ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, July 29, 2019

అస్తమించిన అనుభూతి పూర్ణజీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన కవిత్వ అనుభూతితో పరిచయం కలిగిన పుష్కర కాలానికి కానీ ఆయన పరిచయం కలగలేదు. ఆకాశవాణిలో ప్రసార నిర్వహణాధికారిగా వున్న నాకు పదోన్నతితో కార్యక్రమ నిర్వహణాధికారిగా విజయవాడ కేంద్రానికి బదిలీ కావడంతో, 1991లో ఉషశ్రీగారి స్థానంలో అక్కడ తెలుగు విభాగాన్ని నిర్వహించే బాధ్యతలు చేపట్టాను. అప్పటికి ఆయన విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో స్క్రిప్ట్‌రైటర్ పదవిలో వున్నారు. అప్పటి స్టేషన్ డైరెక్టర్ జి.కె.కులకర్ణి కన్నడిగులు. తెలుగువారు కాదు. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడంతోనే ఆయన ‘‘అయామ్ అలాంటిగ్ సాంస్క్రిట్ అండ్ తెలుగు సెక్షన్స్ టు యు. శ్రీకాంతశర్మ విల్ అసిస్ట్ యూ.’’ అనేసారు. కులకర్ణిగారికి స్ట్రిక్ట్ డైరెక్టర్ అనే పేరుంది. ఒకరిమాట అంత సులభంగా వినేరకం కూడా కాదు.
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ స్క్రిప్ట్ రైటర్ ఉద్యోగంలో వున్నారు గానీ ఆయన ఎంతటి ప్రతిభామతి అయిన పండితుడో, కవియో నాకు తెలుసు. ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారి పుత్రుడిగానే కాదు అప్పటికే స్వయంగా కవి పండితునిగా పేరుప్రతిష్ఠలార్జించిన గొప్ప గౌరవనీయ వ్యక్తి. అలాంటి వ్యక్తి నాకు సబార్జినేట్‌గా అసిస్ట్ చేయడమేమిటి? నేను కులకర్ణిగారితో ఆమాటే అని ఆయనకు సంస్కృత విభాగాన్ని నిర్వహించే బాధ్యత పూర్తిగా అప్పచెప్పమనీ అంతగాఅయితే ఇంకేమైనా అదనపు బాధ్యత కూడా ఆయనే స్వతంత్రంగా నిర్వహించేలా చేయవచ్చనీ, తెలుగు విభాగం కార్యక్రమాల విస్తృతి కూడా ఎక్కువే కనుక నాకు ఆ విధంగా వెసులుబాటు కల్పించిన వారవుతారనీ అభ్యర్థించాను.
ఏ కళనున్నారో కులకర్ణిగారు నా అభ్యర్థనను మన్నించి సంస్కృత విభాగంతోబాటు ప్రతిరోజూ ఉదయం ప్రసారమయ్యే ‘సూక్తిసుధ’ను శ్రీకాంతశర్మగారే రోజూ రాసి ప్రసారం చేయాలని స్వతంత్ర బాధ్యతలు అప్పచెప్పారు. నాకు విజయవాడ కేంద్రం, అక్కడి ప్రాసంగికులు కొత్తవారు కనుక శ్రీకాంతశర్మగారే ఎన్నో విలువైన సూచనలు ఇస్తూండేవారు. ఆయన సెలవుపెడితే నేను, నేను సెలవుపెడితే ఆయనా మా కార్యక్రమాలను నిర్వహించేవారం. ఆయన ఏంచేసినా పద్ధతిగా వుండేది. రోజూ సూక్తిసుధ రాసి ఆ స్క్రిప్ట్‌మీద డైరెక్టర్ కులకర్ణిగారు సంతకం చేశాకనే రికార్డుచేసి కానీ సాయంత్రం వెళ్ళడానికి వుండేది కాదు. ప్రతి స్క్రిప్ట్‌కూ రీడర్స్ రిపోర్ట్‌పెట్టి డైరెక్టర్ అంగీకార సంతకం తీసుకోవలసిందే!
శర్మగారి మీద ఎంత గౌరవం వున్న కులకర్ణిగారు ఆయన రాసిన స్క్రిప్ట్‌ను ఎవరిచేతయినా చదివించుకునిమరీ సంతకం పెట్టేవారు. డైరెక్టర్ రూమ్‌నుంచి ఆ స్క్రిప్ట్ ఎప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడు రికార్డుచేసి వెళ్ళాలా అని ఎన్నోమారులు ఆ రూమ్‌ముందు శర్మగారు తచ్చాడటం కూడా నాకు తెలుసు. కానీ చిరునవ్వుతోనూ, సహనంతోనూ, నలుగురితో సరదాగా కబుర్లు చెబుతూనూ వుండేవారే కానీ ఏనాడూ ఉద్యోగ నిర్వహణలో బాధ్యతారహితంగా వుండేవారు కాదు. ఉషశ్రీగారి అనార్కిజం వ్యవహారాన్ని భరించి తెలుగు విభాగం అసిస్ట్ చేసింది శ్రీకాంతశర్మగారు కనుకనే విజయవాడ వైభవ ప్రాభవాలకు ఆకాశవాణి ఉద్యోగిగా కూడా శర్మగారు ఓ ఐకాన్. నిజమే! స్క్రిప్ట్ రైటర్‌గా ఆయన కలం సృజించిన సృజనాత్మక రూపకాలు, నాటకాలు ఆకాశవాణి జాతీయ స్థాయిలో వరుసగా పదేండ్లకు పైగా అవార్డులు గెలుచుకున్నాయంటే అది ఆయనలోని సృజనాత్మక వైభవానికి ప్రతీక. హృదయధర్మంతో ఉద్యోగ ధర్మం నిర్వర్తించాడాయన. ఆ తరువాత కొద్దినెలలకే ఆయనకూ కార్యక్రమ నిర్వహణాధికారిగా పదోన్నతి లభించి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి బదిలీ చేశారు.
కార్యక్రమ నిర్వహణాధికారులకు ఢిల్లీలోని ఆకాశవాణి శిక్షణా కేంద్రంలో నలభై రోజుల బేసిక్ ట్రైనింగ్ వుండేది. ఆయనకూ పదోన్నతి వచ్చాకే ఢిల్లీ శిక్షణాకేంద్రంలో ఆ శిక్షణ మొదలుకావడంతో ఒకే బ్యాచ్‌లో నేను, శ్రీకాంతశర్మగారు, ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సంచాలకులుగా వున్న కాకరపర్తి సత్యనారాయణ, ప్రస్తుతం రిటైరైపోయిన ఎం. బాబూరావు తెలుగు అధికారులుగా ఆ బ్యాచ్‌లో వున్నాం. ‘ట్రైనింగ్ సెంటర్’ హాస్టల్లో వుండి శర్మగారితో గడిపిన ఆ నలభై రోజుల కాలం జీవితంలో మేం ఎప్పటికీ మరచిపోలేనిది. ఎంత పాండిత్యం! ఎన్ని విషయాలు! ఎంతటి హాస్యచతురత! ఎంతటి స్నేహశీలత. అంత సాన్నిహిత్యంగా వారితో పెరిగి గ్రహించిన జ్ఞాన సంపద, అనుభూతి సంపద ఎంతో! అది అదృష్టంకాక మరేమిటి?
ఒక స్థాయి పదవిలోకి వచ్చాక ఉద్యోగంలో బాధ్యతలూ, బదిలీలు అన్నీ అనివార్యం! శ్రీకాంతశర్మగారు ఆంధ్రజ్యోతిలో పాత్రికేయునిగా 1969-76 మధ్య పనిచేసి 1976లో ఆకాశవాణిలో స్క్రిప్ట్ ఎడిటర్‌గా చేరారు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా నిజామాబాద్‌లో వుండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1996నాటికి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంపాదకులుగా వెళ్ళారు. ఇరవై ఏళ్ళ కాలం పదవిలోవుంటే గానీ స్వచ్ఛంద పదవీ విరమణ చేసినా పెన్షన్ లభించదు. శ్రీకాంతశర్మగారి పట్ల గౌరవంగల ఢిల్లీ స్థాయిలోని ఓ అధికారి సౌజన్యంతో ఇరవై ఏళ్లకు కొద్దినెలలు తక్కువ పడిన అభ్యంతరాన్ని తొలగించి, ఆకాశవాణి రిటైర్మెంట్ బెనిఫిట్స్ శర్మగారికి అందచేయడం జరిగింది. అలా ఆయనకు ఆకాశవాణి జీవితకాలపు పెన్షన్ లభించడం ఆయనకు దక్కిన గౌరవం!
ఆంధ్రప్రభ వారపత్రిక ఆయన హయాంలో పాఠకులను అగ్రగామిగా అలరించింది. ఎడిటోరియల్ పేజీలో ఆయన ప్రతివారం ఒక సంస్కృత శ్లోకాన్ని తాత్పర్య సహితంగా అందించడం, విలువైన ఆ శ్లోక సంపదను ఎందరో భద్రపరుచుకోవడం నేనెరుగుదును. సంస్కృతాంధ్రాలలో ఆయన గొప్ప పండితుడు. తండ్రినుండి పుణికిపుచ్చుకున్న వారసత్వం మాత్రమే కాదు ఆయన స్వయంకృషి, వ్యుత్పన్నత అనితరమైనవి. ఆయన పాత్రికేయుడు, సంపాదకుడు కూడా కావడంవల్ల ఏ ప్రక్రియలో ఆయన రచన చేసినా అది ఎంతో వైశిష్ఠ్యాన్ని సంతరించుకుని అలరించేది. నవల, కవిత్వం, గేయం, వ్యాసం, నాటకం, సంగీత రూపకం, యక్షగానం, సమీక్ష, పరిశోధన, సినిమా పాట ఏది రాసినా ఆ ప్రక్రియలో తనదైన ప్రతిభాపాటవాలను, విలక్షణ సృజనశీలతను నిలుపుకున్నవాడాయన. ‘‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’’ అన్న దేశభక్తి గేయం తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొంది జనం నాల్కలపై నడయాడిందో అందరికీ తెలుసు. అది రాసినది ఇంద్రగంటి శ్రీకాంతశర్మయే! అనుభూతి గీతాలు, శిలామురళి, ఏకాంత కోకిల, నిశ్శబ్దం గమ్యం వంటి కవితా సంపుటులు, పొగడపూలు పేరిట ఆయన లలిత గీతాల సంకలనం, అలాగే తూర్పున వాలిన సూర్యుడు, క్షణికం వంటి నవలలు, శ్రీపాద పారిజాతం, కిరాతార్జునీయం, శ్రీ ఆండాళ్ కళ్యాణం, గంగావతరణం వంటి యక్షగానాలు, అవతార సమాప్తి, మహర్షి ప్రస్థానం వంటి నాటకాలు ఆయన బహుముఖీన ప్రతిభాదర్పణాలు. ఆయన సినిమాల్లోనే కుదరుకుపోదలుచుకోలేదు గానీ సినీ గీత రచయితగానూ ఆయన అందించిన పాటలు సాహిత్య విలువలతో వాసికెక్కినవే. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘నెలవంక’ చిత్రంలో అన్ని పాటలూ ఆయన రాసినవే! రెండు జెళ్ళసీత, పుత్తడిబొమ్మ, రావుగోపాలరావు, తన తనయుడు సినీ దర్శకుడు అయిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘సమ్మోహనం’వంటి చిత్రాలకు ఆయన రాసిన పాటలు సినీ కవిగా ఆయన విలక్షణతను, విన్నాణాన్నీ విపులీకరించేవి. ‘ఆ పాటలన్నీ నేనే పాడాను. అది నా అదృష్టం’ అని సినీ నేపథ్య గాయకులు బాలసుబ్రహ్మణ్యం ఆనందపడుతూంటారు.
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 1944 మే 29న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ప్రసిద్ధ కవి పండితులు శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ, వెంకటరత్నం దంపతులకు నలుగురు సంతానంలో మూడవవారిగా జన్మించారు. ఆయనకు ఇంద్రగంటి భానుమూర్తి, ఇంద్రగంటి సుబ్బరాయశాస్ర్తీ అన్నలు కాగా చెల్లెలు సత్యవాణి. చిన్నతనం నుండే సాహిత్యం, సంగీతాల పట్ల శర్మగారికి మక్కువ ఎక్కువ. ఎం.ఏ. తెలుగు పట్ట్భద్రులయ్యారు. సంస్కృతంలో కూడా నిష్ణాతులయ్యారు. బాలగంగాధర్ తిలక్, ఇస్మాయిల్ వంటివారి సరసన చేర్చదగిన అనుభూతి వాద కవిగా కవిత్వంలో తనదైన ముద్రవేశారు. పద్యం, గేయం, వచన కవిత, పాట అలా ఏ కవిత్వ ప్రక్రియలో రాసినా నిజంగా ఆయన భావం, భాగ్యం అనుపమానమైనది. ఇంద్రగంటి జానకీబాల ఆయన ధర్మపత్ని. ప్రేమించి పెళ్ళాడారు. ఆమె కూడా మంచి కథా, నవలా రచయిత్రిగా, గాయనిగా వనె్నకెక్కినవారు. అలా ఆ సాహిత్య దంపతులకు మోహనకృష్ణ కుమారుడు, కిరణ్మయి కుమార్తె. మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమా దర్శకునిగా నేడు రాణిస్తున్నారు. కిరణ్మయి డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మాణంచేశారు. బెంగుళూర్‌లో భర్త బలరాంతోబాటు నివసిస్తూ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
కవిత్వానికి మాత్రమే శ్రీకాంతశర్మ అంకితమైతే బాగుండేదనీ, ఆయన పాట కూడా కవిత్వాన్ని కప్పేసిందనీ ఆయన మిత్రుడు, సహోద్యోగి పన్నాల సుబ్రహ్మణ్యభట్టు మేలమాడుతుంటాడు గానీ నిజానికి ఆయన పాండిత్యం, జ్ఞాన సంపద విస్తారమైనది. ఆయన సమగ్ర సాహిత్యం రెండు బృహత్సంపుటాలుగా వెలువరించారు. ఇటీవలనే ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ అని తమ ఆత్మకథను ప్రచురించారు. ఆంధ్రభూమి దినపత్రికలో అనేక సమీక్షలు అలాగే ‘పరిపరి పరిచయాలు’ పేరిట తమకు పరిచితమైన ఎందరో సాహితీమూర్తులను గురించి ధారావాహికగా రాసి ప్రచురించారు. ‘సంచలనమ్’ అని ఆయన ఆంధ్రప్రభలో వెలయించిన కాలమ్, అలాగే ‘తెలుగు కవుల అపరాధాలు’ అనే వ్యాసాలు ఆయన విమర్శనా పటిమకు, గొప్ప అధ్యయన శీలతకు నిదర్శనాలు. జాతీయస్థాయిలో ఆకాశవాణి ద్వారా అనేక అవార్డులు, ఫ్రీవర్స్‌ఫ్రంట్ అవార్డు, శిఖామణి పురస్కారం వంటివి ఎన్నో లభించినా నిజానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం మాత్రమేకాదు పద్మశ్రీ స్థాయి పురస్కారానికి సైతం ఆయన సమార్హుడు. కానీ ఏనాడూ ఆయనకు పురస్కారం గురించీ, గుర్తింపుల గురించీ వెంపర్లాట లేదు. తన కృషిని తాను సాగిస్తూపోవడమే, నిరంతర రచయితగా, అధ్యయనశీలిగా సాగడమే ఆయన చేసిన పని. ముద్రారాక్షసం మీద విపుల పరిశోధన చేస్తున్నవారు.
గత అక్టోబర్‌లో శిఖామణి ఆయనకు జీవన సాఫల్య పురస్కారం అందించిన సందర్భంగా యానాంలో చాన్నాళ్ళకు ఆయనతో రోజంతా గడిపే అవకాశం లభించింది. ఆయన పాఠశాల మిత్రుడు ఇంద్రగంటి హనుమంతరావు, నేను, శర్మగారు గడిపిన ఆ క్షణాలే గుర్తున్నాయి. డి.కామేశ్వరిగారి ‘సీతోపదేశం’ పుస్తకావిష్కరణ సభలోనే చివరగా ఆయనను చూసింది. అంతకుముందు ఆకాశవాణి జాతీయ కవి సమ్మేళనం 2019లో అనువాద కవులుగా హైదరాబాద్ కేంద్రంలో కలుసుకున్నాం.
ఆయనతో ముడివడిన జ్ఞాపకాలు ఎనె్నన్నో! నా శ్రీమతి అల్లంరాజు ఉషారాణి మా వివాహానికి ముందు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసార నిర్వహణాధికారిగానూ, ఆ తరువాత మేం ఇద్దరం విజయవాడలో కార్యక్రమ నిర్వహణాధికారులుగా పనిచేస్తున్న కాలంలోనూ మాపై అపార వాత్సల్యాన్ని, అభిమానాన్నీ చూపిన సహృదయ స్నేహశీలి ఆయన. ఆయనతో కబుర్లాడడం అంటే గొప్ప ఉత్సాహంగా వుండేది. సాహిత్య, సాంస్కృతిక విషయాలనేకం ఆయన కబుర్లలో అందుకునేవారం. ఎప్పుడూ చిరునవ్వుతోనే తనమీద తానే జోకులేసుకునేలా కూడా వ్యవహరించేవారాయన. ఆయనలో మంచి నటుడున్నాడు. పాండురంగ, రామం అనబడే ఎస్.బి.శ్రీరామమూర్తి, కృష్ణమోహన్ ఆకాశవాణిలో ఆయనకు అత్యంత సన్నిహితులు. ఆయన స్నేహం ఎవరికయినా అపురూప వరమే!
హైదరాబాద్ నేరేడ్‌మెట్ ఆర్.కె.పురం జి.కె.కాలనీ సాహితీ రెసిడెన్సీలోని ఆయన స్వగృహంలో ఆయనతో ముచ్చటించే అవకాశమే లేకపోయింది. ఎన్నోమార్లు ఆయన ఆహ్వానించినా ఆ ఇంటికి వెళ్లడం కుదరనే లేదు. ఆఖరికి ఆయన పార్ధివ శరీరాన్ని ఈ జూలై 25 గురువారం అక్కడే సందర్శించుకోవడం మనసును కలచివేస్తోంది. సాహిత్యలోకపు ఒక ‘ఐకాన్’, తరలిపోయిన ‘ఇంద్ర’జాలపు కవి ఇంద్రగంటి శ్రీకాంతశర్మకు అశ్రు నివాళులు.
- సుధామ, 9849297958


0 comments: