ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 24, 2013

అంతా అంతే!





‘‘రేపు పాక్షిక చంద్ర గ్రహణంట!’’ అన్నాడు సన్యాసి.

‘‘రేపేమిటి? ప్రస్తుతం కూడాను! ‘చంద్రబాబు’గవర్నర్‌నూ, రాష్టప్రతిని కలిసి, ‘కళంకిత మంత్రులకు’ ఉద్వాసన చెప్పాలని చెప్పారా? ఆయన మాట విని, ప్రస్తుతం రాష్ట్రంలో సిబిఐ ఆరోపణలు సరికొత్తగా ఎదుర్కొంటూ, పదవులకు రాజీనామాలు కూడా చేసిన ధర్మాన, సబితలకు వెంటనే ఉద్వాసన చెబితే, అదెక్కడ చంద్రబాబుకు లాభకారిగా మారిపోతుందోనని, రాజీనామాల ఆమోదం గురించి ప్రస్తుతం ఏమీ చెప్పక వుండడం కూడా, పాక్షిక ‘చంద్రగ్రహణం’లాంటిదే మరి!’’ అన్నాడు శంకరం.

‘‘ప్రతిదీ రాజకీయమేనటోయ్ మరీను!’’ అన్నాడు సన్యాసి.

‘‘అంతే నాయనా! ప్రస్తుతం పరిస్థితులు అలానే వున్నాయి. రాజకీయాలకూ, సినిమాలకే అవినాభావ సంబంధం అని మొన్నటిదాకా అనుకున్నారు. సినిమాల నుంచి రాజకీయాలకు మెట్టి, ప్రజల నెత్తిన మొట్టిన వారు, వారి అభిమానం చేపట్టినవారూ, ఇరువురూ వున్నారు. ‘సినిమాల్లో కంటే రాజకీయాల్లో నటించడమే చాలా కష్టం’అని ముందు ప్రవేశించీ, ఆపై ‘రాజకీయ నటన’ విరమించుకున్న నటీనటులూ వున్నారు. ‘ఫిక్సింగ్‌ల బట్టబయలు... రెండు వికెట్లు డౌన్! ఇద్దరు ఔట్!’’ అంటూ ఇప్పుడు పత్రికల్లో, ఛానెల్స్‌లో కనబడుతోంది, వినబడుతోంది!... అదేదో క్రికెట్ కామెంటరీ వ్యవహారం అనుకుంటే పప్పులో కాలేసినట్లే? వర్తమానం ‘పొలిటికల్ కామెంటరీ’యే! అంటే ఏవిటన్నమాట? ఇప్పుడు క్రీడారంగం రాజకీయ రంగం కూడా మమేకమైపోతున్నాయన్నమాట! రాజకీయాల్లో స్కామ్‌ల ‘ఫిట్టింగులూ’, క్రికెట్‌లో క్రీడాస్వాముల ‘బెట్టింగులూ’ కూడా ఊపందుకున్నాయి. అంచేత- రెండింటి టెర్మినాలజీ కూడా ఈజీగా ఒకటిగా రూపుకడుతోంది’’ అన్నాడు శంకరం మళ్ళీ.

‘‘సర్లే! ప్రకృతి గత అంశాలను కూడా, ఇప్పుడు రాజకీయ మమేకం చేస్తున్నట్లు- ‘రేపు పాక్షిక చంద్రగ్రహణం’ అన్న నా మాటకి, నీ వ్యాఖ్యానమే దాఖలాగా వుంది కదా! రాజకీయ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి! 2014 ‘ఎన్నికల ఋతుపవనాలు’ వస్తే గానీ చల్లబడే పరిస్థితులు లేవంటున్నారు! ఈసారి వర్షాలు బాగానే పడతాయి అంటుంటే; ఎవరికి వారికి హర్షాలుగా, తమ పార్టీకి ఓట్లు బాగా పడతాయనే ఆశల జల్లులు గానే, తోస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ వేరేచోటనుంచి తరలి వచ్చి, ‘ఇక్కడ కురిసే వర్షం ఎక్కడి మేఘానిది’ అయినా, ఆహ్వానించేటట్లుగా- వలస మబ్బులకోసం ఎదురుచూస్తూనే, తమ ఆశయాలే నిండుగా పండుతాయనీ, ఎదుటి పార్టీ ‘జలాశయాలు’ ఎండిపోతాయనీ, అనుకోవడం జరుగుతోంది! ఏక పార్టీ సంపూర్ణ ఆధిక్యత అసంభవం అన్నది నిర్ధారితంగా వుంటున్నా, ఎవరికివారు- ఏ ‘సునామీ’గానో, తామే అంతా కైవసం చేసుకోగలమన్న ఆశల వాతావరణంలో వుంటున్నారు. అంచేత- ‘రాజకీయ ప్రకృతి’ కూడా, ‘ప్రకృతి వైపరీత్యాలు’గానూ వుంటోంది మరి.’’ అన్నాడు సన్యాసి.

‘‘ ‘ఇందుగలదందులేదను సందేహము వలదు’ అన్న ట్లు రాజకీయం లేనిదెక్కడోయ్? ఏ రంగంతోనయినా దానికి సంబంధ బాంధవ్యాలే! ‘కళంకిత’ మంత్రులంటే- వారేదో ‘కళకు అంకిత’మయిన వారైనవారనీ, అదేదో ప్రశంసా సూచకమనీ భావించి, మొన్న ఓ ఛోటా మంత్రి - ‘నిజానికి నేను ఎంతోకాలంగా ‘కళంకిత’మంత్రిని! నా తరువాతే మీరు మరెవరినయినా ఆ విషయంలో తలుచుకోవాలి. నేనంత ముందంజలో వున్నాను.’అంటూ ఓ సభలో ప్రజలముందు విన్నవించుకున్నాట్ట!అలా రాజకీయంగా పాపం- ‘ఎవడి గోల వాడిదే!’ అన్న చందం సాగుతోంది. ఇలా నానా చెత్తగా రాజకీయం ముసరబట్టే, మురగబట్టే, కార్టూనిస్టు చంద్ర- ‘డస్ట్‌బిన్ కార్టూన్లు’అంటూ ప్రధానంగా, నేటి రాజకీయ అవ్యవస్థమీద కార్టూన్లు సంధించి, పుస్తకంగా వేశాడు. ఈ పార్టీ ఆ పార్టీ అనేమీ కాదు; అసలు ‘రాజకీయం’ పేర- సమాజంలోని కుళ్ళంతా కెలికాడు.’’ అన్నాడు శంకరం.

‘‘అవతలివాడికి ‘గంధం’ పూయాలంటే- ముందు గంధం గినె్నలో మనమూ వేళ్ళు పెట్టాలి! అలాగే- అవతలివాడికి ‘బురద’అంటించడానికీ, మనం బురదకు సమీపం అయి అంటుకోవాల్సిందే! ‘యద్భావం తద్భవతి’ అనీ అన్నారు. అంచేత ఫలానాది ‘మిస్టర్ క్లీన్’, ఫలానావాడు ‘బుద్ధిమంతుడు’ అనుకోడానికి లేదివాళ. వాడొట్టి ‘బుద్ధావతారం’ అంటే- బుద్ధిమంతుడని కాదు కదా? ఎందుకూ పనికిరాని ‘బభ్రాజమానం’ గాడనేగా అర్థం! అంచేత రేపు ‘బుద్ధ జయంతి’అని అన్నా, దాన్ని నువ్వు వట్టి ‘బుద్ధూ’జయంతిగా, రాజకీయంగా ‘టర్నింగ్’ఇస్తావ్! నేనెరుగుదునా విషయం’’ అన్నాడు సన్యాసి.

‘‘చూసావా? నేనంటానో అననోగానీ, నువ్వే అలా అనేసేవ్! అంటే ఏమిటన్న మాట? అన్నీ, అందరూ, అన్నింటినీ ఈ రాజకీయాల గాటకు కట్టడం మామూలైపోతోంది! ఇదీ 'ఫ్యాషన్’గా చెలామణీ అవుతోందన్నమాట! గొంగట్లో అన్నం తింటూ- వెంట్రుకలు ఏరుకున్నట్లు, రాజకీయం రొచ్చులో వుంటూ- ఆ రొచ్చు కబుర్లుకాక మెచ్చుకబుర్లూ, హెచ్చు ఆలోచనలూ ఇంకేం చెయ్యగలం? అసలే ‘కార్తెల’కాలం ప్రవేశించింది. ‘కార్యకర్తల’ కాలమూ ప్రవేశించింది. అంచేత వేడిమీ, మంటలూ మరింత పెరుగుతాయి. తప్పదు. ఇక ప్రవేశించేవి ఎన్నికల ఋతుపవనాలే! మండే గుండెల ప్రజలు ఎలా చల్లబడతారో, హర్షపు వర్షపు జల్లులుగా ఎలా వెదజల్లబడతారో- వేచి చూడాల్సిందే’’ అని లేచాడు శంకరం.

 

1 comments:

Vijayagopal said...

Ha,

A cartoon by Sudhama, at alst!!