ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, September 30, 2011

ఒకటీ, పదికి నేపథ్యం..


రేపు ఒకటీ పది- అన్నాడు వస్తూ వస్తూనే సన్యాసి.....

‘‘అర్ధం కాలేదు’’ అన్నాడు శంకరం.


‘‘ఒక్కరి కోసం-పదిమంది కలవడం, పదిమంది కోసం ఒక్కరు కృషి చేయడం అనేదానికి సంకేతం-‘ఒకటీ పదీ’ అని నా భావం. పన్నెండు నెలల్లో అక్టోబర్ పదవది కదా! ఒకటీ అక్టోబర్ తేదీకి ప్రాముఖ్యం ఎంతో ఉందని నా ఉద్దేశ్యం’’ అన్నాడు సన్యాసి.


‘‘ఒక్కడే పదిమంది పెట్టుగా, పదిమందినీ కదిలించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాందీ పుట్టింది అక్టోబర్ రెండున. ఆరోజు జాతీయ సెలవుదినం కూడాను! అది వదిలేసి, ఒకటో తేదీ అంటావేమిటోయ్ గొప్పగా’’ అన్నాడు నవ్వుతూ ప్రసాదు.





‘‘ఒకటిగా ఉండాల్సిన దేశం రెండుగా విభజన అయంది, రెండున జన్మించిన గాంధీతోనే అనేవారున్నారు! అదేరోజున జన్మించిన మాజీ భారత ప్రధాని లాల్‌బహద్దూర్ శాస్ర్తీ మాత్రం- ‘‘జై జవాన్-జై కిసాన్’’ అంటూ నినదించి, ఏకత్రిత భావనలకే కాదు, పొట్టివాడయినా గట్టివాడుగా, ఒక నిజాయితీకీ నిరాడంబరతకూ, అవినీతి రహిత అధికార ప్రాతినిధ్యానికీ, నేటికీ ఏకైక ఆదర్శమూర్తిగా ఉన్నాడు. కానీ ఆయనగురించి ఎవరకూ పట్టదు .



అక్టోబర్ రెండునే ‘కుష్ఠు వ్యవస్థకు’ దర్పణంగా, ‘యాంటీ లెప్రసీ డే’ అంటున్నామేమో!



లేదు కాబట్టే-‘‘నేషనల్ క్లీన్లీనెస్ డే’’గా కూడా అక్టోబర్ రెండుని పేర్కొంటున్నాం !




పేరుకే తప్ప ఇంకా తొలగిపోని ‘కుల వ్యవస్థకు’ దర్పణంగా కూడా, అక్టోబర్ రెండుంది.


కానీ ‘ఒకటీ పది’ విశిష్టత ఏమిటో చెప్పావ్ కాదు’’ అన్నాడు శంకరం సన్యాసితో తాను అక్టోబర్ రెండు గురించి విశదపరుస్తూ..



‘‘దిమందిగా ఉండే కుటుంబం కోసం-ఒక్కడిగా కష్టపడి పైకి తెచ్చి, పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాక, ఆ పదిలో ఒకటిగా మిగిలిపోయే, వయసుడిగిన ‘వృద్ధుల దినోత్సవం’రేపు అక్టోబర్ ఒకటి! పెరుగుతున్న జీవన ఆయుఃప్రమాణాలు ఆనందదాయకాలే కానీ, 2020 సంవత్సరంనాటికి-ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్యే అధికంగా ఉంటుందంటున్నారు! రేపు ఏమవుతుందో, ఎలా ఉంటామో తెలియని వృద్ధుల పరిస్థితి, ఏ దేశంలో చెప్పుకున్నా పదే పదే ఒకటిగానే ఉంటోంది. మన దేశంలో మరీను! వృద్ధాశ్రమాల పెరుగుదల గొప్ప అనీ, సేవా కార్యక్రమాల మహత్తర చర్య అనీ భావించే దశకు వచ్చాంగానీ, మన భారతీయ కుటుంబ జీవన విధానానికే ప్రతీఘాతుక చర్య, అని గుర్తించలేకపోతున్నాం. ‘డబ్బు’ అనేదే ముఖ్యమైపోయి, వృద్ధులైన తల్లిదండ్రులకు ‘పుష్కలంగా డబ్బులిస్తున్నాం.అది చాలదా’ అనుకునే స్థితికి పిల్లలను నెట్టివేస్తున్న కాలం నిజానికి విచారించదగింది! పదిమంది కోసం కష్టించిన ఒక్కడికి-పదిమంది కాదు కదా, ఒక్కడైనా కొడుకు కూడా, ఆసరా కాలేకపోవడమన్నదానికన్నా విషాదం ఏముంది? ‘‘ఒకటీ పది’’ వృద్ధుల దినోత్సవంగా దీనిని సంకేతిస్తోంది’’ అన్నాడు సన్యాసి ఆర్తిగా.




‘‘నిజమే! ఇవాళ కొలతలూ, తూనికలు మారిపోయాయి; మానవ విలువల విషయంలో కూడాను.రేపటి రోజయిన ‘ఒకటీపదినే’ 1958లో-వెయిట్స్ అండ్ మెజర్స్ మెట్రిక్ సిస్టం మొదలైంది. తూనికలు, కొలతల వార్షికోత్సవం కూడా ఒకటీ పదినే సుమా’’ అన్నాడు ప్రసాదు గుర్తు చేసుకుంటూ.


‘‘ అయితే నాకూ ఒకటి గుర్తొస్తోంది! నిజానికి పదిమంది చేరి, ఒకరి విద్యను ఆనందించే-ఆపాత మధురమైన కళ సంగీతం! సంగీతాన్ని మనవాళ్లు ‘కేవలకళ’గా భావించలేదు. భక్తికీ, ముక్తికీ సోపానంగా కూడా భావించారు. రసానంద హేతువైన సంగీతం ఒక్కటే, పదిగా ప్రేక్షక శ్రోతలలో పరివ్యాప్తం చెందుతుంది సుమా! అందుకే అక్టోబర్ ఒకటి అంతర్జాతీయ సంగీత దినోత్సవం కూడా మన్ననలందుకుంటోంది’’ అన్నాడు సుందరయ్య కలగజేసుకుంటూ.





‘‘ నీరుకన్నా రక్తం చిక్కన, కానీ నీళ్లల్లా ఖర్చయిపోయే డబ్బుకి ప్రాముఖ్యం ఇస్తూ రక్తసంబంధాలను కూడా విస్మరిస్తున్న కాలం ఇది! కానీ చూసారూ! రక్తమూ, శరీరంలో రక్తప్రసరణా లేనిదే-అసలుప్రాణి మనుగడే లేదు. ప్రమాదాలు జరిగినప్పుడూ, ఆరోగ్యం వికటించిప్పుడూ ఎందరికో రక్తం అవసరమవుతూంటుంది. ఏ గ్రూపు రక్తమైనా ‘ఎర్రగానే’ ఉంటుందనేది సత్యం! ‘‘స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం’’గా కూడా ‘ఒకటీ పది’ విశిష్టమైంది.



అంతేకాదు! రోగులకూ, క్షతగాత్రులకూ, ముఖ్యంగా దేశరక్షణకోసం సరిహద్దుల్లో శ్రమించే సైనికులకూ వారు గాయపడినప్పుడు కోలుకునే సేవలందించడం అంటే, దేశ రక్షకులకు రక్షణ నివ్వడమే! రేపటి ‘ఒకటిపది’- ‘మిలటరీ నర్సింగ్ సర్వీస్‌డే’గా కూడా గుర్తింపుపొందింది’’ అన్నాడు ప్రసాదు.





‘‘పదిమందీ అయిన తన స్నేహితులకూ, బంధువులకూ వర్తమానం పంపడానికి-ఒకప్పుడు ‘ఉత్తరాలే’ ఆధారం! మంచి అయినా, చెడు అయినా లేఖలద్వారా పరస్పరం తెలియజేసుకునేవారు. అలా ఉత్తరం పంపడానికి ముఖ్యమైనది దానికి అంటిపెట్టుకు ఉండే ‘తపాలా బిళ్ల’. భారతదేశంలో 1854 అక్టోబర్ ఒకటినే-‘పోస్టల్ స్టాంప్’ అనేది మొదలైంది.



అంతేకాదు! మగపిల్లలకు ఇరవై ఒకటి, ఆడపిల్లలకు పద్దెనిమిది, కనీస ‘వివాహ వయస్సు’ అనే- ‘వివాహ వయఃపరిమితి’ కూడా, 1958 అక్టోబర్ ఒకటినుండే అమలులోకి వచ్చింది తెలుసా!’’ అన్నాడు సుందరయ్య.



‘‘ ‘ఒకటీ పది’ అని నేనన్నానుగానీ, అక్టోబర్ ఒకటికి చెందిన విశేషాలు మీ అందరికీ కూడా ఎన్నో తెలుసు చూసారా!


‘అనిబిసెంట్‌' జన్మించింది,





చలనచిత్రరంగంకు చెందిన శివాజీ గణేశన్ జన్మించిందీ,




హాస్యనటుడు అల్లు రామలింగయ్య జన్మించిందీ,




గూడవల్లి రామబ్రహ్మంగారు అస్తమించిందీ





రఘుపతి వెంకటరత్నం నాయుడు జన్మించిందీ,



‘ఒకటీ పదినే’.


ఈ దేహమనేదే ప్రాణికి ఇల్లు అన్నారు.సకల జీవకోటికీ నివాస స్థలం అనేది మరీముఖ్యం! ‘ఒకటీ పది‘ ప్రపంచ ఆవాస దినోత్సవం కూడాను.



రేపటి గురించి-ఇలా ఒకటికి పది విషయాలు మాట్లాడుకోవడమే-నేటి ఆనందానికి పదిలం మరి!’’ అని నవ్వుతూ లేచాడు సన్యాసి.

***
1.10.2011

2 comments:

కొత్త పాళీ said...

బావుంది

Prasad Cheruvu said...

అక్టోబర్ 1,2 తేదీలలో జరిగిన సంఘటనలను పుసగ్రుచ్చి వ్యాసంగా అందించారు.ఈ విషయాలు జనరల్ నాలెడ్జ్ కి బాగా ఉపయోగపడతాయి.