ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, March 14, 2014

పౌర సమరం






'‘పార్టీలనీ, నాయకులనీ ఇన్నాళ్లూ తిట్టుకున్నది చాలు! ఎవరేమిటో నిజంగా అర్థమయినట్లయితే ఇప్పుడు పరిష్కారం, మార్పు నిజంగా ప్రజల చేతిలోనే వుంది. ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించిన గొప్ప శక్తి ఓటుహక్కు వినియోగం. ఓటును విచక్షణతో సద్వినియోగం చేసుకునే అవకాశం ఇది. 

దేశవ్యాప్తంగా నిజంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లయితే తమ ఓటును అమ్ముకోవడం కాక, నమ్ముకోవడం చేయాలి. ఓటు వేయడం అనేది హక్కుగా కన్నా బాధ్యతగా భావించడం ఇప్పుడవసరం. 

అసలు నన్నడిగితే ప్రతి పౌరుడూ ఓటువేసి తీరాలన్న నిర్బంధం అమలులో వుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ‘తిరస్కరణ ఓటు’కు కూడా అవకాశం కల్పించింది. అందువల్ల తమకు ఏ అభ్యర్థీ, ఏ పార్టీ నచ్చలేదంటూ, పోలింగ్‌కు దూరంగా, ఓటువేయకుండాతప్పించుకుపోకుండా మేధావులు, విజ్ఞులు అనుకునేవాళ్లయినా సరే ‘తిరస్కరణ ఓటు’ అయినా వేసి తీరాలన్న నిబంధన వుంటే బాగుణ్ణనిపిస్తోంది నాకు’’ అన్నాడు రాంబాబు.

‘‘నువ్వన్నది ఒక రకంగా నిజం రాంబాబూ! ఎందుకంటే ఓటువేయక తప్పనిసరి అనుకుం
దామన్నా పార్టీలూ, ఆ పార్టీలు నిలబెట్టే అభ్యర్థులూ ఎవరో వారిలోనుంచే కదా ఎన్నుకోవాల్సింది. పార్టీ ఫిరాయింపులు చేస్తున్న నేతలు తమ స్వార్థం గురించీ, రేపు అధికారంలోకి రాబోయే పార్టీ ఏదయితే తమకు లాభం వుంటుంది? తమ ప్రయోజనాలు, పదవీకాంక్షలూ నెరవేరతాయి అన్న ఆలోచనతో మారుతున్నారు తప్ప నిజంగా ప్రజాసేవ, ప్రజా ప్రయోజనాలు అన్న దృష్టితో చేస్తున్న సంకల్పంగా తోచడంలేదు. 

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే గాలులు వీస్తున్నాయనే భావంతోనే కాంగ్రెస్ పార్టీలో మొన్నటిదాకా పదవీ అధికారంకల పురంధేశ్వరి వంటివారు బి.జె.పిలో చేరారని ఎవరయినా చెప్పగలరు. అదీకాక తన ప్రాతినిధ్యపు నగరం సీటుని కాంగ్రెస్ తనను కాక వేరొకరికి అక్కడనుంచి అవకాశం కల్పిస్తుందన్న గట్టి సంగతి తెలిసినందువల్లే పార్టీ ఫిరాయింపే అస్తిత్వానికి రక్షణ అనుకోవడం జరిగిందని గ్రహించడం కష్టం కాదు. 

ఆ మాటకొస్తే నిజంగానే మోడీ గాలులు వీస్తుంటే నరేంద్ర మోడీ కూడా వారణాశి నుంచే పోటీ బరిలోకి దిగాలని కాంక్షించడం ఎందుకు? దేశంలో ఎక్కడినుంచయినా పోటీ చేయచ్చుకదా! కానీ యూ.పిలో పట్టు సాధించాలంటే గెలుపు అవకాశాలెక్కడ వున్నాయో ఆ సేఫ్ జోన్‌లోనే వుండి సాధించుకోవాలని ఆశించడం సహజమే మరి! 

బి.జె.పి ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ బలంగా లేనే లేదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భాజాపా అధికారంలో -సయోధ్యలో వుంది కాబట్టి ,ఇప్పుడు మళ్లీ కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయన్న సంకేతాలుండడంవల్ల అటు మొగ్గులు, పొత్తు భావనలు చిగురెత్తుతున్నాయి అంతే! 

తెలంగాణ ఏర్పాటుకు సహకరించింది తామేననీ, తమవల్లనే బిల్లు పాసయ్యిందనీ చిన్నమ్మని మరిచిపోవద్దనీ సుష్మాస్వరాజ్ అనడం చూస్తూం టే తమకు తెలంగాణాలోనూ ,అలాగే సీమాంధ్ర ప్రయోజనాలకు పట్టుబట్టిందీ తామే కనుక సీమాంధ్రలోనూ కూడా విజయావకాశాలు వున్నాయన్న ప్రబలమైన ఆకాంక్షతోనే స్వతంత్రంగానే అన్ని స్థానాల్లో బరిలోకి దిగాలన్న ఆలోచనా బి.జె.పి చేస్తోంది. 

‘తెలంగాణ పునర్నిర్మాణం’ అనే పదం కూడా ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణాలో ఓటర్ ముందు అన్ని పార్టీలవారూ ఊదరగొట్టే అంశమే! సీమాంధ్రలో కాంగ్రెస్‌మీద కోపం కుతకుతలాడుతోంది కనుక, అది తమకు లాభిస్తుందని బి.జె.పి భావించడంలోనూ అసహజం ఏమీ లేదు. కానీ అసలు ప్రజల నాడి గ్రహించడం మటుకు పార్టీలకయినా, నేతలకయినా బ్రహ్మవిద్యే సుమా!’’ అన్నాడు శంకరం.

‘‘మార్చి 15 వినియోగదారుల చైతన్య దినోత్సవం. ఇప్పు డు ‘ఓటు’ అనేదే విలువైన వినిమయ వస్తువు. అమ్మకం, కొనుగోలు అనే మార్కెట్ సరుకుగా కాక- దేశ భవిష్యత్ నిర్మాణానికై ఆ ఓటు వినియోగం చేయాలన్న ఓటర్ల చైతన్యం నేడు అత్యావశ్యకం’’ అన్నాడు ప్రసాదు.


‘‘ ‘ఓటున్న మా రాజుకి కోటి దండాలు’ అంటూ ఇప్పుడు పార్టీలూ, ఆ పార్టీలనుండి పోటీ చేసే అభ్యర్థులూ అందరూ రంగంలోకి దిగిపోతున్నారు. ‘సందట్లో సడేమియా’ అని మార్పు కోరే జనం తమను సమాదరించకపోతారా అని కిరణ్‌కుమార్ రెడ్డి, పవన్‌కల్యాణ్ వంటివారూ తమ కోడీ, కుంపటీతో తయారైపోతున్నారు. 


తమాషా ఏమిటంటే ప్రజలకు తాము చేసేదేమిటో గట్టిగా, ధీమాగా చెప్పడంకంటే ఎదుటి పక్షాన్నీ, ప్రత్యర్థి నేతలనూ నిందించడమే ప్రచారంలో అధికంగా కనిపిస్తూండడం విచారకరం. అసలు ఎన్నికల ప్రసంగాల్లో ఎవరూ ఎదుటిపక్షం గురించి ఏమీ మాట్లడకుండా తాము ప్రజలకు చేసేదేమిటో, తమను ఎందుకు ఎన్నుకోవాలో మాత్రమే ప్రసంగించాలని గట్టి నిబంధనలుంటే వ్యవహారం వేరేలా వుంటుంది. 

ఒకపక్క అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలంటూంటే మరోవంక పంచాయితీ ఎన్నికల వ్యవహారం చూడమని సుప్రీంకోర్టు ఆదేశించడం చూస్తూంటే మూలిగే నక్కమీద తాటిపండు చందాన వుందని ఎలక్షన్ కమిషనే భావిస్తోంది. వాటిని పోస్ట్‌పోన్ చేయడానికి అనుమతి కోరుతోంది. కానీ పనిలోపనిగా అవి కూడా కానిచ్చేస్తేనే బాగుంటుందని సుప్రీం గట్టిగా అనుకుంటే చేయగలిగేదేమీ లేదు. 

ఇంతకీ ఇప్పుడు అసలు విషయం ‘ఓటర్ చైతన్యం’ అనేది. ఓటర్లలో తమ పట్ల నమ్మకాన్నీ, విశ్వాసాన్నీ కలిగించి వారి ఓటును రాబట్టుకోవాలిగాని, వారిని ప్రలోభాలకు గురిచేసీ,ఎన్నికల్లో డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెట్టడం, పంపిణీ చేయడం కూడా అవినీతి కృత్యమే మరి! ఇప్పటికే పోలీసుల దాడుల్లో అక్రమ డబ్బు రవాణా ఎంతో పట్టుబడుతోంది. వాటి వెనుక దాగిన వారెవరో, అందుకు దన్నుగా వున్న పార్టీలేమిటో ఎప్పటికప్పుడు బహిర్గతం కావాలి. 

ఏమయినా ఇది ఎన్నికల కాలం! నిజానికి సామాన్యుల ఎన్నికలలకో మూలాధారమైన కాలం.అందువల్ల ఇప్పుడు జరగాల్సింది ఓటర్లలో చైతన్యం. కదలాల్సింది పౌరసైన్యం. ఎన్నికలంటేనే అసలైన ప్రజాయుద్ధం’’ అన్నాడు రాంబాబు.




0 comments: