ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, February 24, 2012

చిరునామా‘‘నెంబర్ ఇచ్చాడు. ఇవ్వలేదని ఎవరన్నారు? కానీ ఈ మహానగరంలో ఆ నంబరుతో ఇల్లు కనుక్కోవడం బ్రహ్మతరం కూడా కాదల్లే వుంది! 6-9-54/ఎ/220/ఇ/1/12బి. అంటూ చేంతాడంత నెంబర్ వుంటే- ఏరియా పేరు చెప్పినా, ఆ వీధిలో ఓ స్కూలు, ఏ.టి.ఎం వుంటుందని అవో పెద్ద బండగుర్తులుగా చెప్పినా, వీధికో స్కూలు, ఏ.టి.ఎం. వస్తున్న ఈ రోజుల్లో నాయనా అతగాడి ఇల్లు కనుక్కోవడం నా వల్లకాదు!’’ అన్నాడు శంకరం అసహనంగా రాంబాబుతో.

ఈమధ్యే అమెరికానుంచి చిన్నప్పటి మిత్రుడు మోహన్ వచ్చాడుట. ‘మా ఇంటికి రా కలుద్దాం’ అన్నాడట శంకరంతో. అడిగితే- వాళ్ల వాళ్లను కనుక్కుని ఇంటి నెంబర్ చెప్పాడు. ‘‘ఈ ఇంటి నెంబర్ కనుక్కోవడంకన్నా ఆ లోగా అమెరికా వెళ్లి అక్కడ కలవడమే ఈజీ’’ అన్నాడు శంకరం.

‘‘నిజమేనోయ్! నగరంలో ఇంటి అడ్రస్‌లు పట్టుకోవడం మరీ కష్టంగా వుంటోంది. బస్సు ఎక్కి పక్కనతన్ని ‘‘ఫలానా స్టాప్‌లో దిగాలి. ఎలాగో కొంచెం చెబుతారా’’అని అడిగితే- ‘నేను దిగే స్టాప్‌కి ఇవతలి స్టాపే లెండి! చూసుకు దిగుదురుకాని’ అన్నాట్ట ఆ మహానుభావుడు. అలా ఎవరినయినా అడ్రస్ కనుక్కుందామన్నా, తెలియకపోతే తెలియదని కొందరు చెప్పరు సరికదా, వారి మిడిమిడి జ్ఞానంతో, అడ్రస్ అడిగినవాడిని మరిన్ని వీధులు తిప్పించేలా వుంటున్నారు.’’ అన్నాడు రాంబాబు.

‘‘నీకు మైక్రోసాఫ్ట్ ఆఫీసు తెలుసా? అని అడిగితే- ‘‘తెలీదు గానీ, మీరు అడ్రస్ చెప్పండి ఈజీగా కనుక్కుంటాను’’అని ఓ వెంగళప్ప ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చినట్లు, ‘‘ఫలానా శాస్ర్తీ ఇల్లెక్కడా?’’ అంటే ‘‘ఇల్లెక్కడానికి ఆయనకేం ఖర్మ ఇంట్లోనే వుంటాడు.’’ అని ఒకరూ, ‘‘ఆ శాస్ర్తీగారు మసీదు వీధిలో వుంటాడు’’ అంటే, ‘‘అయ్యో అదేం పాపం! గుడి వీధిలో వుంటే బావుండేదిగా!’’ అని ఒకరూ అడ్రసు అడిగినవాడితో జోకులు వేస్తూంటారులే! అడ్రసడిగితే- ‘‘సీథాజావ్! జాకే ఆగే పూఛో’’ అంటూ- ‘నేరుగా ముందుకెళ్లి అక్కడ ఎవరినయినా అడగండి’అని సలహా ఇచ్చే బాపతు జనమే ఎక్కువైపోయారు. చిరునామాల వ్యవహారం అలా వుంది మరి!’’ అన్నాడు నవ్వుతూ ప్రసాద్ కూడా.

‘‘ ‘చిరునామాలు’ ఇప్పుడు కాంగ్రేస్ పార్టీకి సంబంధించినవోయ్! ఆయన ‘ప్రజారాజ్యం’ కాంగ్రేస్‌లో కలిపేసి, తన పార్టీ ‘అడ్రస్’లేకుండా చేసుకున్నాడు కదా! కేంద్రంలో మంత్రి పదవి అని ఊరించి, కాంగ్రేస్ ‘చిరు’-నామాలే పెట్టిందిగా!’’ అన్నాడు రాంబాబు కూడా నవ్వుతూ.

‘‘ఇదిగో ఇదే ‘పక్కదారి’ పట్టించడం అంటే! అవతలివారి అడ్రస్సే కాదు, తన అడ్రస్ తానే వెతుక్కునే స్థితిలో నగర వాసి తయారవుతున్నాడు. ఓ ఆరునెలలు ఏ విదేశమో వెళ్లివస్తే- తన ఇంటి పక్కలే మారిపోతున్నాయి. తన ఇంటి పక్క ఖాళీ స్థలం మాయమైపోవడం మాత్రమేకాదు, తన ఇంటి మరో పక్క ఇంటి చోట్లో ‘ఇండిపెండెంట్ ఇల్లు’బదులు, ఓ పెద్ద ‘అపార్ట్‌మెంట్’ తయారై కూచుంటుంది! తన ఇల్లు తాను గుర్తుపట్టడమే కష్టమైపోయినా అలా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అన్నాడు శంకరం సీరియస్‌గానే.

‘‘అబ్బ! చాల్లెండర్రా! మీఅతిశయోక్తులు!! జి.హెచ్.ఎం.సి- హైదరాబాద్‌లో ఇంటి నెంబర్లు గుర్తించేందుకు వీలుగా అనుకూలమైన చర్యలు గత ఏడాది ఆగస్టులో మొదలుపెట్టింది. ఓ రెండేళ్ల వ్యవధిలో- సులభంగా ఇంటి అడ్రస్‌లు కనుక్కునే సంవిధానానికి, ఈసరికే తెర తీసింది. అంతేకాదు! వీధులకు ‘సైన్ బోర్డులు’ నెలకొల్పుతున్నారు. నగరంలో ఎనిమిది, తొమ్మిది సర్కిల్స్ అయిన- అబీడ్స్, హిమాయత్‌నగర్‌లలో ఈసరికే పురోగతి కనబడుతోంది మీరు గమనించారో లేదో! కొత్త నెంబర్లు ప్రతి ఇంటికీ కేటాయించడంలో - ఒక ప్రణాళిక ప్రకారం అది అందరికీ సులభంగా, అనుకూలంగా వుండే చర్యలే తీసుకుంటున్నారు ‘‘6-9-54/ఎ/220/ఇ/1’’ అన్నది- ‘‘నెంబర్.1, 55, హిల్‌ఫోర్ట్, హైదరాబాద్’’అనే విధంగా, సింపుల్‌గా మార్చడం జరుగుతోంది! అంటే- ఇప్పుడు ఏర్పాటుచేస్తున్న కొత్త ఇంటి నెంబర్లు, ప్రత్యేకమైన ఏరియా కోడ్, వీధి సంఖ్య, నిర్దేశిత ఇంటి సంఖ్య అన్నట్లుగా వుంటాయి; ఈ బైలూ, భాగాహారాల సంఖ్యలు లాంటివి లేకుండా చూస్తున్నారు.’’ అన్నాడు సుందరయ్య.

‘‘అదేదో! నత్తనడక వ్యవహారంలా కాకుండా- త్వరితగతిని సాగాలి మరి! నగరంలో కొత్త ఇంటి నెంబర్లు ఏర్పాటుకావడం, పోస్ట్‌మెన్‌లాంటివారూ వాటికి అలవాటుకావడం జరగాలి కదా మరి! ముఖ్యంగా జన సమ్మర్దక ప్రాంతాలలో అడ్రస్‌లు గుర్తుపట్టే సులభ పద్ధతి రావడం ముఖ్యం’’ అన్నాడు శంకరం.

‘‘అందుకే కదా! ఓల్డ్ సిటీలో ఓ మూడునెలల కాలంలోనే ఈ కొత్త నెంబర్ల విధానం ఏర్పాటుచేసేసి, ఎక్కువ జనావాసాలుగా వున్న- ఎల్.బి.నగర్, కుక్కట్‌పల్లి, మల్కాజ్‌గిరి, ఉప్పల్, రాజేంద్రనగర్, కాప్రా లాంటి చోట్లలో పురోగతిలో వున్నారట! శేర్‌లింగంపల్లి, పటాన్‌చెరువు, ఆర్.సి.పురం, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలలో అప్పాయింట్ చేసిన కన్సల్టెంట్స్ కొత్త నంబర్ల జారీకి అనుకూలంగా తమ నివేదికలు ఇచ్చారట కూడాను! నగరంలో మొత్తం 647 లొకాలిటీస్‌గా వున్న ప్రాంతాలన్నింటా కొత్త నెంబర్లను వచ్చే ఏడాది ఆగస్టులోగా ఇచ్చేయడానికి కృషి జరుగుతోందిట’’ అన్నాడు సుందరయ్య వివరిస్తూ.

‘‘పాత నెంబరు, కొత్త నెంబరు అంటూ - కొంతకాలం రెండూ చెలామణీలో వుంటే అదో కన్ఫ్యూజన్! జి.హెచ్.ఎం.సి. ‘హౌసింగ్ నెంబర్ విభాగం’ ఇదికూడా దృష్టిలో వుంచుకుని- అడ్రస్‌లు అమలుపరిచే సులభ వైఖరి తేవాలి! ఏమయినా- ప్రతి ఒక్కరికీ ఒక చిరునామా, ఆ చిరునామాను నలుగురూ సులభంగా గుర్తించేవీలూ, వుండి తీరాలి’’ అన్నాడు రాంబాబు.

‘‘మరే! ఒకరి గుండె కింద నీ చిరునామా వుండటం మానవీయ విలువల దృష్ట్యా మరీ ముఖ్యం సుమా!’’అంటూ ప్రసాద్ శంకరం భుజం చరిచాడు.


(24.2.2012 Andhrabhoomi (Daily)

0 comments: