ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, January 4, 2013

దూరం దూరం!





"మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కొంచెం ఆలోచించి ఒక పరమార్థంతోనే చెప్పారు. లెక్కచేయక ఛాదస్తాలుగానో, వ్ఢ్యౌంగానో మనం కొన్ని కొట్టి పారేస్తూ వుంటాం కానీ, నిజానికి వారి మాటలు వింటే ఏరికోరి కొన్ని అనర్థాలు తెచ్చుకునే దుస్థితి సంభవించదు’’అన్నాడు శంకరం దినపత్రిక మడచిపెడుతూ.

‘‘ఇంతకీ ఏమిటిట సంగతి’’ అన్నట్లు కళ్ళెగరేసాడు ప్రసాదు.

‘‘దూరం అనేది కూడా ఒకటి పాటిస్తూ వుండాలి.’’

‘‘దూరం పాటించడం అంటే అంతరానితనం అన్నట్లు కాదా?’’

‘‘అదే పొరపాటు. ఎంత కాదనుకున్నా ‘ఎడం’అనేది కూడా మనలను మనల్నిగా నిలబెట్టి మానవీయతకు ఆఘాతం కలుగకుండా రక్షిస్తూంటుంది. సాన్నిహిత్యాలు ఎక్కడ ఎంతమేరకు అవసరమో ఎవరితో అవసరమో అంత మేరకే సమంజసం. ‘అతి సర్వత్వ వర్జయేత్’అన్నది మానవ సంబంధాలలోనూ పనిచేస్తుందని నా ఉద్దేశ్యం’’ అన్నాడు శంకరం.

‘‘తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలకుకూడా దగ్గర, దూరాలవల్ల సంభవించే పరిణామాలుంటాయర్రా! రేపు జనవరి అయిదున భూమి సూర్యుడికి పధ్నాలుగు కోట్ల డబ్భైలక్షల కిలోమీటర్ల దూరంలోకి జరుగుతోందిట. అంటే ఈ దూరం ఒక విధంగా కొంత సామీప్యంలోకి రావడమే. అయితే దీనివల్ల పెద్దగా మార్పులేవీ వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకోవంటున్నారు శాస్తజ్ఞ్రులు’’ అన్నాడు రాంబాబు.

‘‘సూర్యుడికి మరీ దగ్గరగా వెడితే ఎండకు మాడిమసైపోతాం. అందువల్ల ప్రకృతిలో సహజంగానే దూరం నిలుపుకుని నిర్వర్తించే సంవిధానం ఒకటుంది. ముఖ్యంగా స్ర్తిపురుషుల విషయంలో వుండవలసిన ఎడం గురించి మన పెద్దలు ఏనాడో చెప్పారు. నీతి శతకాల్లో కూడా మానవ వర్తనలను గురించి సందేశనిర్దేశనం చేసిన జాతి మనది. సొంత తల్లి చెల్లితోనైనా ఒకే మంచం మీద దగ్గరదగ్గరగా కూర్చోవద్దని మనిషి మనోవికారాలెరిగిన ద్రష్టలు కనుక ఏనాడో హితవు చెప్పారు. ‘‘దూరం దూరం’’ అంటే ‘‘దూరమెందుకె చెలియ వరియించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనేకదా!’’ అని సంబంధం స్థిరమైనా ‘‘పెద్దలున్నారు’’ అంటూ హద్దులు పెండ్లికొడుకు, కూతురుకు కూడా వివాహం ముందు నిర్దేశించిన భారతం మనది. నిజానికి వాటికీ ‘కట్టుబాట్లు’అని పేరు. ఆ ‘కట్టుబాట్లు’కు నిబద్ధమైనప్పుడే అందం, ఆనందం, ఆరోగ్యం కూడాను ’’ అన్నాడు సుందరయ్య.

‘‘నిజమే సుందరయ్యా!
పెద్దలు వద్దని చెప్పిన
పద్దులఁబోవంగరాదు పరకాంతలనే
ప్రొద్దే నెదఁబరికించుట
కుద్దేశింపంగఃఁగూడ దుర్వికుమారా’’
అని కుమార శతకంలో పెద్దలు వద్దని చెప్పిన పనులు చేయవద్దని, ఇతర స్ర్తిలను ఎపుడయిననూ చూచుటకు కోరవలదు అనీ యువకులకూ, అలాగే కుమార శతకంలో యువతులకు-


‘‘పోకిళ్ళు పోక పొందిక
నాకులలోఁ బిందెరీతి నడఁకవుగా నెం
తో కలసి మెలసి యుండిన
లోకములోపలను దా వెలుగుఁకుమారి!’’

అని హితబోధలు చేయబడ్డాయి. ఇవాళ అవన్నీ ఎవరికి కావాలి? ఆకుల్లో పిందెలాగా కాక ఆడది ఇవాళ దిక్కుదిక్కుల్లో దిక్కున్న చోట చెప్పుకోమన్నట్లు సమానత్వం స్థాయినుండి సాధికారత పేర ఆధిక్యతాస్థాయి ఆక్రమించనభిలషిస్తోంది. పురుషాధిక్యం ఒదులుకోలేని మగాడు స్ర్తి ఎదుగుదలలో అన్ని అవకాశాలను తన స్వార్థానికి వినియోగించుకునే పన్నగాల పన్నాగంగా మారుతున్నాడు.


‘‘దూరంలో ఒక గొప్పతనం వుంది. అది విలువలను గుర్తుచేస్తుంది. చదువులు, ఉద్యోగాలకోసం విదేశాలకు వెళ్లవలసి వచ్చిన మనవారు ఇంటికీ, భాషకీ, మనుష్యులకీ దూరంకావడంవల్లే వాటిమీద అమిత ప్రేమాస్పదులవుతున్నారన్నది కాదనలేని నిజం. నిజానికి దూరంగా ఏ అమెరికాలోనో వుండి తెలుగు భాష గురించీ, తెలుగు తిండి గురించీ, తెలుగు సంస్కృతీ సాహిత్యం గురించీ ఆరాటపడుతున్న మనవారే తమలో, తమ మదిలో, తమ పలుకులో, భావనలో, వర్తనలో వాటిని దగ్గరగా నిలుపుకునే యత్నం చేస్తూంటే పాశ్చాత్య భాష, సంస్కృతీ, డాలర్ల సంపాదనా వ్యామోహంలో మనదేశంలో మనవారే, మనమే స్వయమాపాదిత కృత్రిమ విలువల గురించీ, భేషజాల గురించీ వెంపర్లాడుతున్నాం. ‘తెలుగు అక్కర్లేదు’అనుకుంటున్నది మనమే అయితే, వెలుగు అక్కర్లేదని అనుకుంటున్నట్లే. తెలుగులో మాట్లాడేవారిని దూరం పెట్టి ఆంగ్లాది పాశ్చాత్య భాషాభేషజాల వెంట ఆకర్షితులమై ఇటు తెలుగూ రాక అటు ఆంగ్లమూ రాక సృజనకు, సామర్థ్యానికి దూరమై దురపిల్లతున్నదీ మనమే’’ అన్నాడు రాంబాబు.

‘‘అదేగా నేనంటున్నదీను! దగ్గరకు తీసుకోవాల్సిన వాటినీ... మనవీ, మనపట్ల ప్రియమైనవీ, మనకు హితమైనవీ అయిన వాటిని దూరం నెడుతూ, అక్కర్లేని కశ్మలాన్నీ, కల్మషాన్నీ తీసుకుని నెత్తికెత్తుకుంటూ ఒక భ్రమావరణంలో పడి కొట్టుమిట్టాడుతున్నది మనమే. సినిమా విషయాలు, సినీతారలు మీదుంటే వ్యామోహం, హింస, సెక్స్, బలహీనతల కబుర్ల మీదుండే ఆసక్తి భగవత్ చింతనవైపు త్రిప్పుకోవడం సంగతి వదిలేయండి కనీసం మానవత్వం దిశగానైనా నిలుపుకోలేకపోతున్నాం. 2012లో జరిగిన ‘రేప్’ సంఘటన, ‘రేపు’ గురించి భద్రత పట్ల విశ్వాసాన్ని కలిగించలేని అసహాయతలోకి నెట్టినా ఒక ‘నిర్భయ’తను సంతరించుకుని, గుండె దిటవు పరుచుకుని భవిష్యత్తులోకి పదం సాగించమంటోంది. ఆశను శ్వాసించమంటోంది. దుష్టత్వాలకు దూరం పాటిస్తూ మానవీయతకు మానవ హారం కట్టమంటోంది’’అంటూ నిశ్వసించి లేచాడు శంకరం.

0 comments: