ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, March 30, 2012

ఏమి ‘సేతు’రా!







''ప్రపంచ దేశాలకు ‘నాగరికత’ అంటే అంతగా తెలియని కాలంలోనే, సముద్రం మీద ‘వారధి’ కట్టిన-రాముడు, భారతీయులకు అందుకే ఆరాధ్య దైవం అయ్యాడు! రామాయణంలోని ప్రత్యంశమూ-అపూర్వమూ, అద్భుతమే! ‘రామసేతువు’ మానవ నిర్మితం కాదనీ, సముద్ర గర్భంలో సహజంగా ఏర్పడిన శిలా సమూహమనీ అనుకున్నా, సునామీలాంటి అనేక విపత్తులనుండి రక్షణ కవచంగా-కోటగోడలా ఉందని భౌగోళిక శాస్తవ్రేత్తలే అంగీకరిస్తున్నారు.

1480 వరకూ కూడా రామసేతు వంతెన శ్రీలంక వెళ్లడానికి ఉపయోగపడేది. అయితే ప్రకృతి బీభత్సాల వల్లే కొంత మునిగిపోయింది. శ్రీలంక వాళ్లే రామాయణం గుర్తులుగా చెరిగిపోకుండా కాపాడాలనుకుంటూంటే, దాన్ని కూల్చివేసి, లంకకు పడవలు ప్రయాణించేందుకు వీలుగా- 2,240 కోట్లతో మరో జలమార్గం ఏర్పాటు చేయడానికి ‘సేతు సముద్రం ప్రాజెక్ట్’ను తమిళనాడు ప్రభుత్వం 2005లోనే తలపెట్టింది. కానీ దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసాలతో ముడివడినందువల్ల-కనీసం హెరిటేజ్ సంపదగానైనా గుర్తించి, ‘రామసేతువు’ కూలగొట్టవద్దని అంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు పడ్డాయి.

కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో కరుణానిధికి ‘తందానతాన’ అంది. ఇప్పుడు మళ్లీ ‘రామసేతు ప్రాచీన కట్టడమేనా?’ అన్న వివాదం తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంపై అభిప్రాయం చెప్పమని సుప్రీం ఆదేశించింది. చూసారా!’’ అన్నాడు సుందరయ్య పేపర్ మడిచి టేబుల్ మీద పెడుతూ.

‘‘శత్రురాజ్యంమీద దండెత్తేవాడెవడయినా రహస్యమార్గమే అన్వేషిస్తాడు.
రాముడు వారధి కడుతున్నాడని తెలిస్తే రావణాసురుడు అది కూలగొట్టడానికి కూడా తన సేనను ప్రయుక్తు చేసేవాడే కదా! అందువల్ల నిజంగానే సముద్రగర్భంలో ‘సహజ శిలా సమూహం’ అనిపించేలాగానే-రాముడు సముద్రంమీద సేతువు నిర్మించాడంటే-నిజంగా గొప్ప ఇంజనీరే! రావణ సేనకు తెలియకుండానే సముద్రంమీద ‘వారధి’ నిర్మాణం జరిగిందని భావించాలి. భారతీదర్శన్ యూనివర్సిటీ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - ‘రామసేతువు’ చారిత్రక కట్టడమేనని, మానవ నిర్మితమేనని పేర్కొంది. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి నిర్మాణం ప్రకృతి సిద్ధంగా ఏర్పడడం అసంభవం అనే పేర్కొంది. సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మించాలన్నా రామసేతువున్న స్థలమే దొరికిందా? అది కూలగొట్టకుండా వేరుగా నిర్మించలేరా? డిఎంకె అధినేత కరుణానిధి రాముడి గురించి కోట్లాదిమందికి ఉన్న విశ్వాసాలను అవహేళన చేస్తూ- ‘‘రాముడు ఇంజనీరా! ఏ యూనివర్సిటీలో చదివాడు?’’ అంటూ రెచ్చిపోవడం కూడా జనానికి గుర్తుంది’’ అన్నాడు రాంబాబు కొంచెం ఆవేశంగా.

‘‘రాముడు వానరులతో దానిని నిర్మింపచేశాడు అంటారు కదా! సుగ్రీవుడితో స్నేహం చేసాడనీ, ఆంజనేయుడిని ప్రియ శిష్యుడిగా స్వీకరించాడనీ అంటారు కదా!- మరి వారి మధ్య భాష అడ్డు కాలేదా? వానర భాష రాముడికీ, లక్ష్మణుడికీ తెలుసా? పోనీ వారిద్దరికీ తెలుసుననుకున్నా-అశోకవనంలో సీతతో కూడా హనుమ సంభాషించాడు కదా! సీతకు ఆ భాష తెలుసా? అని నాకు అనుమానం వస్తూంటుంది’’ అన్నాడు ప్రసాదు.


‘‘ తెలుగు వాళ్లెందరో అమెరికాలో ఉన్నారు. తెలుగే ఏమిటి? వివిధ భాషల భారతీయులూ, చైనా, జపాన్ వంటి ఇతర దేశస్తులూ ఉన్నారు. ఒక ‘అనుసంధాన భాష’ ఇవాళ ఇంగ్లీషు లాగా-ఆనాడూ ఉండే ఉంటుంది. మానవుడు కోతినుంచే పరిణామం చెందాడని డార్విన్ సిద్ధాంతం కూడా చెబుతోంది కదా! రాముడికి యుద్ధంలో అయోధ్య సేన ఏమీ తోడు కాలేదు. వానరసేనయే ప్రధానంగా ఉంది. అంటే రాముడు సుగ్రీవునితోబాటుగా వానర సేనను నియంత్రించి, యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా పని చేయించుకునే నాయకత్వం కలవాడుగా ఉన్నట్లే కదా! బహుశా ఏ ‘సంస్కృతమో’ నరులకూ, వానరులకూ కూడా తెలిసే అనుసంధాన భాషగా నాడు ఉండినదేమో! అసలు ‘సంస్కతము’ అంటేనే- ‘సంస్కరింపబడినది’ అని కదా! అదీ కాక ‘మూల ద్రవిడ’ భాషలు అనేవి ఉండేవనీ, సంస్కృతంనుంచి కాక తెలుగు వంటి దక్షిణాది భాషలన్నీ అందులోంచే వచ్చాయనీ నేటి భాషా శాస్తవ్రేత్తలు అంగీకరిస్తున్నారు కదా! అప్పటి వానరసేన కూడా మానవ దశకు ఎదిగిన తెగ అయ్యుంటుంది. కేవలం ‘కోతి’ అని ‘హనుమంతుడిని’ ఆయన వర్తనను చూసయినా అనుకోలేం కదా’’ అన్నాడు సుందరయ్య.


‘‘విశ్వాసం వేరు హేతువు వేరు అనే అనుకుంటాం గానీ, విశ్వాసం ఏర్పడడానికి కూడా ఒక హేతువు ఉంటుందని మరిచిపోకూడదు. ‘గాంధీ వంటి ఒక మనిషి ఈ భూమి మీద సంచరించాడా అని భావి తరాలవారు భావించినా ఆశ్చర్యపోనవసరం లేద’ని నాటి బ్రిటిష్ వారే అన్నారు. మహనీయులకు విగ్రహాలు నెలకొల్పడం, విగ్రహారాధన చేయడం మనకు కొత్త ఏమీ కాదు! మాయావతి-బ్రతికుండగానే తన విగ్రహాలు నెలకొల్పుకుంది! సీతారాముల విగ్రహాలతో రామాలయాలు దేశంలో లక్షలాదిగా ఉన్నాయి జన జీవన మమేకమైన ‘రామాయణ గాథ’ చెరిపివేయగలిగేది కాదు! ‘రామసేతు’ కూల్చేసినంత మాత్రాన- రాముడు వారధి నిర్మించాడన్న విశ్వాసం కూలిపోదు. వైఎస్సార్‌దో, అంబేద్కర్‌దో విగ్రహానికి అపచారం ఏదో జరిగిందంటేనే-జీర్ణించుకోలేక, అభిమానులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు! అలాంటిది రాముడే స్వయంగా నిర్మింపచేసిందన్న విశ్వాసం గల ‘రామసేతువు’ను కూలగొట్టి, సేతు నిర్మాణం చేయడమెందుకు? గోదావరి మీద రెండు మూడు బ్రిడ్జిలు ఉన్నట్లుగానే... ఆ దిశగానే ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు కదా? ‘ఏమి సేతురా?’ అంటూ దీన్ని రాద్ధాంతం చేయడమెందుకు?’’ అంటూ లేచాడు రాంబాబు.


29/03/2012

0 comments: