ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 25, 2012

ఎలానో.. ఎందుకో.. ఆ‘రెస్ట్’






'' జైళ్ళ సంస్కరణల విషయంలో, మన ‘ఆంధ్రప్రదేశ్’యే అగ్రగామిగా వుందంటే వుండదూ మరి! జైలు పాలయినవారికి మనవాళ్లు అందించే సౌకర్యాలు గొప్పవి. జైళ్లకు మామూలు దొంగలూ, హంతకుల కంటే ఇప్పుడు రాజకీయ నేతలూ, ఐ.ఏ.ఎస్ వంటి అధికారులూ రావడం పెరిగిపోతోంది. అంచేత వాళ్లని దృష్టిలో పెట్టుకుని- జైళ్లల్లో ఏ.సీ.గదులు, డబుల్ కాట్‌లు, ఎల్.ఇ.డిలు కూడా అమర్చి, వారి జైలుజీవితం ‘రెస్ట్’గానూ, ‘బెస్ట్’గానూ సాగడానికి- సంస్కరణలను ముమ్మరం చేయకపోతే ఎలా చెప్పు? ‘కారాగారము’అంటే కావలిస్తే రా! నిన్ను ‘గారము’గా చూసుకుంటాం అని, నేరాలుఘోరాలు చేసేవారికి హామీఇస్తూ, ప్రజలు ఒకప్పుడు ‘జైజైలు’ కొట్టినవారు ‘జైలు’కొచ్చినా, ‘జై’-‘హై’ అనుకునేలా తీర్చిదిద్దడం, అభినందించదగిన సంగతి అవునోకాదో గానీ, అనివార్యం అయిపోవడం లేదూ!’’ అన్నాడు రాంబాబు గదిలోకి వచ్చి ఫ్యాన్ ఆన్ చేస్తూ.



‘‘ఎండలు ఎలా వున్నాయి? మండిపోతున్నాయి. అందునా ఇవాళోరేపో ‘రోహిణీ కార్తెలు’ ప్రవేశిస్తున్నాయి కదా? వెధవది! ఈ సమయంలో ఉప ఎన్నికలు వచ్చిపడ్డాయి. మండు‘ట్రెండు’ల్లో- నాయకులు ప్రచారంకోసం పాపం! రోడ్లెక్కక తప్పడం లేదు. వెంటనంటి వుండే అనుచరగణం- ఆయనకో, ఎండలకో వెరచి, వెంటనంటి రాకపోతున్నా, ఏ ఎండకాగొడుగు పట్టగల దిట్టలు ఒకరిద్దరు దొరికినా, వారితోనే- ప్రచార ‘చారణం’చేసుకుంటున్నారు. అంతగా అయితే- ఓటు అడగడానికి వెళ్లిన ఇంటినుంచే, మంచంమీద ఇంత చోటు అడుక్కుంటూ, లేదా ఏ మడత మంచమో అడుక్కుని, మడిచి చంకన పెట్టుకుని, ఏ చెట్టు నీడనో వేసుకుని, కాసింత సేద తీరి మరీ కదులుతున్నారు! ఏసీల్లో వుండే మా రాజులు తమను చూసేటందుకు వచ్చారన్న జాలితో- ‘ఎలాగూ మీరు గెలిచాక మమ్మల్ని నిద్రపుచ్చేవారే కనుక, మీరు కాసేపు పాపం ఇప్పుడయినా నిద్రపోండి’అన్నట్లుగా- వాళ్ల ఉపన్యాసాల హోరయినా, వాగ్దానాల జోరయినా తగ్గుతుంది చాలని, అడిగిందే తడవుగా- మడత మంచములు అద్దెకుకాక, ముద్దుగా ఒద్దికగానే గ్రామస్తులు అందిస్తున్నారల్లే వుందిలే! ‘ప్రచారం’అంటే తమకు ఓటు ఇమ్మనీ, తాముచేసిన, చేయదలిచిన ప్రజోపయోగ కార్యక్రమాల గురించి చెప్పుకోవడం అనేది ఒహప్పటి మాట! ఇప్పుడది కాదు!- అవతలి పార్టీవారిని దుయ్యబట్టడం, చెడ తిట్టడం, వాళ్లకి ఓటువెయ్యవద్దని చెప్పడం, వాళ్లమీద చేతనైనంత బురద జల్లడం తప్ప- మరోటి కాదన్నట్లుగా వుంది! ‘గెలుస్తామా’అన్న నమ్మకంలేకున్నా- ‘అయినను పోయిరావలె.....!’ అన్నట్లుగా, తిరగడం తప్ప, జనం నాడి ఏమిటో ఈ వేడిలో అసలు అర్థంకాక, తమ వైఖరిలో ‘గాడి’ తప్పుతున్న పార్టీలూ, వాటి పెద్దలే అందరున్నూ. తాము మిస్టర్ క్లీన్‌లమయిన ‘అచంచల’ ప్రజాసేవకులమనీ, అవతలి పార్టీవారే ‘చంచల్‌గూడా’కెళ్లాల్సిన దొంగలూ, పుండాకోరులూ అనీ ఎవరి ఉవాచ వారిదే’’అన్నాడు ప్రసాదు ఫ్యాన్ క్రిందకి కుర్చీలాక్కుంటూ.




‘‘అమ్మమ్మ అలా అనకు! స్వస్వరూప జ్ఞానం ఎరిగినవాళ్లూ వున్నారు! జగన్‌ను చూడు- ‘రేపోమాపో నా అరెస్టు ఖాయం’అని ధీమాగా- ఆయన ప్రకటించాడా లేదా? అందరూ కుమ్మక్కయ్యారు అనీ, వాయిలార్‌తో డీజీపీ చర్చించారు అనీ, ఢిల్లీలోనే కుట్ర పకడ్బందీగా జరిగి తనను జైలుపాలు చేస్తారనీ, విశ్వాసంతో సంచలన ప్రకటన జమ్మలమడక రోడ్‌షోలో మొన్నమొన్ననే చేసాడు కదా!- తనను అరెస్టుచేస్తే రాష్ట్రంలో ‘విధ్వంసం’ జరిగి, ఆ నెపంతో ఉప ఎన్నికలు వాయిదాపడతాయని- లోపల పాపం ఆశ తొంగి చూస్తోందాయనకు. అసలు వాళ్ల నాన్నగారి రికార్డు పాదయాత్రల తరువాత, తన ‘సానుభూతి’యాత్రల రికార్డే-రికార్డ్‌బ్రేక్ చేయాలని ఆయన ఆశించారు గానీ, ఇలా ఎండల్లో తాను సి.బి.ఐ. నివేదిక పాటలకు, పాట్లుపడుతూ ‘రికార్డింగ్ డ్యాన్స్’చేయాల్సివస్తుందని అనుకోలేదు కదా! అంచేత అరెస్టు అయితే ఎలాగూ జైలులో కాలం వెళ్లమార్చాలని తెలుసు. ‘మనం ఇల్లా అంటే వాళ్లుఅల్లా’ అంటారని తెలుసుకనుక, ‘నా అరెస్ట్‌ఖాయం’ అని తానంటున్నందుకయినా, వాళ్లు తన మాట నెగ్గడం ఇష్టంలేని వాళ్లు గనుక, అరెస్టుచేయకుండా వుంటారనే భావన కూడా వుంటే వుండవచ్చు! ‘అరెస్ట్’అయినా జగన్ ఆ‘రెస్ట్’ను - చక్కగా ఉపయోగించుకునే ప్రణాళికలు వేసుకోవడంలేదని అనుకోకండి! అన్నాడు రాంబాబు.




‘‘ఇవాళ జగన్‌ను విచారణకు రమ్మనమని సి.బి.ఐ నోటీసు ‘గన్’ పేల్చిందన్నారు గానీ, అది ‘ఢం’అంటుందో, ‘తుస్సు’మంటుందో ఇంత పొద్దునే్న చెప్పలేం! అరెస్టులే ఆయుధంగా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రణాళిక వేస్తే- మోపిదేవి, పొన్నాల వంటి మంత్రుల అరెస్టుముందే జరిగి, జైలు గోడలమధ్యకు నడవాల్సి వుంటుందన్నదీ, గోచరమవుతున్న సమాచారమే. ఇంతకీ ‘దేశం క్లిష్టపరిస్థితులలో వుంది! అంటే వట్టి ‘తెలుగుదేశం’ అనుకోకూడదండీ!... కాంగ్రెస్ ‘ఆదేశం’, జగన్ ‘సందేశం’, తెలంగాణా ‘ఆవేశం’ అన్నీ క్లిష్టపరిస్థితుల్లోనే వున్నాయి. ఉప ఎన్నికలు దేనికీ ‘రిఫరెండం’కావని ఎవరికివారు అనడం, అనుకోవడం జరుగుతూండచ్చు గానీ, అసలుకి ‘ముందున్న గండం’కు- ఇది కనబడుతున్న ఏనుగు ‘తొండం’అని- సింహాలనుకుంటున్న వాళ్లకీ, ‘స్వప్న’సదృశమే! ఎవరెప్పుడు, ఎందుకూ, ఎలా, ఎక్కడ, ఎంత అరెస్ట్ అవుతారో చెప్పలేంగానీ- ‘అరెస్ట్’-ఆ ‘రెస్ట్’అని సరిపుచ్చుకోకపోతే మరి మనలేరు మన నాయకులు ’’ అంటూ నవ్వుతూ లేచాడు సుందరయ్య.


(25.5.2012 Friday)

1 comments:

Kandukuri Ramu said...

మీ ఆర్టికల్ బెస్ట్,
చదవాలి అందరూ మస్ట్,