ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, September 24, 2011

అప్పడాల ఆనందం..


ఏవి ఉండనీ, ఉండకపోనీ, ‘అప్పడం’ లేని భోజనం భోజనంలా తోచదు! ‘అప్పడం‘ ఒక్కటి ఉంటే-అది మామూలు ప్లేట్‌మీలే అయినా, కడుపునిండా భోంచేసిన ‘తృప్తి’ కలుగుతుంది. బహుశా అది ‘అప్పడం’ మహత్యం ఏమో’’ అన్నాడు నవ్వుతూ శంకరం.


‘‘ ‘అప్పడం’ ఈజ్ ఈక్వల్టూ ‘విందు భోజనం’ క్రిందే లెక్క! కరకర లాడుతూ పంటికింద అది కరిగిపోతున్నప్పుడు ఉండే మజా, మాటలతో చెప్పలేం! హోటల్లో భోం చేయడానికి వెళ్లినప్పుడు ముందు సలాడ్, అప్పడాలు పెడితే-కంచం వచ్చేలోగానే అప్పడాలు ‘హుష్ కాకీ’ అయిపోతాయి. మునుపు అప్పడాలు ఇళ్లల్లోనే ఒత్తుకుని, ఎండబెట్టుకుని, వాడుకునేవారు. పాపం! ఆర్థిక వెసులుబాటు అంతగా లేని విధవరాండ్రు కూడా-అప్పడాలు, వడియాలు అమ్ముకుని ఆణాకానీ సంపాదించుకోవడం ఉండేది’’ అన్నాడు సన్యాసి .


‘‘మా తాతయ్యగారికి ‘అప్పడాలపిండి’ అన్న బహుఇష్టంగా ఉండేది! వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి ముద్దవేసుకుని, అప్పడాల పిండి నంచుకుతింటే, స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్న ఆనందం కలిగేదనేవారు. ఏమున్నా లేకపోయినా-ఇంట్లో అప్పడాలు, వడియాలు తప్పనిసరి. వడియాలకన్న, అప్పడాల క్రేజ్ మరీ ఎక్కువ! ఎవరయినా అతిథి భోజనానికి వస్తే-ముందు వేగేవి ‘అప్పడాలే’. డబ్బా అప్పడాలు వేయించి పోసి, వడ్డనకు ముందు పెడితే, ‘ఒహ్హోహ్హో! అప్పడాలు..’ అంటూ మాయా బజారు ఘటోత్కచుడి విందు భోజనపు పట్టుపట్టాల్సిందే’’ అన్నాడు శంకరం.


‘‘కారపు అప్పడాలు అన్నంలో గొప్ప అధరవులర్రా! కూర,పచ్చడి లేకపోయినా, అప్పడాలుంటే అన్నం లాగించేయచ్చు! గుంటూరు కారం అప్పడాలు బాపు, రమణకు బోలెడు ఇష్టం అని సరసి కాబోలు, ప్రత్యేకించి చేయించి పంపాట్ట! అసలు అప్పడాలల్లో ఉన్నన్ని రకాలు బోలెడు!! మినప అప్పడాలు,పెసర అప్పడాలు, నువ్వులపప్పు అప్పడాలు, కందిపప్పు అప్పడాలు, వరిపిండి అప్పడాలు, ఆవిరి అప్పడాలు, కారపు అప్పడాలు, మసాలా అప్పడాలు, పచ్చికారం అప్పడాలు, క్యారెట్ అప్పడాలు...ఒకటేమిటి?...‘అప్పడం’ ఏదయినా రుచే! ముఖ్యంగా మద్రాసు అప్పడాలు బోలెడు ప్రసిద్ధి! మాంబళంలో చిన్న అరచేతి సైజు అప్పడం నుండి పెద్ద మినపట్టు సైజు అప్పడం వరకు బోలెడువెరైటీవి ఉంటాయి. వేపుకు తినేవి, కాల్చుకు తినేవి ఏవయినా రుచి రుచే మరి!’’ అన్నాడు రాంబాబు జోక్యం చేసుకుంటూ లొట్టలేస్తున్నట్టుగా.


‘‘ ‘పప్పుఅన్నం’లో ‘అప్పడం’ నంచుకోవడం కొందరి అలవాటైతే, ‘రసం’లోనో, ‘సాంబార్’లోనో, ‘పప్పు పులుసు’లోనో కొందరు నంచుకుంటారు! నూనెలో వేయించిన అప్పడాల రుచే రుచి! కాల్చినవి కూడా బాగుంటాయి, నిజానికి వంటికి మంచివే కానీ, మైక్రోవేవ్‌లో కాల్చడం కాక, బొగ్గుల కుంపట్లో నిప్పుల మీద కాల్చిన వాటి-రుచే రుచి. పెళ్లి భోజనం అంటే-‘అప్పడం’ లేనిదే పరిపూర్ణం కాదు. అప్పడాలు ముక్కలుచేసి పెట్టడం కాదు- ‘అప్పడం పళంగా’ నిండుగా,గుండ్రంగా దొంతరులుగా కనిపిస్తే...ఆ తృప్తే వేరు’’ అన్నాడు మళ్లీ శంకరం.



‘‘మా మిత్రుడు సూరి ‘అప్పడాభరణం’ అన్నాడు
‘‘వేచే వారెవరురా
కరకరా...టటటటా...
గరగరా...టటటటా...
‘పాపడ్’ వేచేవారెవరురా!
మరిగిన ఈ నూనెలోన
వేగజాల ...అప్పడాలవాల..
వేచే వారెవరురా’’ అని పాట కూడా కట్టాడు.

నిజంగాఅప్పడాలు చేయడమే కాదు, వేచడం, కాల్చడం కూడా ఒక ఆర్ట్! మెత్తబడిపోకుండా ‘స్టోర్’చేసి, ‘వడ్డించడం’ అందరికీ చేతకాదు. అప్పడాలకు ’పాపడ్’ అని వ్యవహారం. ‘పాపడు’ అనగా-పిల్లవాడిని కనడం, సంరక్షించడం ఎంత ముఖ్యమో, భోజనమనే కుటుంబానికి ‘పాపడ్’ అంత ప్రాధాన్యం! మనదేశంలోని అనేక కంపెనీల పాపడ్‌కి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉంది తెలుసా!’’ అన్నాడు రాంబాబు


‘‘ అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లాల్లోను అప్పడాల తయారీ సంస్థలు గణనీయంగా పెరిగినాయ. అదేదో కథలో ‘అఖిలాంధ్ర అప్పడాల మరియు విస్తళ్ల ఫ్యాక్టరీ’ అని చాలా ఏళ్ల క్రితం ముళ్లపూడివారో, ఆదివిష్ణుయో ప్రతిపాదించారు కానీ, నిజానికి అంతస్థాయిలో అభివృద్ధి చెందుతూవచ్చింది పాపడ్- భోజనానికి ఒక గొప్ప గౌరవం; అనే స్థాయికి తప్పడాల తయారీని అభివృద్ధి చేయడం ప్రశంసనీయమైన విషయమే! అప్పడం మలబద్ధకం పోగొడుతుందట.పైగా అసలు భోజనంలో అధరువుగానే కాదు-అటొచ్చీ ఇటొచ్చీ ఓ టిఫిన్‌గానో, కాలక్షేపపు చిరుతిండిగానో కూడా, ‘అప్పడం’ మా గొప్పగా ఉంటుందనేది ఎందరి అనుభవంలోని సంగతో! అప్పడాలు అంటే ‘అప్ప’గారి ‘డాలు’ అని-వంటకు వంకలెన్నే శత్రువులకు కూడా-‘అప్పడం’ కనిపిస్తే, సంధి చేసుకోవాలనిపించేంతగా తిండి ‘రంధి’ పెంచే తిరుగులేని ఆయుధం అప్పడమే మరి! అప్పడాలూ జిందాబాద్’’ అన్నాడు లేస్తూ సన్యాసి ఆనంద నినాదం చేస్తూ...





4 comments:

రసజ్ఞ said...

బాగా వ్రాశారండీ! ఏ మాటకామాటే చెప్పాలి నాకు మాత్రం అప్పడాల కన్నా అమ్మా చేసే అప్పడాల పిండి చాలా ఇష్టం. అప్పడాలలో మాత్రం haldirams వాళ్ళ అప్పడాలు వచ్చేవి. ఒక దానిని నాలుగు భాగాలుగా చేసి వేయిస్తే ఒక్కొకటి ఎంతో పెద్దగా వచ్చేది రుచి బాగుండేది. అసలు అప్పడం ఉంటే చాలు విందు భోజనమే!

Prasad Cheruvu said...

మా బావగారు బందరు వెడితే తప్పనిసరిగా అప్పడాల పిండి,అప్పడాలూ తెచ్చి పంచుతూ వుంటారు.
అప్పడాల తయారికి అక్కడ కుటీర పరిశ్రమలు వున్నాయి.ఇంగువ ఘుమఘుమలు ముక్కుపుటాలకి
కూడా విన్డుచేస్తాయి.

A K Sastry said...

చిన్నప్పుడు.....అంటే మా నిరుద్యోగపర్వంలో.....మా ఫ్రెండొకడిని "భోజనం అయ్యిందా?" అనడిగితే.....

"ఓ! దివ్యంగా! నాలుక్కూరలూ, పచ్చళ్లూ, వూరగాయ, సాంబార్, రసం, 'అప్పడం', పెరుగూ, చివర్లో ఓ స్వీటూ, చక్కెరకేళీ అరటిపండూ, కిళ్లీతో సహా లాగించేస్తున్నాను.....రెండురోజులనుంచీ......'ఒక్క అన్నమే' దొరకడంలేదురా!"

అని నవ్వుతూ కళ్లనీరు పెట్టుకొంటే, అందరం జేబులు తడువుకొని, ప్రక్క సెంటర్లో 24 గంటలూ తెరచివుండే ఓ కాకా హోటలుకి వాణ్ని తీసుకెళ్లి, ఓ పరోటా, అవసరమైతే ఇంకో పరోటా, (షేరువాతో....అంటే మేక కాళ్లు కాదు......బంగాళ దుంప, వుల్లిపాయి, బఠాణీతో.....) తినిపించి, ఓ అరగ్లాసు టీ త్రాగించి, ఆ కొట్టువాడికి రాయల్ గా '15 పైసలు ఖాతాలో వ్రాసుకో' అని ఆర్డరేసి (పరోటా విత్ షేరువా 15 పైసలు; అర టీ 10 పైసలు.....మాదగ్గర పావలా మత్రమే వుండేది....అందుకే 15 పైసలు అరువు!) రూముకి తిరిగి వచ్చేవాళ్లం!

ఇంతకీ వాడు ఓ 'సాయిబ్బు!' (అప్పడాలకీ, సాయిబ్బులకీ ముడేమిటీ అని ఆడగొద్దు!)

మీరు చాలా ఫేమస్ అయిన "గురువాయూరు" అప్పడాల గురించి మరిచిపోయారు!

మంచి టపా!

సుధామగారూ! కొనసాగించండి.

Unknown said...

ఉడిపి హోటళ్ళలో,అలనాటి మలబార్ హోటళ్ళలో మహా వైభవంతో వెలుగొందిన 'అప్పడం ', 'మెస్సు 'ల కల్చర్ వచ్చిన తరువాత క్రమంగా కనుమరుగై అంతరించిపోతున్నది.