ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, March 25, 2012

కళ్లెదుట తెలంగాణా బతుకు చిత్రాలు





విశాలాంధ్ర ఏర్పాటు, పెద్దమనుషుల ఒప్పందంలో ‘ముల్కి’ ముఖ్య భూమికయింది. దీనిలోని అయిదంశాలు నౌకరీ నియామకాలకు సంబంధించినవి కాగా, మూడోది, ఏడోది స్థానికత గురించి చర్చించిందే!

ఈ ప్రాంతంలో ఉద్యోగ నియామకంకోసం, తెలంగాణలో పన్నెండేండ్లు స్థానికుడై వుండాలనే రూలొచ్చింది. రాజ్యాంగంలోని 309 అధికరణం కింద-813 జీవో జారీ అయినా, ఆ నిబంధనలకు విరుద్ధంగా 22వేల మంది తెలంగాణేతరులు ప్రభుత్వోద్యోగాలు పొందారు.

1969 ఆందోళన అప్పుడు- జీ.వో.36 జారీచేసి, స్థానికేతరుల్ని తొలగించి, తెలంగాణా వారితో భర్తీచేస్తామంది ప్రభుత్వం. 1972లో తెలంగాణేతర ఉద్యోగులు హైకోర్టులో ముల్కి నిబంధనలు సక్రమేనని తీర్పుఇచ్చినా, జీవో 36 అమలు పునరుద్ధరింపబడలేదు.

ఆరు సూత్రాల పథకం ప్రకారం ‘ముల్కి’కి వున్న పాత నిర్వచనం పోయి, ‘జోన్’ల స్థానికత రంగం మీదకి వచ్చింది. ఆంధ్రలో మూడు, తెలంగాణలో రెండు, రాయలసీమలో ఒకటి ‘జోన్లు’ ఏర్పడి ముల్కిలను జోన్లు మింగేసాయి. జోన్లవారీగా స్థానిక రిజర్వేషన్లూ అమలు జరగలేదు.

1985లో- ‘610 జీవో’ జారీ అయింది. అయినా అమలులో అంతా అన్యాయమే!

- ఈ నేపథ్యాన్ని వివరిస్తూ, వేముల ఎల్లయ్య తెలంగాణ గుండె చప్పుడుగా వెలువరించిన కవిత్వం ‘ముల్కి’.

నలభై ఒక్క కవితల ఆ సంకలనంలోని ప్రతి కవితా తెలంగాణ బ్రతుకు చిత్రాలను కళ్ళముందు దృశ్యీకరించేదిగా వుంది. తెలంగాణ పలుకుబడులు, స్థానికతా పరీమళం, ఒక వంక ఆర్తి, మరో వంక స్ఫూర్తి దట్టించిన భావాలివి.

‘తోలై లేస్తున్న భూమి’ గురించీ, ‘కుల సముద్రం’గురించీ, ‘సింగడి తీగ’ గురించీ, ‘ఎట్టి తల్లి’ గురించీ, ‘మాతంగి’ గురించీ, తెలంగాణా జీవద్భాషలో పలికిన కవితలివి.

వివిధ వృత్తి జీవిత ఖేదాలూ, అణచివేత వాదాలూ ఎలా వుంటున్నాయో ప్రతిబింబింపచేసారు. తెలంగాణేతరులకు ఈ కవిత్వ భాష అర్థంకావడం కూడా అంత సులభం కాదు. సంకలనం 70వ పేజీలో కవి తన ‘పత్త’ గురించి వివరించిన వైనం విలక్షణంగా వుంది.

కంకెడు ముద్దకోసం
కట్టాన్ని నెమరేస్తాం
తడి గుడ్డతో అద్దడం మాకొద్దు
మా నాలికతో మేమే గతుక్కుంటాం బతుకుని
మా పాలు పంపకానికి
మక్కిన మాయిముంతలు
పక్కున పగుల జీరుతున్నాయి ఈ భూమిని


అంటాడు వేముల ఎల్లయ్య.

‘గుంపు’ సాహితీ సంస్థ వెలువరించిన ఈ సంకలనం ‘తెలంగాణ గుండె గుంపు’లో నిలిచేది!

- సుధామ

ముల్కి (కవిత్వం)
- వేముల ఎల్లయ్య-
గుంపు సాహితీ సంస్థ ప్రచురణ, మున్సిపల్ లేబర్ కాలనీ,
సంజయ్‌గాంధీనగర్ కాలనీ, పానగల్ రోడ్,
నల్లగొండ- 508001;
వెల: రూ.20/-


(ఆంధ్రభూమి దినపత్రిక 'అక్షర ' 25.3.2012)

2 comments:

gata said...

Maku Telangana mandalikam teliyadanadam ubhayulaku gauravapradam kadu.Nenu anni mandalikalloni rachanulu chadvutanu.Migita mandalikalanni miku arthamaitayanna bhavana mi vakkulo vyanjitam.

gata said...

Bhsha anedi mandalikala samaharame!Aa mandalikalu parasparava bodhamule!Telagana mandalikam artham kadante adi vere bhashaku chendinadane mi abhiprayama?Telangana bhasha oka swatantra bhasha ani bayalu derina vadaniki mi mata balanni istunnadi.