‘‘హాస్య స్ఫూర్తి వుండాలోయ్! అది కొరవడినప్పుడు ‘చాటుకో’దగిన హాస్యం అనేదే ‘చేటు’గా మారుతుంది మరి! సున్నితమైన హాస్యం ఎవరిని ఉద్దేశించిందో, వారికి కూడా- ఆ హ్యూమర్ సెన్స్ వున్నవాళ్లయితే నచ్చుతుంది. ‘శంకర్స్ వీక్లీ’ పత్రిక నడచినప్పుడు- ఆ కాలంలో దేశపు తొలి ప్రధాని అయిన నెహ్రూగారు శంకర్ తనమీద ఏ కార్టూన్ వేశాడా అని ఆసక్తిగా చూస్తూ వుండేవారట. ఏనాడూ కోపగించుకోలేదు సరికదా శంకర్‌ను ప్రోత్సహించేవారుట’’ అన్నాడు శంకరం.
‘‘ఫ్రీలాన్స్ కార్టూన్స్‌కు పొలిటికల్ కార్టూన్స్‌కూ తేడా వుందోయ్. పొలిటికల్ కార్టూన్‌కు ఎంతలేదన్నా కొన్ని పరిమితులుంటాయి. ఒక రాజకీయ నేతయో, పార్టీయో ఒకలానే వుండడు. ‘‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజ్ చేస్తూంటేనే గానీ పొలిటీషియన్ కానేరడు’’అని గురజాడవారి గిరీశం వూరికే అనలేదు! పొలిటికల్ కార్టూన్లు- ప్రధానంగా రోజువారీ దినపత్రికల్లో చూస్తూంటాం. వాటిని వేసే కార్టూనిస్టు ఆ పత్రికలో పనిచేసేవాడే అయ్యుంటాడు. లేదా ఆ పత్రిక ప్రత్యేకంగా నియుక్తం చేసుకునయినా వుండవచ్చు. అంచేత ఆ కార్టూనిస్టు- ఆ పత్రిక యాజమాన్య రాజకీయ భావాలకనుగుణంగానే కార్టూన్లు గీయడం జరుగుతుంది. ఆ పత్రికనుంచి ఆ కార్టూనిస్టు మరో పత్రికకు మారితే అతను గీసే కార్టూన్ల భావజాలం కూడా మారిపోతుంది. మార్చుకోక తప్పదు. అంటే పొలిటికల్ కార్టూనిస్టు తాను పనిచేసే పత్రిక రాజకీయ భావజాల మూసలోనే ఆలోచించి, కార్టూన్లు గీయాలి. కానీ పొలిటికల్ కార్టూనిస్టుగాకాక- ఫ్రీలాన్స్ కార్టూన్‌గా వున్న కార్టూనిస్టుకి ఈ ఇబ్బంది వుండదు. స్వేచ్ఛగా ఎలాంటి కార్టూనే్లనా గీసుకోవచ్చు. కార్టూనిస్టుల స్వేచ్ఛాయుత భావాలలోనే నిజమైన వారి నిజాయితీ హాస్యం వుంటుంది. పొలిటికల్ కార్టూన్లు ఫ్రీలాన్స్ కార్టూనిస్టులు ఎక్కువ గీయకపోవచ్చు. ఏ వ్యంగ్య చిత్రకారులు అయినా తమ సృజనాత్మక కృషికి పూనుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వుంటుందనిపిస్తోంది. రాజ్యాంగ నిర్మాణంలోని ఆలస్యంపై అంబేద్కర్‌పై ఆరు దశాబ్దాల క్రితంనాటి కార్టూన్ ఎన్.సి.ఇ.ఆర్.టి. పాఠ్యగ్రంథంలో చేర్చడంపై పార్లమెంట్‌లో దుమారం రేగి, ఆ పాఠ్యగ్రంథాన్ని ఉపసంహరించుకునే స్థితి ఏర్పడింది అంటే, ఒక కార్టూన్ ఎంత ప్రభావం కలిగించగలదో అర్థంకావడం లేదా’’ అన్నాడు సుందరయ్య.
‘‘అంతర్జాతీయంగా ఇలా వివాదాస్పదంగా కార్టూన్లు మారిన ఘటనలు ఎన్నో వున్నాయి’’అని కూడా అన్నాడు.
‘హాస్యంబునకు దేశ కాల పాత్రంబులు లేవా?’ అన్నారు తిరుపతి వెంకటకవులు. ఆరు దశాబ్దాల క్రితం కార్టూన్‌ను అప్పటి సామాజిక రాజకీయ స్ఫూర్తితో అర్ధంచేసుకోవాలి గానీ, ఇప్పుడు అదేదో కించపరిచేదిగా వుందని ఆందోళన పడటం ఏమిటి? అది వెలువడినప్పుడు స్వయంగా అంబేద్కర్ మహాశయుడే దానిని స్వీకరించినదేకదా!’’ అన్నాడు శంకరం.
‘‘కావచ్చు. ఆయన అలాంటి వాటిని జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నవాడే! కానీ పనిగట్టుకుని అరవై ఏళ్ల తరువాత రాజ్యాంగ నిర్మాణంలో ఆలస్యం జరిగిందన్న, ఇప్పుడు అవసరం లేని విషయాన్ని ఎత్తిచూపే కార్టూన్‌ను పాఠంలో చేర్చడం ఎందుకు? రాజ్యాంగ రచనా కాలంనాటి నాయకులు, సంఘటనలను అర్ధంచేసుకున్న భిన్నరీతులన్నింటిని విద్యార్థులకు పరిచయం చేసేందుకే ఎన్.సి.ఇ.ఆర్.టి. పాఠంలో చేర్చామని ఆ గ్రంథ కూర్పరులైన ఆచార్యులు సమర్ధించుకో చూస్తున్నారు కానీ, వారి ఆచార్యత్వానికి రాజీనామా చేయక తప్పలేదు వారికి! పొలిటికల్ కార్టూన్‌కు శాశ్వత విలువలు వుండవు. ఆ సంఘటన జరిగిన కాలానికీ, అప్పటి ఆ వ్యక్తి తీరుకూ అది దర్పణంగా నవ్వు పుట్టిస్తుందేమోగానీ, ఆ హాస్యం కాలగతిలో మరుగునపడుతుంది. ఒక చారిత్రక అంశానికి రికార్డుఅయిన ఒక వ్యాఖ్యగా మాత్రమే నిలుస్తుంది. అదీకాక-ఇవాళ వివిధ పత్రికల్లో వేస్తున్న పొలిటికల్ కార్టూన్లలోని హాస్యం బానే పండుతున్నా, అది ఆ పత్రికయొక్క పాక్షిక దృక్పధానికీ, అది కలిగివుండి మొగ్గుచూపుతున్న రాజకీయ భావజాలానికీ నిదర్శనంగానీ, అదే శాశ్వత సత్యమో, వాస్తవమో కాదు. ఒక ‘వ్యంగ్య వ్యాఖ్య’ మాత్రమే! అదీ ఒక పాక్షిక కోణంలో మాత్రమే! అసలు నన్నడిగితే- నేతల ముఖాలను క్యారికేచర్లుగా సంతరిస్తూ వేసేవే పొలిటికల్ కార్టూన్లనుకోవడం సరికాదు. ఆ రాజకీయ వాతావరణాన్నీ, భావజాలాన్నీ ప్రతిఫలించేలా సృజనాత్మకంగా కార్టూన్లు వేయడం గొప్ప. తొలి తెలుగు కార్టూనిస్టు అయిన ‘తలిశెట్టి రామారావు’గారు ఆరోజుల్లో భారతి, ఆనందవాణి లాంటి పత్రికల్లో ఆ పనిచేసారు. అనేక సామాజిక, సాంఘిక అంశాలమీద, దురాచారాల మీద కార్టూన్లు సంధించారు. ఇప్పటికీ వాటిల్లో అందుకే హాస్య స్ఫూర్తి నిలిచి వుంది’’ అన్నాడు సుందరయ్య.
‘‘నిజమైన సృజనకారుడి ప్రతిభ అక్కడే వుంటుందయ్యా! కాలావధులకు నిలచే కార్టూన్లు గీయడం మరీ గొప్ప! తాత్కాలిక లక్ష్యాలూ, ప్రయోజనాలూ మాత్రమే ముఖ్యమైతే, నవ్వు నాలుగు విధాల ‘చాటు’ అనే తత్వంపోయి, ‘చేటు’అన్న ప్రమాదమే పరిఢవిల్లుతుంది. కార్టూన్లూ, కార్టూన్ల హాస్యస్ఫూర్తీ వక్రీకరించబడే విధానాలు ఏవయినా సరికాదు. మే’20 తలిశెట్టి రామారావుగారి జయంతిని తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా కార్టూనిస్టులు పాటించడం సంతోషదాయకమే! కార్టూన్లకున్న బలమైన శక్తి ఏమిటో స్పష్టంగా అర్ధమవుతున్నప్పుడు- ఆ శక్తియుక్తులను సక్రమమార్గంలో ఉపయుక్తంచేస్తూ, నవ్వుల ప్రపంచాన్ని ఆరోగ్యదాయకంగా, అభివృద్ధిదాయకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్టూనిస్టులదే మరి’’అంటూ లేచాడు ప్రసాదు.
0 comments:
Post a Comment