తెలుగు చాలా సంపద్వంతమైన భాష అనడానికి ఒక పదానికి అనేక పర్యాయపదాలు వుండడమే గొప్ప నిదర్శనం.
భాష మీద పట్టు సాధించాలంటే, వాడిన పదం మళ్లీ వాడకుండా ఒక అంశం గురించి వివరించాలంటే పర్యాయ పదాలు గొప్పగా దోహదపడతాయి. అయితే ఒకే అర్థం ఇచ్చే పదమే అయినా సమయం, సందర్భం బట్టి ఆ పద ప్రయోగం చేయడంలోనే ప్రసంగకర్త మాటకారితనం, రచయిత అభివ్యక్తి విన్నాణం దాగి వుంటాయి.
మగవాడు, పురుషుడు, మనుష్యుడు అని మగవాడికి పర్యాయపదాలు వుండడంతో పోలిస్తే భాషలో స్త్రీ కి వున్న పర్యాయ పదాలు చూస్తే అనేకంగా కనిపిస్తాయి.
స్త్రీ అనే అర్థంలో అంగన, అంచయాన, అంబుజలోచన, అంబుజవదన, అంబుజాక్షి, అంబుజానన, అంబురుహాక్షి, అక్క, అతివ, అన్ను, అన్నువ, అన్నువు, అబల, అబ్జనయన, అబ్జముఖి, అలరుబోడి, అలివేణి, ఆడది, ఆడకూతురు, ఇంతి, ఇందీవరాక్షి, ఇందునిభ్యాస, ఇందుముఖి, ఇందువదన, ఇగురుబోడి, ఇభయాన, ఉగ్మలి, ఉవిద, ఉజ్జ్వలాంగి, ఎలనాగ, ఏతుల, కంజముఖి, కంబుకంఠి, కనకాంగి, కమలాక్షి, కలకంఠి, కలశస్తని, కలికి, కాంత, కువలయాక్షి, కేశిని, కొమ్మ, కోమలి, కోమలాంగి, చంద్రముఖి, చంద్రవదన, చక్కనమ్మ, చాన, చామ, చారులోచన, చిగురుబోడి, చిలుకలకొలికి, చెలువ, చేడె, తన్వంగి, తన్వి, తమ్మికంటి, తరళేక్షణ, తరుణి, తలిరుబోడి, తలోదరి, తొయ్యలి, తోయజాక్షి, దుండి, ననబోడి, నళినాక్షి, నవలా, నాతి, నారి, నీరజాక్షి, నీలవేణి, నెలత, నెలతుక, పంకజాక్షి, పడతి, పడతుక, పల్లవాధర, పాటలగంధి, పుత్తడిబొమ్మ, పూబోడి, పైదలి, పొలతుక, ప్రమద, ప్రియ, బింబాధర, బింబోష్టి, బోటి, భామ, మగువ, మహిళ, మదిరాక్షి, మానిని, మానవతి, ముగుద, ముదిత, ముద్దుగొమ్మ, మెలత, యోష, రమణి, రూపసి, లతాంగి, లలన, లేమ, వనిత, వలజ, వారిజనేత్రి, వాల్గంటి, విరబోడి, విశాలాక్షి, వెలది, శంపాంగి, శాతోదరి, సుందరి, సుగాత్రి, సుదతి, సునయన, హంసయాన, హరిణలోచన, ఓహ్!... ఎన్నో వదిలేసానుగానీ ఇలా స్త్రీకి పర్యాయ పదాలు అపారంగా వున్నాయి.
అంతెందుకు... వట్టి బాలిక అన్న పదానికే అమ్మాయి, అమ్మి, కన్య, కన్యక, కుమారి, కొంజిక, కొండుక, కొమారి, చిన్నది, చిఱుతుక, ధీత, ధీద, నగ్నిక, నివర, పసిగాపు, పాప, పిన్నపాప, పిల్ల, పీపరి, పోఱి, బాల, గుంట, బాలిక, బాలకి, రోహిణి, వాసువు అనే పర్యాయపదాలున్నాయి.
మూడేండ్ల బాలికను త్య్రబ్ద అని ప్రత్యేకంగా ప్రయోగించే పదం వుంది.
యువతికి ఎలనాగ, కాహళి, కొమరు, చామచిరంటి, జవరాలు, జవ్వని, తరుణి, ధని, పడుచు అనీ, వృద్ధురాలుకు జరతి, ఏలిక్ని, మందాకిని, ముదుసలి, ముద్ది, వృద్ధ, అవ్వ వంటి పదాలున్నాయి.
అయితే ఏ పదం ఏ సందర్భంలో ఎలా ఔచితీమంతంగా, అర్థవంతంగా ప్రయోగించి మాటాడాలో, రాయాలో తెలుసుకోవాలి. ఒక బిడ్డను మాత్రమే కన్న స్త్రీని కదళీవంధ్య అనీ, ఇద్దరు బిడ్డలు మాత్రమే కన్న స్త్రీని కాకవంధ్య అనీ ఒకప్పుడు అనేవారు.
దూషిత, హత అంటే కన్యాత్వము చెడినది అనీ, భర్త, పిల్లలు గతించిన స్త్రీని నిర్వీర అనీ, మారుమనువాడిన స్త్రీని పునర్భువు అనీ పిల్లలు కలగని స్త్రీని గొడ్రాలు, అప్రజాత, అశశ్వి, గొడ్డురాలు, బందకి, వంజ, వంధ్య, వృషలి, శూన్య అనీ, గర్భవతియైన స్త్రీని అంతరాపత్య, అంతర్గర్భ, ఉదరిణి, గర్భిణి, చూలాలు, దౌహృదిని, నిండు మనిషి, భ్రూణ, సనత్త్వ, సూష్యతి, వ్రేకటిమనిషి అని పేర్కొనడం వుంది.
అలాగే బాలెంతరాలు అయిన స్త్రీని జాతాపత్య, నవప్రసూత, పురుటాలు, పురుటియాలు, ప్రజాత, ప్రసూత, ప్రసూతిక, బాలెంత, బిడ్డతల్లి, సూతక, సూతి అని పేర్కొంటారు.
ఇలా స్త్రీకి వివిధ దశల్లో కూడా పేర్కొనబడే అర్థసూచక పదాలు అనేకం వున్నాయి. ఆత్రేయి, ఉదక్య, ఏకవస్త్ర, త్రిరాత్ర, నెలబాల,స్త్రీ ధర్మిణి అంటూ ఋతుమతి అయిన స్త్రీకి పర్యాయపదాలున్నాయి.
పర్యాయపదాలు గురించి చెప్పడానికి వాచవిగా తీసుకున్నదే ఇది. ఒక స్త్రీకే తెలుగు భాషలో ఇన్ని పర్యాయ పదాలు వ్యవహారంలోకి వచ్చాయంటే మన భాష ఎంత సంపద్వంతమో తెలియడంలేదా? పర్యాయపదాలు అని చెప్పుకుంటున్నాం కదా ..అసలు ఈ పర్యాయము అన్న పదానికే తడవ, అనుకల్పము, ఆవర్తి, ఆవృత్తి, తూరి, దఫా, పరి, పరువడి, పారి, పూపు, మఱి, మాటు, మాఱు, మొగి, రువ్వము, రువ్వు, విడుత, సారి అనే పర్యాయ పదాలున్నాయి తెలుసా!
నిజానికి పర్యాయ పదాలకు ఒక నిఘంటువే పూర్తిగా రూపొంది వుంది. ఆచార్య జి.ఎన్.రెడ్డిగారు పర్యాయ పద నిఘంటు నిర్మాణం ఒకటి చేసి ముఖ్యంగా యువతకు అందుబాటులోకి తెచ్చారు.
సమానార్థకాలుగా గానీ, సన్నిహితార్థాలుగా గానీ వుంటూ ,రూపభేదంతో ఉండేవి పర్యాయ పదాలు. సమానార్థకాలైనందువల్లనే కాకుండా అర్థచ్ఛాయల్లో ఉండే సూక్ష్మతర భేదాల్ని తెలుపడానికి కూడా ఈ పదాలు ఉపయుక్తంగా వుంటాయి. పూర్తి సమానార్థకాలు కొన్నయితే ,పాక్షిక సమానార్థాలుగా కొన్ని వుంటాయి.
ఈ పర్యాయ పదాలనేవి అభివ్యక్తి సామర్థ్యాన్ని బట్టి మాటల్లో, రచనల్లో వీటిని ఉపయుక్తం చేసి సొబగు చూపుకోవలసింది మనమే. ఏమంటారు.
7 comments:
పర్యాయ పద నిఘంటువు ని గూర్చి తెలిపారు. థాంక్స్. 'స్త్రీ' కి ఉన్న పర్యాయపదాలు అన్నీ తీసిపెట్టుకున్నాను - మరొక మారు ధన్యవాదాలు.
మీ ఆదరణకు కృతజ్ఞతలు ఉష గారూ!
వారంవారం చదివి మీ అభిప్రాయాలు తెలియచేస్తున్నందుకు చాలా సంతోషం.
STREE KI UNNA PARYAYA PADAALALO NENU VINANIVI:UGMALI,ETULA,CHEDE, TOYYALI,DUNDI,YOSHA.
DHANYAVADALU
పర్యాయపదాల నిఘంటువు గూగుల్లో లభ్యమగునా ! తెలుపగలరు.అసలలాంటి నిఘంటువు ఉన్నట్లు మీవల్లే తెలిసింది సుమండీ!
A.Hymavathy
పర్యాయపదాల నిఘంటువు గూగుల్లో లభ్యమగునా ! తెలుపగలరు.అసలలాంటి నిఘంటువు ఉన్నట్లు మీవల్లే తెలిసింది సుమండీ!
A.Hymavathy
Post a Comment