ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 10, 2013

విగ్రహారాధన






‘‘ఈ విగ్రహాల గోలేమిటో నాకు అర్థంకాదు. గొప్పవారి విగ్రహాలు నెలకొల్పుతేనే, వారిమీద మనకు గౌరవంవున్నట్లా? విగ్రహ ప్రతిష్ఠాపన వరకూ బానే వుంటుంది. ఆ తరువాత అనేక విగ్రహాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, పక్షుల రెట్టలతో, ఆగ్రహం వచ్చినవారి దెబ్బలతో- వుంటాయి. సదరు విగ్రహమూర్తుల జయంతులకో, వర్ధంతులకో ఓ దండ వేసి దండం పెట్టడం తప్ప, వాటివల్ల ప్రయోజనం ఏముంది? పార్లమెంట్‌లో ఎన్.టి.ఆర్. విగ్రహం నెలకొల్పిన వేడుకకు సోనియాగాంధీ రాలేదంటున్నారు. ఆవిడ ఎంతయినా క్రిస్టియన్. క్రిస్టియన్‌లకూ, ముస్లింలకూ విగ్రహారాధనల మీదా, విగ్రహాల మీదా విశ్వాసం వుండదు కదా!’’ అన్నాడు శంకరం.

‘‘వేద గోప్రతిమాసేవీ- సహిందు ముఖవర్ణ్భాక్’’ అని క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దంనాటి ‘వృద్ధస్మృతి’లో హిందూ శబ్దానికి నిర్వచనం చెప్పారు. హిందువుయొక్క లక్షణాలలో- వేదాన్నీ, గోవునీ, ప్రతిమ అనగా విగ్రహాన్నీ ఆరాధించడం వౌలిక లక్షణం. దైవకార్యాన్ని సమష్టిగా నిర్వర్తించుకునే ఆలయాల్లో అందుకే దేవతా విగ్రహాలుంటాయి. మూలవిరాట్టుగా కొలిచేది రాయినికాదు. పూర్వం దేవాలయం కట్టాకే ఊరుని నిర్మించేవారు. ఆలయంలేని జనపథంలో నివసింపకూడదని నియమం వుంది. ఇకపోతే శంకరం! విగ్రహారాధనను ఇతర మతాలు అంగీకరించవు గానీ, పరోక్షంగా ఆచరిస్తూనే వుంటాయి. అన్ని మతాలవారు దేవుళ్ళ, ప్రార్థనామందిరాల, కట్టడాల చిత్రాలనుకూడా పవిత్రంగా చూసుకుంటున్నారంటే, ఒక విధంగా విగ్రహారాధన అంగీకరిస్తున్నట్లే! విగ్రహం ఒక పవిత్ర ప్రతీక. అంతెందుకు? మన ‘జాతీయజెండా’ను చూచినా, తగులబెట్టినా అది నేరం. ‘అది గుడ్డమాత్రమే’ అనుకోం! మన జాతి ‘గౌరవప్రతీక’ అది. దానిని అవమానిస్తే దేశాన్ని అవమానించినట్లే! అలాగే ఏ ఊర్లో ఏ మహానేత విగ్రహానికి అపచారం జరిగినా, ఎవరయినా చెప్పులదండవేసినా, పాక్షికంగానైనా ధ్వంసంచేసినా, అది పోలీసు కేసు అవుతోంది! అంతెందుకు? వైఎస్సార్ మరణించాక రాష్టమ్రంతటా వేలాది విగ్రహాలు నెలకొల్పారా లేదా? ఆయన క్రైస్తవ మతావలంబకుడయినా, విగ్రహాలకు వ్యతిరేకం కాదుగా!’’ అన్నాడు సుందరయ్య.

‘‘సరే! దేవతామూర్తులకో, దివంగత జాతినేతలకో విగ్రహాలు అంటే సబబే అనుకున్నా, బ్రతికుండగానే మాయావతి లాంటి వారు తమ విగ్రహాలు స్వయంగా ప్రతిష్ఠించుకున్నారు. దానిమాటేమిటి? ఈమధ్యనే విశాఖ రామకృష్ణాబీచ్ ఒడ్డున విశ్వనాథవారికీ, మహాకవి జాషువాకి విగ్రహాలు నెలకొల్పుతూ, డా.సి.నారాయణరెడ్డిగారి విగ్రహం కూడా పెట్టేసారట! బహుశా తనను గౌరవిస్తున్నారని తను బ్రతికుండగానే సంతోషించడానికి విగ్రహం ఆస్కారం ఇస్తుందేమో! కాకపోయినా ఎందరో ప్రముఖులు తమ తైలవర్ణ చిత్రాలు ఆర్టిస్టులచేత వేయించుకుని, తమ డ్రాయింగ్ రూమ్‌ల్లో అలంకరించుకుంటూనే వున్నారు. విగ్రహం అయితేనేమి? చిత్తరువు అయితేనేమి? గౌరవంలో తేడా ఏమిటి?’’ అన్నాడు రాంబాబు.

‘‘విగ్రహారాధన నిరసించడం అంటే నాకో విషయం గుర్తుకువస్తోంది! పాశ్చాత్య ప్రభావానికి లోనయిన ఆళ్వారు మహారాజు- హిందూ ధర్మాచారాలను ‘ఎద్దేవా’చేస్తూండేవాడట! ఒకసారి వివేకానందుల ముందు విగ్రహారాధనను గురించి చెడుగా విమర్శించసాగాడట. అంతా విన్న వివేకానందులు కాసేపు ఆగి- దివానును పిలిచి, మహారాజు పటం తీయించి, దానిమీద ఉమ్మివేయమన్నాడట. దివాన్జీ లెంపలువేసుకుంటూ ‘మహారాజుని అవమానించజాల’నని అన్నాడట. వెంటనే వివేకానందస్వామి ‘‘రంగు పూసిన గుడ్డమీద బొమ్మమీద ఉమ్మివేయడం మీ మహారాజుని అవమానించడం ఎలా అవుతుంది?’’అని ప్రశ్నించాడట. అలా అంటూ ఆళ్వారు రాజుతో- ‘‘ఈ చిత్రంలో వీరు మిమ్మల్ని చూస్తున్నారు. అలాగే భక్తులు విగ్రహంలో భగవంతుని చూడటంలో తప్పేముంది?’’ అనేసరికి ఆళ్వారు మహారాజు నిరుత్తరుడయ్యాడట. కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు అనేవారు సైతం తమ నేతల విగ్రహాలను నెలకొల్పుకుని, గౌరవించుకుంటూనే వున్నారు. అంచేత ‘విగ్రహారాధనకు మేం వ్యతిరేకులం’అనేవారి చేష్టల్లో నిజాయితీ, చిత్తశుద్ధి ఏమీలేదు’’ అన్నాడు సుందరయ్య.

‘‘హిందూ ధర్మం మూలసూత్రాలలో విగ్రహారాధన ఒకటి అన్నది నిజమే కావచ్చు! కానీ నా ఉద్దేశంలో అది మధ్యలో వచ్చిన ఒక ప్రక్రియ. మూల సూత్రాలకూ, ప్రక్రియకు తేడా వుంది. ప్రక్రియ కొంతకాలం తరువాత పోవడమో, ప్రాధాన్యం తగ్గడమో జరగవచ్చు. కానీ మూల సూత్రాలు అలాకాదు. అవి విశ్వాసాలు. అవిపోతే ఇంకేం వుండదు. ‘ఏసుక్రీస్తు జూదుల యొక్క దేవుని కుమారుడు’ అనీ, ‘అతను చచ్చి బతికాడు’అనీ క్రైస్తవ మూల సూత్రం. అతను జూదుల దైవకుమారుడు కాదనీ, అతను చావలేదు అనీ, చచ్చినా మళ్ళీ బతకలేదు అనీ, అసలు అలాంటి మనిషి రెండువేల ఏళ్ళక్రితం ఎవరూ లేరనీ నిరూపించగలిగితే ఆ మతం వుంటుందా? క్రీస్తుఅన్నా కృష్ణుడన్నా ఒకరేననీ, ‘దేవకి’ అంటే దేవుడి బిడ్డను కన్న కన్యకేననీ పుస్తకాలొచ్చాయి. రష్యన్ యాత్రికుడు ‘నికోలామ్ నోటోవిచ్’ జీసస్ తన 12నుండి 28, 30 ఏళ్ళ వయసులో ఇండియాలో నివసించాడనీ, ఇండియా, నేపాల్ యోగులు అతనికి జ్ఞానబోధ కలిగించారనీ, శిలువ వేసిన అనంతరం ఆయన బ్రతకడానికి ఆ ‘యోగసాధనే’ కారణమనీ వ్రాసాడుట! ఏమయినా మతానికీ, విశ్వసానికీ వున్న లంకె గొప్పది. విగ్రహారాధన విషయంలోనూ ‘విశ్వాసమే’ మూలకందం! విగ్రహారాధకులున్నట్లే, విగ్రహ విధ్వంసకులూ వున్నారు. ఆ విగ్రహ విధ్వంసకులూ విగ్రహారాధన విశ్వాసాన్ని విశ్వసించేవారు కనుకనే, ‘ఒకరి విశ్వాసాన్ని దెబ్బతీసేస్తాం’అనే విశ్వాసంతోనే ఆ పని చేస్తూంటారేమో! ఏమయినా విగ్రహాలకన్నా మనిషి నిగ్రహాలకు విలువ ఎక్కువ అని గ్రహించడం ‘మానవీయం’అంటూ లేచాడు శంకరం.

 

0 comments: