ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 9, 2014

యాగమయ్యింది
మొన్నటితో మొత్తానికి ఓ యజ్ఞం పూర్తయింది. ‘ఓ పనైపోయింది బాబూ!’అని నిమ్మళించడానికి వీలయింది’’ అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ సుందరయ్య.

‘‘ఏం ఇంట్లో ఆవకాయ, మాగాయ గట్రా ఏవన్నా పెట్టారా ఏమిటి? తెలుగిళ్ళల్లో పచ్చళ్ళు పెట్టడం కూడా ఓ యజ్ఞంగా భావిస్తూంటాం కదా! ఎలావుంది షూటు? బాగా ఊరిందా’’అన్నాడు నవ్వుతూ ప్రసాదు.


‘‘ఘాటుకేం బ్రహ్మాండంగా వుంది. ఊరిందా అన్నదీ, ఎలా ఊరిందన్నదీ పదహారున కానీ చెప్పలేం! ఇంతకీ ఆ యజ్ఞం ఆవకాయ కాదు నాయనా! మన తెలుగు రాష్ట్ర ఎన్నికల వ్యవహారం’’ అన్నాడు సుందరయ్య.


శంకరం కూడా నవ్వాడు. ‘‘నిజమే! ఈసారి ఎన్నికల ఘాటు బానే వుంది. జంటనగరాల వంటి నగరవాసుల్లో తప్ప, ఇతరత్రా చోట్లలో ఓటర్ల చైతన్యం బ్రహ్మాండంగా వుంది. మొన్న ఏడో తేదీ సీమాంధ్రలో ఓటువెయ్యడం కోసం బయట నగరాలనుంచి భారీగా తరలివచ్చిన, తెలుగు ఓటర్లూ వున్నారుట. ‘కాయ’ పులుపుబట్టి రుచి అన్నట్లు, ‘ఈవియం’లు ఎలా నిండాయి, ఎలా పండాయి అన్నది ముఖ్యం. నువ్వన్నట్లు ఫలితాలు మే పదహారుకి గానీ తెలియవు. అంతవరకూ ‘ఊరేవి’, ‘ఊరించేవి’గా ఎవరికివారికి తోస్తూనే వుంటాయి’’ అన్నాడు.


‘‘సరే! మన రాష్ట్రంలో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇవే ఆఖరు ఎన్నికలు మరి! జూన్ రెండున ఆధికారికంగా, రెండు రాష్ట్రాల ఏర్పాటూ జరిగిపోనుంది! ఏ రాష్ట్రానికి ఏ పార్టీ ఆధిపత్యం వహిస్తుంది? ‘హంగ్’ వ్యవహారమైతే, ఏ పార్టీ ఎలా పొంగుతుంది? ఎటు వంగుతుంది? ఏ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న సమీకరణలు ఫలితాలు వెలువడడంతోనే మొదలవుతాయి. ఇప్పటికయితే తెలంగాణలో టి.ఆర్.ఎస్, సీమాంధ్రలో టి.డి.పి, కేంద్రంలో బి.జె.పి. అధికార పగ్గాలు చేపట్టగలిగే అవకాశాలు వున్నాయన్న ఊహాగానాలు, సర్వేలు చెలరేగుతున్నాయి. అంచనాలయితే ఇలా వున్నాయంటున్నారు గానీ ఫలితాలు వెలువడ్డాక తారుమారులు అయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తాలు కూడా ప్రజలు కోరుకుంటున్న మార్పు తమకు ప్రాబల్యం తీసుకురాగలదని భావిస్తున్నారు మరి.’’ అన్నాడు ప్రసాదు.


‘ఎన్నికల ఘట్టం దేశంలో మే’12న గానీ ముగియదు. తుది విడత పోలింగ్ ఆరోజు దేశంలో జరగనుంది. అప్పుడు గానీ అసలు ఈమాటు, సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం ఎలాగుంది? పోలింగ్ శాతం ఎంత మెరుగయ్యింది అన్నది తెలీదు. ఓటింగ్ శాతం గురించి ఆరోజు సాయంత్రానికి తెలిసిపోతుంది గానీ ఓటర్ల నాడి మటుకు లెక్కింపు జరిగే మే ’16గానీ తెలీదు. నిజంగా ‘మోడీ ప్రభంజనం’వుందా? కాంగ్రెస్ పార్టీ కళావిహీన స్థితిలోకి జారుకుందా? ‘ఆమ్‌ఆద్మీ’ గురించి జనం ఏం తలపోశారు, రాష్టవ్రిభజన ప్రభావం పోలింగ్‌పై ఎలా పడింది? ఉద్యమ పార్టీ అనిపించుకున్న తె.రా.స. తెలంగాణలో పునర్నిర్మాణ ఆధికారిక పార్టీ కాగలుగుతుందా? టి.డి.పి. బాబుగారు మళ్ళీ పుంజుకుంటారా? అవినీతి ఆరోపణలతో జైలుపాలయి, అక్రమాస్తుల రాజు అన్పించుకున్న వైఎస్సాఆర్‌సిపి అధినేత జగన్ ఫ్యాన్ గాలి ఎలా వుంటుంది ఇవన్నీ ఫలితాలు వెలువడిన రోజే తెలుస్తాయి. మరో ముఖ్యమైన సంగతి ఈసారి ఎన్నికల్లో ఈ.వి.యంలలో ‘నాటా’ బటన్ ప్రవేశపెట్టారు. ఏ అభ్యర్థీ నచ్చకపోతే ‘నన్ ఆఫ్ ది ఎబౌ’అనే ఆ బటన్ నొక్కే అవకాశం ఓటరుకు కల్పించబడింది. ఎవరినీ ఎన్నుకోకుండా అలా తిరస్కరించిన ఓటర్ల శాతం ఎంత అనేది కూడా నాడే తెలుస్తుంది. పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఎవరికీ ఓటువేయకుండా పనిగట్టుకుని ‘నోటా’ బటన్ నొక్కిన వారెంత శాతం అనేది కూడా కుతూహలం కలిగించే విషయమే. అంచేత ఆ ఫలితాలకోసం కూడా ఆసక్తి వున్నవారున్నారు సుమా!’’ అన్నాడు శంకరం.


‘‘ఎన్నికలు-ఎన్నికలలు అంటూ కవిత్వాలు అల్లినవారున్నారు. నేను ఓటేశా! మరి మీరో అంటూ సిరాచుక్క పెట్టిన చూపుడు వేలు ఫొటోలతో ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్‌వర్క్‌ల్లో హంగామా చేసినవారున్నారు. తమకు నచ్చిన అభ్యర్థుల గురించి పొగుడుతూ, నచ్చనివారి గురించి తెగడుతూ కామెంట్లతో హోరెక్కించిన వారూ వున్నారు. నిజంగానే భారతదేశపు ప్రజాస్వామ్యం ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏ మలుపు తిరిగింది, లేక సాంప్రదాయకపు ఒరవడులలోనే మళ్ళీ ఒదిగిపోయిందా అన్నది ఫలితాలకోసం ఎదురుచూసే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలు వస్తాయి పోతాయి అవి పార్టీల పబ్బాలే గానీ, పౌరులవి అవునా కాదా అనేది కూడా ఫలితాలనుబట్టి అంచనా వేసుకోవచ్చు’’అన్నాడు ప్రసాదు.


‘అవునయ్యా! యజ్ఞం ముగిసింది. ‘యజ్ఞం ఫలితమే’తేలవలసి వుంది. ‘నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అని ప్రతి ఓటరూ భావించడం సహజం. యజ్ఞపురుషుడు ఎలా ఆవిర్భవిస్తాడో, ఏం ప్రసాదిస్తాడో ఇంకా తెలియడం లేదు. ఎన్నికల కమిషన్ క్రతువు నిర్వహించింది. ధర్మబద్ధంగా, సజావుగా సాగవలసిన యజ్ఞంలో ప్రలోభాలు కుమ్మరింపచూసిన వారూ వున్నారు. మద్యం కుమ్మరించాలనీ, నోట్ల కట్టలు వెదజల్లాలనీ- అందుకు చెలరేగినవారూ వున్నారు. పోలీసు యంత్రాంగం కూడా బానే పనిచేసింది. పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. గతంతో పోలిస్తే ఎన్నికల్లో హింస కొంత తగ్గిందని అంగీకరించక తప్పదు. ఇప్పుడు ఇక అందరి దృష్టీ మే‘16 వైపే. ‘యాగం’ ఏ ‘యోగం’తెస్తుందో, రాష్ట్ర విభజన ‘వియోగమో’,‘ప్రయోగమో’, ఏది, ఎవరికి, ఎందుకు, ఎలా, ప్రయోజనమో, జరిగేది ప్రభంజనమో కాదో, గెలిచింది ‘జనమో’కాదో ఇక వారంరోజుల్లో తేలిపోనుంది. ‘అంతా మనమంచికే’అని ఆశతో మరి ఎదురుచూద్దాం’’అని సుందరయ్య కరచాలనం చేసి కదిలాడు.
0 comments: