ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, June 8, 2015

గుర్తొచ్చానా వానా

గతి తప్పిన రుతురాగం

  • 07/06/2015
  • -సుధామ, 
వాన రాకడ... ప్రాణం పోకడ... -అని మనవాళ్లు ఊరికే అనలేదు. ఈ రెండూ ముందుగా గుర్తించడం అసంభవం. ఎంత శాస్త్ర సాంకేతికాభివృద్ధి జరిగినా, అంచనాలు వేయడమంటూ జరిగినా, అనుకున్నట్టుగానే జరుగుతుందని అస్సలు చెప్పలేం! అయితే ‘అతివృష్టి’ - లేకుంటే ‘అనావృష్టి’ అన్నట్లు పరిస్థితులుంటూంటాయి. ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా - ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా’ అని వర్షం పాటలు ఎన్ని పాడుకున్నా, అది రాదలచుకుంటే వస్తుంది. లేదంటే లేదు. వచ్చినా ఎంత శాతంగా తన ‘పాతం’ నమోదు చేసుకుంటుందో, జరిగాక కానీ చెప్పలేం! 

వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో - ఆ వ్యవసాయం కూడా ప్రధానంగా వర్షాధారితం కనుకనే, ‘వాన రాకడ’ పట్ల మనకంత నిరీక్షణలూ, మమకారాలూ! కానీ, రోజులు మారిపోతున్నాయి. మేధోమథనాలు, మేఘ మథనాలు వచ్చాక ‘దృక్పథాలూ’ మారిపోతున్నాయి. ఒకప్పుడు వానతో ముడివడిన అనుభూతులు క్రమంగా అంతరించి పోతున్నాయేమోనన్న బెంగా కలుగుతోంది. 

‘వానల్లు కురవాలి వానదేవుడా 
వరిచేలు పండాలి వానదేవుడా’ 

‘వానావానా వల్లప్పా’ 
అని పాడుకునే పిల్లలు ఇప్పుడు - ‘రెయిన్ రెయిన్ గో ఎవే’ అని పాడుతున్నారు. వరుణుడికి కోపం వస్తే రావచ్చు మరి. 

‘ఎల్.కె.జి. రైమ్‌కీ, ‘ఎల్‌నినో’కు సంబంధం ఉంటుందా? అంటే ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’ అయిపోవచ్చు. మెయిల్ కాదు గానీ, ‘మొయిలు’ అంటే మేఘం అనే. ‘బ్లాక్‌మొయిల్’ అనగా నల్లని మేఘం అంటే వర్షవాహికగా భావిస్తాం మరి! ‘మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకుంటామా’ - అలా చేస్తే ఇప్పటికే తాగునీరు సమస్య పెరిగిపోతోంది. అది మరీ గుక్కెడు నీరు అందని విపత్కర పరిస్థితి తెచ్చేయవచ్చు. గుంపులు గుంపులుగా కనపడ్డ మబ్బులు గుప్పెడు నీళ్లయినా చల్లకుండా తేలిపోవచ్చు. ‘కుంభవృష్టి’ అనగా కుండపోత నీరు పడడం పోయి వాన వాటర్‌బాటిల్ ఒంపినట్లుగా పడి ముగిసిపోనూ వచ్చు. 

అసలు ‘వానాకాలం’ అనే దానికి గొప్ప ప్రాధాన్యం. సకాలంలో పంటలు పండాలంటే సకాలంలో వర్షాలు కురవాలి. వర్షం కాకుండా డ్రిప్ ఇరిగేషన్ అంటూ బిందు వ్యవసాయంలోకి దిగితే ‘డిప్రెషన్’ రావచ్చు. రైతు ఆత్మహత్యలకు వర్షాభావ పరిస్థితులూ హేతువులవుతున్నాయనే మాట ఉంది. పర్యావరణ సమతుల్యతను చేజేతులా మనమే దెబ్బతీసి అడవులు, చెట్లు నరికివేస్తుంటే ఇక సహజ వర్షాలను చేజేతులా అడ్డుకున్నట్లే అని శాస్తవ్రేత్తలు ఘోషిస్తూన్నారు. 

‘వానలో తడవనివాడు’ మనిషే కాడు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి, సహజసిద్ధంగా జీవనం గడపవలసిన మనిషి ఆ సహజాతాలకు దూరంగా ఆ కాలానికి తగినట్లుగా కాక ప్రతికూలతలను సౌకర్యాలుగా సంభావించి అనుభవించడం నేర్చుకుంటున్నాడు. వానలో తడిస్తే మొక్క మొలిచి పోతానన్నట్లు భయపడుతున్నాడు. వివేకం బదులు విలువలు నశించి బుర్రలో మట్టి పెరుగుతున్నప్పుడు సదరు భయాలు సహజమే అనిపిస్తోంది కూడాను.

 మునుపు ‘వానాకాలం చదువులు’ అనేవారు. వర్షపురోజుల్లో బడులు, బోధనలు సెలవులెక్కువ పుచ్చుకునేవి అప్పుడు. కానీ, వానాకాలం చదువు అంటే నిజమైన వ్యవసాయ విద్య అనే భావనా వుండేది. చెట్లు చేమలతో, పొలాలతో ప్రకృతితో ప్రతి మనిషికీ అవినాభావ సంబంధం ఉండేది ఆ రోజుల్లో. ఇప్పటి పిల్లలు కొందరు బియ్యం చెట్లకు కాస్తాయనుకుంటున్నారంటేనూ, ఏది ఏ పొలమో, ఏది ఏ చెట్టో మొక్కో చాలామంది గుర్తించలేని స్థితిలోనే వున్నారంటేనూ వానతో, ప్రకృతితో వారికి అనుబంధం ఎడమై పోవడమే. 

సన్నగా వర్షం పడుతూంటే రేడియోలో వివిధభారతిలో ఏ హిందీ పాటనో వింటూ, వేడివేడి పకోడీలో, మిరపకాయ బజ్జీలో తినడంలోని అనుభూతి- ఆ మజా అనుభవిస్తే గానీ తెలియదు కదా! ఇప్పుడు రేడియో ఔట్ ఆఫ్ డేటెడ్ కదా పాపం! ‘బర్సాత్ కీ ఏక్ రాత్’, ‘వర్షం కురిసిన రాత్రి’ లాంటి కథలు సాహిత్యంలో హృదయదఘ్నంగా చేరువైన రోజులూ వెళ్లిపోతున్నాయి. ‘కొమ్మచాటు పువ్వు తడిసె - ఆకుచాటు పిందె తడిసె’ అని వర్షపు గీతాలు, సినిమాల్లో వర్షపు సన్నివేశాలు ఎంతగా ఎందరి అనుభూతి ప్రపంచాన్ని చుట్టుకున్నాయో మాటల్లో చెప్పడం కష్టమే! వర్షంతో ముడిపడిన కథలెన్నో! కావ్యాలెన్నో! ‘నగరంలో వాన’ అని కుందుర్తి సుదీర్ఘ వచన కవిత రాశారు. అలాగే, వర్షం గురించి వంగపల్లి విశ్వనాథం అనుభూతి వీచికలు కవితాత్మకం చేశారు. సినిమాల్లో వాన పాటలు, వాన దృశ్యాలకు కొదవే లేదు. మబ్బు మరణించి వానగా మారిపోవు విత్తు మరణించి మొక్కగా మారిపోవు అంటూ మృత్యుకేదారముననె జీవి సుమించుట చూస్తాం- అని తాత్త్విక కవిత నల్లిన వారున్నారు. వానలు ముంచెత్తితే వరదలే! గాలివాన ఒక బీభత్స దృశ్యమే. పాలగుమ్మి పద్మరాజుగారి ‘గాలివాన’ కథకే అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ఇప్పుడు తుపానులు కూడా కొత్తకొత్త పేర్లు పెట్టుకుని వస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘హుద్‌హుద్’ తుఫాను అందాల విశాఖను ఊడ్చిపారేసింది. ఇప్పుడిప్పుడే విశాఖ మళ్లీ ప్రకృతి అందాల చిగుళ్లు తొడుక్కుంటోంది. వరద బీభత్సాలు పంటలను, గ్రామాలను పాడుచేస్తే వర్షాభావ పరిస్థితులు కరువు కాటకాలు తెస్తాయి. వానలు పడక పోవడమంత దురదృష్టం మరొకటి లేదు! 

వర్షాల గురించి అధ్యయనాలు ఇవాళ ప్రపంచమంతటా సాగుతున్నాయి. వాతావరణ శాఖ వాన రాకడ అంచనాలకు అహర్నిశలూ కృషి చేస్తూ ఉంది. డైనమిక్ థియరీ, జెట్ స్టీమ్ థియరీ వంటి కొత్తకొత్త పరిశోధనలు వచ్చాయి. ఎల్‌నినో ఏర్పడితే వర్షాభావ పరిస్థితులెదురై కరువు కాటకాలకు దారి తీస్తుందంటున్నారు శాస్తజ్ఞ్రులు. పసిఫిక్ మహాసముద్ర జలాల్లో వచ్చే ఉష్ణోగ్రతల్లోని పెనుమార్పులే ఎల్‌నినోకు కారణం.సాధారణ ఉష్ణోగ్రతలకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు మధ్య తూర్పు పసిఫిక్ జలాల్లో సంభవించి మిగిలిన సముద్ర ప్రాంతాలకు విస్తరించడమూ జరుగుతోందిట! వేడి నీటి ప్రవాహాలు సముద్రంపైన గాలిలో నీరు చేరేందుకు అడ్డుపడి, వర్షాభావంతో కరువులకు నెలవులు అవుతూంటాయి. సముద్రపు నీటి ప్రవాహాల్లో వేగం తగ్గడం కూడా ఎల్‌నినో ఏర్పడడానికి సంకేతం అంటున్నారు శాస్తజ్ఞ్రులు. నీటి ఉష్ణోగ్రత సామాన్య స్థితికన్నా బాగా తగ్గిపోవడంవల్ల ‘లానినా’ సంభవిస్తుంది. ‘ఎల్‌నినో’ అయినా, ‘లానినా’ అయినా ఉష్ణోగ్రతల్లో తారతమ్యాల వల్ల ప్రమాద సూచికలయ్యే వీలుంది మరి! 

భూగర్భ జలాలు కూడా క్రమేపీ తగ్గిపోతున్నాయి. చెరువులు, కుంటలు కూడా కబ్జాలకు గురై, కాంక్రీటు భవనాలు లేచిపోతుంటే పర్యావరణం దెబ్బతినక ఏమవుతుంది? దారికి ఇరుపక్కలా మొక్కలు నాటించిన, బావులు తవ్వించిన అశోకుడు వంటివారు ఇవాళ చరిత్ర పుటలకే పరిమితమై పోయారు. వ్యక్తి స్వార్థంతో ప్రకృతి వనరులు కూడా దోపిడీకి గురవుతున్నాయి. మొక్కలు నాటడం కన్నా నరకడం పరిశుభ్రత అనుకునే దుస్థితి వచ్చింది. ‘వన మహోత్సవం చేద్దాం మొక్క నాటడానికి చోటు చూడండి’ అని అధికారులు ఆదేశిస్తే, ‘గత సంవత్సరం నాటిన చోటు బానే వుందండీ! అక్కడే నాటేద్దురుగాని’ అని సమాధానమిచ్చే సహాయకులు, స్వచ్ఛ భారత్ చేయాలంటే చీపుర్లు పట్టడం కోసం ఆ నేతలకు సమీపంలోనే చెత్త చేర్చేవారు రూపొందుతున్నారు. ‘వాన నీటిని వృథా కాకుండా కాపాడాలి’ అన్నది నినాదంగా మిగిలిపోకూడదు. వానలు అరుదై పోతే వాననీరు మరీ అరుదై పోతుంది. 

కృత్రిమ వర్షాలు కృత్రిమ వర్షాలే అవుతాయ గానీ రుతుపవనాలతో సహజసిద్ధంగా వర్షించినవి కాజాలవు కదా! నైరుతి రుతుపవనాలు మే నెలాఖరు నుండి జూన్ మొదటి వారంలో ప్రవేశించడం మన దేశంలో సహజంగా జరుగుతూ ఉంటుంది. వీటి కారణంగా సెప్టెంబర్ వరకు వానలు పడే వీలుంటుంది. అయితే, వర్షపాతం ఎక్కువ, తక్కువలు అనేది సముద్ర జలాల ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. మబ్బులు ఏర్పడటంతో సరిపోదు. అవి సరియైన దిశగా పయనించి కొండలను తాకి తాము ధరించిన నీటిని వర్షించడం ముఖ్యం. ఈ పరిణామం సహజంగా ఎంత చక్కగా జరిగితే వర్షపు పరిమాణం అంత హర్షదాయకం అవుతుంది. 

నీరే ప్రాణాధారం అన్నారు. భూమినైనా మూర్ఛ నుంచి తేర్చేది వర్షపు నీరే. వర్షం రైతు నేస్తం మాత్రమే కాదు. సర్వ జీవరాశి జీవన నేస్తం కూడాను. వానల కోసం భారత విరాట పర్వ పారాయణాలు చేయడం, కప్పలకు పెండ్లి చేయడం ఈ భరత భూమిలో ఇప్పటికే జరుగుతూనే ఉంది. వానాకాలం అంటే ప్రాణకోటి జీవనకాలం. ప్రకృతితో మమేకమై విలువల జీవధార నిలుపువడం ఎప్పటికీ అవిస్మరణీయ అంశం. 

0 comments: