ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, December 14, 2012

తెలుగులు
'తెలుగుఅనగానే ముందుగా గుర్తొచ్చేది భాషయే. కానీ తెలుగుఒక్క భాషతోనే ప్రధానంగా ముడిపడి వున్న మాట వాస్తవమే. అయినా, భాషా విషయికంగానేకాక ఆ తెలుగుతనంనిలుపుకోవలసిన తావులు చాలా వున్నాయి. అది కూడా మనం విస్మరించకూడదు’’ అన్నాడు శంకరం.


‘‘
చూడు నాయనా! భాషకే ప్రథమస్థానం. తెలుగు మాట్లాడటం వున్నా, ఈ తరంలో చాలామందికి తెలుగు చదవనూ, రాయనూ రావడం కూడా తగ్గిపోయింది. తెలుగు భాష అంతరిస్తోందన్న భయానికి మూలహేతువు అదే. ఇప్పటికే ఈ తరం మాట్లాడే తెలుగులో తెలుగు కంటే అన్య భాషాపదాలు, వాక్యాలు.. ముఖ్యంగా ఆంగ్లం బాగా చొరబడిపోయింది. అందుకే తెలుగు మాట కూడా మున్ముందు సమసిపోగలదన్న ప్రమాద ఘంటికలూ మ్రోగుతున్నాయి’’ అన్నాడు ప్రసాదు.

‘‘
తెలుగులో ఆలోచించడం అనేదే చేతకాకపోతే.. తెలుగు చదవనూ, వ్రాయనూ రాక, తెలుగు మాట్లాడటం మాత్రం ఎలా మిగులుతుంది.?చేజేతులా స్వయంకృతాపరాధంగా మనం చేసుకున్నదే నేటి స్థితికి కారణం కాదా? తెలుగునాట తెలుగు చదువుకోనవసరం లేకుండానే విద్యావిధానం చెలామణీ అయ్యే స్థితికి కారణం ఎవ్వరు? మన ప్రభుత్వాలు, మన పాలకులే కదా! ఆంగ్లం పట్ల మోజుతో, ఆంగ్ల విద్య కారణంగానే ఉద్యోగాలు లభిస్తాయి తప్ప, మాతృభాష వల్ల కాదనే ఊహలతో తమ పిల్లలను తల్లితండ్రులు కూడా తెలుగుకు దూరంచేస్తూ రాలేదా? మెకాలే విద్యావిధానాలే వేద పురాణేతిహాసాలు కావ్యాల వంటి ప్రాచీన విద్య పునాదిగాగల మన భాష, సంస్కృతీ సంప్రదాయాలను క్రూర మెకాలుగా కబళించాయన్నది యధార్థం. అందుకు మనమూ తలలూపి, బానిసలుగా పేరుకు దేశస్వాతంత్య్రం సంపాదించినా ,భావదాస్యులుగానే బతుకుతూ వచ్చాం.

1835
ఫిబ్రవరి రెండున బ్రిటీష్ పార్లమెంట్‌లో లార్డ్‌మెకాలే తన పన్నాగం స్పష్టంగానే చెప్పాడు- ‘‘నేను భారతదేశమంతటా పర్యటించాను. ఆశ్చర్యకరమైన విషయమేమంటే... దారిలో ఒక భిక్షగాడు గాని, ఒక దొంగగాని తారసపడలేదు. ఈ దేశం సిరిసంపదలతో తులతూగుతోంది. నైతిక విలువలతో అలరారుతున్న సమాజం, సామర్థ్యంకల జనం... నా ఉద్దేశ్యం ప్రకారం ఎన్నటికి భారత్‌ను స్వాధీనం చేసుకోలేము. ఈ దేశానికి వెనె్నముక అయిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ధ్వంసం చేయగలిగిననాడు మాత్రమే భారత్‌ను జయించగలము. కాబట్టి వారి ప్రాచీన విద్యావిధానంలో మార్పులుచేసి, మన విద్యావిధానం ప్రవేశపెట్టాలి. భారతీయులు తమ సంస్కృతికన్నా ఆంగ్లేయుల సంస్కృతి గొప్పది అనుకునేలా చేయగలగాలి. వాళ్లు స్వాభిమానం కోల్పోయి వారి మూలాలను మర్చిపోయి, సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయినప్పుడే మనము అనుకున్నట్టుగా తయారవుతారు’’ అన్నాడు. మెకాలే అనుకున్నట్లుగానే జరిగినందువల్లనే- 1947లో ‘‘ఈ దేశానికి స్వాతంత్య్రం ఇచ్చినా మనము అనుకున్నట్టుగా తయారయ్యారు కనుక, ఇక మనకు నష్టమేమీలేదు’’ అనుకున్నందువల్లనే స్వాతంత్య్రం ప్రకటించి వైదొలగారు. కానీ మనమే మన వెన్నెముకను తిరిగి నిలబెట్టుకోలేక మన సంస్కృతీ, సాంప్రదాయాలను మూలాలను మరిచి ఆంగ్ల, భాషా సంస్కృతుల ముందు సాగిలపడి ప్రాకుతున్నాం’’ అన్నాడు ఆవేశంగా సుందరయ్య.

‘‘
నిజమే! జరగవలసిన నష్టం ఒక విధంగా జరగనే జరిగింది. అయితే ఇవాళ అదే ఆంగ్లంతో మన తెలుగువాళ్ళే ఎంతో నిష్ణాతులై, విదేశాలలో ఆ విదేశీయులనే అధిగమించి మరీ తేజరిల్లుతున్నారు. అందుకు మనం ఆనందించవలసిందే. కానీ అలా తేజరిల్లే క్రమంలో మన మూలాలను పోగొట్టుకోనవసరం లేదన్నదే నేడు గుర్తించాల్సిన విషయం. మన సంస్కృతీ సాంప్రదాయాలు ,తరతరాల మన కుటుంబ వ్యవస్థ, క్రమశిక్షణల కారణంగానే ఆంగ్లాది అన్య భాషలు నేర్చి మనం అత్యున్నత స్థానాలకు ఎదగగలిగామన్న మౌలిక స్పృహ అవసరం. మన ప్రాచీన విద్యా మూలధాతువుల వల్లనే ఏ విద్యావిధానంలోనైనా మనం రాణించగలిగామన్నది ప్రాథమికంగా గుర్తించి తీరాలి.’’అన్నాడు ప్రసాదు.

‘‘
మనం తెలుగును పునరుజ్జీవింప చేసుకోవడం అంటే, ప్రాథమిక స్థాయినుండి తెలుగు అనివార్యంగా విద్యావిధానంలో వుండి తీరాలి అని అంటున్నామంటే ఇంగ్లీషుకు వ్యతిరేకం అని కాదుకదా! మన అస్తిత్వాన్ని, మన వెన్నెముకను కోల్పోయి ,మోకాళ్లపై ఇంకోచోట దేవులాడాల్సిన అగత్యంలోకి క్రుంగిపోయి పతనం కాకూడదనే. ఇవాళ తెలుగు మూలాలకే ప్రమాదం వాటిల్లుతూంటే, ఈతరం తెలుగులో ఆలోచించడమేకాక ,తెలుగు చదవనూ వ్రాయనూ తెలియక ,తెలుగు మాట్లాడటం కూడా ఆంగ్ల భాషాసంకరమై పేట్రేగుతోందనే యధార్థం గుర్తించినందువల్లనే, భావితరాల బాగోగుల గురించైనా ,ఇక కఠిన నిర్ణయాలు తీసుకోవలసిందే. తెలుగునాట ప్రాథమిక స్థాయినుండి కళాశాల స్థాయివరకు తెలుగు బోధన విధాయకంగా వుండి తీరవలసిందే. నేల విడిచి సాము చేయరాదన్నట్లుగా, మాతృభాష అయిన తెలుగును విస్మరించి ఎంత ఎదిగినా- అది వాపే కానీ బలుపుకాదని ఇకనైనా గుర్తించడం మంచిది. భాషను నిలుపుకుంటూ, తెలుగు గీతల్లో, తెలుగు మాటల్లో, తెలుగు కట్టుబొట్టులో, తెలుగు పండుగల్లో, తెలుగు ఆచార వ్యవహారాల్లో, కళల్లో ఆ తెలుగుతనాన్ని వెలుగు దీధితులతో నిలుపుకోవలసిన, పెంచుకోవలసిన కర్తవ్యం ఈనాడు తెలుగువారందరిలోనూ వుంది. కుల, మత ప్రాంతాలకు అతీతంగా తెలుగును అన్నివిధాలా తేజరిల్లచేసుకోవాలి.అప్పుడే భవిష్యత్తు. గత కీర్తులనుండి వర్తమానం మీదుగా భవిష్యత్తు నిర్మించుకునే స్ఫూర్తికి ఆహ్వానం’’ అంటూ లేచాడు శంకరం.

 

0 comments: