ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, January 11, 2013

మనఃప్రవాసం




'ఇంటగెలిచి రచ్చ గెలువు’ అన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అస్థిర పరిస్థితుల దృష్ట్యా-విదేశాల్లోని భారతీయ రక్షణ, భద్రతకు, ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మన్మోహన్‌సింగ్ మొన్న ‘కోచ్చి’లో ‘ప్రవాసీ భారతీయ దివస్’లో మాట్లాడుతూ అన్నారంటే, నాకు అదే గుర్తొచ్చింది! తన ఇల్లు ముందు తాను చక్కదిద్దుకోవడం ముఖ్యం. ఢిల్లీ గ్యాంగ్ రేప్ వంటి సంఘటనలు ఒకవంకా, పెచ్చరిల్లుతున్న అవినీతి మరోవంకా స్వదేశంలోనే ప్రభుత్వ ప్రతిష్ఠను కునారిల్లచేస్తుంటే, విదేశీ భారతీయుల గురించీ, వారి భద్రత గురించీ వల్లించడం హాస్యాస్పదం కాదూ!’’ అన్నాడు రాంబాబు.

‘‘విదేశాల్లోని భారతీయుల రక్షణ బాధ్యత ప్రధానంగా ఆయా దేశాలపైనే ఉంటుంది. అయితే గత ఏడాది లిబియాలో కల్పించినట్లుగా, మన ప్రభుత్వం సకాలంలో సహాయ సహకారాల అందచేయడం సబబే! ఒకసారి దేశం విడిచి చదువులకో, ఉద్యోగాలకో మన భారతీయులు విదేశాలు వెళ్లి అక్కడ వసిస్తున్నంత మాత్రాన, మన భారతీయులు కాకుండా పోరు. అదీకాక విదేశాల్లోని భారతీయులకు స్వదేశంతో సంబంధాలను బలోపేతం చేయాల్సిందే! వారి ప్రయోజనాలను పరిరక్షిస్తూనే, నిజానికి వారి మేధా సంపత్తి, అనుభవాలు, నైపుణ్యాలను దేశ ప్రయోజనాలకు ఎలా వినియోగించుకోవాలో, అటువంటి ప్రయోజనకర వ్యవస్థను ఏర్పరుచుకోవాలి. కాదనం! అసలు మన దేశ వ్యవస్థ పటిష్టంగా ఉండి, ఉపాధి వనరులు పుష్కలంగా ఉంటే-మనవాళ్లు ప్రవాసులు కావలసిన ఆగత్యం ఎందుకొస్తుంది’’అన్నాడు ప్రసాదు. ‘‘ఎటొచ్చీ ఈ దేశంలో ఉంటూనే- మనఃప్రవాసులయ్యే దుస్థితి రారాదు’’ అని కూడా అన్నాడు.

‘‘విదేశీ చదువులు, ఉద్యోగాలు వట్టి ‘మోజు’లేనా? లేక నిజంగా ‘అనివార్యాలా?’ అని ఆలోచించాల్సిన ఆగత్యం ఉంది. నిజానికి ఆర్థిక సరళీకరణలు ప్రవేశపెడుతూ- దేశంలో అభివృద్ధి, జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పుకు అది దోహదం చేస్తాయని నమ్మబలికారు కదా! రెండుదశాబ్దాల కాలంలో నిజంగా అంత గణనీయమైన మార్పే వస్తే, నిజానికి ఆ కాలంలోనే కదా భారతీయులు అనేకం అమెరికా వంటి దేశాలకు విద్యా, ఉద్యోగాలకోసం అధికంగా తరలి వెళ్లిందీనూ. దేశంలో పేదరికం, అసమానతలు, ఉపాధి అవకాశాలు వంటి పెను సవాళ్లు మరింత పెచ్చరిల్లుతున్నట్లుగా వుంది తప్పితే, అనుకూల పరిస్థితులేవీ’’ అన్నాడు శంకరం కల్పించుకుంటూను.

‘‘నిజానికి ప్రతికూల పరిస్థితులు-శరవేగంగా మార్పు చెందుతున్న దేశంలో, అంత వేగిరంగానూ పెరుగుతున్నాయి. భారతీయ స్ర్తిలకు విదేశాల్లో వున్న రక్షణ పాటి, స్వదేశంలో లేకుండా పోతోందంటే ఎంత శోచనీయమైన సంగతి అది? ఆధ్యాత్మిక, కౌటుంబిక, నైతిక ధర్మాల విషయంలో ప్రపంచ దేశాలకు అనేకం ఆదర్శనీయమనిపించుకున్న మన దేశం ఈనాడు ఇక్కడే పతనం అంచులవైపుకు జారిపోతున్నదనే ఆర్తి చెలరేగడం ఆలోచనీయం కాదా?’’ అన్నాడు రాంబాబు.

‘‘ఆధ్యాత్మిక, నైతిక గురువులుగా భావించబడే కొందరు స్వామీజీలూ, అత్యున్నత స్థానాల్లో వున్న కొందరు పెద్దలూ దేశంలో జరుగుతున్న మహిళలపై వరుస అత్యాచార సంఘటనల వంటివాటిపట్ల స్పందిస్తున్న తీరూ వివాదాస్పదమవుతోంది. ఆ స్ర్తిల ‘రాత’ బాగోకే రేప్‌లు జరుగుతున్నాయని ఒకరు, రేపిస్టులను బ్రతిమాలాడుకోవడం, ‘అన్నా’ అని పిలిచి రక్షించమనకపోవడం వంటి ఆ మహిళల వైఖరివల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఒకరు, అసలు స్ర్తిలు అర్ధరాత్రి, అపరాత్రి సంచరించడాలు మానాలని, భర్తలకు విధేయంగా స్ర్తిలు బుద్ధిగా మసలుకుంటే సమస్యలు రావని ఒకరు, ఇలా విడ్డూరపు వ్యాఖ్యలు చేస్తూ-సమస్యను పరిష్కరించే సూచనలు చేయకపోగా, వైఫల్యాలకు బాధ్యతను బాధితుల మీదే నెట్టివేసే వైఖరుల కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా పాలన అందించలేని రాజకీయ వైఫల్యం, ఏ పార్టీ చరిత్ర చూసినా అవినీతులే విరాడ్రూపం ధరిస్తూ ప్రజలకు అసహనాన్ని, ఆగ్రహాన్నీ కలిగిస్తున్నాయి’’ అన్నాడు ప్రసాదు.

‘‘ప్రజలలో ముఖ్యంగా యువతలో ఈ వైఖరులు నేడు ఆగ్రహావేశాలను కలిగిస్తున్న మాట యదార్ధం! అయితే అవి సానుకూలమైన మార్పుకు బలమైన శక్తిగ మారాలి. మరింత బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, సమర్ధవంతమైన, స్వచ్ఛమైన పాలన కోసం ప్రజలనుంచి డిమాండ్లు పెరుగుతున్న సూచనలను- స్వచ్ఛందంగా సమీకృతమవుతున్న సంఘటనలు నిరూపిస్తునే ఉన్నాయి. న్యాయపరమైన, నియంత్రణ వ్యవస్థలను మెరుగుపరచడానికి-వైఫల్యాలుగా పొడగడుతున్న సంఘటనలను ఒక అవకాశంగా మలచుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందా అనేదే ప్రశ్న! విదేశాలలో ఉండి తాము భారతీయులమని గర్వంగా చెప్పుకునే పరిస్థితిని, అక్కడి మన వారికి కూడా పోగొట్టే ప్రమాదాలు నేడు ఇక్కడ సంభవిస్తున్నాయి. నిజానికి దేశ విభజనతో పాకిస్థాన్ ఒక ముస్లిం దేశంగా ఆవిర్భవించింది కానీ, భారతదేశమే-సర్వమత సామరస్యం, లౌకిక వాదం పేర భిన్న జాతుల కూడలిగా మిగిలి, నిజానికి హిందూదేశంగా విరాజిల్లవలసిన వౌలికతకు కూడా విఘాతం కలిగే పరిస్థితులు ఎదురవుతున్నా మతం కన్నా మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇస్తూ ఉంది. ‘‘్ధర్మో రక్షతి రక్షితః’’ అని, ధర్మాన్ని రక్షిస్తే-్ధర్మమే అందరినీ రక్షిస్తుందని విశ్వసించి పురోగమిస్తోంది! మంచిని అసమర్ధతగా, వౌనాన్ని పిరికిదనంగా, సహనాన్ని చేవచచ్చిన తనంగా భావించి, అసాంఘిక ప్రలీపశక్తులు విజృంభిస్తుంటే-ఇకా వౌనం దాల్చడం, ఓర్పు వహించడం సరికాదు! కాటు వేయకపోయినా, బుసకొడితే తప్ప పాము గురించిన భయం నిలబడనట్లు, తన సమర్ధతను నిరూపించుకోవలసిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం అంటే ప్రజలే. కాబట్టి భవితవ్యం ప్రభుత్వం చేతుల్లో అనగా ప్రజల చేతుల్లోనే ఉంది.’’ అంటూ లేచాడు శంకరం.

3 comments:

Supani said...

sudhamagaru
prapradhamamgaa pracuritamaina meeracanalanu jagrattaparacinanduku pratyeka dhanya vaadamulu

Supani said...

sudhamagaru
prapradhamamgaa pracuritamaina meeracanalanu jagrattaparacinanduku pratyeka dhanya vaadamulu

సుధామ said...

Dhanyavaadaalu Purushottama rao garu!