ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, November 4, 2012

గీతల్లో ఒదిగిన హైదరాబాద్



‘‘చూడ కనులకింపు
మన రాజధాని సొంపు’’-


హైదరాబాద్ ఆకాశవాణి పిల్లల ప్రోగ్రాంలో కొన్ని దశాబ్దాల క్రితం ఈ పాట ఆంధ్ర దేశం నాలుగుచెరగులా ఆబాలగోపాలాన్ని అలరించిన పాట! హైదరాబాద్- ‘్భన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు’ అన్నమాట వాస్తవం. హైదరాబాద్ ‘రిం..ఝింలు’ ఒకప్పటి రిక్షావాలా నుండి ఇవాళ ఆటోరిక్షావాలాకూ, నగరంలో దేశం నలుదిక్కులనుండి వచ్చి స్థిరపడిన బేహారులకూ బాగా తెలుసు! ‘‘ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము’’అని నగర సౌందర్య భాగ్యంతో పులకించిపోయిన జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఎందరో వున్నారు.


నాలుగువందల సంవత్సరాలకు పైగా కలిగినది నగర చరిత్ర. రోజురోజుకూ సరికొత్త అందాలతో కనబడే పాత నగరం నుండి, అంతర్జాతీయ దృష్టినాకర్షించిన హైటెక్ సిటీ వరకు నగర సౌందర్యం గొప్ప విలక్షణతతో, వైరుధ్యాలతో, వైవిధ్యాలతో కూడా భాసిస్తూ వుంటుంది. హైదరాబాద్‌ను నగరవాసి మాత్రమే కాదు, రాష్ట్రం అంతా ప్రేమిస్తుంది. అందులో అవసరాల అనివార్యత కాదు, అందాల అనుబంధం, జీవన వికాసం అనుసంధానమై వుంది.

‘చూడ కనులకింపు- రాజధాని సొంపు’అన్న మాట ‘సుభాని’వల్ల ఇప్పుడు సరికొత్తగా పల్లవించేలా, పుస్తకం చేతబట్టిన ప్రతి ఒక్కరినీ అలరించేలా రూపొందిన పుస్తకమే- ‘ఆదాబ్ హైదరాబాద్’. ఇది నిజంగా కనులకింపయిన దృశ్యగ్రంథమే! మరి నగరపు వైవిధ్యాన్ని, నిత్యం కళ్లబడే, అద్భుత దృశ్యాలను తన కుంచెతో ఆవిష్కరించిన చిత్రకారుడు ‘సుభాని’. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘డెక్కన్ క్రానికల్’ చూసేవారికి ‘సుభాని’ సుపరిచితుడే!

హైదరాబాద్ నగరం ఇతివృత్తంగా ‘సుభాని’వేసిన కార్టూన్లు, స్కెచ్‌లు, క్యారికేచర్లు ‘ఆదాబ్ హైదరాబాద్’ పేరిట ఆకర్షణీయమైన గ్రంథంగా ఇటీవల విడుదలయ్యింది.

సుభాని ‘సుభానల్లా’అని అంతా మెచ్చేలా, తన బొమ్మల శోభనెల్లా విస్తరింపచేస్తూ- శుభాలనెల్లా అందుకుంటూ వచ్చారు! ‘నగరం’ ఈ చిత్రకారుడి రేఖల్లో అందాల ప్రేయసిలా ఒదిగిపోయింది.

‘ఆదాబ్ హైదరాబాద్’- సుభాని క్యారికేచర్లు, కార్టూన్లు, రాక్స్, స్కెచెస్ అనే ‘చార్’మీనార్ల మీద నిలబడి, నలుగురినీ ఆకట్టుకునే పుస్తకంగా రూపుదాల్చింది!

‘క్యారికేచర్ల’లో- నగరాన్ని పాలించిన నిజాం ప్రభువుల చిత్తరువులనూ, భాగమతీ సోయగాన్నీ- వారి చరిత్రను క్లుప్తంగా ఆంగ్లంలో పేర్కొంటూ చిత్రించిన సుభాని, ‘కార్టూన్స్’లో తన ‘హాస్య చతురత’ విశ్వరూపాన్ని చూపించారు. రెండు రెండు పేజీలకు విస్తరించిన ఈ వ్యంగ్య చిత్రాల కాన్వాస్ మనల్ని ‘్ఫదా’ చేస్తుంది. నగరం బహిరంతర తత్త్వాలనన్నింటినీ ఇంత బహుముఖీనంగా, బహుశా మరో చిత్రకారుడెవరూ అందించిన దాఖలా లేదు; అందునా ఇంత వ్యంగ్య రేఖావైభవంతో. నగరంలో సంచరించే ప్రతి నగరవాసికీ ఎదురయ్యే, చిరపరిచిత ఉర్దూ, తెలుగు పరిభాషా దర్శనమూ ఆశ్చర్యానందాలనందిస్తుంది. చార్మినార్, మొజంజాహి మార్కెట్, అసెంబ్లీ, హుస్సేన్‌సాగర్ నెక్లస్ రోడ్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, మాదాపూర్ హైటెక్ సిటీ, జూపార్క్, గోల్కొండ, పురానాపూల్, సాలార్జంగ్ మ్యూజియం వంటి హైదరాబాద్ ప్రసిద్ధ ప్రాంతాలూ, అక్కడి పరిసరాలూ, జన జీవనం, భాష, దైనందిన వ్యవహారాలూ వంటి వాటినన్నింటినీ- ఇంత సవిస్తరంగా, వ్యంగ్య హాస్య ధోరణులలో తన రేఖలలో సాక్షాత్కరింపచేసిన ‘సుభాని’ పరిశీలనా ప్రతిభకు అభినందనలందించక తప్పదు!

అలాగే ‘రాక్స్’ విభాగంలో- ప్రకృతి సహజంగా నగరంలో వివిధ పరిసరాల్లో కానవచ్చే రాళ్ళ ఆకృతులనూ, వాటి సహజ అమరికలోని అద్భుత సౌందర్యాన్నీ, నేషనల్ హెరిటేజ్‌గా కూడా కొన్ని గుర్తింపబడిన ఆ వైభవాన్నీ- రేఖల్లో, రంగుల్లో కనుల ముందుంచారు.

ఇక సుభాని ‘స్కెచ్’లు చూసి- అబ్బురపడక తప్పదు. ఉత్తరపు దిక్కు కమాన్ నుండి చార్మినార్, తూర్పువైపు వీక్షణలో చార్మినార్, అలాగే దక్షిణం వైపుగా చార్మినార్... ఇలా ఒక్క చార్మినారే వివిధ పార్శ్వాలనుండి ఎలా కనబడుతుందీ, సన్నని గీతలతో, ప్రత్యంశ వివరాలు గోచరమయ్యేలా- చిత్రించి చూపారు. మక్కామసీద్ ముంగిట పావురాల గుంపు చూపడంలో, చౌమహల్లా ప్యాలెస్, కుతుబ్‌షాహీ టూంబ్స్, స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ, హైకోర్టు, కాచీగూడ రైల్వేస్టేషన్ అందాలూ సుభాని రేఖల్లో చూసి తీరాల్సిందే! ముఖ్యంగా బిర్లామందిర్ దృశ్యాన్ని చిత్రించిన తీరు, అందులో చిత్రకారుడు చూపిన ప్రతిభకూ ముచ్చట వేస్తుంది.

హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతికీ, హైదరాబాద్ వైభవ ప్రాభవాలకూ సుభాని ‘ఆదాబ్ హైదరాబాద్’ గ్రంథం సరికొత్త ఉపాయనంగా రాణిస్తూంది. అందమైన ఆర్టు పేపర్ మీద సర్వాంగ సుందరంగా అచ్చయిన సుభాని ‘ఆదాబ్ హైదరాబాద్’- కార్టూన్స్, కారికేచర్స్, స్కెచెస్ పుస్తకం రెండువందల యాభై రూపాయలకు సొంతం చేసుకుని, ‘క్యా నజర్ హై’ అని వీక్షించి ఆనందించవచ్చు.

చిత్ర కళాప్రేమికులు సమాదరించదగిన రేఖాత్మక హైదరాబాద్ నగర సర్వస్వం ఇది.

-సుధామ
ఆదాబ్ హైదరాబాద్
(కార్టూన్స్, కారికేచర్స్, స్కెచెస్) సుభాని
షెహనాజ్ ప్లాట్ నెంబర్.27
సంచారపురి కాలనీ, ఫేజ్.2
న్యూబోయిన్‌పల్లి
సికింద్రాబాద్ 500011
వెల: 250 రూ/-

2 comments:

Dantuluri Kishore Varma said...

మచ్చుకి మీరు ఇచ్చిన రెండు బొమ్మలు, రివ్యూ కలిసి ఎప్పుడెప్పుడు పుస్తకం సొంతం చేసుకొందామా అనేలా ఉంది. చాలా బాగా రాసారు.

సుధామ said...

కృతజ్ఞతాభివందనాలు శ్రీ దంతులూరి కిషోర్ వర్మ గారూ!