ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, August 31, 2012

అదనుకోసం పదును‘‘అలుగుటయే ఎరుంగని అజాతశత్రువే అలిగిననాడు...’’ అంటూ పాడుకుంటూ ప్రవేశించాడు సన్యాసి.

‘‘అలుగుట అంటే బుంగమూతి పెట్టుకు కూర్చోవడమో కోరిక ఏదో తీర్చుకోవడానికి అలకపాన్పు ఎక్కడమో కాదయ్యా! అలుగుట అంటే కోపపడుట అని అర్థం. ఇంతకీ నువ్వంటున్న ఆ అజాతశత్రువు ఎవర్నాయనా!’’ అని ప్రశ్నించాడు ప్రసాదు.

‘‘దశాబ్దానికి పైగా దాదాపు తెరవెనకనుంచే పార్టీని నడిపిస్తున్న సోనియాగాంధీయే నయ్యా! ఇన్నాళ్ళూ ఆవిడ చాలామటుకు ‘సైలంట్ మోడ్’లోనే వున్నారు. ఆవిడ అధిష్ఠానదేవత అయిన మూల విరాట్టుగా మాత్రమే వుండేది. భజించినా, భంజించినా పట్టించుకున్నట్లు ప్రత్యక్ష గోచరమయ్యేది కాదు. కానీ చూసారూ! ప్రణబ్ రాష్టప్రతి భవన్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల టైంలోనే నామ్ సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మన్మోహన్ ఇరాన్ వెళ్ళారు. ఇదే అదను అన్నట్లు ప్రతిపక్ష బి.జె.పి అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్‌ని కడిగిపారేయడానికి సిద్ధమైంది. సాక్షాత్తూ ప్రధానియే రాజీనామా చేయాలని లోక్‌సభలో నినదించింది. దీనితో సోనియాకు ఆగ్రహం పెల్లుబికింది. ఆమధ్య పార్లమెంట్‌లో కోపం వచ్చి పెన్సిల్ విరగ్గొట్టారు. కానీ ఈ మాటు బి.జె.పిపై కత్తి దూసినంత పని చేసారు’’ అన్నాడు సన్యాసి.

‘‘అవునయ్యా! బొగ్గు కుంభకోణంపై అందివచ్చిన అవకాశం బి.జె.పి ఎందుకు వదులుకుంటుంది. 2జి స్ప్రెక్ట్రమ్ విషయంలో 1.76 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం ఏర్పడిందని వేలం వేయకుండా చేసిన ఆ కేటాయింపులపై ‘కాగ్’ తప్పుపట్టినందువల్లనే కదా అప్పటి టెలికాం మంత్రి రాజా జెయిల్ పాలయింది దయానిధి మారన్ కూడా మంత్రి పదవి కోల్పోయింది. ఇప్పుడు బొగ్గు బ్లాకుల కేటాయింపులోనూ ఆ అంశాలనే కాగ్ ఎత్తిచూపింది. 1.86 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని స్పష్టపరిచింది. మరి ఈ బొగ్గు బ్లాకుల కేటాయింపులప్పుడు సాక్షాత్తు ప్రధాని మన్మోహన్‌గారే బొగ్గుశాఖనూ నిర్వహించారాయె! రాజా, మారన్‌లకు ఒక న్యాయమూ, ప్రధానికి ఒక న్యాయమూనా? అని ప్రశ్నిస్తూ బి.జె.పి మన్మోహన్ రాజీనామాకు భీష్మించుకు కూర్చుంటోంది. బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో ప్రధాని కార్యాలయం జోక్యాన్ని ఆధారాలతో చూపుతోంది. అప్పట్లో ఫుడ్ ప్రాసెసింగ్‌కు ,ప్రస్తుతం పర్యాటకశాఖకు మంత్రిగావున్న సుబోధ్‌కాంత్ సహాయ్ లేఖకు స్పందించి ప్రధాని, రెండు బొగ్గు బ్లాకులు మెస్సర్స్ ఎస్‌కే ఎస్ ఇస్సాత్ అండ్ పవర్ లిమిటెడ్‌కు చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలోని వారి స్టీల్ ప్లాంట్లకు అప్పనంగా కేటాయించారని బి.జె.పి గుర్రుమంటోంది. కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతోంది అందుకే’’ అన్నాడు రాంబాబు కల్పించుకుంటూ.

‘‘అందుకేగా సోనియా నేరుగా రంగంలోకి దిగింది. బ్లాక్‌మెయిల్ చేయడం బి.జె.పి దినచర్యగా మారిందని ఆవిడ కాళికలా హూంకరిస్తూ బి.జె.పిపై ఎదురుదాడి చేయమని ప్రత్యక్షంగా పార్టీ ఎంపీలకు ఆదేశించారు. బొగ్గు గనుల కేటాయింపుల వ్యవహారంలో పార్టీ మొత్తాన్ని ప్రధానికి మద్దతుగా నిలబెడుతూ లోక్‌సభలో, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా 'లేచి నిలబడండి, నినదించండి, తీవ్రంగా పోరాడండి' అని ఒక సైన్యాధ్యక్షురాలి లాగా సమరశంఖం పూరించారు. అందుకే... ‘అలుగుటయే ఎరుంగని అజాతశత్రువే అలిగిననాడు’ అనిపిస్తున్నది’’ అన్నాడు సన్యాసి.

‘‘బీజేపీది ఉద్దేశ పూర్వక బాధ్యతారాహిత్యం అనీ , 2014 ఎన్నికల లబ్దికోసమే బొగ్గుగనుల అంశాన్ని రచ్చచేస్తూ ప్రధానినే లక్ష్యంగా చేసుకుని ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తోందని ,పార్లమెంట్‌ని స్తంభింపజేయడాన్ని లక్ష్యంగా ఓ అలవాటుగా చేసుకుందనీ అనిపించడం సహజమే! కానీ కాగ్ నివేదికపై చర్చకు కాంగ్రెస్ సిద్ధపడుతూంటే బ్లాక్‌మెయిల్ ద్వారా సొమ్ముచేసుకోవడానికి బి.జె.పి వ్యూహరచనలు చేస్తోందని సోనియా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటు తన రాజ్యాంగ విధుల్ని నిర్వర్తించడానికి బి.జె.పి అడ్డుపడుతోందని అద్వానీపై ఆమె ఆగ్రహోద్రేకం చెందుతున్నారు’’ అన్నాడు రాంబాబు.

‘‘ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా దెబ్బతిన్న మాట వాస్తవమర్రా! అక్రమాలకు, అవినీతికి, కుంభకోణాలకు నెలవుగా ప్రభుత్వం మారిపోయిందనిపిస్తున్న మాట వాస్తవం. అయితే వీటి ప్రాతిపదికలు మునుపటి బి.జె.పి ప్రభుత్వంలోనివే అనీ , పాపాలభైరవులు ఆద్యులు వారేననీ కాంగ్రెస్ అంటోంది. కాగ్‌పైనా, బి.జె.పి పైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. పార్లమెంట్‌ను స్తంభింపచేస్తున్నందుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు బి.జె.పిని ఏకాకిని చేయచూస్తూండగా, సోనియా వాదనలకు యూ.పి.ఏ. భాగస్వామ్య పక్షాలు మద్దతునివ్వడం ఆమె స్థైర్యాన్ని పెంచుతున్నాయి. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వున్నా, అది బి.జె.పి పట్లనో మరే ఇతర పార్టీపట్లనో అనుకూలతగా మాత్రం ప్రజలలో ఇంతవరకూ మారిన సూచనలు లేవు. అవినీతిపై అంతులేని పోరాటం ప్రకటించిన అన్నాహజారే బృందం కూడా కొత్త రాజకీయ పార్టీగా అవతారమెత్తడానికి సిద్ధమవడం ప్రజలలో ఉత్సాహోద్రేకాలను కలిగిస్తున్న దాఖలాలు లేవు. రాజకీయ పార్టీలు పరస్పరం నిందించుకుంటూ కత్తులు దూసుకుంటున్నాయేగానీ, ఏ పార్టీ ప్రజలలో తమ నాయకత్వంపట్ల విశ్వాసాన్ని ప్రోదిచేయలేకపోతోంది. రాబోయే ఎన్నికల్లో మరి ప్రజల ‘ఓటు’ ఆయుధం ఎవరిపై ఎలా ప్రయోగింపబడుతుందో ఇప్పుడు చెప్పలేం. ధర్మోరక్షతి రక్షితః అని విశ్వసించడం తప్ప’’ అన్నాడు ప్రసాదు.
0 comments: