ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 3, 2013

ఏడడుగుల సంబంధం




ఎండాకాలమనక- ఆయాసపడక- తమరి కార్యంబంచు- తలచిరారయ్య’ అంటూ, మునుపు పెళ్ళి శుభలేఖలమీద ఆత్మీయంగా-పిలుపు అచ్చొత్తించడం వుండేది. తమ బంధువుల దగ్గరనుంచి వచ్చిన పెండ్లి పత్రికలో అది చూపి శ్రీమతి తన భర్తతో- ‘‘పాపం! వెళ్దామండీ’’ అంటే, ‘మన ‘కార్యం’అని ఎలా అనుకుంటాం? అదయ్యి అప్పుడే పాతికేళ్ళయింది’అని చమత్కరించాడట! ఏమయినా- మే నెలలో ‘పెళ్లిముహూర్తాలు’బానే వున్నాయి. చూస్తే ఎండలు మండిపోతున్నాయి. ఉన్న ఊరే అయినా- ఈ జంటనగరాల్లో పెళ్ళి మంటపాల దూరాభారాలు ఎక్కువ. వనస్థలిపురం నుండి డోలారీథనిలో పెళ్లంటే- వెళ్లేసరికే మనంకాదుగానీ ఆశీర్వదించడానికి తాతలు దిగివస్తారు’’ అన్నాడు రాంబాబు పెళ్ళిశుభలేఖ చూస్తూ ప్రసాద్‌తో.


‘‘్భలేవాడివోయ్! పెళ్ళనేది జీవితంలో ఒక్కసారి జరిగే మహోజ్జ్వల ఘట్టం! అది ‘మెమరబుల్’గా జరగాలనీ, బంధుమిత్రులందరి సమక్షంలో చేసుకోవాలనీ, ఎవరయినా ఉబలాటపడటం సహజం! నిజమే! పెళ్ళిళ్ళ పేరిట వృథా ఆడంబర ఖర్చులూ అవీ అనవసరంగానీ, పదిమందిని పిలిచి విందు చేయడం, నలుగురికీ పెట్టుకోవడం, ఇలాంటి శుభకార్యాల సందర్భంగా మంచిదేకదా! తూతూమంత్రంగా జరిగే యాంత్రిక వివాహాలు కాదు. శాస్తబ్రద్ధంగా ఇద్దరిని వివాహబంధంలో ముడివేయడం సబబే! వలచి చేసుకునేవే అయినా- ‘వివాహం’అనేది వ్యష్టి సమష్టికావడమే కనుక, సమాజంలోని బంధుమిత్రులనే పదుగురూ హాజరుకావడం అనేది, ఔచిత్యమూ, అనివార్యమూ కూడాను. అంచేత పెళ్ళికి పిలిస్తే వెళ్ళిరావడం విధాయకంగా భావించాలి. దూరాభారాలనేవి ఆత్మీయతలకూ, ప్రేమలకూ అడ్డంకికాదు, కాకూడదు. ఈ మేలో పెళ్ళిళ్ళు బానే వున్నట్టున్నాయ్ అని నీవన్నది నిజమే! అన్నట్టు పెట్రోల్ ధరలు కూడా అయిదేళ్ళలో మునుపెన్నడూ లేనంతగా తగ్గాయి. అంచేత నీ కారో, స్కూటరో, పెళ్ళివారి బస్సో- నిరభ్యంతరంగా హాయిగా సాగిపోవచ్చు’’ అన్నాడు నవ్వుతూ ప్రసాదు.

‘‘పెరుగుట విరుగుటకొరకే- ధర తగ్గుట హెచ్చుకొరకే’అని మనవాళ్ళు ఊరికే అనలేదు. బంగారం ధరలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టాయి. పెట్రోలు ధరలూ తగ్గాయి. అంచేత కులాసాగా అనేసుకోనక్కర్లేదు! ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. విద్యుత్ ధరల బాదుడు, కూరగాయల ధరల పెరుగుడు వుంది చాలదూ!- గడచిన అయిదేళ్ళల్లో- 2007 ఫిబ్రవరిలో నలభైరెండు రూపాయల ఎనభై అయిదు పైసలుండిన లీటరు పెట్రోలు ధర, గత ఏడాది సరిగ్గా ఇదే మేలో ఎనభై నాలుగు రూపాయల నలభైనాలుగు పైసలయ్యింది. ప్రస్తుతం తగ్గిన ధరల ప్రకారం- అరవై ఎనిమిది రూపాయల ఇరవై ఒక్క పైసలు కావడం సంతోషదాయకమేగానీ, ఇది స్థిరంగా ఎంతకాలం వుంటుందనే సందేహం అలానే వుంది! వ్యవస్థలో ధరల విషయంలోనే ఎగుడుదిగుడులు కాదు, వివాహవ్యవస్థలో విలువల విషయంలోనూ ఎగుడుదిగుడులు ఎక్కువైపోయాయి. ఇవాళ వివాహబంధాలు గతంలోవలె పటిష్టంగా వుండడం జరిగితే- నిజంగా అది మహద్భాగ్యంగానే వుంటోంది. యువత ఆలోచనల్లో ఎంతో మార్పువచ్చింది. అమ్మాయిలు కూడా ‘జీవితానికి పెళ్ళే సర్వస్వం’అని నేడు అనుకోవడంలేదు! తమకు నచ్చినవాడు దొరకకపోతే- అవివాహితులుగా వుండడానికయినా సిద్ధపడిపోతున్నారు గానీ, ‘ఎవడో ఒకడు మొగుడైతే చాల్లే’ అనుకోవడం లేదు. నిజానికి ఇవాళ పెళ్ళికూతురు దొరకడమే కష్టంగా మారుతోంది. వ్యక్తిత్వాన్నీ, సాధికారతను సంతరించుకున్న అమ్మాయిలు- వివాహబంధంలో ఇమడడానికి ఒకప్పటిలా ఆత్రపడడం లేదు. తల్లితండ్రులకు పిల్లల పెళ్ళిళ్ళుచేయడం ఈ రోజుల్లో ఒక్కోసారి ఎంత కష్టమో, ఒక్కోసారి అంత సులభం! తాము ప్రేమించుకున్నామని అబ్బారుూ, అమ్మారుూ ముందుకొస్తే- ఇరువైపుల తల్లితండ్రులూ ఎలాంటి భేషజాలూ లేక వారికి వివాహం చేయడమే శ్రేయోదాయకం ఈరోజుల్లో’’ అన్నాడు శంకరం సంభాషణలో కలుస్తూ.

‘‘నిజమే కానీ! నిజంగా పెళ్ళి అనేది ఇద్దరికి మనసు బంధమై, కలకాలం కలిసి బ్రతికే స్నేహసుగంధమై నిలవడం అనేది-నేటికీ అదృష్టంగానే భావింపబడుతోంది! మనస్పర్థలతో విడాకులుదాకా వెళ్ళిపోయే జంటలు పెరిగిపోతున్నాయి. ‘పెళ్ళి’అనేది ఒక ‘రాజీ’అనుకోవడం నేడు ఎవరికీ నచ్చదు. కానీ నమ్మకం, విశ్వాసం, అనురాగం పరస్పరం వున్నప్పుడే- వివాహం అనేది నిజమైన బంధంగా, పటిష్టంగా నిలుస్తుంది. పెద్దల ప్రమేయాలు వద్దనుకుంటే ఇబ్బందులపాలయ్యే సందర్భాలూ వుంటాయి. తల్లితండ్రులు కూడా పిల్లల వివాహానంతరం నేటి రోజుల్లో తమ జోక్యాలను తగ్గించుకుని, అవసరమైనంతమేరకే అండగా వుం డడం మంచిది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మటుమాయమైన ఈరోజుల్లో- కుటుంబంలోకి వివాహం ద్వారా వచ్చిన అబ్బాయో, అమ్మాయో మనలో కలసిపోవడమనేదే మహద్భాగ్యం నేడు. ఆ అనుబంధాలనూ, ఆత్మీయతలనూ నిలబెట్టుకుంటూ, ‘మైక్రో ఫ్యామిలీ’లే అయినా-అనారోగ్యపు ఆలోచనల ‘మైకాలు’కమ్మక, ఆరోగ్యకరమైన వివాహబంధంతో ఆనందంగా ముందుకెళ్ళడం ముఖ్యం! పెళ్లంటే- అట్టహాసపు శుభలేఖ, ఖరీదయిన వివాహమంటపం, ఘనమైన అలంకరణ, తిన్నంత తిని తెగపారేసేటంతటి అనేక పదార్థాలతోటి విందుభోజనం కాదు. మనసెరిగిన బంధంతో, మనమెరిగిన వారి సమక్షంలో, సమష్టి జీవనానికై వేసే ఏడడుగులు. సుదూర సుమధుర లక్ష్యంకోసం- ఒక సాక్ష్యం! అదీ సంగతి’’అంటూ లేచాడు రాంబాబు.


 

 

0 comments: