ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, January 27, 2012

వి‘గ్రహింపు’




స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ మంత్రి, కీర్తిశేషులు ఎం.ఎస్.రాజలింగం గారి దగ్గరకు ఒకసారి కొంతమంది వెళ్లి --

‘‘మీకు ఒక విగ్రహం నెలకొల్పుదామనుకుంటున్నాం. ఒక నాలుగురోడ్ల కూడలిలో వేదిక కూడా సిద్ధంగా ఉంది. మీరు ఒక లక్ష రూపాయలు ఇస్తే మీ విగ్రహం అక్కడ ఏర్పాటుచేస్తాం’’ అన్నారట.
దానికాయన నవ్వుతూ - ‘‘ఆ లక్ష రూపాయలేవో మీరే ఇస్తే, విగ్రహం ఎందుకు? నేనే వెళ్ళి అక్కడ నించుంటాను కదా!’’ అన్నారుట.

బ్రతికి వుండగానే విగ్రహాలు నెలకొల్పుకోవాలన్న మోజు-దేశ స్వాతంత్య్రంలోగానీ, మానవాభ్యుదయంలోగానీ తమదైన విశేషపాత్ర ఏమీలేని ‘మాయావతి’లాంటివారికి చెల్లిందిగానీ, నిజమైన మహనీయులూ, త్యాగమూర్తులూ - అలాంటివి ఏనాడూ ఆశించలేదు; సరికదా - నిరసించారు కూడాను! కీ.శే. వావిలాల గోపాలకృష్టయ్యగారు అలా సాదాసీదా జీవనం గడపడానికి ఇష్టపడిన వారే!

అసలు ‘విగ్రహారాధన’ నిరసించేవారూ ఉన్నారు. దేవుడిని ఒక విగ్రహ రూపంలో ప్రతిష్టింపచేసుకుని పూజించడం, ఆరాధించడం కూడా మనసు ఆధ్యాత్మికంగా అంతర్ముఖంగా కేంద్రీకృతం కావడానికి ఒక ఆలంబన కోసమేగానీ - నిజానికి నిరాకారుడూ, నిర్గుణుడుగానే పరమాత్మ స్వరూపం పేర్కొనబడింది!


దైవాన్ని కూడా తనకన్నా అందమైన రూపులేదన్న అహంకారంతోనే మనిషి దైవస్వరూపానికి కూడా మానవాకృతినే ఇచ్చి, ‘మరీ బాగుండదేమో’నని - ఊరికే నాలుగుచేతులు తగిలించాడనీ, సృష్టికర్తకు కూడా ‘ఒక తల ఏమిటిలే’ అని నాలుగుతలకాయలు తగిలించాడనీ... మా తెలుగు మాస్టారు అంటూండేవారు’’ అంటూ సుందరయ్య గడగడా మాట్లాడుతున్నాడు.


‘‘సుందరయ్యా! అసలు ‘శక్తి’, ‘జగన్మాత’గా సుందరి అయ్యా! దేవుడు కూడా ‘శక్తి’ స్వరూపునిగా అవతరించినవాడే! శక్తి, బలం అనేవి గుణాత్మకాలే కానీ, నిజానికి రూపాత్మకాలు కావు. లావుగా, ఎత్తుగా వుండేవాడు గొప్ప బలశాలి అని మనం అనుకుంటాం అంతే! భీముడికీ, హనుమంతుడికీ, రాక్షసులకీ అందుకే ఆ స్వరూపాలు సంతరిస్తాం!
నిజానికి లాలిత్యంగా, ముగ్ధమనోహరంగా, ఫెమినైన్ ఫీచర్స్‌తో వుండే రూపాలుగా - రాముడినీ, కృష్ణుడినీ అందగాళ్లుగా ఆకారాలు కల్పించింది మనమేకదా! కానీ రాక్షసులను దునుమాడగలిగే శక్తి సామర్థ్యాలు ఆ ‘కోమల రూపాల్లోనే’ కోరి భజిస్తూనే వున్నాం కదా! అంచేత విగ్రహం అనేది మన కల్పితమూ, మనఃకల్పితమూనూ’’ అన్నాడు రాంబాబు.

‘‘అసలు విగ్రహాలు నెలకొల్పడం ఎందుకు? అవి ఎవరో పాడుచేసారనో, పాడయ్యాయనో బాధపడడం ఎందుకు? తమకు విగ్రహాలు నెలకొల్పమని గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ ఏనాడూ కోరారని నేననుకోను. అలాగే - వేమనో, గురజాడో, నన్నయ్యో, పోతనో కూడా కోరుకోలేదు.

విగ్రహాలు నెలకొల్పుకోవడం వారిపట్ల గౌరవం ప్రకటించుకోవడం కోసం అనుకుంటున్నాం గానీ, ఎండకూ, వానకూ ఆ విగ్రహాలు అలా నిలబడి... పక్షుల రెట్టలకూ, రోడ్ల వాహనాల దుమ్మూ, ధూళికీ లోనవుతూ వుండడం... వారిపట్ల మర్యాద సూచకమా? అవమానమా?
అభిమానం పేరుతో ఆ విగ్రహాల మధ్య కూడా వైషమ్యాలు మనవేం సృష్టించుకుని, నచ్చని వాటిని ధ్వంసం చేసుకోవడం నచ్చేవాటికి దండలూ, అభిషేకాలూ అంటూ పూనుకోవడం... ఒకరకం ‘వెర్రి’కాక ఇంకేమిటనిపిస్తుంది’’ అన్నాడు ప్రసాదు కూడా.

"విగ్రహాల పేర నిగ్రహాలు కోల్పోతూ, ఆగ్రహాలు పెంచుకుని ఆ మహనీయుల త్యాగాలు, మంచిపనులు అనే వాటిని ఆచరించడం అనే వాటికి తిలోదకాలు ఇచ్చి, వట్టి భజనలూ, ఆరాధనల్లో పడడం ‘అవివేకం’ అని గ్రహించరు సరికదా, ఇప్పుడో కొత్త ట్రెండు వచ్చింది. ఒక వర్గం నాయకుడి విగ్రహానికి ఏదో అపచారం జరిగిందని ఎదుటివర్గం తాలూకువారి నేత విగ్రహాన్ని తాము ధ్వంసం చేయడమో, పాడు చేయడమో ఒక రకం పని అయితే, తమ నేత విగ్రహానికి అవమానం జరిగిందని ఆ విగ్రహానికి ‘పాలాభిషేకాలు’ చేస్తున్నారు!

కడుపునిండా గంజినీళ్లు కూడా దొరకని వారున్న నేటి సమాజంలో - విగ్రహానికి శుద్ధి అనో, అభిషేకం అనో అలా బిందెల బిందెల పాలు వృధా చేసే బదులు, వాటిని పేదవారు త్రాగేందుకు ఇవ్వవచ్చుకదా! అన్ని లీటర్ల పాలు వృధా చేసేబదులు నలుగురి ఆకలి తీర్చవచ్చుకదా! తల్లిపాలు కూడా నోచని పసిపిల్లలకు పట్టించవచ్చుకదా! కానీ ఆ పని చేయరు.

‘విగ్రహం’ అంటే తమ వ్యక్తిత్వంలో వుండాల్సిన ‘ఉదాత్తత...!’ ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటే ధర్మం మూర్త్భీభవించిన వాడు రాముడు అని’’ అన్నాడు సుందరయ్య.


‘‘నాలుగు రాష్ట్రాల ఎన్నికలయ్యేంత వరకూ - తనదీ, తన పార్టీ గుర్తువీ విగ్రహాలు నెలకొల్పిన మాయావతి విగ్రహాలమీద, ముసుగులు కప్పమని ఎన్నికల కమిషన్ ఆదేశించింది కానీ .... అసలు నన్నడిగితే విగ్రహాలు నెలకొల్పకుండా ఒక చట్టం చేసేయాలి.

ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలు కూల్చివేసారని బాధపడ్డాం! కానీ అసలు ఆ విగ్రహాలన్నింటిలోనూ - వాటిని నెలకొల్పిన పూర్వ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. పోలికలే వున్నాయనీ, అప్పట్లోనే వ్యాఖ్యానం చేసిన వారున్నారు!


‘‘చిత్తంలో ప్రతిదెబ్బా
సుత్తిదెబ్బగా మలచిన
మానవమూర్తిని మించిన
మహిత శిల్పమేమున్నది’’


అని బోయి భీమన్న గారన్నట్లు - ఉదాత్త వ్యక్తిత్వాలతో నిగ్రహమే విగ్రహంగా రూపుదాల్చిన గుణవర్తనులు వందనీయులు!

ఆదర్శమూర్తుల నామ భజనంతో విగ్రహారాధనంతో ఉత్సహించడం కాదు, ఆ మహనీయులు ప్రవచించిన ఆదర్శాలను అమలుపరిచేందుకు అక్షరాలా కృషిచేయాలి! రాతిబండలను చెక్కి కొలిచే రీతి కాదు వారు చూపిన వెలుగుదారుల్లో పయనించి వెలుగొందాలంతే!’’ అని లేచాడు రాంబాబు.


0 comments: