ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, March 7, 2014

ఆహ్వానించదగిన అవరోధాలు

‘ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య- ఏరుదాటాక బోడ మల్లయ్య’ అన్నట్లే వుంది తంతు! - ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలనే చంకనెక్కించుకుని, వారి ముద్దుమురిపాలకే ప్రాధాన్యం ఇచ్చి, ‘పాలు తాగి రొమ్ము గుద్దిన వాళ్ళ’ని- ఇప్పుడు ఖేదించడంవల్ల ప్రయోజనం వుండదు. కాకలు తిరిగిన రాజకీయ పార్టీ పరిణామాలను ముందుగా ఊహించలేక పోవడం శోచనీయం కాదూ!’’ అన్నాడు ప్రసాదు.

‘పిచ్చివాడా! రాజకీయపు ఎత్తుగడలు నీకు తెలీవు. తెలంగాణ ఇస్తే తె.రా.సను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్న కె.సి.ఆర్ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తుకూడా వుండదనీ, ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతున్నాననీ అనడం వెనుక బోలెడు స్ట్రాటజీ వుంది. దేశవ్యాప్తంగా 16వ లోక్‌సభ ఎన్నికలకు నగారా మ్రోగింది. దాంతోపాటు ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలూ జరుగుతున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు, 119 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్రలో 25 పార్లమెంట్ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు మే ’7న పోలింగ్ జరగబోతోంది. దేశంలో ఈమారు తొమ్మిది విడతల్లో అంటే ఏప్రిల్ 7,9,10,12,17,24,30 మే 7,12 తేదీల్లో ఎన్నికలు జరుగుతూండగా, మన రాష్ట్రంలో తెలంగాణ పది జిల్లాల్లో ఏప్రిల్ 30న, సీమాంధ్ర 13 జిల్లాల్లో మే’7న ఎన్నికలు జరుగనున్నాయి. రెండుగా విభజింపబడిన ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ, సీమాంధ్ర రెండు కొత్త రాష్ట్రాల అవతరణా జూన్ 2వ తేదీ పంచమి, సోమవారం అని ముహూర్తం కూడా ఖరారుచేసారు. అంచేత కె.సి.ఆర్ తె.రా.సను ఆ తరువాత కాంగ్రెస్‌లో కలిపి కావలస్తే మాట నిలబెట్టుకోవచ్చు. ఈలోగా కలవకపోవడంవల్ల తెలంగాణలో అటు కాంగ్రెస్‌కు, ఇటు తె.రా.స కు బోలెడు లాభాలు వున్నాయి. మిగతా పార్టీల ఓట్లు చీల్చడానికి బోలెడు ఆస్కారం రెండు విధాలుగా లభిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే తమకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని ప్రజలు విశ్వసించి కాంగ్రెస్‌కే పట్టంకట్టే అవకాశం వుంది. అలాకాక తె.రా.సకే పట్టంకట్టినా కేంద్రంలో ఏర్పడబోయేది యు.పి.ఏ. ప్రభుత్వమా, ఎన్.డి.ఏ. ప్రభుత్వమా అన్నదాన్నిబట్టి కె.సి.ఆర్. తె.రా.స భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. ఈలోగానే పార్టీని కాంగ్రెస్‌లో కలిపితే ఇక్కడ ఎన్నికల్లో వేరే పార్టీలు బలపడే అవకాశాలు చేజేతులారా ఇచ్చినట్లవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా, తె.రా.స ప్రభుత్వం ఏర్పడినా అప్పుడు ఎలాగూ వారిరువురి మధ్యా సయోధ్య వుంటుంది. అంచేత ఎన్నికల ముందు తె.రా.స విలీనం కాకపోవడమే తెలంగాణకు శ్రేయస్కరం! ‘‘కలసిపోయి సాధించుకునే సీట్ల కన్నా, విడిగా ఇరువురూ సాధించుకునే సీట్లే ఎక్కువ కాగలవు’’అన్న కాంగ్రెస్, తె.రా.సల విశ్వాసమే- ఇప్పుడు విలీనానికి ఆహ్వానించదగిన అవరోధంగా వుంది’’ అన్నాడు శంకరం.


‘ఔనౌను! నువ్వన్నదీ నిజం! కె.సి.ఆర్. నుంచే విలీనం ప్రతిపాదన వచ్చిందీ, తిరస్కరణ సూచన వచ్చిందీ రెండూను. అంచేత తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కాంగ్రెస్ సోనియాగాంధీవల్లేననుకుంటే కాంగ్రెస్‌కు ఓటేస్తారు. కాదు కె.సి.ఆర్‌గారే ప్రధానం అనుకుంటే తె.రా.సకు ఓటువేస్తారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరచడానికి కావలసిన మెజారిటీ కాంగ్రెస్‌కు గానీ, తె.రా.సకు గానీ రాకపోతే ఇద్దరూ కలిపి ప్రభుత్వం ఏర్పరచగల సీట్ల సంఖ్యకోసమైనా ఇద్దరూ ఒంటరిగా పోటీచేయడమే మంచిది. అందువల్ల బి.జె.పి.యో, తెలుగుదేశం, వై.కా.పా లాంటివో ఏ రకంగానూ లబ్దిపొందకుండా నిరోధించగల అవకాశం వుంటుంది. విలీనాలు, పొత్తులు ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాగూ వుండేవే. అందునా కాంగ్రెస్‌కు ఆ సంస్కృతి కొత్తదేమీకాదు. ప్రజారాజ్యం చిరంజీవిగారు అందుకు గొప్ప ఉదాహరణ’’ అన్నాడు సన్యాసి.


‘‘ఈ లెక్కన సీమాంధ్రలో ఇప్పుడు నిజంగా కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి వారెవరయినా ఏ కొత్త పార్టీ పెట్టినా, ఆఖరికి చిరంజీవి తమ్ముడు పవన్‌కళ్యాణ్ పార్టీని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు! ఎందుకంటే సీమాంధ్రలో ఇప్పుడు బలపడే అవకాశంవున్న పార్టీ ఏదయినా వున్నదీ అంటే అది ప్రధానంగా తెలుగుదేశమే. వై.కా.పాకు కాంగ్రెస్ ఛాయ ఏనాడో సోకింది. జగన్ డి.ఎన్.ఎ. గురించి కాంగ్రెసే చెప్పుకుంది. కానీ కాంగ్రెసే పరోక్షంగా ఇప్పుడు ఏర్పడబోయేవేవయినా వుంటే ఆ కొత్త పార్టీలకు గానీ, వై.కా.పాకు గానీ, బయటకు ఏమన్నా- లోన ఆహ్వానం పలుకుతుంది. బి.జె.పి కానీ, తెలుగుదేశం గానీ సీమాంధ్రలో బలపడకుండా, ఓట్లుచీల్చే రాజకీయానికి, ఎన్నికల్లో స్వాగతం చెప్పకుండా వుండదు. ఇదంతా అసలు ప్రజలకు తెలియదనుకుంటే అంతకన్న వెర్రీలేదు. అసలు నా అనుమానం అసలు ఈమాటు ఎన్నికల్లో గెలుపు శాతం ఓట్లు మరీ తగ్గిపోతాయనిపిస్తోంది. ఎందుకంటే మొదటిసారిగా తిరస్కరణ ఓటుకు కూడా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. కానయితే గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగింది. ఏడువందల మిలియన్లను మించిన ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోగలరు. ఏప్రిల్ రెండున తెలంగాణలో, ఏప్రిల్ 12న సీమాంధ్రలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. కానీ దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటితమైంది కనుక ప్రవర్తనా నియమావళి, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసినట్లే! ఇక ఎన్నికల తుఫాన్‌ను ఎదుర్కోవలసిందే! కాంగ్రెస్‌తో విలీనం కాలేదనీ, పొత్తు వద్దన్నాడనీ కె.సి.ఆర్‌ను అసలు అనుకోవడం ఎందుకులెండి! సాటి తెలుగువాళ్ళతో కలసి వుండలేకే, పొత్తు పడకే కదా! అసలు ‘విభజన’కు ఆయన ఉద్యమించింది. ఆయన స్వభావమే అది అయినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ - తాము మేలుచేసినా, తమవల్ల లాభపడినా ఆయన వేరుకుంపటే పెట్టుకుంటున్నాడని అనుకోవడం వాళ్ళ అవివేకమే అవుతుంది’’ అంటూ లేచాడు ప్రసాదు.0 comments: