ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, March 23, 2012

కాలగమన శుభాభి‘నందన’లుఉగాది ప్రకృతి పర్వం.

మార్పు జీవలక్షణంగా నవచైతన్యం సంతరించుకునే కాలం.
తరులతాదులు పుష్టించి, ఆమ్రవృక్షాలు ఫలించి, పచ్చని ప్రకృతి, మల్లెపూలు, మలయమారుతం, మామిడిపళ్లు, పండువెన్నెలగా దృశ్యమానమయ్యే కనువిందైన కాలం-

కోకిలల కూతలు కాలాన్ని ‘స్వరభరితం’ చేసేకాలం!
ఉగాదిని ‘యుగాది’ అని కూడా అంటాం.

నిజానికి ‘యుగం’ అంటే రెండు, జంట, మిథునం. ఇలాంటి మాట - ఒక కాలగణన సూచికగా, రూఢమైన అర్థాన్ని సంతరించుకుంది.

కొత్త సంవత్సరాన్ని మన తెలుగువారు మాత్రమే ఉగాది, యుగాది అంటున్నాం.మనిషికి నాగరికత - వ్యవసాయం, పశుపాలనతో వచ్చింది. అది బ్రతుక్కి ఒక స్థిరతనూ సమకూర్చింది. తిండికోసం వేటగాడుగా, దిమ్మరీడుగా వుండాల్సిన గతిమారాక, అతనికి ప్రకృతి, పరిసరాల పరికింపులోని శోభ, జిజ్ఞాస అనుభూతికాసాగాయి! ఆకాశం మీద చందమామ, చుక్కలు పరికించాడు. చంద్రుని పదహారుకళలు తరుగుదల, పెరుగుదలతో వ్యవసాయ పనులకు ముడివేసుకునే ఒక లెక్క మొదలెట్టాడు. అప్పట్లో వ్యవసాయ పనులు స్ర్తిల ఆధిపత్యంలోనే వుండేవి. పున్నమి, అమావాసల ఈతకోతలతో వారి శారీరక మానసిక ఉద్వేగాలుండేవి - అలా ఆకాశం మీద చంద్రగతికీ, స్ర్తిల ఋతుచక్రానికీ సమన్వయం పడింది.


‘మా’ అనే ఏకాక్షరానికి చంద్రుడని పేరు. ‘చంద్రమా’ అని సంస్కృతంలో సంబోధన! అమాస, పూర్ణిమాలలో కూడా ‘మా’ వుంది. ఆ అక్షరం నుంచే - నెలకి ‘మాసం’ అని పేరు వచ్చిందంటారు. చరిత్ర- తొలినాగరికులుగా ‘సుమేరులు’ను గుర్తించింది. ఆరువేల సంవత్సరాలకన్నా ముందే వారు నాగరికతనందుకున్నారనీ, వారి నుంచే ఈజిప్టు, బాబిలన్, గ్రీక్, రోమ్ వంటి చోట్లకు నాగరికత ప్రాకిందనీ అంటారు. మన దేశంలో - ‘హరప్పా’ నాగరికత సుమేరు నాగరికతలో భాగమేనన్న చరిత్రకారులు కొందరి వాదనా వుంది.

‘చందమామ’ మనకు పురుషుడు. కానీ ఇంగ్లీష్ వారికి స్త్రీ. బైబిలుద్వారా వారికది సంక్రమించింది. సుమేరులు, బాబిలాన్, ఆసీరియావారు చంద్రుడిని ‘సిన్’ అంటారు. అరబ్బులు, హిబ్రూలు వారి నుంచి గ్రహించారు. సిన్‌ స్త్రీ మొదట నెలను - నల్ల, వెల్ల అని రెండుగా భాగించుకున్నారు. నెల, వెల కలిసే మనకు ‘వెన్నెల’ అయిందట. ‘నెలతప్పడం’ అనే మాటా స్త్రీ కి, చంద్రునికీ సమన్వయంగా కాలగణనలో వచ్చిందే! మనం నెల, వెలలను కృష్ణ, శుక్ల పక్షాలుగా చేసుకున్నాం. ఆ పక్షాలు వారాలుగా, వారానికి ఏడురోజులుగా, నాలుగువారాలు ఒక మాసంగా కాలగణన మొదలయిందలా. ఆదికాలంలో నెలకు ఇరవై ఎనిమిది రోజులే!


నాగరికత పెరిగిన కొద్దీ గూళ్లు గూడేలు, గూడేలు నగరాలు అయి, ఒక ప్రక్క గుళ్లూ, మరో ప్రక్క కోటలూ వెలిసాయి. కోట రాజుగారు, గుడి పురోహితుడు ఇద్దరూ ప్రముఖమయ్యారు. ‘లిపి’ వచ్చి, శాస్త్రాలు పుట్టి, తొలినగరాలు, నాగరికత వచ్చిన ‘సుమేరియా’లోనే - చాంద్రమానం వల్ల భూమిమీది ఋతుచక్రం సరిపోవడం లేదని గ్రహించారు. అందుకోసం వ్యవసాయపనులకు - నదుల వరదల వంటి వ్యవహారం ఖచ్చితంగా అంచనాకు అందితేగానీ ఏర్పాట్లు సాధ్యంకాదని, భూభ్రమణక్రమాన్నీ, నక్షత్రగతులనూ, గ్రహగతులనూ లెక్కించడం అనివార్యమైంది. అందువల్ల చాంద్రమానంతోబాటు, కాలగణనకు భూభ్రమణం మీద ఆధారపడిన సౌరమానం, గ్రహగతులను చెప్పే బార్హప్యత్య, నక్షత్ర మానం కూడా గణనలోకి వచ్చాయి.

తన చుట్టూ తాను చంద్రుడు తిరిగే కాలం, భూప్రదక్షణ కాలం దాదాపు సమానమే! భూప్రదక్షణ కాలం ఇరవై ఎనిమిది అనుకుంటే సరిపోలేదు. అమావాస్య, పున్నముల మధ్య దూరం - 14 రోజుల కన్నా ఎక్కువగా వుంది. అవి రావడంలోనూ తేడాలున్నాయి. ఓ అమావాస్య పూర్తి నలుపు కాదు. ఓ పున్నమి పూర్తి తెలుపుకాదు. అలా సన్నని వెలుగు రేఖవుండే ఒక అమావాస్యకు - ‘సినీవాలి’ అని పేరు. ఈ పేరులోని ‘సిని’ సుమేరుల ‘సిని’ అంటే చంద్రుడు నుంచి వచ్చిందే. ‘కుహూ’ అంటే పూర్తి అమావాస్యట! అలాగే నిండు పున్నమి ‘రాకా’ అని పేరు. కాస్త మెతి వున్న పున్నమిని ‘అనుమతి’ అంటారట.


మన పురాణాలు చంద్రుడు, లక్ష్మి సముద్ర మథనం లోంచే పుట్టాయని, చంద్రుడిని లక్ష్మి తమ్ముడిని చేసాయి. అయినా తొలి నాగరికులైన సుమేరుల స్త్రీత్వం పూర్తిగా పోలేదు. సినీవాలి, కుహూ, అనుమతి, రాకా - అంగీరసుని కూతుళ్లని పురాణాల్లో వుంది. అమావాస్య పున్నమలు స్త్రీలైతే, చంద్రుడు పురుషుడవడం తమాషాయే మరి!

భూమి చుట్టూ చంద్ర ప్రదక్షణంతో కాక, సూర్యుని దృష్టితో చూసే గణనవల్లే - సంవత్సరానికి 365 రోజుల లెక్క సరిపోతుంది . ఖగోళాన్ని ఎంత పరిశోధించినా ఫలితాలు సామాన్యులకు అందాలనే సంకల్పంతోనే కాలగణనం ఏర్పరిచారు. అమాస, పున్నముల లెక్కన అయిదేళ్లకు కాలామానానికి ‘యుగం’ అని పేరు వచ్చిందనీ, అయిదేళ్ల తర్వాత ఇంకో యుగాది అనీ అనుకునేవారట! అయితే పురాణాల ననుసరించి మనకు అరవై సంవత్సరాలకు పేర్లున్నాయి. ఆ తర్వాత అవే పేర్లు పునరావృతమవుతాయి. అరవై సంవత్సరాల్లో పన్నెండు యుగాలన్నమాట. ఖర నామసంవత్సరం 25వది వెళ్లిపోయి, ఇప్పుడు 26వది అయిన ‘నందన’ ప్రవేశించింది. అరవై సంవత్సరాల క్రమంలో ‘నందన’ నిజంగా ఆరవ ‘యుగాది’ అన్నమాట.

ఏమయినా యుగం అన్న మాటనీ, దానికి మూలమైన సంవత్సరాన్నీ - తెలుగువాళ్లం నిలుపుకుని, కాలగణనలో మన ప్రత్యేకతను నిలుపుకుంటున్నాం. ఈ అరవై సంవత్సరాల పేర్లనూ ‘సోమదైవాదనుడ’నే ప్రాచీన ఖగోళ శాస్తజ్ఞ్రుడు - తాను రచించిన ‘కల్పలత’ అనే గ్రంథంలో పేర్కొన్నాడట! బృహస్పతి గ్రహం రాశిచక్రంలోని పన్నెండురాసుల్లోనూ ఒకసారి తిరిగిరావడానికి అరవై సంవత్సరాలు పడుతుందట. దీని ఆధారంగా సంవత్సరాలు, ఆ సంవత్సర ఫలితాల మూలకందంగా వాటి పేర్లూ నిర్ణయించారంటారు.

బ్రహ్మసృష్టిని మొదలెట్టిన రోజు కనుక ఉగాది పంచాంగశ్రవణంతో బాటు సృజనకారులైన సృష్టికర్తలు కనుక, కవి బ్రహ్మలనబడే - కవుల సమ్మేళనాలకూ అందుకే ఉగాది నెలవయ్యింది.

అందరికీ నందన ఉగాది శుభాభి‘నందన’లు.

(23/03/2012)

0 comments: