ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, February 25, 2012

మృతం కాదు అమృతం

ఆంధ్రభూమి దినపత్రిక

'నుడి ' పేజీ లో

ఈ శనివారం నుండి మొదలైన నా శీర్షిక.

కొద్దివారాల పాటు సాగే ఈ శీర్షిక చదివి
మీ స్పందన తెలియ చేస్తారుగా!


మృతం కాదు అమృతం


భాష భావవినిమయ సాధనం.

భావ వ్యక్తీకరణ చేయడానికి- ఇంకొకరితో మాట్లాడటానికి భాషను ప్రయుక్తం చేస్తాం. అలాగే రాయడానికీ భాషను వినియోగిస్తాం. మాట్లాడినప్పుడు మాట. రాసినప్పుడు లిపి.

మాట్లాడే భాషకూ, రాసే భాషకూ ఒకప్పుడు అంతరం వుండేది. గ్రంథస్థమైన భాషను గ్రాంథికం అనీ, వ్యవహరించే భాషను వ్యావహారికం అనీ అన్నారు. కానీ రాను రాను మాట్లాడినట్లే రాయాలనీ, అందువల్ల రాసింది చదివినప్పుడు, మాట్లాడినట్లే అనిపించి, నిజమైన భావ వినిమయం సరళంగా, సూటిగా జరుగుతుందనీ ఒక ఉద్యమంలానూ జరిగింది. కానీ ఇప్పటికీ మాట్లాడ్డానికీ రాయడానికీ మధ్య భాషను ప్రయుక్తం చేయడంలో అనివార్యంగా కొంత అంతరం వుంది.

ఒకమాట అని, నేను అనలేదని ఆ తరువాత మాటలతోనే త్రోసిరాజనవచ్చు. కానీ అదే రాసినప్పుడు లిఖితరూపంగా వుండి, వ్యక్తీకరించిన విషయం తిరుగులేనిదిగా నమోదవుతుంది. అందుకే ‘అక్షరం’ అంటే క్షరము కానిది, నశించనిది అని అర్థం మరి! అందుకనే లిఖిత పూర్వకవిషయాలకు వుండే విలువ, ‘మన్నిక కాలం’ ఎక్కువ.

ఒక విషయం ప్రభావవంతంగా మాట్లాడానికి కూడా అందువల్లనే ముందు చెప్పదలుచుకున్న దానిని వ్రాతపూర్వకంగా కూర్చుకోవడం జరుగుతుంది.
ఇంతకీ మాట్లాడినా, రాసినా అదే తెలుగు, అదే వర్ణమాలలోని అక్షరాలనే అందరూ ఉపయోగిస్తున్నా కొందరు మాట్లాడే మాటలు ఎంతో శ్రవణానందకరంగానూ, అలాగే కొందరి రచనలు పఠితలకు ఎంతగానో ఆసక్తిదాయకాలూ కావడానికి హేతువు భాషలోని వ్యక్తీకరణే!


సాహిత్యం ‘ఆలోచనామృతం’ అన్నారు. అది మౌఖికమైనా, అక్షరబద్ధమయినా అట్టిదిగానే రాణించాలి. తెలుగు భాషలో సహజంగానే ఎంతోగొప్ప పదసంపద వుంది. ముఖ్యంగా భాష సజీవంగా నిలవడానికి, మనుషుల మధ్య నిరంతరంగా అది వినిమయమవుతూండాలి. అన్యభాషలు నేర్చినా మాతృభాషను పరిపుష్టం చేసుకోవాలే కానీ- విస్మరించకూడదు. వ్యక్తీకరణకు అనుకూలంగా, కాలావసరాలకు తగినట్లుగా భాషను పెంపు చేసుకుంటూండాలి. కొత్త పద సృష్టి స్వభాషలో జరుపుకోకుండా, పాతబడిన మాటలంటూ వున్నదానిని కూడా పోగొగట్టుకోవడం విజ్ఞత కాజాలదు!

భావ వ్యక్తీకరణకు సమర్థం కాకుండా భాషను పడగొట్టుకున్నా, అధునాతన శాస్త్ర సాంకేతిక ప్రగతికి అనుగుణంగా తగిన పద సంపద కూర్చుకుని భాషను విస్తరించుకున్నా అది మనం చేసుకునేదే!

మన తెలుగు భాషలో ఎంతో మాధుర్యం వుంది. తొంభై సంవత్సరాల క్రితం 1921లో పానుగంటివారు ‘స్వభాష’ అనే సాక్షి వ్యాసంలో పేర్కొన్నట్లు - ‘‘మన భాషయే- మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే- మహానంద కందళ సందోహ సంధాన తుందిలమగు మాతృభాషయే- క్రమతకు క్రమత, కఠినతకు కఠినత, వదలునకు వదలు, బిగికి బిగి, జోరునకు జోరు, ఎదురెక్కునకెదురెక్కు, మందతకు మందత- ధాటికి ధాటియూ- నన్నివనె్నలు, నన్నిచినె్నలు, నన్నివగలు, నన్నివద్దికలు, నన్నితళుకులు, నన్నిబెళుకులు, నన్నిహొయలు, నన్నిమొయ్యారములు కలిగిన మన మాతృభాషయే. వ్యాసమునకు, ఉపన్యాసమునకు కవిత్వమునకు గానమునకును సంపూర్ణార్హత కలిగిన భాషయే పైవారే యా భాషను పట్టుదలతో ప్రయత్నమున నభ్యసింపవలసియుండగా మనవారే దానినంత యధమాధమముగా చూచుట తగునా’’ అన్న ఆర్తి నేడు మరీ ఔచితీమంతం!

తెలుగు భాషలో బోలెడు సొగసులున్నాయి. తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు మొదలుకొని నేడు ఆంగ్లాది అన్య భాషా పదాలను సైతం భావ వ్యక్తీకరణానుకూలంగానే ‘తెలుగు’ తనలో కలుపుకుంది. అయితే నేడు తెలుగు భాష అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే స్థితి పొడచూపుతోంది అంటే అందుకు కారణం మన భాష సమర్థతను, మన భాషలోని సొగసులను మనమే గుర్తించక, వినియోగంలో స్వయంగా చేజార్చుకుంటూ వుండడమే.

మాట్లాడడానికయినా, రాయడానికయినా తెలుగు భాషమీద పట్టు కావాలి. అది పట్టుకునే పట్టుదల కావాలి. భాషలోని సొగసులను గ్రహించి, అందిపుచ్చుకుని, నిత్య వ్యవహారంలో, లేఖనంలో, నిలుపుకోవాలి. తెలుగు మృతభాష కాదు- అమృతభాష. ‘‘తెలుగు మాట్లాడే దీపాలు తెల్లవార్లూ వెలుగుతూనే వుంటాయి’’ అని ఆరుద్ర అన్నట్లు మన తెలుగు భాషలో సొగసులు సతత హరితాలు. సదా అవధరణీయాలు.

భాషలో మౌలికంగా వున్న అలాంటి కొన్ని సొగసులను విస్మృతిలోకి పోకుండా ‘స్మర వారంవారం’ అంటూ మళ్ళీ మళ్ళీ తలుచుకుందాం. ఉన్న సంగతులనే ఈ తరానికి పెన్నిధులుగా అందించుకోవాల్సిన అవసరం వుంది కనుక, తెలుగుభాషా వికాసం మన తెలుగువారందరి కర్తవ్యం కనుక, మన భాషలోని సొగసులను కొన్ని ఉపయుక్తం చేసుకునేందుకు పునశ్చరణలోకి తెచ్చుకుందాం. తెలియని సంగతులని కాదు గానీ, తెలిసిన సంగతులనే మళ్ళీ ఓ మారు మాటల్లో కలబోసుకుందాం. ముందుగా వచ్చేవారం భాషలో సొగసుగా వున్న ‘జంటపదాలు’ అనే అంశం
మాటాడుకుందాం.

3 comments:

Unknown said...

Congrats for starting yet another column, that too on our beloved mother tongue Telugu. I am sure that this column will ignite renewed interest in propagating our language.
-Amballa Janardhan-Mumbai

Purnachand Gangaraju said...

మీరు రాస్తున్నారుగా సుధా మధుర౦గా... బావు౦టు౦ది రసభర౦గా!
మన౦ ఏ భాషకూ వ్యతిరేక౦ కాదు. ఎవరి యాసకూ అ౦తకన్నా వ్యతిరేక౦ కాదు. మన౦ కోరేదొకటే... మనవైన పదాలున్న చోట పరాయి వాటికోస౦ వె౦పర్లాడట౦ దేనికనే! మన భాషని మరి౦త వాడక౦లోకి తేవటానికేగా మన తపన౦తా!
మీ కొత్త శీర్షికకు స్వాగత౦.
పూర్ణచ౦దు

సుధామ said...

మీ స్వాగతాదరాలకు ధన్యవాదాలు పూర్ణచంద్ గారూ!
Thanks a lot Amballa janardhan garu for your good wishes.