Friday, December 7, 2012
పెద్ద (బాల)‘శిక్ష’
‘‘చలం ఏం రాసాడో చదువుతా విను- ‘‘నిజమైన ప్రేమ ఎప్పుడూ ఇతరుల సౌఖ్యానికై ప్రయత్నిస్తుంది. ఆ సౌఖ్యం కోసం ఏ త్యాగాన్నైనా చెయ్యడానికి వెనుతియ్యదు. నిజమైన ప్రేమ వుంటే, యిన్ని వందల సంవత్సరాలనుంచి బిడ్డల్ని కొడుతూనే వుంటారా? బిడ్డల్ని కొట్టడంవల్ల తల్లిదండ్రులకి బాధ కలుగుతోందా? కొట్టడం తప్పనిసరి అయింది కదా అని దుఖ్ఖపడుతున్నారా? కొట్టకుండా వీలు లేదా, అని ఉపాయాలు వెతుకుతున్నారా!
బిడ్డని కొట్టడంవల్ల పెద్దవారికి ఆనందం కలుగుతుంది. కొట్టాలనే వాంఛ వారి మనసుల్లో వుంది. కోపం రాగానే - ‘యితరులని’ కొడితే మళ్ళీ కొడతారు. దిక్కుమాలిన బిడ్డ మళ్ళీ కొట్టలేదు. కొట్టాలనే దుర్వాంఛవల్ల బిడ్డల్ని బాదే ఉపాధ్యాయులున్నారనే సంగతి విద్యాధికారులు వొప్పుకొని, కొట్టకూడదని శాసించారు. అట్లానే కొట్టే సంతోషం కోసం, తమ కోపాన్ని తీర్చుకునేందుకూ, కసి తీర్చుకునేందుకూ సమస్తమైన విద్యాధికులు, జ్ఞాన సంపన్నులు, దయామయులు, పుణ్యాత్ములైన తల్లిదండ్రులందరూ బిడ్డల్ని బాదుతున్నారు. ఈ ఘోర కార్యంలో వుండే ఈ నీచత్వమూ, రుూ పశుత్వం బయలుపడుతుందేమోనని, ఈ క్రూరం దండనలకి- ‘శిక్షణా’, ‘దయా’, ‘ప్రేమా’, ‘మాతృప్రేమా’ అని పవిత్రమైన పేర్లు పెట్టి సమర్థించుకుంటారు! దెబ్బలు లేకపోతే చెడిపోతారని తమ మనసుల్ని తామే మోసపుచ్చుకుని సుఖిస్తారు’’ అని తన ‘బిడ్డల శిక్షణ’లో నిర్ద్వంద్వంగా పేర్కొన్నాడు చలం. ‘‘కనుక కొట్టడమనేదీ, తిట్టడమనేదీ శిక్షణా విధానంలోంచి తీసేస్తేగానీ లాభం లేదు. బిడ్డని కొట్టారా, మళ్లీ బిడ్డల చేత వెంటనే దెబ్బలు తినాలి. కొట్టడం తప్పని వొప్పుకోవాలి’’ అంటాడు కచ్చితంగాను’’ రాంబాబు ఇలా విశదపరిచేసరికి శంకరం-
‘‘అయితే చలం ఇప్పుడుంటే- నార్వేలో బిడ్డను దండించిన పెద్దలను శిక్షించడం, వాళ్లను జైలుపాలు చేయడం సమర్థిస్తాడంటావా? పిల్లల్ని కొట్టడం నేరమని నార్వే దేశంలోని చట్టంతో అలా చేసిన తల్లిదండ్రులను ఆ ప్రభుత్వం శిక్షించడం ఆమోదిస్తాడంటావా?’’ అని అడిగాడు బింకంగా.
‘‘పెద్దవారి రక్షణా శిక్షణా లేకుండా పెరిగిన పిల్లలు చాలా శిక్షణలో వున్న పిల్లలకన్న చాలా ఉత్తములుగా తయారవుతారు. ఈ పెద్దవారి చేతులలో- వారి అభిప్రాయాలకీ, ఉద్దేశ్యాలకీ, సాధనాలై వంకర తిరిగినపిల్లలకన్న, దిక్కులేని అనాధ శిశువులు, వారి ఆనందాన్ని వారే వెతుక్కుని సహజంగా జీవిస్తారు. విద్యావంతుల పిల్లలు ధనికులూ, అధికార్లూ, కీర్తివంతులూ కావచ్చు లోకం ముందు. కానీ వారికి లోపల్నించి సుఖపడి బతకగల శక్తి నశిస్తుంది. చెడిపోతున్నట్టు కనబడ్డాసరే, బిడ్డని బిడ్డ స్వభావానికి వొదలడం చాలా వివేకమైన శిక్షణ. యితరులు వాళ్ల జోలికి వచ్చి వంకర్లు తిప్పకుండా వీలైనంత వరకు చూడడమే గొప్ప రక్షణ’’ అని చలం ఎప్పుడో అన్నాడు. ‘‘ఇప్పుడిప్పుడే ప్రపంచం బిడ్డల విషయమై తాను నమ్మిన అబద్ధాలలోంచి మేలుకొని పెద్దవారి అంధత్వంవల్ల బిడ్డలకి అన్యాయం జరుగుతోందనీ, బాధ కలుగుతోందనీ గ్రహిస్తోంది’’ అన్న ఆశాభావమూ వ్యక్తీకరించాడు’’ అన్నాడు రాంబాబు.
‘‘నార్వే దేశంలోని ఓస్లో జిల్లా కోర్టు- ‘గో.స్లో!’ అనుకోకుండా, తమ ఏడేళ్ల బిడ్డ సాయి శ్రీరామ్‌ను మందలించి శిక్షించారని అతని తల్లిదండ్రులైన వల్లభనేని అనుపమ, చంద్రశేఖర్‌లను, స్కూల్ టీచర్ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు దోషులుగా నిర్థారించి, అరెస్టు చేసి, విచారించి, తండ్రికి పద్దెనిమిది నెలలూ, తల్లికి పదిహేను నెలలూ కారాగారశిక్ష విధించింది. మన తెలుగు సంస్కృతీ నేపథ్యం నుంచి వచ్చిన ఆ తల్లిదండ్రులకు నార్వే వంటి పలు పాశ్చాత్య దేశాలలో పిల్లల హక్కులు, చట్టాల గురించిన అవగాహన వుండకపోవడం సహజమే! తరతరాల ఇక్కడి సామాజిక వాతావరణానికి అలవాటుపడిన వారికి- అల్లరిచేస్తూ, దొంగతనాలవంటివి చేస్తున్నాడని తమ పిల్లవాడిని ఇంట్లో దండించడం చాలా వైయక్తిక వ్యవహారంగానే అనిపిస్తుంది! తల్లిదండ్రులను శిక్షించడం ఆ దేశపు చట్టప్రకారం న్యాయం కావచ్చేమోగాని, పిల్లాడిని మందలించిన తల్లిదండ్రులకంటే- ఏడాదికిపైగా అమ్మా నాన్నలకు దూరమైన ఆ పిల్లవాడు సాయిశ్రీరామ్, వాడి తమ్ముడు అభిరామ్‌లకే ‘శిక్ష’ కాలేదా? అమ్మానాన్నలమీద బెంగతో ఆ పిల్లల ఆరోగ్యం పాడుకాలేదా? గత ఏడాదే ఉద్యోగరీత్యా భార్యాపిల్లలతో నార్వే వెళ్లిన చంద్రశేఖర్ చేస్తున్నది ‘సాఫ్ట్‌వేర్ ’ ఉద్యోగమే! పిల్లలు బుద్ధిగా వుండాలనీ, అల్లరిచిల్లరిగా దొంగతనాల వంటివాటికి పాల్పడుతూ పాడైపోరాదనీ, తండ్రిగా అతను అభిలషించడం తప్పుకాదు. పిల్లలు దారి తప్పుతున్నారన్నప్పుడు- ‘సాఫ్ట్’గా వుండగల స్వభావం ఇక్కడి సామాజిక వాతావరణంనుంచి వెళ్లిన అతనికి నార్వేలో చట్టాలున్నంత మాత్రాన వెంటనే ఎలా అలవడిపోతుంది? ఓస్లో కోర్టు ఇచ్చిన తీర్పు అక్కడి చట్టాల ప్రకారం సహేతుకం కావచ్చు. ఇది ఒక రకంగా పిల్లల్ని బాధించే తల్లిదండ్రులకు గుణపాఠమూ కావచ్చు. కానీ ‘ముల్లూ - అరిటాకు’ సామెతలా, ఏ రకంగా చూసినా పిల్లలకే నష్టం వాటిల్లుతోందని గ్రహించగలగాలి. తల్లిదండ్రుల్ని జైల్లో పెట్టి పరోక్షంగా ఆ పిల్లలనే శిక్షిస్తోన్నట్లవుతోంది. నార్వేలోని భారత దౌత్య కార్యాలయం, మన ప్రభుత్వం కూడా తగినవిధంగా స్పందించి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి’’ అన్నాడు శంకరం స్థిరంగా.
‘‘ ‘శిక్షణ’ వేరు, ‘శిక్ష’ వేరు. ‘బిడ్డల శిక్షణ’ అంటే అందులో ‘శిక్ష’ వుంది కదా అనుకోవడం- మారుతున్న కాలానికి చెల్లదు! అందునా ‘అణుకుటుంబాలు’ వచ్చి, ఒకరో ఇద్దరో పిల్లలు మాత్రమే వుండే కుటుంబాలు ఎక్కువయ్యాక, తల్లితండ్రులు మునుపటి తరం పెద్దలవలె కోపతాపాలు పిల్లలపై చూపాల్సిన అగత్యాలూ అంతరిస్తున్నాయి. మూర్ఖంగా పిల్లల్ని బాధలు పెట్టడం, గారాబాలు చెయ్యడం, లెఖ్కలేకుండా వొదిలెయ్యడం ఇకముందు వీల్లేదు. బిడ్డలు సుఖపడడానికి ఈ ఉదంతం తల్లిదండ్రులకి ఒక కనువిప్పయ్యి, ఆరోగ్యదాయిక కుటుంబ వ్యవస్థకు ప్రాతిపదిక కావాలి’’ అన్నాడు రాంబాబు లేస్తూ.
Labels:
సం.సా.రా.లు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment