ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, March 4, 2012

ఆ ‘పాత’ రమణీయం

ఆ ‘పాత’ రమణీయం

ఒకప్పుడు సినిమాలను తన హాస్య వ్యంగ్య అక్షరాస్త్రాలతో చీల్చి చెండాడి, అదే సినిమా రంగంలో రచయితగా, నిర్మాతగా నిలబడిన పెద్దమనిషి - ముళ్లపూడి వెంకటరమణ.

పంతొమ్మిది వందల యాభైలనాటి కాలంలో ‘ఆంధ్ర సచిత్రవారపత్రిక’లో- రమణగారు రాసిన తెలుగు, కొన్ని హిందీ- ఇంగ్లీష్ సినిమాల రివ్యూలు సినిమా సమీక్షలకు ఒక విలువను, ఒరవడిని కలిగించాయి. ‘రమణ’రాసిన రివ్యూలన్నీ నిర్మొహమాటంగా రాసినవే! అదే కాలంలో- రమణగారి మిత్రుడు బాపు-‘రేఖా’ గణితంలో లెక్కకు మిక్కిలి పేరు గడించాడు.

‘బాపూరమణీయం’అనే రమణ రాత, బాపు గీత- సినిమా సంబంధితమైన గ్రంథంగా తొలి ముద్రణ 1990లో నవోదయ వెలువరించింది.
రెండు దశాబ్దాల తరువాత విశాలాంధ్ర 1955-60ల మధ్య రమణ సినిమా సంబంధిత వ్యాసాలు, వ్యంగ్య రచనలు, సమీక్షకులకుతోడు బాపుగారు సినిమాల వారిపై గీసిన ‘కార్ట్యూన్లు’, కార్టూన్లు కలిపి, ఆ జంట తీసిన సినిమాలపై ‘బాపు’తానే ‘నామీదేనర్రోయ్’ అని వేసిన చిత్రాలనూ కూర్చి, ఈ గ్రంథాన్ని సరికొత్తగా అందిస్తోంది. అంతా సినిమా సంబంధితంగానే వున్నా 24వ పేజీలోని బాపుకార్టూన్లుతత్సంబంధివేననుకోలేం!
అక్కడక్కడ పేజీల్లో బాక్సులుకట్టి- బాపురమణలు పనిచేసిన సినిమాల్లోని రసగుళిక వాక్యాలను కూర్చారు.


రమణ సినిమాలపై సెటైర్‌గా రాసిన ‘విక్రమార్కుడి మార్కు సింహాసనం’ నుండి కూడా ఉటంకింపులు వున్నాయి.

సమీక్షలు రాయడంలో రమణ తనదైన బాణీనే అంతటా ప్రదర్శిస్తారు. ‘అక్కాచెల్లెళ్లు’ సినిమా గురించి రాస్తూ- ‘‘ఈ చిత్రంలోని ‘తనలో తాను’లూ, ‘తనతో తాను’లూ కాస్తంత తగ్గించి వుంటే మరింత రాణించి ఉండేదనిపిస్తుంది. కథకు కూడా కాస్త పుష్టి చేకూరేది’’ అంటారు.

గురుదత్ ‘ప్యాసా’ చిత్రం సమీక్షిస్తూ- ‘‘ప్రజలకు అందచేయడంకోసం అతడు కల్పించిన కథను పరికిస్తే, అందులో మటుకు పరిణతినందిన కళాకారుడి ప్రతిభ తాలూకు క్రీనీడలు కూడా కనబడవు.’’ ‘‘కృత్రిమంగా, అసహజంగా కనిపించే కథవల్ల సానుభూతి బదులు చిరాకు కలిగించే తరహాలో రూపకల్పన చేసిన భూమికవల్ల కవిగా గురుదత్ ప్రదర్శించిన నటన రాణించలేదు. భ్రుకుటి ముడిచి, దిగులుగా ప్రేక్షకుల వంక చూడటం తప్ప అతడు చేసినదాట్టే కనపడదు’’అంటారు నిష్కర్షగా.

అలాగే ‘కాగజ్ కె ఫూల్’ చిత్రం గురించి - ‘గురుదత్ సినిమాస్కోపు చిత్రం ఎంత బావుంటానని ఆశపెట్టిందో- అంతా నిరాశ కలిగించగలిగింది. ఒక సమర్థుడి ప్రజ్ఞ విలువైన కాలం, బోలెడంత డబ్బు, రెండుమూడు మైళ్లు సెల్యులాయిడ్ ఫిల్మూ- అన్నీ వృధా అనిపించింది. పేరులాగే ఈ చిత్రం కూడా రంగూ రుచీ వాసనా లేని పువ్వు’’అని సమీక్ష మొదట్లోనే కొట్టిపారేస్తాడు రమణ.


రమణ సినిమా సమీక్షల్లోని అభిప్రాయాలతో ప్రేక్షకులు అంగీకరించడం సంగతి అటుంచి, సినిమావాళ్లు మాత్రం ‘తానేమంటాడా’అని ఆ రోజుల్లో- గమనించే వారన్నమాట వాస్తవం! ఆంగ్ల చిత్రం ‘ది ఓల్డ్‌మెన్ అండ్ ది సీ’ గురించి రాస్తూ- ‘‘సినిమా అన్న మాటకి చెలామణిలో వున్న అర్థాన్నిబట్టి కొన్ని చలనచిత్రాలను ఆ పేరుతో పిలుచుకోవడం మంచిది కాదు. ‘ఓల్డ్‌మాన్ అండ్ ది సీ’ సినిమా కాదు. హెమింగ్ వే చిన్న మాటల చిన్న వాక్యాల కావ్యానువాదం. ఒక్క భావానికి రూపకల్పన. అందువల్ల దర్శకుడు దీన్ని కథాప్రకారంగానే ఆవిష్కరించారు.మనం కథ చదువుతున్నప్పుడు చక్షురక్షర సంయోగంలోంచి పుట్టే బొమ్మలనే వరుసగా పేర్చుకు వచ్చారు’’ అంటారు.


యాభైఆరు రచనలున్న ‘బాపురమణీయం’లో- ఒకప్పటి తెలుగు సినిమా వైభవ ప్రాభవాలు రమణీయ రచనల్లో ఎలా విశే్లషింపబడిందీ, ‘పథేర్ పాంచాలీ’ ‘బెంగాలీ మోజుని’ ‘చెత్తేర్ - చెదారేర్’అని ఎలా హాస్య భరితం చేసిందీ- అందుకుని ఆనందించగలం. ‘వీణాప్రవీణ’అని ఈమని శంకరశాస్ర్తీగారిపై వ్యాసం ఈ సినీ గ్రంథంలో ‘ఆడ్‌మ్యాన్ ఔట్’ అన్నట్లుంది ఎందుకో!
- సుధామ


బాపు రమణీయం-
బాపు, రమణ- విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్, విజ్ఞానభవన్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్-1;
వెల: రూ.150/-

0 comments: