‘‘ ‘అంగట్లో అన్నీ వున్నాయి కానీ, అల్లుడి నోట్లో శని’ అని సామెత. కానీ అది నిజం కాదని, అల్లుడినే ‘అంగడికి’ అధిపతిని చేయడానికి సమకట్టింది ఓ అత్తమ్మ. ‘అల్లుడికి అత్తాశ’- అన్నట్లు ఆయనగారిది ‘అత్యాశ’కూడాను! ఓ అత్తకు అల్లుడినన్న హోదాతోనే, ఎస్పీజీ భద్రత మాత్రమే కాదు, ఏడేళ్ళ క్రిందట యాభై లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలెట్టి, ఇప్పుడు వందల కోట్లమేరకు ఆస్తిపరుడయ్యాడు’’ అన్నాడు శంకరం పేపర్ మడచి టేబుల్ మీద పడేస్తూ.
‘‘ఎవరా అల్లుడు? ఎవరా అత్త?’’ ప్రశ్నించాడు ప్రసాదు.
‘‘తెలియనట్లు అలా మొహం పెట్టకు! ‘దశమగ్రహం’గా ఎదగ గలిగిన గ్రహగతులు దక్కించుకున్న ‘రాబర్ట్‌వాద్రా’ గురించి విననే లేదా? కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ముద్దుల కూతురు ప్రియాంక భర్త రాబర్ట్‌వాద్రా అల్లుడి హోదాలో అప్పనంగా దక్కించుకున్న గొప్పతనం గురించి అవినీతి వ్యతిరేక భారత్ సభ్యులు- అరవింద్ కేజ్రివాల్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌లు కోడై కూసారుకదా!’’ అన్నాడు శంకరం.
‘‘ఔనౌను! కానీ దుర్బల దేశంలో సామాన్యులు ఏదో వాగుతూ వుంటారని వాద్రాగారు ఫేస్బుక్లో కామెంట్లుకొట్టి, అత్త దన్ను చూసుకుని చెత్త రాతలు రాసారట కదా! సోనియాకు అల్లుడయితే దేశానికే అల్లుడిననుకుంటున్నాడేమో ననుకుంటే, అసలు ఈ దేశం మీదనే- ‘దుర్బల’ దేశమని వ్యాఖ్యానిస్తున్న వాచాలత్వాన్ని ఏమనాలి’’అన్నాడు రాంబాబు మొహం చిట్లిస్తూ.
‘‘దేశం సొమ్ము అంటే- ‘అత్త సొమ్ము’ అనుకుంటున్నట్లున్నాడర్రా రాబర్ట్ వాద్రా! ప్రముఖ రియాల్టీ సంస్థ డిఎల్ఎఫ్, వాద్రాకు 65 కోట్ల వడ్డీ లేని ఋణం ఎందుకిచ్చినట్లు? క్విడ్ ప్రోకో వ్యవహారం కాకపోతే మతలబులు మరేమిటి? ఒక్క ఢిల్లీలోనే వాద్రాకు మూడువందల కోట్ల మేరకు ఆస్తులున్నాయిట. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో మూడువందల ఎకరాలు కొన్నాడట. మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం హర్యానాలోని గుర్గావ్లో కోట్లాది విలువైన ప్లాట్లను డీఎల్ఎఫ్ నుంచే కొన్నాడట కూడాను! తన భార్య ప్రియాంకకు- చెర్రీ యాపిల్ పండ్ల తోటలు, దేవదారు చెట్లమధ్య చల్లటి కొండల్లో మంచి భవంతి నిర్మించుకుని నివసించాలన్నది చిరకాల వాంఛ అని తెలిసి, అందుకు తగినట్లుగా హిమాచల్‌ప్రదేశ్‌లో సముద్ర మట్టానికి ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుందర హర్మ్య నిర్మాణం చేస్తున్నారట కూడాను! వచ్చే ఏడాదికల్లా అందులో కాపురం పెట్టేస్తారట! దేశం సొమ్ము దోచుకుంటూ, దేశంమీద గౌరవం లేకుండా వ్యాఖ్యానించడం, తాము ‘మిస్టర్ క్లీన్’ అన్నట్లు ప్రవర్తించడం- కొందరికే చెల్లింది.’’ అన్నాడు సన్యాసి.
‘‘గొప్పవాళ్ళ మీదా, వారి వారసుల మీదా బురద చల్లడం కూడా ఓ ఫ్యాషనవుతోంది! వై.యస్కు కొడుకయినందుకే జగన్‌నూ, సోనియా అల్లుడైనందుకే రాబర్ట్‌వాద్రాను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కానీ, ఒక్కసారిగా ఎవరూ కోట్లకు పడగలెత్తరు కదా! వారు వారి వ్యాపారాల్లోనే రాణించి కోటేశ్వరులయ్యారని ఎందుకు ఒప్పుకోలేరు? కొన్ని సంవత్సరాలు వారు ఎంతో శ్రమిస్తేనే కదా ఈ స్థాయికి ఎదిగింది.’’ అన్నాడు ప్రసాదు.
శంకరం ఒక్కసారిగా ఖయ్యిమన్నాడు- ‘‘నాయనా! సవ్యమైన దారుల్లో ఎదిగితే ఎవ్వరూ కాదనరు. ఫలానావారి కొడుకు, ఫలానా వారి అల్లుడు అనే వారిని నెత్తికెక్కించుకుని, వారికి తోడ్పడడం ద్వారా తాము లాభంపొందేవారు వేసే వలల్లో- ‘క్విడ్ ప్రోకో అంటూ చిక్కి, చివరకు వలలు కొరికి, తామే ఎత్తుకు ఎగిరిపోవాలని చూసేవారికి ‘చెక్’పెట్టి దింపకపోతే ఎలా? కేజ్రివాల్ గానీ, మరొకరుగానీ నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదు! జగన్‌ను విజయమ్మ తన కొడుకు అనీ, రాబర్ట్ వాద్రాని సోనియా తన అల్లుడనీ వెనకేసుకు రావాలనే చూస్తారు. సోనియాకు విధేయంగా- డీఎల్ఎఫ్, రాబర్ట్‌ల మధ్య లావాదేవీలు ప్రైవేట్ వ్యవహారాలనీ, వాటిపై దర్యాప్తు ‘జరపం’అనీ ఆర్థికమంత్రి చిదంబరం తేల్చిచెప్పడం ఏమిటి? రాబర్ట్ ప్రైవేట్ వ్యక్తి ఎలా అవుతాడు? గత ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు తానూ రాజకీయాల్లోకి రాగలనని వ్యాఖ్యానించిన అతగాడు- కాంగ్రెస్ వంశపారంపర్య ఖాతాలోని వాడుకాకుండా పోతాడా?’’ అన్నాడు శంకరం.
‘‘ఇదో దుర్బల దేశం..ఇందులో కొందరు సామాన్యులు వారా నన్ను ప్రశ్నించేది?’’ అంటూ- వాద్రా ఫేస్బుక్లో రాసిన దానిమీద నిరసనలు వెల్లువెత్తటంతో, ఆయన ఫేస్బుక్ అక్కౌంట్ క్లోజ్ చేసాడట! కానీ అహంకారపూరితమూ, అవినీతిమయమూ అయిన అల్లుళ్లూ, కొడుకుల ‘అక్కౌంట్లు’ ఎప్పుడు క్లోజవుతాయా? అని అవినీతి రహిత భారత్కోసం కలలుగంటున్న సామాన్యులే ఆర్తిచెందుతున్నారు! తమదైన విశిష్ట వ్యక్తిత్వాలు నిర్మించుకోక, అత్త్ధాపత్యంతో అల్లుడు, తండ్రి అండతో కొడుకు- దేశంకంటే తాము ఎత్తుకు ఎదుగుతామనీ, చట్టాలు న్యాయాలూ అన్నీ తమకు ఒదుగుతాయనీ, ఒదగాలనీ ఆశించి విర్రవీగడమే తప్పు! తమ వారల పలుకుబడిని దుర్వినియోగం చేయడం, కాదని ఠలాయించడం నేరం’’అన్నాడు సన్యాసి.
‘‘దేశ సంపద ఉమ్మడిగా పౌరులందరి హక్కు. దేశ గౌరవప్రతిష్ఠలూ, స్వేచ్ఛా స్వాతంత్య్రాలూ నిలబెట్టడం పౌరులందరి బాధ్యత. దేశ నాయకులు సరైన దిశానిర్దేశం చేసి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించవలసిన వారు. ఆ నేతాశ్రీల బంధుగణం- కొడుకులైనా, కూతుళ్లయినా, అల్లుళ్లయినా.. మరింత బాధ్యతాయుతంగా తమకు, తమవారికీ మచ్చతెచ్చే పనులేవీ చేయకూడదు! అవినీతి, బంధుప్రీతి అలుముకుని దేశం దిగజారకుండా ఇంత అవ్యవస్థలో- ఇప్పటికైనా నడుంబిగించి సమాయత్తమవుతున్న వారుండడం చీకట్లో చిరుదీపం. ‘అల్లుడా! మజాకా! నా, అని బాకా వూదకపోవడం నయం.’’ అన్నాడు తల పంకిస్తూ ప్రసాదు.
2 comments:
ఆయ్! బాగా చెప్పేరండి!! ఎవరేమనుకుంటే పోయిందేముందండీ!!! మన సొమ్ము మన దగ్గరున్నపుడూ అనుకుంటున్నారండి వారూ ఆయ్!!!
nijam cheparandi..
Post a Comment