ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, September 21, 2012

చిగురు జాడ

‘‘జనగణమన బెంగాలీలో వుంది కనుకా, టాగూర్‌కు నోబెల్ బహుమతి వచ్చింది కనుకా, నెత్తినెట్టుకుంటున్నాం గానీ- నిజానికి ‘జనగణమన’ గీతంకన్నా, గురజాడ రచించిన ‘దేశభక్తి’గీతం వందరెట్లు గొప్పది! ఆమాటకొస్తే ఏ దేశం వారయినా, దేశభక్తి విషయంలో నెత్తినెట్టుకోదగిన గొప్ప రచన అది! గురజాడ తెలుగువాడై పుట్టాడు కనుక- ఈ వివక్ష అనిపిస్తుంది. నిజానికి టాగూర్, గురజాడ ఇద్దరూ సమకాలికులే. టాగూర్ 150వ జయంతిని పట్టించుకున్నట్లుగా ప్రభుత్వాలు గురజాడ 150వ జయంత్యుత్సవాల్ని పట్టించుకోనే లేదు.’’ అన్నాడు ఆవేదనగా పేపర్ టేబుల్ మీద పడేస్తూ రాంబాబు. ‘‘అదేం మాట! రాష్ట్ర ప్రభుత్వం- సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలితో గత మూడురోజులుగా అనేక కార్యక్రమాలకు దోహదం చేస్తూ, ఇవాళ పెద్దఎత్తున రవీంద్ర భారతిలో సమాపనోత్సవం చేస్తోంది కదా! ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రం అంతటా- అన్ని పాఠశాలల్లో, గురజాడ రాసిన ‘దేశమును ప్రేమించుకుమన్నా- మంచి అన్నది పెంచుమన్నా’అనే దేశభక్తి గీతాన్ని ఆలాపింపచేస్తోంది! అందుకోసం రెండువందల సి.డి. లను అన్ని జిల్లాలకూ పంపించిందిట. గత కొద్ది రోజులుగా బోలెడు సెమినార్లు పలుచోట్ల జరిగాయి. గురజాడ ప్రతిభా పురస్కారాలు పేర అయిదుగురికి లక్ష రూపాయల చొప్పున సత్కారం, మరి పాతిక మందికి పాతికవేల చొప్పున పురస్కారాలు అందిస్తున్నారు కూడాను! స్వయంగా ముఖ్యమంత్రి కూడా నేటి సభలో పాలుపంచుకుంటున్నారాయె!’’ అన్నాడు శంకరం. ‘‘గత ఏడాది సెప్టెంబర్ 21నే గురజాడ 150వ జయంతి సంవత్సరం మొదలుకాగా, ఏడాది పొడుగునా నిద్రపోయి, ఇప్పుడు మేల్కొన్న ప్రభుత్వం ప్రకటించిన ఈ కార్యక్రమాలు ‘మొక్కుబడి’ తతంగాలు తప్ప, నిజంగా గురజాడను జాతి పునర్వికాసానికి తోడ్పడిన మహనీయునిగా గుర్తించినవి కావు! భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి ఇలా ఏ దృష్ట్యా చూసినా గురజాడ మహోన్నతంగా ఎన్నదగినవాడు. కొందరు ఆయనకి ప్రాంతీయతనూ, బ్రాహ్మణత్వాన్ని అంటగట్టి దిగజార్చే దుస్సాహసమూ చేసారు. ట్యాంక్‌బండ్ మీద ఆయన విగ్రహం ముక్కలై మాయమైపోయింది. ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందని ఆయన ఏనాడో చెప్పాడు! అంతేకాదు బౌద్ధాన్ని తరిమివేసి దేశం నష్టపోయిందన్నాడు. ‘‘మంచిచెడ్డలు మనుజులందున- ఎంచి చూడగ రెండెకులములు- మంచి అన్నది మాలయగుతే- మాలనే అగుదున్’’ అంటూ దళితుడిని తనతో కలుపుకోలేని వాడికి జాతీయత గురించి మాట్లాడే అర్హతే లేదన్నాడు. అలాంటి గురజాడకు- మనం ఇస్తున్న గౌరవం ఇదా! ఆయన పేరున ఒక పోస్టల్ స్టాంపు కూడా లేదు. విజయనగరంలోని ఆయన ఇల్లు గురించి శ్రద్ధగా, జాతి నిలబెట్టుకోవలసిన స్మారక స్థలంగా- పట్టించుకున్న దాఖలాలే లేవు.’’ అన్నాడు మళ్ళీ రాంబాబు. ‘‘ప్రభుత్వంకన్నా స్వచ్ఛంద సంస్థలే కొంత గౌరవించినట్లుగా వుంది ఆయనను. ముందునుండీ శ్రద్ధగా గురజాడ జయంత్యుత్సవాల గురించి వేదగిరి రాంబాబు వంటి వ్యక్తులు పడిన శ్రమను గుర్తించాల్సే వుంది. నిజానికి సాహిత్యాన్ని ప్రజాస్వారు ూకరించి, సామాన్య మానవుడికి సాహిత్యంలో పెద్దపీట వేసి, ‘‘మనిషి చేసిన రాయిరప్పకు మహిమ కలదని సాగిమ్రొక్కుతు- మనిషి అంటే రాయిరప్పలకన్న కనిష్టంగా చూస్తావేమి బాలా’’ అని భక్తి, ఆధ్యాత్మికతలకన్నా, మానవీయ విలువలు ముఖ్యమన్న మహాకవి గురజాడ. ఆయన పేర రెండు ఆడిటోరియాలు కట్టేసి, అచ్చుతప్పులతో పుస్తకాలు అచ్చేసి వదిలేస్తామంటే ప్రభుత్వ బాధ్యత తీరిపోదు! మరో ఏడాది గురజాడ ఉత్సవాల్ని పొడిగించయినా- అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో గురజాడపై సమర్థులచే కార్యక్రమాలను నిర్వహింపచేస్తే బాగుంటుంది’’ అన్నాడు ప్రసాదు రాంబాబును సమర్థిస్తూ. ‘‘ప్రజల భాగస్వామ్యం దేనికయినా అవసరం! ప్రభుత్వం చేసే కార్యక్రమాలలో- పాలనాపరమైన బ్యూరోక్రసీవల్లా, ఆశ్రీత పక్షపాతాలవల్లా, అందరికీ న్యాయం కలిగించాలన్న ఆ(కాం)ంక్షలవల్లా పూర్తి న్యాయం జరగడం, విలువగల గుణాత్మక కార్యక్రమాలు జరగడం కొంచెం కష్టమే! ‘తద్దినం పెట్టినట్లుగా వుంది’ అనిపించే వైఖరులూ కానవస్తూంటాయి. పాఠ్యాంశాలలో అన్ని స్థాయిల్లో గురజాడ సృష్టించిన వైవిధ్య భరితమైన సాహిత్యంనుండి ఉపయుక్త అంశాలను విధిగా చేర్చవలసిన అవసరం వుంది. అంతెందుకు? ‘కన్యాశుల్కం’ ఇవాళ లేకపోయినా- ఆయన రాసిన ఆ నాటకం ఎంత ప్రాచుర్యంతో నేటికీ వుందో మనమెరుగుదుము! అయినా దానిని అర్థంచేసుకోవలసిన రచయితయొక్క అసలు దృక్పథం పట్టుకున్నామా? ‘గిరీశం సంస్కృతే’ పరివ్యాప్తమై- గిరీశమే ‘హీరో’ అయి కూర్చున్నాడు! వ్యవస్థను ఆ అవస్థలోకి నెట్టుకున్నది మనమే. గురజాడ హాస్యంగా, అధిక్షేపంగా రాసిన నాటకంలోని అసలు నీతిని గ్రహించక, ‘మన వెధవాయిత్వానికి’ నేటికీ ఉపబలకంగా- గిరీశాన్ని తోడుచేసుకుంటున్నాం’’ అన్నాడు శంకరం. ‘‘గురజాడ రచనల మూలాన్ని సరిగ్గా పట్టుకుని ప్రచురించడం అవసరం! ఒక ‘దేశభక్తి’గీతమే ఆయన రాయని పాఠాంతరాలతో, భాషాదోషాలతో అనేక రకాలుగా అచ్చుకావడం చూసినప్పుడు బోలెడు బాధేసింది. ‘దేశమును ప్రేమించుమన్నా- మంచి అన్నది పెంచుమన్నా’ అన్న వాక్యాలే ‘ప్రేమించుమన్న’, ‘పెంచుమన్న’అంటూ దీర్ఘాలు లేకుండా- విజయనగరంలో గురజాడవారి ఇంట్లోనే ఒక బోర్డుమీద దృశ్యమానం కావడం చూస్తే, మన అశ్రద్ధ, మన ‘వెధవాయిత్వం’ స్పష్టంగా తెలుస్తున్నాయి. పలు భాషల్లో అనువదింపచేసి దేశభక్తి గీతాన్ని అచ్చువేసిన వేదగిరి కమ్యూనికేషన్స్ పుస్తకంలోనూ- అసలు తెలుగులో గురజాడ ‘దేశభక్తి’గీతమే బోలెడు అచ్చుతప్పులతో ముద్రితమైంది. చిత్తశుద్ధి, నిజాయితీ, గౌరవం, శ్రద్ధలేకుండా మహనీయుల ఉత్సవాల్ని నిర్వహించుకోవడం వృధా తంతే అవుతుంది. ‘‘దేశమని యెడు దొడ్డవృక్షం- ప్రేమలను పూలెత్తవలెనోయ్- నరుల చెమటను వడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్’’ అని స్వప్నించిన గురుజాడ పలికిన- ‘సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్’ అన్నది ప్రతి పౌరుడి ఆచరణలో అభివ్యక్తమయితే, తమ వ్యక్తిత్వ సాహిత్యాల ద్వారా గురజాడ లాంటి మహారచయిత ఆశించిన- సువ్యవస్థా వృక్ష సుమధుర ఫలాలకు ‘చిగురుజాడ’ కనిపిస్తుంది. అదీ కావలసింది!’’ అంటూ లేచాడు సుందరయ్య.

5 comments:

Jai Gottimukkala said...

మీకు గురజాడ మీద అభిమానం ఉండొచ్చు గాక. దీనికి రవీంద్రుని తక్కువ చేయడం అవసరమా? ఇలాంటి ప్రయత్నాల వల్ల తెలుగు భాష పరువు పెరగదు.

సుధామ said...

రవీంద్రుని తక్కువ చేయలేదు జై గారూ! జనగణమన కన్నా గురజాడ దేశభక్తి గీతం ముందుగా రావడమే కాదు ఏ దేశప్రజకైనా వర్తించే ఉదాత్త భావనలు కలిగింది.ఆయనకు ఆ విలువ ఇవ్వడం సముచితమన్న భావన మాత్రమే!

సుధామ said...

ఇద్దరూ సమవయస్కులూ,సమకాలీనులూ,సమప్రజ్ఞులూ అయినప్పుడు ఈ వివక్ష సబబంటారా!

Dantuluri Kishore Varma said...

మీ బ్లాగ్లో విషయాలు చాలా బాగున్నాయి సుధామ గారు.

సుధామ said...


మీకు నచ్చినందుకు ఆనందంతో కృతజ్ఞతలు కిశోర్ వర్మ గారూ!