ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, June 7, 2013

బ్రతుకు పంజరం



‘‘పక్షులకు, జంతువులకు అనేకం మనిషితో అవినాభావ సంబంధం ఉంది. పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్లు వంటివేవో కొన్ని తప్పిస్తే, మనిషికి సహాయపడనివి లేవేమో! ఆ మాటకొస్తే పులులు సింహాలను కూడా మచ్చిక చేసుకుని సర్కస్‌లలో ఆడించి జనాన్ని వినోదపరచడమూ ఉంది’’ అన్నాడు ప్రసాదు.

‘‘కానీ అది ఇవాళ చట్టప్రకారం నేరం. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అనుసరించి జంతువులను మచ్చిక చేసుకోవడం పేరనైనా హింసించడం, వాటిచేత పనులు చేయించడం నేరం. పక్షులనూ, జంతువులనూ సహజంగా వాటి స్వేచ్ఛా వాతావరణంలో తిరగనివ్వాలన్నది అభిమతం’’ అన్నాడు శంకరం.

‘‘కుక్కల్నీ, పిల్లుల్నీ పెంపుడు జంతువులుగా ఇళ్లల్లో పెంచుతున్నామా లేదా? పెంపుడు కుక్కలు బోలెడు సేవలు చేస్తాయి. ఇళ్లల్లో ఆవులు, గేదెలు కలిగి ఉండడం అంటే గొప్ప పాడి ఉన్నట్లు. ఇవాళ పట్టణాలలో అపార్టుమెంట్ కల్చర్ పెరిగిపోయాక వైయక్తిక పాడి కూడా తగ్గిపోయింది. పాలు అంటే ‘ప్యాకెట్ల’లో లభించేదే అనుకుంటున్నారు కూడా నేటి పిల్లలు. ఆవులు, గేదెల మొహాలు కూడా చూడని పిల్లలున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే బట్టలు ఉతకడానికి చాకిరేవుకి తీసుకెళ్లడానికి, మోయడానికి మునుపు గాడిదలుండేవి. ఇవాళ రజకుల ఇళ్లల్లో కూడా గాడిదలు లేవు. అసలు బట్టలుతికే వాళ్లే తగ్గిపోయారు. ఇప్పుడంతా ఇస్ర్తి చేసేవాళ్లే. అపార్టుమెంట్ సెల్లార్లో ఓ బల్లా, ఇస్ర్తిపెట్టె పెట్టుకుని బ్రతికేసేవాళ్లున్నారు. ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు వచ్చాక బట్టలు చాకళ్లు ఉతకడం తగ్గిపోయింది. పెద్ద పెద్ద దుప్పట్లు, కర్టెన్లు వంటివో, ఖరీదైన జరీ చీరలో డ్రైక్లీనర్స్‌కు వేసేయడమే! మొత్తానికి జంతు సంబంధం రజకత్వంలో లేదిప్పుడు. అలాగే ఎద్దుబండ్లు, గుర్రపు బగ్గీలు కూడా తగ్గిపోయాయి’’ అన్నాడు రాంబాబు.

‘‘కానీ మనిషి ప్రకృతికి దూరమైపోతున్నాడనిపిస్తోంది ఇవాళ. పశుపక్ష్యాదులతో సంబంధాలు వద్దనడం సరికాదేమో! వీధి కుక్కలు పేట్రేగిపోయి జనాన్ని హింసిస్తుంటే పట్టని ప్రభుత్వం జంతు సంరక్షణ పేరిట అమలుపరుస్తున్న నిబంధనలు కొన్ని అసమంజసంగా ఉంటున్నాయి. కోళ్లు, గొర్రెలు, మేకలు, ఆవులు అన్నీ మాంస భక్షణానికన్న తీరు పెరుగుతోంది. గోవధ నిషేధం అన్నమాట కాగితాలమీదనే కానీ కార్యరూపంలో కానరావడంలేదు. సింహాచలం దేవస్థానానికి భక్తులు చెల్లించిన గోవులకే భద్రత కల్పించలేక ఓ చిన్నకొట్టంలో పట్టనన్ని సంఖ్యలో వాటిని కట్టిపడేసి ఇరుకులో, ఆకలి దప్పులతో అవి అసహాయంగా మరణిస్తుంటే చూస్తూ ఊరుకున్నారంటే అంతకన్నా దారుణం ఇంకేముంది. నిజమే!అపురూప జంతువులను, హానికరమైన వాటిని ఏ ‘జూ’లోనో వుంచడం ఆమోదించ దగిందే. పాములను, మొసళ్లను ఇంటి ప్రాంగణాల్లో ఉంచమని అనము. అసలే పిచ్చుకల వంటి ప్రాణులు అంతరించిపోతూ ఒకప్పటి ఇళ్ల శోభను కలకలాన్ని మటుమాయం చేసాయి. అక్వేరియంలో చేపలను అలంకరించుకున్నట్టుగా ఇవాళ ఇళ్లల్లో పంజరాల్లో చిలుకలను, పక్షులను పెంచుకోవడం వాటి స్వేచ్ఛకు ఆఘాతంగానే తలపోయబడుతోంది’’ అన్నాడు శంకరం.

‘‘మొన్న సోమవారం వన్యప్రాణి వేట నివారణ దళం అధికారి హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాలలో అటవీ శాఖ నిబంధనలను ఉల్లంఘించారంటూ, చిలుక జోస్యం చెప్పుకుంటూ బ్రతికే జ్యోతిష్కుల నుంచి రామచిలుకలను స్వాధీనం చేసుకుని ‘జూ’కు తరలించారట! ఏ.సి.ఎఫ్ అధికారి కొండల్‌రావు, జూ క్యూరేటర్ శంకరన్ దేశీయ పక్షులను బంధించడం, హింసించడం చట్టవిరుద్ధమని, రామచిలుకలను బంధించి వాటితో వ్యాపారాలు నిర్వహిస్తూ జ్యోతిష్యం చెప్తున్న వారిని అదుపులోకి తీసుకుని, వారినుండి రామ చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి రామచిలుకలను స్వాధీనం చేసుకుని ‘జూ’కి అప్పగించారు. రామచిలుకలకు స్వేచ్ఛ పేరిట ‘జూ’లో పెద్ద పంజరాల్లోకి పంపారన్న మాట! కానీ పాపం! బ్రతుకుతెరువుకై చిలుక జోస్యాల చెప్పుకుంటూ రోజుకు సంపాదించే పదో, పరకో డబ్బులతో పొట్ట నింపుకునే ఆ బీద జ్యోతిష్కుల పరిస్థితి ఏమిటి? నిజానికి ఆ రామచిలుకలతోనే వారి జీవితం, బ్రతుకు తెరువూ ముడిపడి ఉంది. ఆ రామచిలుకలను వారు బంధించి హింసిస్తున్నారా? తాము సంపాదించిన దాంట్లోంచే కాయో, పండో కొని వాటిని పోషిస్తున్నారు కూడాను. కానీ రామచిలుకలను స్వాధీనం చేసుకోవడమంటే పాపం వారి పొట్టకొట్టినట్టు కాదా? వన్యప్రాణి సంరక్షణ ఆ రామచిలుకలు అనుభవిస్తాయో లేదో తెలియదు కానీ, తమ జీవనాధారం కోల్పోయిన ఆ బడుగు బతుకుల సంగతి ఆలోచించవలసింది కాదా?’’ అంటూ చెమర్చిన కన్ను తుడుచుకుంటూ లేచాడు ప్రసాదు.
 
 
 

0 comments: