ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, March 24, 2012

‘రూఢివాచకా’ల మెరుగులు


‘రూఢివాచకాలు'

రూఢి వాచకం అనేది భాషలోని మరో సొగసు.

ఒక పదానికి వాస్తవానికి వుండే అర్థం ఒకటి అయితే జనవ్యవహారంలో మరో అర్థానికి రూఢిగా వాడబడుతూండడమే ఈ విశేషం.
కాలక్రమేణా అర్థవిపర్యయం చెందేవి కొన్ని వుంటాయి. కానీ ఏ కాలానికయినా ఒక అర్థంలో రూఢిగా నిలిచేవి మరికొన్ని వుంటాయి.

అధ్వాన్నం అనే మాటను మనం ఇవాళ పనికిరానిది, బాగులేనిది, చెత్తగా వుంది అనే అర్థంలో వ్యవహరిస్తున్నాం. కానీ అధ్వము అంటే మార్గము. నిజానికి మార్గమధ్యంలో తినే అన్నం అధ్వాన్నం. మునుపు ఒక ఊరునుంచి మరో ఊరు ప్రయాణిస్తూ దారిలో తినడానికి మూట కట్టుకువెళ్ళేవారు. అది అధ్వాన్నం. కానీ ఇవాళ ఆ పదం యొక్క రూఢి వేరు.

రూఢివాచక శబ్దాలలో పురుష, స్త్రీ, వస్తు, జంతు రూఢివాచక పదాలు అనేకం వున్నాయి.

ఏ పేరూ లేనివాడిని ‘అగస్త్యభ్రాత’ అంటాం. అగస్త్యుడి సోదరుడి పేరు తెలియదు కనుక అలా రూఢి అయింది. అలాగే వాడొక ‘కుంభకర్ణుడు’ అంటాం. కుంభకర్ణుడు రావణుడి సోదరుడు. ఆరునెలలు నిద్రపోతే లేవగానే ఆకలి అంటాడు. అంచేత నిద్రముచ్చుకు కుంభకర్ణుడు అనే పదం రూఢి వాచక శబ్దమయింది. అలాగే '‘వాడు నక్షత్రకుడు’ అనుకో' అన్న వ్యవహార వాక్యంలో నక్షత్రకుడు అంటే పట్టువిడువక వెంటబడేవాడు అని. అప్పు వసూలు చేయడానికి హరిశ్చంద్రుని వెంటబడిన నక్షత్రకుడు జన వ్యవహార భాషలో అలా రూఢి శబ్దమయ్యాడు. అలాగే తిండిపోతుని ‘బకాసురుడు’ అంటాం. ఇలా పురాణాల నుంచి రూఢివాచక శబ్దాలు గ్రహించడం జరిగింది.

కానీ ఆధునిక కాలంలోనూ రూఢివాచక నామాలు ప్రముఖుల పేర్లనుండి జన వ్యవహార భాషలో ప్రత్యేకార్థంలో స్థిరమవుతూనే వున్నాయి. ‘సూర్యకాంతం’ అనే పదం గయ్యాళి అన్నదానికి రూఢి వాచకం అయింది. తెలుగు సినిమాల్లో సూర్యకాంతం ప్రభావం అలా ఎదిగి భాషలోకి వచ్చింది. ‘అంతులే’ అంటే, అంతులేని అవినీతికి స్థిరమైంది. అలాగే గొప్పగా పాడే లక్షణ వ్యవహారానికి ‘ఘంటసాల’ పేరూ నేడు భాషావ్యవహారంలో ఓ రూఢివాచకమయిందనవచ్చు.


పురాణాలలోనివి ఎన్నో పాత్రలు విశాల జన ప్రపంచం పరిధిలోనివి కనుక ఆ వాచక శబ్దాలు భాషలో ప్రత్యేకార్థంలో రూఢిగా ప్రయుక్తమవుతూంటాయి. గొప్ప బలశాలిని 'భీముడు’ అనీ, కపటిని, దుష్టుడినీ ‘శకుని’ అనీ అర్జునుడికి గల ‘సవ్యసాచి’ అనే పదాన్ని రెండు చేతులతో పనిచేయగల సమర్థుడనే అర్థంలోనూ.. ప్రయుక్తం చేయడం జరుగుతోంది. గురువు లేకనే కేవలం ఒకరిని లక్ష్యంగా గౌరవప్రదంగా పెట్టుకుని విద్యనభ్యసించేవాడిని ‘ఏకలవ్యుడు’ అంటాం.

అలాగే స్త్రీ రూఢి వాచక శబ్దాల విషయానికి వస్తే గొప్ప అందగత్తెను ‘రంభ’ అంటాం. ఆమె ఇంద్రసభలోని నాట్యకత్తె. ఉగ్రురాలు, కోపస్వభావిని అయిన స్త్రీని ‘భద్రకాళి’ అంటాం. తంత్రముగల దుష్టబుద్ధి స్త్రీని ‘మంథర’గా వ్యవహరిస్తాం. జానపద నాయిక అనగానే ‘ఎంకి’ అంటాం. ఆ ‘ఎంకి’ని అలా రూఢివాచక శబ్దం చేసిన ఘనత కవి నండూరి సుబ్బారావుగారిదే. అలాగే చుప్పనాతి బుద్ధిగల దుష్టురాలుకు రూఢి వాచక పదం ‘శూర్పణఖ’. తృప్తిగా అన్నం పెట్టే స్త్రీని ‘అన్నపూర్ణ’ అని భాషలో వ్యవహరించుతూ వుంటాం.
ఇక వస్తుగత రూఢివాచక శబ్దాలూ వున్నాయి మిక్కిలి యోగ్యతను ‘బంగారం’ అనీ, దృఢ సంకల్పాన్ని ‘ఉక్కు’ అనీ భాషలో పదప్రయోగం చేసినట్లే ఏమీ చేయని వాడిని ‘చట్రాయి’ అనీ, భారంగా పరిణమించినవాడిని ‘గుదిబండ’ అనీ వ్యవహరిస్తాం.

కష్టాలు కలిగే తావుని ‘నరకం’ అనీ ,సుఖప్రదేశాలను ‘స్వర్గం’ అనీ రూఢిగా పేర్కొంటాం. ప్రతిబంధకాలయిన వాటిని ‘సంకెళ్ళుగా మారాయి’ అంటాం. ముత్యం, రత్నం, వజ్రం, మణి ఇవన్ని వ్యక్తుల యోగ్యతకు ప్రయుక్తం చేస్తూండే రూఢివాచక శబ్దాలే. కోర్కెలు తీర్చే స్వభావం వున్న వితరణిశీలిని ‘కల్పవృక్షం’గా ‘కామధేనువు’గా పలుకుతాం.

ఇలాగే మానవ స్వభావంలోని వివిధ పార్శ్వాల, గుణాల ఉటంకింపునకు భాషలో వ్యవహరించే రూఢివాచక పదాలు అనేకం జంతు సంబంధులుగానూ ఉన్నాయి. పట్టుగలవాడిని ఉడుము అని, ఎలుగుబంటి అనీ, పంచతంత్రంలోని జంతు పాత్రలైన నక్కలని జిత్తులమారి అతి తంత్రము గలవారికి రూఢిగా ‘కరటకదమనకులు’గా ప్రయుక్తం చేస్తారు.

తెలివితక్కువవాడు ‘పశువు’గానే రూఢి. గొప్ప ధైర్యశాలిని సింహం, పులితోనూ, అమాయకుడిని ‘పిల్లి’పదంతోనూ, లోన సత్తా లేక, పైకి గాంభీర్య ప్రదర్శన చేసేవారిని ‘మేకపోతు’ అని, కొంటె పనులు చేసేవాడిని ‘కోతి’ అనీ, పీడించే స్వభావం కలవాడిని ‘జలగ’ అనీ, సాధుస్వభావినీ, పూజనీయుడినీ ‘గోవు’ అనీ, హానిచేసేవాడిని ‘పాము’ అనీ, ‘తేలు’ అనీ రూఢివాచక శబ్దాలతో వ్యవహారభాషలో ప్రయుక్తం చేస్తూంటాం.

ఇవన్నీ ఉదాహరణకు వాచవిగా ఎంపిక చేసి చెప్పిన రూఢి వాచక శబ్దాలే గానీ భాషా సౌందర్యం పరికించినపుడు ఇలాంటి అనేకం ఎవరికి వారు పట్టుకోవచ్చు. రూఢివాచక శబ్దాలుగా ఇలా భాషలో మానవ జీవన ప్రకృతి సంబంధులుగా వినియోగించే అర్థవంతమైన అద్భుత పద సంపద, ఆ వ్యవహారం, భాషలోని సొగసు. కాదంటారా!


-సుధామ
నుడి
(24.3.2012-శనివారం)

3 comments:

Mantha Bhanumathi said...

చాలా బాగుందండీ సుధామగారూ.
ఎప్పట్నుంచో రూఢిగా తెలిసిన పదాలే అయినా, అవన్నిటినీ విరివిగా వాడుతున్నా.. రూఢిపదాలు అనే మాటని చాలా రోజుల తరువాత గుర్తుకు తెచ్చారు.
ధన్యవాదాలు.
మంథా భానుమతి.

మరువం ఉష said...

ప్రభంజనం (ఒక వ్యక్తి శక్తికి ప్రతీక గా), సుడిగాల్లా చుట్టేసాడు, చిటాకులా ఎగిరిపడ్డం - ఇవీ రూడీవాచకాల్లోకి వస్తాయా? మీ వ్యాసాలు నేర్చినవి వల్లెవేసుకోడానికీ, రానివి బట్టీయం వేయడానికీ చాలా బాగున్నాయండి.

శ్రీలలిత said...

మనం తరచూ వాడే పదాలని రూఢిపదాలంటారని ఇప్పుడే తెలిసింది.
మీరు చెప్పేవిషయాలు కొత్తకోణంలో దర్శనమిస్తున్నాయి. వ్యాసం ఉపయోగకరంగా వుంది.