ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, May 20, 2012

బ్లాగు కథలు బహు బాగు‘జాజిమల్లి’ కథలు పత్రికల్లో పడినవి కాదు. తన బ్లాగ్‌లో రచయిత్రి స్వేచ్ఛగా రాసుకున్నవి. తనే చెప్పుకున్నట్లు ఈ సంపుటిలోని ప్రతి కథలో వున్న ‘నేను’ ఈ కథలకి ఒక కేంద్ర బిందువుకాక సాక్షిగానో, పరిశీలకురాలిగానో నిలిచేదే.


ఇవి ఒట్టి ఉద్వేగాలూ, అనుభూతులతో కూడిన జ్ఞాపకాలు, ఘటనలు గానే అనిపించినా జీవితంలో ఎదురైన భావోద్వేగాలను నియంత్రించుకుంటూ వాటి మూలాలను అనే్వషిస్తూ తన శక్తిమేరకు ఒక క్రమంలో వ్యాఖ్యానించుకుంటూ పోయిన కథనాలే.


సున్నిత మానవ సంబంధాలు, సంక్లిష్ట కుటుంబ సంబంధాలు ఒక స్ర్తి కోణంనుండి ఈ కథల్లో పట్టుకోగలం. చితికిపోయిన వ్యవసాయ కుటుంబంలోని ఓ ఆడపిల్లగా రచయిత్రి వర్తమాన అవగాహన నుంచి బాల్య జీవితాన్ని విశే్లషిస్తారు కొన్నింటిలో. గ్రామీణ జీవిత చిత్రణం అస్తిత్వ ఉద్యమాల కోణంలో కూడా వీటిల్లో తొంగి చూస్తూంటుంది.


ఇందులోని నలభై ఒక్క కథల్లో ఒకనావళ్యం, సాన్నిహిత్యం పఠనీయతకు ప్రోద్బలకంగా వున్నాయి. ‘ఇప్పుడు స్ర్తిలు సాల్మన్ చేపలుకారు’, ‘మా అమ్మే తోటమాలి అయితేనే’, ‘ఆమెకి చేతులు కావాలి’, ‘నేను- మా నాన్నగారు- మహిళా దినోత్సవం’, ‘మనిషిని కావలించుకునే ఉత్తరం, ‘రిక్షారంగదాసు- చాకలి బాలమ్మ’ వంటి కథలు పరిచిత జనపాత్రలతో సమావేశం అన్నట్లుగా సాగుతూ కొసమెరుపుల పసలతో కూడా అలరిస్తాయి.


అధునాతన సాంకేతికాభివృద్ధితో విస్మరిస్తున్న విలువల పునఃసాక్షాత్కారం కూడా ఈ కథల్లో ద్యోతకమయ్యే ఘట్టాలున్నాయి. ‘అరచేతిలో ఆక్వాగార్డ్’అలాంటి రచనే. చేతులారా మంచినీళ్ళను మురికి చేసుకుని ‘ఆక్వాగార్డ్‌తో వడబోసుకుంటున్న వైనాన్ని చెబుతూ ‘చిల్లగింజ’వేసి స్వచ్ఛ జలం పొందగల మామ్మగారి ఓ తరం కిటుకును అందించారిందులో.


ప్రతికూలతలు వున్న స్ర్తిలు తమ ప్రతిభను సామర్థ్యాన్ని నిలుపుకోగలరని నిరూపించే దృష్టాంతాలు వీటిల్లో చాలాచోట్ల చూస్తాం. స్ర్తిల అస్తిత్వ చైతన్యమే చాలా కథల్లోని ప్రధాన అంశం.

కుఛ్ ఖోకర్ పానాహై
కుఛ్ పాకర్ ఖోనాహై

అన్నట్లు ‘‘జీవితం ఒక రాకపోకల రథ్య’’యే అయినా, మానవత్వపు విలువల సయోధ్యతో అడవినైనా అయోధ్య చేసుకోగల ప్రజ్ఞ ప్రాకృతిక సహజ పరీమళంగా వీటిల్లో తాకుతూ వుంటుంది. క్లుప్తంగా, సున్నితంగా, సూటిగా నిజంగా బ్లాగున్న కథలివి.


జాజిమల్లి (కథలు)
మల్లీశ్వరి - పర్‌స్పెక్టివ్స్ హైదరాబాద్ ప్రచురణ

305, హిమశివ అపార్ట్‌మెంట్స్, 
బాగ్‌అంబర్‌పేట్,
హైద్రాబాద్- 13.
వెల: రూ.80/-
(Andhrabhoomi Daily-'Akshara' 20.5.2012)

1 comments:

Anil said...

Sudhama Avr గారు ఈ బుక్ + ప్రింట్ బుక్ రెండూ కూడా కినిగె.కాం లో లభ్యం:
http://kinige.com/kbook.php?id=511