ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, October 9, 2015

చీకట్లు వీడని ఉదయమా?






నిజాంను పొగిడి పొగిడి 
ఇప్పుడు తన రక్షకభట యంత్రాంగాన్ని కూడా 
రజాకార్లలాగామార్చి నియంతగా రాణించాలని 
గద్దెనెక్కిన బంగారు తెలంగాణ పెద్ద భావిస్తున్నాడేమోనని
అనుమానాలు పొడచూపుతున్నాయి 
అంటే పరిస్థితుల తీరు అలానే పొడగడుతోంది మరి!

ఉద్యమస్ఫూర్తితో ఎదిగి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చి 

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిందనుకున్న పార్టీ,
 తద్వారా పాలనాపగ్గాలు చేపట్టిన నేత 
ఆ ఉద్యమభారాన్ని దింపేసుకుని 
ఫక్తు గత ప్రభుత్వాల ముఖ్యమంత్రిలాగానే మారిపోయి
‘రాజ్యం’యొక్క తడాఖాను ప్రదర్శిస్తాడని ఎవరనుకుంటారు?
కానీ జరిగిందీ, జరుగుతున్నదీ అదే! 

మానవ హక్కుల కమిషన్ ననుసరించి గానీ, కేంద్ర చట్టాలననుసరించి గానీ
 బూటకపు ఎన్‌కౌంటర్‌లను ప్రశ్నించడం నేరం కాదు. 
బంగారు తెలంగాణ సాకారాన్ని అభిలషిస్తున్న యువజనులలోని వారే శ్రుతి, సాగర్‌లు. 
వరంగల్ ఎన్‌కౌంటర్‌లో వారి మరణాన్ని తల్లిదండ్రులతో సహా, ప్రజాస్వామ్యవాదులు, 
మానవ హక్కుల పరిరక్షకులూ ప్రశ్నించడమే నేరమైపోయింది. 

ప్రజాస్వామ్యబద్ధంగానే తలపెట్టిన ‘లో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి 
ఎనిమిదో తరగతి పిల్లలనుండి, ఎనభై ఏళ్ళ చుక్కా రామయ్య వరకూ 
అరెస్టులతో, గృహ నిర్బంధాలతో తెలంగాణ ప్రభుత్వం అణచివేత చర్యలకు సమకట్టి 
వేలాది మందిని అరెస్టుచేయడం చూస్తుంటే 
‘ఏడుమారినా ఈడు ముదిరినా ఏమి మారినది ఈ లోకంలో’ అని కాళోజీ అన్నట్లు
 ప్రభుత్వం మారినా ప్రజల ఆకాంక్షలు మాత్రం ఫలించడం లేదు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటిందో లేదో 
రైతుల ఆత్మహత్యలు, ఎన్‌కౌంటర్ మరణాలు బంగారు స్వప్నాలను ఛిద్రం చేస్తూ
 భవిష్యత్ ఆశలను తుత్తినియలు చేస్తున్నాయి. 
వెంగళరావ్ ప్రభుత్వ హయాంలోవలె- 
వామపక్షాలు, విప్లవ సంఘాలు, పౌర హక్కుల నేతలపై 
ఆంక్షలు, కట్టడులు, అరెస్టులు ముమ్మరం కావడం కనిపిస్తోంది. 

ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా ‘ఛలో అసెంబ్లీ’ విజయవంతం అయినట్లే.
 నక్సలైట్ల ఏజెండాయే మా ఎజెండా తరహా కబుర్లు చెప్పిన ఉద్యమ నేతలు 
ఆ స్ఫూర్తిని తుంగలోతొక్కడం ‘రాజ్యహింస’కే తామూ ద్వారాలు తెరవడం అమానుషం.
 ప్రశ్నించటం, నిరసన తెలియజేయటం ప్రజాస్వామ్యంలో భాగమని పాలకులు గుర్తించాలి. 

ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ కావాలి అని ఆశించడం నేరం కాదు.
 భవిష్యత్ చరిత్రలో తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు కూడా లిఖింపబడుతుందని
 మరిచిపోకూడదు ముఖ్యమంత్రి. 

ఛలో అసెంబ్లీని తలపెట్టిన తెలంగాణ ప్రజాస్వామిక వేదిక చర్యలను అడ్డుకోడానికి 
పోలీసులు పన్నిన వ్యూహాలు నిరంకుశత్వాన్నేతలపించాయి. 
అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్ చుట్టూ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు 
మోహరించడం విస్మయపరచింది. 
అయినా గన్‌పార్క్‌లోకి ప్రవేశించి వరంగల్ జిల్లా పౌర హక్కుల సంఘం 
సభ్యులొకరు పెట్రోల్ పోసుకు ఆత్మహత్యాయత్నం చేయడం
 ‘మానవ హక్కుల ఉల్లంఘన నశించాలి’ అని నినదించడం 
బంగారు తెలంగాణ కలలు భగ్నమవుతున్నాయనడానికి
 ప్రవేశికలా శోచనీయ దృశ్యమైంది. 
తెలంగాణ వచ్చినా ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాలు 
స్వేచ్ఛావాయువుల్లోకాక ఉద్రిక్త, ఉద్విగ్న పరిస్థితుల్లోకే నెట్టబడుతూండడం 
దేనికి సంకేతమో అర్థంకాని స్థితే!

ఉదయం కానే కాదనుకోవడం నిరాశ
ఉదయించి అలానే ఉంటుందనుకోవడం దురాశ

అన్న కాళోజీ కవిత్వ పంక్తులు

 ప్రత్యేక రాష్ట్రోదయానికి కూడా ఇంత త్వరగా వర్తిస్తాయని ఎవ్వరనుకుంటాం? 
కె.సి.ఆర్. తన ఆలోచనా విధానాలను మార్చుకోవాల్సిన అగత్యం వుంది.
 ఒవైసీ అన్నట్లు ఆయన ఫార్మ్‌హౌస్‌లంత పచ్చగా రైతుబ్రతుకులు పండాలి. 
శ్రుతి వంటి యువతను బలితీసుకునే ఎన్‌కౌంటర్లు లేని 
స్వేచ్ఛాయుత తెలంగాణ ఏర్పడాలి. 
తెలంగాణను తెచ్చుకున్నది కుటుంబ పాలనకో 
కేవలం కొందరి వైయక్తిక అభివృద్ధికొరకో మాత్రం కాదు.
చచ్చిపోయిన రైతుకు పరిహారంగా ఇచ్చే సొమ్ము 
వారికి బ్రతికి వుండగానే ఇచ్చినా ఎన్నో రైతు కుటుంబాలు బాగుపడతాయి.
 తెలంగాణ పేద రాష్ట్రంకాదంటున్న అధినేత 
కోట్ల సొమ్మును అనవసర ఆర్భాటాలతో రాళ్ళపాలు చేయడం కాక, 
నిజంగా బంగారు తెలంగాణ నిర్మాణ పటిష్ఠ చర్యలకు వినియోగిస్తారనీ,
 బడుగు బ్రతుకుల కన్నీరు తుడుస్తారనీ ఆకాంక్షిద్దాం




  • - సుధామ
  •   


    9.10.2015

    2 comments:

    కనకాంబరం said...

    అందలం ఎక్కగానే అన్నవన్నీ మరిచిపోయి అధికారం చలాయించడమే నీతిగా, అణగద్రోక్కడమే ఆనవాయితీగా,నోరు నొక్కడమే ఘనతగా మార్చుకొంటోంది అధికారిక రాజకీయం .అభిశంసనీయం..../Nutakki Raghavendra Rao.

    సుధామ said...

    మీ స్పందనకు ధన్యవాదాలు రాఘవేద్రరావు గారూ!