ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 2, 2014

వేలెత్తి‘చూపు’


 


నువ్వు వేసినవాడు గెలుస్తాడన్న నమ్మకం అతనికిగానీ నీకుగానీ లేనప్పుడు ఓటేయడం దండగ కదుటోయ్! ఎలాగూ సాంప్రదాయిక పార్టీ అభ్యర్థి ఎవరో మందీ మార్బలం సపోర్ట్‌వల్ల గెలుస్తాడు. నీతి, నిజాయితీగల అభ్యర్థి అని నువ్వనుకున్నవాడు అంత బలగం లేనివాడు అయినప్పుడు నీ ఓటు వృథాయే గదా!’’ అన్నాడు సన్యాసి

.
‘‘అమ్మమ్మమ్మ! అలా అనకు. అసలు ఆ ఆలోచనే తప్పు. నువ్వు ఓటు వెయ్యడం అంటే నీ అభిప్రాయాన్ని ప్రకటించడం. అది నిరసనకు గుర్తుకావచ్చు, మార్పుకు హేతువు కావచ్చు. ఏమవుందో ముందే చెప్పలేం కదా! మే 16న ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు అనూహ్యంగా నేను ఓటేసిన అభ్యర్థే గెలవవచ్చు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పౌరుడిగా బాధ్యత నిర్వర్తించడం ముఖ్యం. ‘‘నేను ఓటువేసినవాడు గెలుస్తాడా ఏమన్నానా? నేను ఓటేయకపోయినంత మాత్రాన గెలిచేవాడు గెలవక మానతాడా? సరైన అభ్యర్థి ఎవరూ లేరనుకుంటే ఆ ‘నోటా’ బటన్ నొక్కడానికి పోలింగ్ బూత్‌కు ఎండలోపోయి క్యూలో నించుని శ్రమ తీసుకోవడం ఎందుకు. అసలు వేయడం మానేస్తే పోలేదూ!’’ అనుకోవడం సరికాదు. కానీ ఇలాంటి అభిప్రాయం చాలామందికి అందునా విద్యావంతులు, మేధావులు అనుకుంటున్న వాళ్ళకి ఉండడంవల్లే నూరు శాతం పోలింగ్ ఎక్కడా జరగడంలేదు సరికదా జంటనగరాల వంటి నాగరీక నియోజకవర్గాల్లోనే అతి తక్కువ శాతం పోలింగ్ జరుగుతోంది. ఆదర్శంగా పౌర బాధ్యతలు నిర్వర్తింపబడవలసిన నగరాలే అలసత్వంతో కునారిల్లడం విషాదం’’ అన్నాడు రాంబాబు.



'‘నిజానికి గత 2009 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగిందోచ్! ఈసారి ఓటర్లలో చైతన్యాన్ని నిజానికి ఎన్నికల కమిషన్ బాగా కలిగించింది. రాష్ట్రంలో భన్వర్‌లాల్ తీసుకున్న శ్రద్ధ అభినందించదగింది. మొదటిసారి ఓటువేసిన యువత మంచి చైతన్యం కనబరిచారు. ఓటువేసే చోట పౌరులందరూ సమానమేననీ అక్కడ వి.ఐ.పీ ట్రీట్‌మెంట్స్ ఏవీ వుండవని మెగాస్టార్ చిరంజీవి అందునా సాక్షాత్తు కేంద్ర మంత్రి అయినవాడే ఓ యువ ఓటర్ చేత చెప్పించుకోవలసివచ్చి, విధిలేక విధిగా క్యూలో నిలుచున్నాడంటే ఓటింగ్ గురించి పౌర చైతన్యం నిజంగా అభినందించదగిందే మరి! అయినా హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం గత ఎన్నికల్లో 53.83 శాతం వుంటే 70 శాతం పోలింగ్ సాధించగలమన్న ‘్ధమా’ని తుస్సుమనిపిస్తూ ఈ మాటు 53 శాతం వరకే నమోదైంది. ఓటర్లలో ఈ నిర్లిప్తతకూ, పోలింగ్ వ్యతిరేకతకూ పార్టీలు, ఛానెళ్లు సృష్టించే హడావుడి, అయోమయాలే కారణం అనాలి. రాజకీయ పార్టీలు ఓటర్లలో చైతన్యం పెంచి వాళ్ళు ఓటు ఎలాగయినా వేసేవిధంగా ప్రోత్సాహం కలిగించే బదులు తమ స్వార్థ వైఖరులతో ఊదరగొట్టడం, అంతా కలిసి ఓ రకమైన వైముఖ్యం పెంచడమే కారణం అనాలి. జంటనగరాలు ఇకపై తమవి కాబోవన్న ఇక్కడి సీమాంధ్రులైన ఓటర్ల నైరాశ్యం కూడా ఓటుశాతం తగ్గేలా చేసాయనవచ్చు. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను చూపగలమన్న భరోసా లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు ఇక్కడ ఏ మేరకు కలిగించగలిగాయన్నది సందేహాస్పదమే. బిజెపి, తెలుగుదేశంల పొత్తు ఇక్కడి తెలంగాణ ఓటర్లు ఏ మేరకు ఆమోదించారు? టి.కాంగ్రెస్ నేతలకు టి.ఆర్.ఎస్‌కు నడుమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సిన విధాయక వైఖరి ఇవన్నీ కూడా ఓటింగ్ శాతంపై ప్రభావితం చూపినమాట నిజమే అయ్యుంటుంది కూడాను. ఎటొచ్చీ పోలింగ్ చాలా మేరకు ప్రశాంతంగా జరగడం అనేది నిజంగా గుర్తించి అభినందించాల్సిన విషయం’’ అన్నాడు శంకరం.


‘‘ప్రతివాడూ వేలెత్తి చూపేవాడే’’ అని నవ్వుతూ సన్యాసి అన్నాడు కదా- ‘‘ఓటు వేసిన వి.ఐ.పీ, సరికొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న యువ ఓటరూ- అందరూ ఓటేసిన గుర్తుగల తమ వేలెత్తి చూపుతూ ఫొటోలు చూపేవారే! పత్రికల్లో సెలబ్రిటీలు ఓటేసిన ఫొటోలు తారసపడితే ‘పేస్‌బుక్’లాంటి సోషల్ నెట్‌వర్క్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నామంటూ ఎందరో తాము వేలెత్తి చూపే ఫొటోలు పోస్టు చేశారు. అసలు ఫేస్‌బుక్‌లో ఫొటో పెట్టడానికే కొందరు ఓటు వేశారట! ఈ పార్టీ సరిగా లేదు, ఆ పార్టీ సరిగా లేదు, వీరి పాలన అపసవ్యం, వారి ప్రభుత్వం అసమర్థం అని తర్వాత వేలెత్తి చూపకుండా ముందుగానే తమ ఓటుహక్కుని సద్వినియోగం చేసి, ఇంకు అంటిన తమ వేలిని ఎత్తి చూపడం పౌరులందరూ విధిగా చేయదగిందే! అందులో మేలమాడవలసింది ఏమీ లేదు. వ్యవస్థ బాగులేదని వేలెత్తి చూపడం కన్నా తమ వేలిమీంచే మార్పును ఎత్తిచూపగల గోవర్థనగిరిధారి దక్షత గలవాడే ప్రతి ఓటరు కూడాను’’ అన్నాడు సన్యాసి.
‘‘అది సరే! ఇంతకీ నువ్వు ఓటు వేశావా లేదా అది చెప్పవేం’’ అడిగాడు రాంబాబు.



‘‘మా ఆవిడ పొద్దునే్న ‘ఓట్స్’ ఉప్మా చేసిందోయ్. అది తిన్న వెంటనే ఇద్దరం కలిసి వెళ్లి క్యూలో నించుని మరీ ఓటు వేశాం. ‘ఓట్స్’ చాలా మంచివి కదా మరి. అది మన మేలుకేగా!’’ అన్నాడు సన్యాసి నవ్వుతూ.

‘‘వెరీగుడ్! నువ్వు బాధ్యతాయుతమైన పౌరుడివి కావని ఎవరూ వేలెత్తి చూపకుండా నీ వేలెత్తి చూపుతున్నావన్న మాట. కంగ్రాట్స్’’ అని కరచాలనం చేశాడు శంకరం కూడాను.

0 comments: