ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, March 9, 2012

సంప్రాప్తే...సన్నిహితే కాలే







‘‘కనకపు సింహాసనమున... అన్న పద్యం గుర్తుకొస్తుంటుందోయ్ ఒక్కోసారి! జనం ఆదరించి అభిమానంతో విశ్వాసంతో గద్దెనెక్కించినా ,అది నిలుపుకోలేకపోవడమంటే అధికారం నెత్తికెక్కడమే. జన సంక్షేమం గురించిన ప్రాధాన్యతాక్రమాలు మరచి, స్వార్థం, అహం తలకెక్కించుకున్నప్పుడు పతనం తప్పదు మరి. నిజానికి అట్టడుగు స్థాయినుంచి ఎదిగివచ్చిన వారికి- తమకు లభించిన ఉన్నతిని పరిరక్షించుకుని, అసలుకు తానేమిటోనన్న మూల పరిజ్ఞానం లోపించి, అహం, అధికారం, ఆబ, కక్కుర్తి ఆక్రమించుకుంటే- ఎంత త్వరగా నిచ్చెన ఎక్కినా, పరమ పద సోపానపటంలో అంత త్వరగా పెద్ద పామునోట్లోబడి, దిగువకు జారే చ్యుతి తప్పదు. ‘మంచి చేయని దేవుడికన్నా భయపెట్టే దయ్యమే నయం’ అని జనం అనుకుంటారంటే ఆశ్చర్యపోనక్కర లేదు. దేశంలోనే అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలే ఇందుకు ప్రబల నిదర్శనం’’ అన్నాడు రాంబాబు పేపర్ మడిచి టేబుల్ మీద పెడుతూ.



‘‘జనం మార్పు కోరుకుంటారోయ్! వాళ్లకి మూస ధోరణులు నచ్చవు. పైగా ఇప్పుడు ప్రజలలో రాజకీయ విచక్షణ బాగా పెరుగుతోంది. డబ్బుకు, సారాయికి ఓటును అమ్మేసుకుంటున్నారనీ ,ఓటర్లను ప్రలోభపెట్టడం చాలా సులువనీ అనుకుంటే అది నేతల అజ్ఞానం. అదనుచూసుకుని వారు చెప్పే గుణపాఠాలు వారు చెబుతూనే వుంటారు. నిజానికి దేశంలోనే తొలి మహిళా దళిత ముఖ్యమంత్రి అయివుండీ, ఉత్తరప్రదేశ్ అంతటి పెద్ద రాష్ట్రానికి జనాదరణతో అధినేత కావడం జరిగిందన్న వివేకం కోల్పోయి, తాను బ్రతికి వుండగానే తన విగ్రహాలను నెలకొల్పుకోవడం, తన మంత్రులనే ఈసడించడం, అవినీతి చేయడం తనకు లభించిన హోదా కారణంగా తన జన్మహక్కు అన్నట్లు ప్రవర్తించడం వల్లనే, మాయావతి నిజంగానే నెత్తిన అవమాన భారంతో ముసుగేసుకోవాల్సిన స్థితి తెచ్చుకుంది. ఎంత గూండారాజ్యం నెరపాడని గతంలో అనుకున్నా ములాయంకే ఉత్తరప్రదేశ్ పీఠం దక్కిందంటే ఆలోచించు మరి!’’ అన్నాడు ప్రసాదు.


‘‘తమాషా చూసారా! అసలు జాతీయ పార్టీలుగా వనె్నగాంచిన కాంగ్రెస్, బి.జె.పి, ఒకప్పటి గొప్ప హోదాగల ప్రతిపక్ష వామపక్షాలూ ఈ కాలపు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ‘హవా’ముందు వెలవెలబోయే స్థితికొచ్చాయి. ‘ఒక పార్టీ- ఒక సిద్ధాంతం’అనేది మొన్నటి మాట. కానీ కాంగ్రెస్-బి.జె.పి. లాంటి పార్టీల కంచుకోటలన్నీ ఎప్పుడో బద్దలయ్యాయి. ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్టీ ఆధిపత్యం కూడా రాజరికపు వైఖరులకు వచ్చి, వారి నిరంకుశ చేష్టలు పొడచూపుతుండడం వల్లనే, నిజంగా ప్రజలు విసిగిపోతూ వస్తున్నారు. ‘వంశపాలన’అనేది నిర్ద్వంద్వంగా తిరస్కరించే స్థితి ఏర్పడుతోంది. ముమ్మూర్తులా ఇందిరలా కనిపిస్తుందనుకునే ప్రియాంక, యువ కిశోరమని- నెహ్రూ వంశ వారసునిగా ఊదరగొట్టిన రాహుల్ గాంధీ- ఎంత ప్రచారం చేసినా, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో నాలుగవ స్థానానికి పడిపోయి భంగపాటు చెందింది చూసారా! ఉత్తరాఖండ్‌లో కూడా కేవలం ఒక్క సీటు ఆధిక్యంలో భాజపా పైన వుంది అంతే! పంజాబ్ లాంటి రాష్ట్రంలో శిరోమణి అకాలీదళ్ వద్ద శిరస్సు వంచాల్సి వచ్చింది. ఈ ఫలితాలు చూస్తూంటే రెండువేల పధ్నాలుగు ఎన్నికలప్పటికి జాతీయ పార్టీలనే వాటి మనుగడే ప్రశ్నార్థకమై, ప్రాంతీయ పార్టీల ఆధిక్యమే పెరిగేటట్లుంది’’ అన్నాడు శంకరం కల్పించుకుంటూ.


‘‘జనానికి - కేంద్ర అధికారం ఎవరికివ్వాలి?, రాష్ట్ర అధికారం ఎవరికివ్వాలి? అనే విచక్షణ వుందర్రా! రెండుచోట్లా ఒకరే వుండాలని వారు అనుకోవడం ఎప్పుడో మానేసారు. స్థానిక అవసరాలు తీరాలంటే కేంద్ర పాలిత పార్టీకన్నా తమదగ్గర ప్రతిపక్ష పార్టీ అధికారంలో వుంటే కేంద్రం మీద ఒత్తిడితెచ్చి నిధులు సమీకరించుకోవడం, అభివృద్ధి పనులు చేయించుకోవడం ఎక్కువ సులభమేమో అన్న భావనకు కూడా వారు లోనవుతున్నట్లు కనిపిస్తున్నారు. తదనుగుణంగానే- పార్లమెంట్ ఎన్నికలకూ, అసెంబ్లీ ఎన్నికలకూ అభ్యర్థులనూ, పార్టీలనూ గెలిపించడంలో తమ నిర్ణయాత్మక పాత్రను నిర్వహిస్తున్నారు. ‘జనం నాడి’ పసిగట్టడం అంత సులభంకాదు సుమా! ఏమయినా ఇప్పుడు జాగరూకత వహించి తమ పద్ధతులను జనాదరణకోసం తీర్చిదిద్దుకోవలసిన అగత్యం ప్రధానంగా జాతీయ పార్టీలది! వామపక్షాల వెలుగుజిలుగులు ఇప్పటికే అంతరించిపోయాయి. ఇక జాతీయ పార్టీలుగా అధికారం వెలగబట్టిన కాంగ్రెస్, బి.జె.పి- రాష్ట్రాలలో చావుదెబ్బ తింటూ, భవిష్యత్తును చేజేతులా పోగొట్టుకునే ప్రమాదంలో పడుతున్నాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే పూర్తిగా నష్టపోతాయి. ఎన్నికల్లో కులం, మతం, వర్గం, ధనం అన్నీ అస్తమానూ పనిచేస్తాయనుకుంటే జనం ఒప్పుకోరని చరిత్ర ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే వుంది. దళిత మహిళా ముఖ్యమంత్రి ‘మాయావతి’ ప్రధాని పదవికి ఎదగవలసిన గుణశీలాలు పెంపొందించుకోలేక, అందిన దానినే చేజార్చుకోవడం చూసాక- జనం విజ్ఞత ఏమిటో గ్రహింపుకు రావడం లేదా? ‘‘సంప్రాప్తే సన్నిహితే కాలే నహినహి రక్షతి డుకృఞ్కరణే’’ అన్నట్లు నిర్ణాయకశక్తి దగ్గరకు వచ్చేసరికి పాండిత్యాలూ వట్టి రిజర్వేషన్లూ ఏవీ ఆదుకోవు! అంచేత మూఢమతిత్వాన్ని రాజకీయ పార్టీల నేతలు వదులుకుని, ‘భజగోవిందం’అన్నట్లు మాధవ మానవ జన భజన చేయాల్సిందే’’ అంటూ నవ్వుతూ లేచాడు రాంబాబు.






09/03/2012

2 comments:

JANARDHAN AMBALLA said...

Good commentary on the existing affairs in U.P
-Amballa Janardhan.

సుధామ said...

Thank you Janardhan garu!