ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, August 23, 2013

ఆలియమ్ సీపా‘‘ఆలియమ్ సీపా గురించి తెలుసా? దాని విలువ ఇవాళ అంత ఇంతా కాదు’’ అన్నాడు సుందరయ్య.

‘‘ఆలియమ్ సీపానా? అదేమిటోయ్? ఇంతకీ ఏమిటట దానికి అంత విలువ?’’ అడిగాడు ఆశ్చర్యంగా సన్యాసి.


‘‘ఇవాళ ఓ గృహిణి తన పుస్తెల తాడు తీసి భర్తకి ఇచ్చి దీనిని కుదువబెట్టయినా దానిని తీసుకురమ్మనీ అది లేనిదే జీవిక కష్టమనీ మొరపెట్టుకుందిట. మొన్న రాఖీరోజు ఓ చెల్లెలు అన్నకు దానినే రాఖీగా కడితే ఆ అన్నగారు కానుకగా దానినే ఓ కిలో చెల్లెలకు కొనిచ్చాడట’’ అన్నాడు సుందరయ్య ముసిముసిగా నవ్వుతూ.


‘‘ఇంతకీ ఏమిటోయ్ ఆ ఆలియమ్ సీపా? పీపాలాగా? అసలు సంగతి చెప్పేందుకు అంత సేపా?’’ అన్నాడు సన్యాసి కనుబొమ్మలు ముడుస్తూ.


‘‘సన్యాసి బాటనీ చదువుకోలేదు సుందరయ్య? చదివిన నాకే గబుక్కున అలా అంటే గుర్తు రాలేదు. మొత్తానికి నువ్వు భలేవాడివే’’ అన్నాడు రాంబాబు కూడా నవ్వుతూ.


‘‘ఇంతకీ అసలు సంగతి చెప్పేదుందా లేదా? కొంచెం కోపంగానే అడిగాడు సన్యాసి.


‘‘ఆలియమ్ పీపా అనేది ఉల్లిపాయకు శాస్ర్తియ నామమోయ్ సన్యాసీ! సాధారణ వంటకాలలో మనం వాడే ఉల్లిపాయ సైంటిఫిక్ పేరు అది. కరోలస్ లినే్నయస్ ద్వినామీకరణ ప్రకారం ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతికి చెందింది ఉల్లిపాయ. ఉల్లిపాయలో ఎర్రనివి, తెల్లనివి, చిన్నవి, పెద్దవి, ఎక్కువ వాసన కలవి, తక్కువ వాసన కలవి, తియ్యటివి అనేక రకాలున్నాయి. అసలు పేదవాడి తిండి అయిన చద్దన్నం, అందులో నంచుకోడానికి ఓ ఉల్లిపాయ ముక్క. అలాంటిది ఇవాళ ఉల్లిపాయ ధరలు కొండెక్కి కూచున్నాయి. బంగారం ధరయినా తగ్గుతుందేమో గానీ ఉల్లిపాయ ధరలు పెరిగిపోతున్నాయి. ఉల్లి చేసే మేలు తల్లయినా చేయదనే సామెత ఊరికే రాలేదు. ఉల్లి గొప్పతనంవల్ల వచ్చిందే’’ అన్నాడు రాంబాబు.


‘‘చంపావ్ కదోయ్ సుందరయ్యా! ఉల్లిపాయ అని అర్ధమయ్యేలా చెప్పకుండా, శాస్ర్తియ నామాలు వల్లిస్తే ఎలా? నిజమే ఉల్లి ధరల లొల్లి పెరిగిపోయింది. సామాన్యుడికి అందకుండా ఉల్లి విలాస హాస ఒయ్యారాలు పోతోంది. కానీ చూసావ్! ఈ ఉల్లిపాయే ఒకప్పుడు జనతా ప్రభుత్వాన్ని పడగొట్టిందని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే విలువైన ఉల్లిపాయను రెండు ముక్కలుగా కోసి సోనియమ్మ తల్లి కన్నీరు తెప్పిస్తూ, కాంగ్రెస్ పార్టీని ఆ స్థితికే నెట్టుతోందని ‘నెట్’లో కూడా చాలామంది వాపోతున్నారు’’ అన్నాడు సన్యాసి.


‘‘ఏదయినా మనకు అందనపుడు దాని గురించి కథలుగా చెప్పుకుని సంతోషిస్తుంటాం. ఇప్పుడు ఉల్లిపాయ కథ కూడా అలానే ఉంది. మీకో సంగతి తెలుసా? ఉల్లిపాయ ఒక ఆంటీ బయాటిక్ అంటే అద్భుత రోగ నిరోధక శక్తిగలది. ఉల్లిపాయ తిననవసరం కూడా లేదు. కానీ మన పక్కన ఉంచుకుంటే వైరస్, బాక్టీరియాల వలన వచ్చే రోగాలు దరి చేరనివ్వదు. వచ్చిన జబ్బులను కూడా నయం చేస్తుంది’’ అన్నాడు సుందరయ్య.


‘‘నువ్వనేది మరీ విడ్డూరంగా లేదూ?’’ అడిగాడు సన్యాసి.


‘విడ్డూరమేమీ కాదోయ్! ఋజువైన సత్యాలే! ఉల్లిపాయల్లో బాక్టీరియాలకూ, వైరస్‌లకూ కావలసిన అయస్కాంత శక్తి ఉంది. ఆ మాగ్నెట్ ఆకర్షణ కారణంగా వైరస్‌లూ, బాక్టీరియాలు ఉల్లిపాయలోకి చేరతాయి.అలా వెళ్లాక ఆ ఉల్లి ఘాటుకు అవి చచ్చిపోతాయి. ఆ చచ్చిపోయిన బాక్టీరియా, వైరస్‌ల వల్లనే ఉల్లిపాయ నల్లబడుతుంది. బాక్టీరియాతోగానీ, వైరస్‌తో గానీ జబ్బుపడి బాధపడుతున్నవారు పెచ్చు తీయని ఉల్లిపాయను రెండు ముక్కలుగా తరిగి, ఆ రెండు ముక్కలనూ తలో గినె్నలో వుంచి తమ దగ్గర పెట్టుకుంటే ఆ రోగి శరీరంలోని వైరసో, బాక్టీరియానో ఉల్లిపాయ ఆకర్షణకు బయటకొచ్చి ఆ ఉల్లిలో చేరిపోతుంది రోగిలోని బాక్టీరియ, వైరస్ తొలగిపోవడంతో జబ్బు నయం అవుతుంది’’ అన్నాడు సుందరయ్య.


‘‘ఓర్నాయనో! ఈ సంగతి తెలిస్తే ఉల్లిపాయ రేటు ఇంకా పెరిగిపోతుంది కదోయ్! ఎనభై రూపాయల ధర ఇప్పటికే దాటిపోయింది. వంద దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉల్లిపాయలను సామాన్యుడికి అందుబాటులో ఉంచని ప్రభుత్వమూ ఒక ప్రభుత్వమేనా? ఏ కాయగూరలు, పండ్లు లేకపోయినా బ్రతకచ్చుగానీ ఉల్లి లేకుండా బ్రతుకు వల్లి ఎలా నిలుస్తుంది’’ అన్నాడు సన్యాసి.


‘‘వంటలలో ఉపయోగించడానికి ఉల్లిపాయ అనివార్యం. కానీ ఒకసారి తరిగిన ఉల్లిపాయను మిగిలిపోయింది కదా అని మరునాడు వాడకూడదు తెలుసా! ! ఎందుకంటే ఆ ఉల్లిపాయలో గాల్లో వున్న బాక్టీరియాలు చేరి వుంటాయి. 1919లో ఫ్లూ వచ్చినప్పుడు అనేక మిలియన్ల ప్రజలు మరణించారు. అయితే ఒక గ్రామంలోని రైతు కుటుంబీకులంతా ఆరోగ్యంగా ఉండడానికి పెచ్చు తీయని ఉల్లే కారణమైందట. ప్రతిరూమ్‌లోనూ ఓ ఉల్లిపాయ పెట్టారట వాళ్లు. ఇది నిజ జీవిత సంఘటనగా ఓ డాక్టర్‌గారు గ్రంథస్తం చేసారు కూడాను. ప్రపంచం అంతటా ఉల్లిసాగు ఉంది. ఉల్లి చట్నీయే అక్కర్లేదు పచ్చిది కూడా నేరుగా తినేస్తాం. కొలస్ట్రాల్ పెరగకుండా, క్యాన్సర్ బారిన పడకుండా ఉల్లిపాయే రక్షిస్తుంది. అయితే ఇప్పుడు ఉల్లిపాయ రేటు పెరగకుండా మనం రక్షించుకోవాలి. ‘ఉల్లీ రక్షతి రక్షితః’ అన్నమాట. ఆలియమ్ సీపా గూర్చిన దృష్టే ఆలిండియావైపా అంటే అది వర్తమాన యదార్ధం’’ అంటూ లేచాడు రాంబాబు.


0 comments: