ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 17, 2013

పురుగన్నం




‘‘నేనూ అచ్చుతప్పు అనుకున్నాను కానీ, ‘పెరుగన్నం’ కాదు ‘పురుగన్నమే’! ఒకప్పుడు ‘పురుగులు పడి ఛస్తావ్’అని తిట్టేవారు కానీ- ఇప్పుడు పురుగులు తిని హాయిగా బ్రతకచ్చు అనే సిద్ధాంతం వచ్చింది. మాంసాహారం అంటే ఏదో కోడి, మేక, గొడ్డు కావచ్చు కానీ, ఆకలి తీరాలంటే ఐక్యరాజ్యసమితే ఇప్పుడు ‘పురుగులు తినండి’ అంటోంది’’. అన్నాడు రాంబాబు.

‘‘చైనావాళ్ళు కండ చీమల్ని మనం మరమరాలు వేయించుకుని ఉప్పూకారం చల్లుకు తిన్నట్లు తింటారనీ, వారికి కప్పలు, పాములు కూడా గొప్ప ఆహారమనీ అంటారు గానీ, ఈ పురుగుల వ్యవహారమేంటో వినలేదు. అందునా స్వయంగా ‘ఐరాస’ ప్రతిపాదిస్తోందా? నమ్మదగిన నిజమేనా?’’ అన్నాడు శంకరం ఆశ్చర్యంగా.

‘‘యూఎన్‌ఓ ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్.ఎ.ఓ. స్వయంగా ప్రకటించిన సంగతేనయ్యా ఇది! ఆకలి, కాలుష్యం, భూతాపం, నిరుద్యోగం వీటన్నింటికీ పురుగులు తినడం గొప్ప పరిష్కారంట! రోమ్‌లో ఇటీవలే ‘ఆహార భద్రతకు, పౌష్టికాహారానికి అడవుల ప్రాధాన్యం’ అనే అంశం మీద అంతర్జాతీయ సదస్సు జరిగింది. కనీసం రెండువందల కోట్ల మందికి సంప్రదాయ ఆహారంలో పురుగులు భాగం అవుతాయని, ఒక పరిశోధనా నివేదికలో వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 1900 రకాల పురుగులను మనుషులు తింటారని అధ్యయనంలో తేలింది.’’ అన్నాడు రాంబాబు.

‘‘అది కాదయ్యా! పౌష్టికాహారం తినాలనీ, పర్యావరణ రక్షణకు జీవ వైవిధ్యం కాపాడాలనీ అంటూ- పురుగూ పుట్రా కూడా ఆకలి తీర్చుకునే భోజనమే, ‘హాయిగా ఓ పట్టుపట్టండి’ అనడం ఏమిటయ్యా’’ అన్నాడు శంకరం.

‘‘పురుగులని, ‘పురుగు’లా తీసిపారేయకు మరి! పురుగుల్ని తినడంవల్ల పౌష్టికాహారం లభించడంతోబాటు, కర్బన వాయు ఉద్గారాలు తగ్గుతాయనీ, అభివృద్ధిచెందుతున్న దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆకలి తీరుతుందనీ, నిరుద్యోగ సమస్యా పరిష్కారానికి కూడా ఇది దోహదమేననీ, యూ.ఎన్.ఓ ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్.ఏ.ఓ నొక్కి వక్కాణించిందిట! పురుగుల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయనీ, కాల్షియం, ఐరన్, జింక్ కూడా చాలా బాగుంటాయనీ వెల్లడించారు. ఎఫ్.ఏ.ఓ డైరెక్టర్ ఇవాముల్లుర్ అనేదేమిటంటే- గొడ్డుమాంసం తినడంకన్నా మిడతలు తినడం బెటరనీ, అందరూ పురుగులు తిని తీరాల్సిందేనని కాదు గానీ పురుగులు తినడం కూడా మంచి ఆహారం అనీ ప్రకటించారు’’ అన్నాడు రాంబాబు.

‘‘ఏమిటి మిడతలు గొడ్డుమాంసంకన్న మేలా?’’ ఆశ్చర్యంగా అడిగాడు శంకరం.

‘‘వంద గ్రాముల గొడ్డుమాంసంలో 6 మిల్లీగ్రాముల ఐరన్ మాత్రమే వుంటుంది. అదే వంద గ్రాముల మిడతల్లో ఎనిమిది నుంచి ఇరవై మిల్లీగ్రాముల ఐరన్ వుంటుందిట! మరి మిడతలు తినే నడతలు మంచివేకదా’’ అన్నాడు రాంబాబు.

‘‘కోడిమాంసం, గొడ్డుమాంసం, పంది మాంసం, చివరకు చేపలు కంటే కూడా పురుగులే బెస్టంటారేమో!’’ అన్నాడు మళ్లీ శంకరం నోరునొక్కుకుంటూ.

‘‘అంటారేమో అంటావేమిటి? అనేసారు. అలా నోరునొక్కుకోకు. ఎఫ్.ఏ.ఓ- వాటన్నింటికంటే పురుగులు ఆహారంగా తినడమే అన్నివిధాలా ఆరోగ్యదాయకమనీ, పురుగులు భోంచేయడంవల్ల ‘్భతాపం’ తగ్గి పర్యావరణానికీ మేలు జరుగుతుందనీ పరిశోధనలో తేలిందట. అంచేత ఆకలి తీరాలంటే పురుగులు తినండి. హాయిగా మీ చుట్టూ తిరిగే వాటినే, క్రిమికీటకాలనే, ఫాస్ట్ఫుడ్‌లా, ఇన్‌స్టెంట్‌గా, ‘ఇన్‌సెక్ట్ ఈటింగ్’ కావించండని మరి ఐరాస సలహా!’’ అన్నాడు రాంబాబు.

‘‘అది సరేగానీ బ్రదరూ! పురుగులు అంటే ఏమిటేమిటట ఇంతకీ! ఆ సంగతి చెప్పారా? పౌష్టికాహారం అయిన పురుగులు అంటూ ప్రత్యేకంగా ఏవో తేల్చే వుంటారు కదా! పరిశోధన నివేదికల్లో ‘పెరుగన్నం’ అంత కమ్మనైన ‘పురుగన్నం’ ఏదోకూడా సెలవియ్యిమరి! తెలుసుకునే వుంటావుగా!’’ అన్నాడు శంకరం రెట్టిస్తూ.

‘‘పురుగులంటే ఏమేం తినొచ్చంటావా? పేడ పురుగు, గొంగళి పురుగు, తేనెటీగ, కందిరీగ ఇవన్నీ పౌష్టికాహారమేనట’’ అన్నాడు రాంబాబు.

‘‘యాక్! గొంగళి పురుగా? చిన్నప్పుడు మా అన్నయ్య పెరట్లో ఆడుతూ, వేప చెట్టు దగ్గరి గొంగళీపురుగు నోట్లో పెట్టేసుకున్నాడని, అమ్మ నాన్న తెగ కంగారుపడ్డారు.’’ అన్నాడు శంకరం.

‘‘మీ అన్నయ్య నీకన్నా బలహీనంగా ఎందుకున్నాడా? అనుకునేవాడిని. అదా సంగతి! చిన్నప్పుడు అతన్ని దాన్ని తిననిస్తేపోయేదేమో!’’ అన్నాడు రాంబాబు నవ్వుతూ.

‘‘ఎంత ప్రొటీన్లువున్నా పురుగులు ఎలా తింటారయ్యా బాబూ!’’ అన్నాడు శంకరం వెగటు మొగంతో.

‘‘పేడ పురుగులు 31 శాతం, గొంగళీ పురుగులు 18 శాతం, తేనెటీగలు, కందిరీగలు 14 శాతం, మిడతలు, కీచురాళ్ళు 13 శాతం ఇవన్నీ ఆహారంలో భాగమేననీ, ప్రపంచవ్యాప్తంగా 1900 రకాల పురుగులు మనుషులు తింటున్నారనీ, ఆహారంగా పురుగులు- పెరుగుదలకు చక్కగా దోహదపడతాయనీ, పౌష్టికాహారంగా ఉపయోగపడుతూ, కోట్లాది మంది ఆకలితీర్చడమేకాక, అనేక సమస్యలకు నివారణోపాయంగా భాసిస్తుందనీ ఐరాస సలహా! అంచేత ‘పురుగులు’ అని హీనంగా చూడకు వేన్నీ! మనుషుల ప్రాణం కాపాడేవే అవన్నీ! అంచేత మున్ముందు- వంటింటి సొరుగుల్లో పురుగులు, డైనింగ్ టేబుల్ కంచంలో ‘పెరుగన్నం’బదులు ‘పురుగన్నం’-కను‘విందు’గా, తిన‘విందు’ గా సాక్షాత్కరించే రోజులు దూరంలేవేమో!’’ అన్నాడు రాంబాబు శంకరం భుజం తట్టిలేస్తూ.*


2 comments:

సుధామ said...












Srinivas Vasudev Sudhama Avr గారూ ఇది నిజమె..దీనికి పునాది కొరియాదేశం..ముందు వారె ఈ ప్రయోగం చేసాక ఐరాస దీన్ని ప్రపంచం ముందుకు నెట్టింది. పూర్తి వెజ్ తిండంటే మనకి తప్ప ప్రపంచంలొ మరెక్కడా లేదు కాబట్టి ఇది వేరేవారెవ్వరికీ పెద్ద ఆశ్చర్యమనిపించదేమొ

about an hour ago · Like..





Srinivas Vasudev :Sudhama Avr గారూ ఇది నిజమె..దీనికి పునాది కొరియాదేశం..ముందు వారె ఈ ప్రయోగం చేసాక ఐరాస దీన్ని ప్రపంచం ముందుకు నెట్టింది. పూర్తి వెజ్ తిండంటే మనకి తప్ప ప్రపంచంలొ మరెక్కడా లేదు కాబట్టి ఇది వేరేవారెవ్వరికీ పెద్ద ఆశ్చర్యమనిపించదేమొ

Srinivas Iduri :ఇకనుండీ వెజ్ బిర్యానీ బదులు గొంగళీ బిర్యాని, పెసర పునుగులకి బదులు పెసర పురుగులు తినాల్సోస్తుందేమో!!!!!!!!!!!

సుధామ said...

Lakshminarayana Murthy Ganti: పురుగన్నం సుధామధురం సమాసం బాగానేయుందికాని,దీనికి డిమాండు పెరిగితే గవర్లమెంటువారి విద్యార్ది వసతిగృహాలలో పిల్లలికి అదికూడా దక్కదేమో?