ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, February 14, 2014

‘డే’లు



‘‘ప్రతిరోజూ ప్రాముఖ్యమైనదే. ఏరోజుకు వుండే విశిష్ఠత ఆ రోజుకి ఉంటుంది. కాలాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం అన్నది ముఖ్యం. రోజులో ఇరవై నాలుగ్గంటల సంగతి వదిలేయండి. ఎందుకంటే ఆహార నిద్రాదుల్లో కొంతకాలం ఎలాగూ గడచిపోతుంది. రోజులో ఉన్న కాలాన్ని సదుపయోగం చేయడం ముఖ్యం. అదెలా వినియోగిస్తున్నామన్నది ఎవరికివారికి బేరీజు వేసుకోవాల్సిందే’’ అన్నాడు ప్రసాదు.

‘‘మామూలు జనం సరేనయ్యా! ఆ జనానికి నేతృత్వం వహిస్తున్నామంటున్నవారు కాల సద్వినియోగంలో ఎలా వుంటున్నారన్నది ముఖ్యం కాదా? అంతదాకా ఎందుకు? చట్టసభల్లో అమూల్యమైన కాలం ఎలా దుర్వినియోగం అవుతోందో తలుచుకుంటూంటే కడుపు రగిలిపోవడం లేదా? కోట్లాది రూపాయలు రోజువారీ చట్టసభల సమావేశాలకు ఖర్చవుతున్నాయి. కానీ ప్రజోపయోగ అంశాలను వాటిల్లో చర్చించి అమలుచేయడం ఎక్కడ జరుగుతోంది? అల్లర్లతో,కొట్లాటలతో, అవరోధాలతో సభాసమయం ఎంత దుర్వినియోగమైపోతోందో కదా. ప్రజాప్రయోజనాల సంక్షేమానికి ఎంతమాత్రం కృషిచేయని ‘నామ్‌కే వాస్తే’ సభలుగా నిర్వహింపబడుతూండడం గొప్ప విషాదం కాదూ!’’ అన్నాడు సన్యాసి.


‘‘సభలు జరిగేదే కొన్ని రోజులు. ఆ రోజుల్లోని సభా నిర్వహణ సమయంలోని ప్రతిక్షణం ఎంతో విలువైనది. కానీ ఆ కనీస స్పృహ నేతల్లో కరువైంది. దీనికన్నా కేవలం ఒక్కరోజుకి పరిమితమై జనాలు జరుపుకుంటున్న ‘డే’లు చూస్తుంటే అబ్బురమనిపిస్తుంది. ఆ ఒక్క రోజునీ ఇంక మళ్ళీ ఎప్పటికో కదా అన్నట్లు జరుపుకునే సంస్కృతి వచ్చి పడింది. ఇవాళ ఫిబ్రవరి 14 ‘వాలెంటైన్స్ డే’ అంటున్నాం. ప్రేమికుల దినోత్సవం అనేది మన భారతీయ సంస్కృతి కాకపోయినా యువతరం గ్రీటింగ్ కార్డులతో, పువ్వులతో, చాక్లెట్లతో, షికార్లతో ఈరోజుని అట్టహాసంగా నిర్వహించుకుంటోంది. పెళ్లికాకుండా ప్రేమ పేరుతో డేటింగ్‌ల పేరుతో అబ్బాయి అమ్మాయి కలసి తిరగడం మన సంస్కృతి కాదనే భారతీయ జనతాపార్టీ, ఆర్‌ఎస్సెస్ లాంటివారు ‘వాలెంటైన్స్ డే’ని వ్యతిరేకిస్తూ నిరసనలు గట్రా చేస్తూంటారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ తామే భుజాలమీద మోస్తున్నట్లు వ్యవహరించేవారు, అయోధ్యలో రామాలయ నిర్మాణం గురించి అనవరతం ఘోషించేవారు మరి ఆ రామాయణంలోని భ్రాతృధర్మం గురించి అన్నదమ్ముల మధ్య వుండవలసిన ఐక్యతానుబంధాల గురించి విస్మరించినట్లే కనబడుతున్నారు. ధర్మం అనేది ఎప్పటికీ ధర్మం. అధర్మ వర్తనం మరి ఏ రకంగానూ పనికిరాదుకదా!’’ అన్నాడు శంకరం.


‘‘నువ్వంటే గుర్తొచ్చిందోయ్! ఇవాళ విదేశీ వ్యామోహం కారణంగానే ఈ ‘డే’ల సంస్కృతి మన దేశంలోనూ విస్తరిస్తోంది. మన భారతీయ విలువల గురించి, ధర్మం గురించీ, కుటుంబ సంవిధానం గురించీ విదేశీయులు సైతం మనవైపు చూస్తూంటే మనమే వేలంవెర్రితో విదేశీయుల ‘డే’ల మోజులో పడ్డాం అనిపిస్తోంది. సంవత్సర కాలంలో వస్తున్న ‘డే’లను చూస్తూంటే ఎంతో ఆశ్చర్యం వేస్తోంది. ఈ ఫిబ్రవరిలో ఇవాల్టి వాలంటైన్స్ డేయే కాదు సైన్స్‌డే, చాక్‌లెట్ డే, మాతృభాషా దినోత్సవం, పెట్స్ డే వంటివి వున్నాయి. క్రిందిటి జనవరిలో హగ్గింగ్ అంటే ఆలింగన దినం, ఆర్మీడే, ఫన్ ఎట్ వర్క్‌డే వంటివి జరిగాయి గుర్తుందా’’ అన్నాడు ప్రసాదు.


‘ఎలాగూ మొదలెట్టావ్ గనుక ప్రసాదూ! ఈ ఏడాది రాబోయే నెలల్లో వచ్చే డేల గురించి కూడా ముఖ్యమైనవి చెప్పేయ్! పనిలోపనిగా గుర్తుండిపోతుంది’’ అన్నాడు నవ్వుతూ సన్యాసి.


‘‘అసలు రానురాను దీనికి ‘డే’వుంది, దీనికి లేదు అనేది లేకుండా పోయేలా వుందిలే. మార్చిలో డెంటిస్ట్‌డే, ఉమెన్స్‌డే, ఏప్రిల్‌లో వరల్డ్ హెల్త్‌డే, హెరిటేజ్‌డే, మేలో కార్మిక దినోత్సవం మేడే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌డే, విజిట్ రిలేటివ్ డే, ఫ్రీడండే, మదర్స్‌డే, వరల్డ్ రెడ్‌క్రాస్ సొసైటీ డే, వరల్డ్ టెలికమ్యూనికేషన్‌డే, కామన్‌వెల్త్ డే, యాంటి టుబాకో డేలు అలాగే జూన్‌లో వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే, ఫాదర్స్‌డే, డయాబిటిస్ డే వంటివి వున్నాయి. జూలైలో పేరెంట్స్‌డే, ఆంటి అండ్ అంకుల్స్‌డే, వరల్డ్ పాపులేషన్ డే, ఆగస్టులో బుక్‌లవర్స్‌డే, లెఫ్ట్‌హ్యాండ్స్‌డే, ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే, ఇండిపెండెంట్స్‌డే, నేషనల్ స్పోర్ట్స్ డే, సెప్టెంబర్‌లో వరల్డ్‌పీస్‌డే, టీచర్స్‌డే,
వరల్డ్ టూరిజం డే, అక్టోబర్‌లో గ్లోబల్ హాండ్ వాషింగ్‌డే,  వరల్డ్ఫుడ్ డే, వరల్డ్ యానిమల్ వెల్ఫేర్‌డే, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌డే, నేషనల్ పోస్ట్ఫాస్‌డే, నవంబర్‌లో హౌస్‌వైఫ్ డే, చిల్డ్రన్స్‌డే, డిసెంబర్‌లో వరల్డ్ ఎయిడ్స్‌డే, లాఫింగ్‌డే, హ్యూమన్‌రైట్స్ డే, ఫార్మర్స్‌డే వంటివి వున్నాయి’’ అన్నాడు ప్రసాదు.

‘‘మానవ బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, విశ్వాసాలు ఇవన్నీ తాత్కాలికాలూ కేవలం కృత్రిమ అభివ్యక్తిదాయకాలూ కాదర్రా! ఒక్కరోజు ఒక అంశానికి కేటాయించి ఆరోజు దానికి ప్రాధాన్యతనిచ్చి మిగతారోజులు దాన్ని పూర్తిగా విస్మరించడం అభిలషణీయమని ఎవరూ అనరు. మన భారతీయ జీవనంలో విలువలు నిరంతరం జీవధారలా పరస్పరాశ్రీతాలై సాగుతూంటాయి. యాంత్రిక జీవనబద్ధులైన విదేశీ సంస్కృతి వారిని మనలా కట్టివుంచడం లేదు. అమ్మానాన్నలకు రోజూ నమస్కరించి కార్యమగ్నులకావడం మన పద్ధతి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ ముందు దైవంకన్నా వారికి ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళం మనం. పెద్దలను గౌరవించడం, అందరి పట్లా ప్రేమాభిమానాలను కలిగి వుండడం, పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవడం, ఐకమత్యంతో సమష్టిజీవనం సాగించడం ఇవన్నీ భారతీయ జీవన ధోరణులు.’’ అన్నాడు శంకరం.


‘‘నిజమే! ఎవ్విరీ‘డే’ అంటే ప్రతి దినమూ మనకు విలువైనదే. రోజులో నిత్యమూ మనం తల్లిదండ్రులకు, మన ప్రేమలకు, భూతదయకు, శ్రమకు, ఆప్యాయతానురాగాలకు, స్నేహాలకు దైవ, దేశ, దేశభక్తులకు అన్నింటికీ కేటాయిస్తూనే వుంటాం. నిత్యం సమగ్రతకు, సమష్టితనానికి అన్ని రకాలుగా కృషిచేస్తూంటాం. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అది మన విలక్షణత, విశిష్టత’’అంటూ లేచాడు ప్రసాదు.



4 comments:

Karthik said...

Chaalaa chaalaa baagundi sudhama garoo:-):-)

సుధామ said...

Dhanyavaadaalu Karthik garu !

sarma said...

తత్+దినము=తద్దినము. :)

సుధామ said...

హ..హ్హ..హ్హా!అంతే.. అంతే.. శర్మగారూ!