ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, March 10, 2012

ఒక్క అక్షరం.. లక్షల భావాలు



ఒక్క అక్షరం.. లక్షల భావాలు


అక్షరరూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక - అంటాడు కాళోజీ కవి. అక్షర సముదాయాలు కాక, కేవలం ఒకే ఒక అక్షరం కూడా గొప్ప అర్థవంతంగానూ, ప్రయోజనాత్మకంగానూ భావిస్తున్న దాఖలా మన భాషలో వున్నదే.


తెలుగులో అనేక సంస్కృత పదాలు ఎప్పుడో చొరబడిపోయాయి. ఇవాళ మనం వాడుతున్న తెలుగు అచ్చతెలుగు కానే కాదు కానీ అచ్చంగా తెలుగు భాష సంపద్వంతమయింది. అన్యభాషా పదాలు, గ్లాసు, రోడ్డు, రైలు వంటి పదాలు ఇంగ్లీషువని అనుకోలేనంతగా నేటి తెలుగులో కలిసిపోయాయి.


ఏకాక్షరాలు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ‘శ్రీ’ అనేది భాషలో ఎంత గాఢంగా, హృద్యంగా స్థిరపడిందో ముందే చెప్పాలి. ‘శ్రీ’ అంటే ‘సిరి’ అనే. ‘శ్రీ’ అంటే మంగళదాయకమైన పదం. గౌరవ సూచకంగా మగవాళ్ల పేర్లకు ముందు శ్రీ అనే ఏకాక్షరాన్నే రాస్తుంటాం. పేరుకు ముందు శ్రీ పెట్టలేదని అలిగేవారూ వుంటారు. శ్రీ అంటే లక్ష్మి, ధనం, సంపద, సమృద్ధి, శోభ, కాంతి, హోదా, కీర్తి అనే అర్థాలున్నాయి. శ్రీకాళహస్తిలోని శ్రీ అంటే సాలెపురుగు.


రమాకుమారుడు అంటే మన్మథుడు అని అర్థం. ఆ పదంలో ముందునుంచీ ఒక్కొక్క అక్షరం తొలగిస్తూ మాకుమారుడు, కుమారుడు, మారుడు, రుడు, చివరికి డు అనే ఏకాక్షరానికి కూడా మన్మథుడు అనే అర్థం. ఈ సొబగు భాషలోనిదే మరి! అవును, సరే అనడానికి మనం ఒక్క ‘ఊ’ అని సరిపెడుతున్నామంటే ఏకాక్షరంలో ఎంత అర్థం గంభీరంగా దాక్కుని వుందో చెప్పాలా? అలాగే ‘జే’ కొట్టడం, ‘జై’ అన్న ఏకాక్షరంలో విజయనాదం వుంది. ఇవాళ యువతరం ‘యా’ అనే ఒక్క ఆంగ్లపదాన్ని అంగీకారసూచక సమ్మతి భావ వ్యక్తీకరణకు ఎంతో అలవోకగా వాడేస్తోంది. ‘ఊ’ కొట్టడం అంటే తెలుగులో సమ్మతిని శ్రవణానుభూతిని ప్రకటించడమే. అమ్మ కధ చెబితే పిల్లలు ఊ కొడుతూంటారు.


తెలుగు వర్ణమాలలో తొలి అక్షరమైన ‘అ’ అనేదానికి బ్రహ్మ, విష్ణువు, శివుడు, వాయువు అని అర్థం వుంది కానీతెలుగులో వ్యస్తప్రయోగం లేదంతే! మళ్లీ అదే ‘ఆ’ అనే దీర్ఘాక్షరానికి ‘ఫలానా’, ‘ఆ యొక్క’ అనే అర్థాలున్నాయి. ఆ వేళ, ఆ రోజు అంటూ ‘ఆ’ చేర్చి నియమిత కాలాన్ని సూచించడం వుంది. అలాగే ‘ఈ’ అనేది ఇప్పటి, వర్తమాన సూచికగా వినియోగిస్తాం. ‘ఆ’ దూరం వున్నదానిని సూచించే అక్షరమైతే ,‘ఈ’ దగ్గర వున్నదానిని అభివ్యక్తీకరించే అక్షరం. వ్యస్తప్రయోగం లేకపోయినా ‘ఊ’ అన్నా శివుడు, చంద్రుడు, రక్షకుడు అన్న అర్థాలున్నాయి. అలాగే ‘ఏ’ అనే ఏకాక్షరం ప్రశ్నార్థకంగా, సందర్భానుసారం ఆశ్చర్య ప్రశంసాదులు తెలిపేదిగా వుంది. చూచితిరే, రావే అనే పదాల్లో ‘ఏ’ కారం అలా చొరబడిందే. ‘ఐ’ అనే అక్షరం ‘అగు’ ధాతువుయొక్క క్త్వార్థక రూపం. ఐ కొన్ని చోట్ల ‘అయి’గా మారి వ్యవహరింపబడుతుంది. అలాగే ‘ఓ’ అనే ఏకాక్షరం సంబోధనను, ప్రార్థనాదులను తెలిపేదిగా ‘ఒక’ అనేదానికి క్లుప్తీకరణంగా వ్యవహృతమవుతోంది. ‘అం’, ‘ఆం’ అనేవాటిని చిన్నపిల్లలకు గోరుముద్దలు తినిపిస్తూ పెద్దలు ప్రయోగించడం తెలిసిన సంగతే కదా!

ఇక హల్లుల్లో ‘క’ తెలుగులో వ్యస్తప్రయోగం లేకపోయినా బ్రహ్మ, విష్ణువు, ఆత్మ, పక్షి, దేహం, గరుడుడు నీరు వంటి అర్థాలు కలిగింది. 'కవి యను నామంబు నీటికాకికి లేదే' అనడానికి కారణం క అంటే నీరు, వి అంటే విహంగము అనే అర్థాలుండడమే.

నీ జట్టు ‘ఖ’ అంటూ పిల్లలు జట్టునుంచి విడివడే భావ వ్యక్తీకరణకు ‘ఖ’ ప్రయోగిస్తుంటారు. ‘ఆ’ అనే అర్థంలో తెలంగాణలో ‘గా’ అనే అక్షర ప్రయోగం వుంది. గావేళ, గాసోటు, గాదినం వంటి ప్రయోగాలున్నాయి. అలాగే ‘ఈ’కి ‘గీ’ అనే వాడకం. చి అనే ఏకాక్షరాన్ని ‘చిరంజీవి’ అన్న భావనకు సంకేతంగా పిల్లల పేర్ల ముందు సంకేతించి రాతలో ప్రయోగించడం వుంది. ‘ఛ’ ‘ఛీ’ అనేవి నిందార్థకాలుగా, అసహ్య సూచకాలుగా ప్రధానంగా మాటల్లో వాడుతూనే వుంటాం. ‘ఢ’, ‘ఠ’ వంటి ఏకాక్షరాలు గొప్ప సంఘటనాత్మక భావ సూచికలుగా నేడు పత్రికల పతాక శీర్షికల్లోనూ ‘లారీ ఢీ- ఇద్దరు ఠా’ అన్న ధోరణిలో వాడుతూన్నారు. నా, నీ అనే అక్షరాలసంగతి మా, మీ అనే అక్షరాలసంగతీ ఏకాక్షరాలుగా వాటి అభివ్యక్తి సామర్థ్యం అందరూ ఎరిగినదే.

‘తై’ అనేది నృత్య సూచికగా, ‘థూ’ అనేది నిందార్థకంగా వున్నాయి. ‘ ఫో’ అనే ఏకాక్షరం పొమ్మని, ‘పై’ అనేది ఉపరితల సూచకంగానూ వుండగా, పువ్వు అనే అర్థంలోనూ, అశ్లీలార్థకంగానూ కూడా ఓ ఏకాక్షరం కానవస్తుంది. ‘భౌ’ అనే ఏకాక్షరం కుక్క అరుపుకు సంకేతం. ఇక ‘రా’ అనే ఏకాక్షరం పిలువుకీ, ఆత్మీయతకూ, సాన్నిహిత్య భావనకూ భాషలో సొగసుగా రాణిస్తోంది. ‘లం’ అనే అక్షరానికి బురద అనీ, ‘జ’ అంటే పుట్టింది అనే అర్థంలో- బురదలో పుట్టిన పద్మానికీ, లక్ష్మికీ సంకేతంగా ఏర్పడిన పదం నిందార్థకంలో స్థిరపడడం విషాదమే.

‘నో’, ‘లౌ’ అనే తెలుగు అక్షరాలు ఇంగ్లీషులోని వద్దు, వలదు, ప్రేమ అనే భావనలు ప్రతిబింబించే ఏకాక్షరాలుగా చాలా విరివిగా వాడబడుతున్నాయి. అలాగే ‘గో’ అనేది తెలుగులో ఆవుకీ ,ఆంగ్లంలో 'వెళ్లు' అనేదానికీ నిలబడి ప్రయుక్తమవుతున్న ఏకాక్షరమే.

ఇవి వాచవిగా చెప్పిన ఏకాక్షర భావ వివరణలే. భాషలో సొబగులను ఇలా ఏకాక్షరాలుగా మరిన్నింటిని గ్రహించే వేడుక, అధ్యయనం ఇక మీదే మరి. సరేనా!

-సుధామ



నుడి (10/03/2012)

0 comments: