ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, April 27, 2012

ఇక్కడ అంతా ‘లూజే!’







‘ముడి జారిపోతున్నప్పుడు నాడా బిగించి మళ్ళీ కట్టుకోవాలి. అయితే అసలు బొందులో నాడా వుండాలి. ఒక్కసారి నాడా అంచులోపలికి పోతే, అటునుంచి బయటకులాగే ప్రయత్నం చేయాలి. ముడి బిగించడానికి ఒకవైపు అంచున నాడా కనపడుతూంటే చాలదు. రెండంచులూ బయటకు సజావుగా కనిపిస్తూంటేనే- లాగుదో, లంగాదో, పైజమ్మాదో ముడి మళ్లీ బిగించి కట్టుకోవడం సాధ్యమవుతుంది. ఒక్కసారి మొత్తం బొందులోంచి నాడా లాగేసి, మళ్లీ బొందులోకి జాగ్రత్తగా ఎక్కిస్తేకానీ, ముడి వేసుకుని జారిపోకుండా, బంధం గట్టిపరచుకోవడం కుదరదు’’ అన్నాడు ప్రసాదు.



‘ఈలాగున- ఈ లాగు జారిపోతున్న బొందు, నాడాల భాష ఏమిటి మహాశయా! దర్జా పోయి ‘దర్జీ’తనంలో పడడం ఏమిటి? అసలు వైనం ఏమిటి? ఏమిటిట జారుడు దైన్యం?’’ అన్నాడు రాంబాబు నవ్వుతూ.




‘‘అబ్బే! కాంగ్రెస్ పార్టీ జారిపోతున్న ‘పట్టు’ గురించే వైనం! కట్టు బిగియాల్సిన అవసరం పెరిగింది. అందుకే ఒక వంక ప్రభుత్వంలో, ఒక వంక పార్టీలో బొందు రెండంచులూ ముడికి అనుకూలంగా వుండాలి. ఏ అంచు అందకపోయినా, లోనికి అందకుండా వెళ్లిపోయినా, ‘పటిష్టత’ కుదిరే పని కాదు మరి! అందుకు సోనియమ్మ ‘కామరాజ్ నాడార్ పథకం’ అనే ‘నాడా’ గురించి ఆలోచిస్తోందట! 2014 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ మనుగడకే పెద్ద పరీక్షగా మారబోతున్నాయి అన్న అవగాహన వచ్చింది. అదీకాక ‘రాహుల్’ని ప్రధాని పీఠంపై చూసుకోవాలన్న ఆశ ఆ తల్లికి వుండడంలో తప్పులేదు కదా! యువ ‘లీడర్’కు తగిన ‘క్యాడర్’ తోడుండాలి. వృద్ధ నాయకుల వ్యవహారసరళితో ఆయన ఎలాగూ నెగ్గుకు రాలేడు. అంచేత- ముసలీ, ముతకా నేతల అనుభవాలను పార్టీ పటిష్టతకు మలుచుకుని, ప్రభుత్వం ఏలుబడికి యువరక్తం తేవాలని ఆవిడ తపన’’ అన్నాడు ప్రసాదు.
‘2014 సంగతి సరే! ఇపుడు మన రాష్ట్రంలోనే పద్ధెనిమిది అసెంబ్లీ స్థానాలకు, ఓ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికల సమరభేరి మోగుతోంది. జూన్‌లో జరిగే ఆ ఎన్నికల్లో ముందు కాంగ్రెస్‌కు సీట్లు దక్కించి, మింగుడుపడాలికదా!’’ అన్నాడు సన్యాసి.




‘‘జగన్ వర్గీయులపై అనర్హత వేటువల్ల ఖాళీ అయిన సీట్లే’’ ప్రధానంగా అవి. మన రాష్ట్ర ప్రజలు ఎలాంటి వారంటే ‘‘పాపం ఎవరి సీట్లలో వారుండనీ! 2014లో మార్పు సంగతి చూసుకుందాం’’ అనుకోవచ్చు. మొన్న తె.రా.స. వారికి వారి రాజీనామాలవల్ల ఏర్పడిన ఖాళీల్లో వచ్చిన ఎన్నికల్లో, మళ్లీ భారీగా వారివి వారికిచ్చేసారుకదా! ఇప్పుడు ‘జగన్మోహన్’కూ ఆ పని చేయవచ్చు. కానీ అందువల్ల జగన్ ప్రజలు మావైపే వున్నారనుకుంటే సరికాకపోవచ్చు. ‘ఉపఎన్నికలు రిఫరెండం’ కాదు అని కొందరంటున్న మాటలో - వాస్తవం లేకపోలేదు. ఓటర్లు చాలా తెలివైనవాళ్లు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో పెద్ద మార్పును సూచిస్తారనుకోలేం. ఒకవేళ అలాంటి మార్పు ఏదైనా కనబడినా- అది శాశ్వతం అనుకోవడం అసలు కుదరదు. 2014లో జరిగిన ఎన్నికల్లోనే- పార్టీల అసలు ‘పస’లు బయటపడేది! ఉప ఎన్నికలు కంటితుడుపు చర్యలుగానే నిలిచే ప్రమాదం వుంది. జగన్ అక్రమాస్తుల కథలూ, సిబిఐ ఎంక్వయిరీ కథలూ ఎన్ని తెరమీదకు వచ్చినా- వైఎస్సార్ అభిమానులు ‘జగన్’ అభిమానులుగానే కొనసాగే వీలేమీ సమసిపోలేదు. ఒకవేళ జగన్ ‘వైఎస్సార్ కాంగ్రెస్’ అన్ని సీట్లూ తిరిగి గెల్చుకున్నా- అందువల్ల అతగాడి పార్టీకి ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్ వాటిని కోల్పోయినా, 

వాటిల్లోవి కైవసం చేసుకున్నా, కొంత ‘ధీమా’ ఏర్పడవచ్చేమోగానీ, జనంవారి వెంటనే వుండి 2014లో అధికారం కట్టబెట్టేస్తారని కలలు కనడం కానిపనే అవుతుంది! తెలుగుదేశం వైపు జనం గాలి మళ్లుతోందన్న సూచన లేవయినా ఈ ఉప ఎన్నికల్లో కనబడతాయా అని ఆశిస్తున్నవారున్నారు. నిజంగా భాజపాగానీ, వామపక్షాలుగానీ- జగన్ వర్గీయులవల్ల ఏర్పడిన ఈ ఖాళీల్లో కొంతయినా ‘కుదురుకోగలిగితే’ గొప్పే అవుతుంది. ఉప ఎన్నికల ఫలితాలు తప్పక ఆసక్తిదాయకమైనవే! కానీ అవి 2014 ఎన్నికల సూచికలుగా వుంటాయని మాత్రం నిర్థారించలేమని నా భావన. ఒక్కటి మాత్రం నిజం! అన్ని పార్టీల ప్రతిష్ఠలూ జారిపోతున్న ‘లాగు’లుగానే వున్నాయి. లాగు పైకి లాక్కుంటున్నామనుకుంటున్నా- ముడి విప్పుకుని మళ్లీ బిగించి కట్టుకోనిదే, జారిపోవడాలు జరుగుతూనే వుంటాయి. అసలు ‘లాగే’ చిరిగిపోతే- వట్టి బొందు బిగించి కట్టుకున్నా లాభం ఏముంది? ‘ఉడుపు’ను మార్చుకోవాలంటే కొత్తగా రెడీమేడ్‌ది వుండి సరిపోతే అమర్చుకోవాలి. లేదూ కొలతల ప్రకారం నేర్పరియైన వారిచేత కుట్టించుకోవాలి. వస్తధ్రారణ తప్పదు. యుద్ధానికి వస్తధ్రారణతోబాటు అస్తధ్రారణ తప్పదు. అంచేత పార్టీల ప్రక్షాళనలు జరిగితే తప్ప, భవిష్యత్ ప్రభుత్వపాలనల మీద జన నిర్ణయాన్ని ‘ఒడుపు’గా అందుకోవడం కష్టం! అందాకా ‘‘ఇక్కడ అంతా లూజే!’’ అంటూ లేచాడు సుందరయ్య.

0 comments: