ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, May 9, 2015

ఏ వెలుగులకీ ప్రస్థానం’

అక్షర






‘నవీన’ మార్గంలో హత్తుకునే యథార్థవాదం

     Andhrabhoomi Telugu Daily Saturday 
  • 09/05/2015

తెలుగు నవలా సాహిత్యానికి ‘అంపశయ్య’ ఒక మైలురాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నేపథ్యంలో, ఒక రోజు కథగా, ‘చైతన్యస్రవంతి’ పంథాలో సాగిన ఆ నవల- యువతను, ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని విపరీతంగా ఆకర్షించింది. నవీన్ ఆ తరువాత చీకటి రోజులు, ముళ్ళపొదలు వంటి నవలలు సీక్వెల్‌గా రాసినా- యువతను ముఖ్యంగా స్ర్తిపాఠకులను ఆయన వారపత్రికల సీరియల్ నవలలే బాగా ఆకర్షించాయి. సౌజన్య, ఉమెన్స్ కాలేజి, సంకెళ్ళు, వౌనరాగాలు, తీరని దాహం, మనోరణ్యం, ప్రేమోన్మాదులు వంటి నవలలన్నీ అతనిని కమర్షియల్ రైటర్ స్థాయి గుర్తింపు నోచుకునేలా చేశాయి. కథలు, వ్యాసాలు వంటివి ఎన్ని రాసినా ప్రధానంగా నవలా రచయితగానే నవీన్‌కు గుర్తింపు లభించింది.

అసలు అంపశయ్య నవీన్ ఆలోచనాధార, పరిణామశీలత, సమాజం పట్ల ఆయన కమిట్‌మెంట్ మొదలైనవి అభివ్యక్తం అయ్యే నవలలు- ఆయన సీక్వెల్‌గా రూపొందించి అందించినవి. తెలంగాణ సాంఘిక జీవితాన్నీ, సామాజిక చరిత్రనూ బహుశా నవలీకరించిన రచయిత దాశరథి రంగాచార్యగారి తర్వాత అంపశయ్య నవీనే నేమో, ఎమర్జన్సీ కాలపు వికృత స్వరూపాన్నీ, శాంతిభద్రతల పేరిట నాడు జరిగిన రాజకీయ హోమంలో యువత, మేధావి వర్గం ఎలా సమిధలైపోయిందీ ‘చీకటి రోజులు’ నవలలో, అలాగే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగిన కాలంనాటి యువతలోని ఆశావాదాన్ని, నిరాశా విదాన్ని, ఉగ్రవాదాన్ని, క్షీణ వాదాన్ని, అభ్యుదయ వాదాన్ని భిన్నకోణాలలో ‘ముళ్ళపొదలు’ నవలలోనూ పరిశీలించి రాసిన నవీన్ సమగ్ర తెలంగాణ జన జీవన చిత్రణను- కాలరేఖలు, చెదరిన స్వప్నాలు, బాంధవ్యాలు మొదలయిన నవలల్లో క్రమక్రమానుగత సజీవ చిత్రణంగా అందించారు.

అటు వ్యక్తి స్వేచ్ఛను, ఇటు ఆర్థిక సమానావకాశాలను కాపాడగలిగే సమాజం రచయిత అభిలాష! తను ‘అవాస్తవికుడు’ కాదు. ఒక విధంగా యధార్థవాది. తెలంగాణ జీవన కల్లోల మూలాలనే కాదు, అసలు మానవ మనోవిశే్లషణలోనే గొప్ప అధ్యయన శీలిగా, అభివ్యక్తి సమర్థకునిగా గోచరిస్తాడు. మానవ జీవనశైలి లోనవుతున్న మార్పులను సాకల్యంగా దర్శిస్తూ, ఒక చైతన్య స్పృహతో సాహిత్య సృజన చేయడం సీరియన్ పాఠకులు నవీన్‌లో గుర్తించగలుగుతారు. తెలంగాణ అంటే కేవలం పోరాటాలు, ఉద్యమాలు, ఉద్రేకపరిచే అంశాలు అనేకాక- బ్రతుకుపోరాటంకోసం సామాన్య ప్రజలు పడే ఆరాటం కూడా చిత్రించి, హృదయదఘ్నంగా ఆకట్టుకోగల నవలా రచయిత కనుకనే తన ‘కాలరేఖలు’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది. పాఠకులుయిన అక్షరాస్యులనేగాక, ఆకాశవాణి ద్వారా ప్రసారమై నిరక్షరాస్యులైన లక్షలాది శ్రోతలను కూడా ఆకట్టుకుంది.

ఇక సరికొత్తగా వెలువడిన ‘
ఏ వెలుగులకీ ప్రస్థానం’ నవల ‘బాంధవ్యాలు’ నవలకు సీక్వెల్‌గా భావించాలి. ఈ నవలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం 2001 సంవత్సరంనుంచీ సాగిన మలిదశ ఉద్యమ చిత్రణ కూడా ఉంది. భారతదేశపు 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించడంతో ఈ నవలను ముగించారు. అయితే ప్రధానంగా ఈ నవల - ఆర్థిక సంస్కరణల్లో ప్రధాన భాగాలైన ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అన్న మూడు విధానాల భిత్తిక మీద- నేటి సామాజిక మానవ జీవితం ఎలా ప్రభావితవౌతున్నదీ, మధ్యతరగతి, కింది మధ్యతరగతి జీవితాలు ఎలాంటి మార్పులకు గురిఅవుతున్నదీ విశదపరిచేదిగా రూపొందింది. ముఖ్యంగా ప్రైవేటీకరణ మూలంగా ప్రభుత్వం ఎలా తన ప్రజాసంక్షేమ బాధ్యతలనుంచి తప్పించుకుని, ఆర్థిక వ్యత్యాసాలను మరింతగా పెంచిపోషిస్తున్నదీ చూపించారు.

‘‘ఆర్థిక సంస్కరణల కారణంగా ఉత్పన్నవౌతున్న మార్పులన్నీ సమాజాన్ని ఎటువైపు తీసుకెడుతున్నాయి? ఈ మార్పులన్నీ ఎవరికోసం? ఎందుకోసం? విలాస వస్తువులను అనుభవిస్తూ ప్రజలు సుఖంగానే వుంటున్నారని పైకి అనిపింపచేస్తూ వారిని మానసిక ప్రశాంతతకు, మానవీయ విలువలకు దూరం చేస్తున్న మార్పులవల్ల నిజంగా ఏమయినా ప్రయోజనం వుందా?’’ అన్న ఆర్తి నవలలో స్ఫుటంగా కానవస్తుంది! నరేందర్, అరుంధతి, రాంగోపాల్, అభిషేక్, అరవింద్; వీరేశ్, శ్రావ్య, సుమతి, రమ్య, రమణి వంటి పాత్రల ద్వారా నడిచే కథనం- 1991 నుంచి నేటివరకు తెలుగు సామాజిక వ్యవస్థ పరిణామాలనూ, వివిధ ప్రభావాలనూ కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అనేక సంఘటనలతో సాగుతూ పలు అంశాలను గురించి సాకల్యంగా చర్చిస్తూ సాగుతుంది.

‘‘మార్పు అనేది అనుక్షణం జరుగుతూనే వుంటుంది. నిన్న ఉన్నట్టు ఇవ్వాళ లేను... ఇవ్వాళ ఉన్నట్లు రేపుండకపోవచ్చు.. మార్పు అనేది చాలా సహజం. ఒక స్థిర బిందువు దగ్గరే ఆగిపోవడం ఎవరికీ సాధ్యం కాదనుకుంటాను.’’

‘‘ప్రపంచం చాలా ముందుకెళ్తున్నదన్నమాట నిజమే కావచ్చు.. కానీ మనిషనేవాడేమన్న ముందుకెళ్తున్నాడా అని నా సందేశం.. వాడి సంస్కారం యేమన్నా పెరుగుతున్నదా? స్వంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడ్తున్నాడా? మంచిని పెంచటానికి కృషిచేస్తున్నాడా? బలవంతుడు బలహీనుడ్ని దోచుకోవడం మానుకుంటున్నాడా? నేను అగ్రకులంలో పుట్టాను. కాబట్టి అధికుణ్ణి అనే ఫీలింగ్‌లోంచి బయటపడగల్గుతున్నాడా? పురుషుణ్ణి కాబట్టి స్ర్తికంటే అధికుడిని అనే ఆధిపత్య భావాన్ని వదిలేయగలుగుతున్నాడా? సాంకేతికంగా ఈ ప్రపంచం చాలా ముందుకెళ్ళిన మాట నిజమే. ఒప్పుకుంటాను. కానీ మనిషి మనీషిగా ఎదిగాడా అన్నదే నా సందేహం’’ అని నరేందర్ పాత్ర ద్వారా రచయిత వౌలిక ప్రశ్నలు లేవదీసి ఆలోచింపచేస్తారు.
అలాగే అభిషేక్, వీరేశ్ పాత్రల ద్వారా ప్రత్యేక తెలంగాణ వల్ల ప్రయోజనమేమిటన్న చర్చను రెండంచుల పదునుతో చాకచక్యంగా నిర్వహించి చూపారు.

‘‘ఒకప్పుడు తెలుగు మాట్లాడే ప్రాంతమంతా తెలంగాణే! నిజాం రాజులు ఇంగ్లీషు వాళ్ళకు అప్పుల క్రింద సర్కారు జిల్లాలను, తర్వాత రాయలసీమను అమ్మేసి వేరుచేశారు. అప్పుడిక ఇప్పటి తెలంగాణలోని పది జిల్లాలు మాత్రమే మిగిలాయి. ‘తెలంగాణ’ వేరు అనే ఒక బలమైన సెంటిమెంట్ ప్రజల హృదయాల్లో నాటారు. ఇదంతా కొందరు మేధావులనిపించుకునే వాళ్ళు చేసిన పని. ఎవడి ప్రాంతం వాడికి గొప్ప. ఒక ప్రాంతాన్ని గొప్ప చేయడం మరో ప్రాంతాన్ని తక్కువ చేయడం చాలా తప్పు’’ అంటాడు అభిషేక్ ఒకచోట.

‘‘మార్పు అనేది ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. నిన్న ఉన్నట్టు ఇవ్వాళ ఉండం. అదొక నిరంతర ప్రక్రియ. నేనూ ఒకసారి అమెరికా వెళ్ళొచ్చాను. నాకు అమెరికా ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత వుంది. ముఖ్యంగా ప్రపంచాన్నంతా తమ గుప్పిట్లో ఉంచుకోవాలన్న వాళ్ళ సామ్రాజ్యవాద దృక్పథాన్ని ఖండిస్తాను. కానీ, అమెరికన్ ప్రజలు నాకు నచ్చారు. వాళ్ళలో క్రమశిక్షణ... చట్టాన్ని గౌరవించే ప్రవర్తన.. వాళ్ళ కస్టమర్ ఫ్రెండ్లీ నేచర్.. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం... వారంలో అయిదు రోజులు బాగా పనిచేసి మిగతా... రెండు రోజులు బాగా ఎంజాయ్ చేయడం.. ఎక్కడా లంచగొండితనం కనిపించకపోవడం.. ఏ పనైనా ఆఫీసులో అలా అప్లికేషన్ పడేస్తే అయిపోవడం.. అన్నీ మెరిట్స్‌బట్టి జరగడం. వాళ్ళ సివిక్ సెన్స్.. ఎక్కడా చిన్న కాగితం ముక్కను కూడా డస్ట్‌బిన్‌లో తప్ప ఎక్కడంటే అక్కడ పడెయ్యకపోవటం... వాళ్ళు ట్రాఫిక్‌రూల్స్‌ని తూచ తప్పకుండా ఫాలో కావడం... భార్యాభర్తలు హ్యాపీగా కలిసుండలేం అనుకున్నప్పుడు విడాకులిచ్చేసుకోవడం... 15 ఏళ్ళు రాగానే పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడిపోవడం... విద్యార్థులకు చాలా స్వేచ్ఛ ఇచ్చే వాళ్ళ విద్యావిధానం... వాళ్ళ స్కూల్స్, వాళ్ళ కాలేజెస్, రీసెర్చికి వాళ్ళిచ్చే ప్రాధాన్యం, వాళ్ళ లైబ్రెరీలు, వాళ్ళ మ్యూజియమ్స్... ఇవన్నీ నాకెంతో నచ్చాయి.’’

‘‘నేను, నాదీ అనే పద్మవ్యూహం నుండి ఈ మనిషనే వాడు యేనాటికైనా బయటపడ్తాడా? మనిషిని డబ్బు సంపాదించే యంత్రంగా మార్చేస్తున్న ఈ ఆర్థిక సంస్కరణలు మన సమాజాన్ని ఎక్కడకు తీసికెళ్తాయి? ఓ మహాకవి అన్నట్టు ఏ వెలుగులకీ ప్రస్థానం? ఏ స్వప్నం? ఏ దిగ్విజయం? ఈ కాలంలో ఈ దేశం ఏ పరమార్థాన్ని సాధించబోతున్నది? కాలమే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి?’’ అనుకుంటాడు. కాలరేఖలు, చెదిరిన స్వప్నాలు, బాంధవ్యాలు నవలలకు కొనసాగింపుగా వచ్చిన ‘ఏ వెలుగులకీ ప్రస్థానం’ నవల అంపశయ్య నవీన్‌ను ప్రాంతావధులను అధిగమించిన విశ్వప్రేమిక రచయితగా సంభావింపచేస్తుంది! రచయితగా ఆయన ‘యథార్థవాది’ అని నిరూపిస్తుంది. ‘ఏ వెలుగులకీ ప్రస్థానం’ పాఠకుడిని మనిషిగా ఆలోచింపచేస్తుంది. వివేచనా చైతన్యాన్ని ప్రోదిచేస్తుంది.

 ‘ఇంకేమి కావాలె?’

  • -సుధామ


ఏ వెలుగులకీ ప్రస్థానం (నవల)
- అంపశయ్య నవీన్
వెల: రూ.250/-
ప్రత్యూష ప్రచురణలు, 2-7-71, ఎక్సైజ్ కాలనీ, హనుమకొండ,
వరంగల్- 506001







0 comments: