ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, January 22, 2012

కామెంట్(రీ)కవిత్వం


ప్రముఖ సాహితీ విమర్శకులు,ఇటీవలే 'భాషా శిక్షణా కళానిధి 'బిరుదు గ్రహీత డాక్టర్.ద్వా.నా.శాస్త్రి (ద్వాదశి నాగేశ్వర శాస్త్రి)నా 'కవికాలం' సమకాలిక సంఘటనల స్పందనాత్మక కవిత్వ పుస్తకంపై ఆoధ్రభూమి దినపత్రిక ఆదివారం (22.1.2012) అక్షర పేజీలో చేసిన సమీక్ష

ఫాత కొత్తల మేలుకలయికగా రాసే సుధామ సరికొత్త కవితా సంపుటి ‘‘కవికాలమ్’’.

నిజమే, ఇది విలక్షణమైన కవితా సంపుటి! ఇటువంటి కవితా సంపుటి ఇంతవరకు రాలేదు. సుధామ సరికొత్త ప్రయోగం చేశారు.

2007-2009 కాలం మధ్య దేశవిదేశాలలో జరిగిన ముఖ్య సంఘటనలకు స్పందించి రాసిన కవితల సమాహారం ‘‘కవికాలమ్’’. ఇలా రాయడానికి కవి హృదయం ఒకటీ చాలదు, సమకాలీన స్పృహ వుండాలి. దానిని మననం చేసుకొని అక్షరబద్ధం చేయకలిగిన ప్రతిభ వుండాలి. అయితే సంఘటనలకు ఎప్పటికప్పుడు స్పందించి రాయాలన్న తపన వల్ల కొన్ని కవితలలో కవిత్వం పలచగా ఉండవచ్చు. కానీ స్పందన ముఖ్యం.

పుస్తకం ముందుమాటలో గుడిపాటి చెప్పినట్టు ఇదొక విలక్షణ పఠనానుభవం కలిగిస్తుంది. సమకాలీన సంఘటనలపై వ్యాసాలూ విశ్లేషణలూ వేరు. కవితా రూపంగా వ్యక్తీకరించడం వేరు. ఈ కవితా సంపుటి కవిత్వానికి ఒదగని అంశం ఏదీ ఉండదని చాటి చెప్తుంది.

‘‘కీర్తిశేషులు ఖాళీచేసిన సీట్లలో
సహగమన సతులుగా కాక
మహిళలు సాధికారకతతో
రాజకీయాధికారంలోకి’’ రావాలంటారు సుధామ.


నిజమే మహిళా రాజకీయ నాయకురాళ్ళు నోరెట్టుకునో, బురద జల్లో ‘‘మీడియా’’లో ప్రముఖులయ్యారు. త్వరలో మొగుడుపోతే బాగుండు. రాజకీయాల్లో వెలగవచ్చు అనే భావన ఎక్కువైనా ఆశ్చర్యపోనక్కరలేదు.
మన దేశంలోని మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ పదవులలో గల వారికి ప్రభుత్వం ‘‘సెక్యూరిటీ’’పేరు మీద ఖర్చు పెట్టే డబ్బుతో దేశంలో నిరుద్యోగం లేకుండా చేయవచ్చు. పేదరికాన్ని సగానికి సగం పోగొట్టవచ్చు. అందుకే సుధామ వాస్తవంగా ఇలా చెప్తారు-

‘‘చివరి రక్తపు బొట్టువరకూ
ప్రజాసేవకే అంకితం అనేవాళ్ళు అంగరక్షకులకై
అంగలార్చడం ఎందుకు.’’

ఎందుకంటే ప్రజలకి ‘‘మా నాయకుడు’’ అనే విశ్వాసం లేదు గదా?

పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు పరిపాలన అంతమైంది. తృణమూల్ మమత పీఠమెక్కింది. ఎందువల్ల?

‘‘నందిగ్రామ్! ప్రత్యేక ఆర్థికమండలి
ప్రతిష్ఠాపనకు పదివేల ఎకరాల స్వాధీనమా?’’


ఇదీ ప్రశ్న. పరిపాలనలోకి వచ్చేటప్పటికి సామ్యవాదులు కూడా సామ్రాజ్యవాదులూ, బూర్జువాలు అవుతారన్నమాట!

నిజాం నిరంకుశ పాలనని వ్యతిరేకిస్తూ ఎంతో సాహిత్యం వచ్చింది. దాశరథి, యాదగిరి వంటి కవులెందరో నిజాం నవాబును దుమ్మెత్తిపోశారు. ఇదంతా ‘రికార్డ్’ అయింది. అయినా నిజాం నవాబును స్తుతిస్తుంటే సుధామ మౌనం వహించకుండా దీనికి కూడా స్పందిస్తూ ‘‘పోరుబాటే పోవుబాట’’ కవిత రాశాడు.

‘‘రాజకీయ రక్తనిధీ వుంటుంది/
దాశరథీ కరుణా(పయో)నిధీ! హతవిధీ’’


అంటూ అంత్యప్రాసలతో చమక్కులు చేస్తాడు సుధామ.

‘‘స్వదేహీమారక ద్రవ్యం’’ ‘‘శ్రీమద్ మారాయణం’’ వంటి కొత్త పదాలున్నాయి. అన్ని కవితలూ వ్యంగ్యంతోనే లేవు. కొన్ని నిజoగా సేవ చేసినవారిని స్తుతించాడు. ‘వరద’లకి హస్తం కావాలన్నాడు.

నిజానికి ‘‘కవికాలమ్’’అనేది కవిత్వంలో కరెంట్ అఫైర్స్ అన్నమాట! కొందరికి షాక్ ఇచ్చే ‘‘కర్రెంట్’’అఫైర్ కూడా!
ఆధునిక కవిత్వంలో ఇదొక కొత్త ప్రయోగం.

-ద్వా.నా.శాస్త్రి


కవి కాలమ్
సుధామ,
వెల: రు.90/-,
ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 403-విజయసాయి
రెసిడెన్సీ, సలీంనగర్,
మలక్‌పేట,
హైద్రాబాద్- 500 036

0 comments: