ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, December 2, 2011

వ్యవస్థీకృతం

‘‘విత్తు ముందా? చెట్టు ముందా? అన్నట్లు, అధికారంవల్ల అవినీతియా? లేక అవినీతి వల్ల అధికారమా? అన్న విచికిత్సా వుంది! ఈ రెండింటికీ- ‘రాజకీయం’తో అనివార్యంగా లంకె వుంది. ఇవాళ్టి రాజకీయాల్లో సగానికి పైగా నాయకులు అవినీతితో అధికారాలు హస్తగతం చేసుకున్నవారు కాగా, అధికారంతో అవినీతిని శాఖోపశాలుగా విస్తరించి, వ్యవస్థీకృతం చేస్తున్న వారున్నారు’’ అన్నాడు రాంబాబు టీవీ రిమోట్ పక్కనపెడుతూ.

‘‘చూడు రాంబాబూ! నిజానికి ‘ప్రభుత్వ పాలన’ అనేది అధికారుల మీద ఆధారపడి వుంటుంది. రాజకీయాలతో వచ్చి మంత్రులయినవారిని నిజానికి వారి- ఆయా శాఖల ‘అధికారులే’ గైడ్ చెయ్యాలి. నిజమే! రాజకీయ ఒత్తిడులు అధికారులకు వుంటాయి. కానీ వాటికి లొంగిపోని స్థైర్యం, నిజంగా ప్రజాహితం కోరే ప్రణాళికలూ, పద్ధతులూ నియమానుసారం అమలుపరచడం- అధికారుల పనే. ‘రూల్స్’ అనేవి వుంటాయి కదా! ఒక ‘పాలనా చట్టమూ’ అంటూ వుంది కదా! నియమ నిబంధనలను తుంగలో తొక్కి పనులు చేయించాలనే ఒత్తిడులు రాజకీయంగా వున్నా, చిత్తశుద్ధి, నిజాయితీ వున్న అధికారులయితే- పద్ధతులను ఆ నేతలకు ఎరింగించి, నిజంగా ‘ప్రజా సంక్షేమం’ కోసమే అయితే, వాటిల్లో సడలింపులకు గల అవకాశాలనూ విశదపరుస్తారు. అంతేగానీ, అడ్డగోలుగా పనులు చెయ్యరు. లంచాలు తిన నేర్చినవాడు- తినిపించడమూ నేరుస్తాడు. ఒక పని సానుకూలం కావాలంటే కొన్ని ‘అంచెలు’ వుంటాయి. ఆ అంచెలంచెలు దాటుకుంటూనే- ఏదయినా పని, సాఫల్య స్థాయికి వచ్చి నెరవేరుతుంటుంది. అక్రమాలకూ, నియమ విరుద్ధాలకూ పాల్పడి పని చేయిచుకోవడం కోసం, లేక త్వరితగతిన లాభపడడం కోసం అవరోధకమయ్యే అంచెలను అవినీతితో లంచాలిచ్చి దాటేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా, యోగ్యతా యోగ్యతల ప్రమేయం లేకుండా, పనులు సానుకూలం చేసుకుంటున్నవారుంటున్నారంటే- వారికి అధికారులు దోహదపడడంవల్లనే కదా అలా జరిగేది! ఆ ‘దోహదం’ కోసమే అధికార దుర్వినియోగం చేయడం, డబ్బుకో, మందుకో, మరే దేనికో అమ్ముడుపోవడం జరుగుతూంటుంది. ‘అవినీతి’లో వాటాలుంటాయి! ఒకచోట బోలెడు ‘అవినీతి’ మేటవేసిందంటే- అందుకు అంచెలంచెల స్థాయిని పట్టించుకోక అధిగమించి చేసేయడం కొన్ని సందర్భాల్లో జరిగితే, ఆయా స్థాయిలకు తగిన శాతం అవినీతితో తృప్తిపరచి, పేరుకు కాగితాలమీద పద్ధతి ప్రకారమే చూపెడుతూ, తమ వారికో, ఆశ్రీతులకో, ఒత్తిడులు తెచ్చినవారికో, లేక భయహేతువులుగా మారినవారికో- వారికి కావలసిన పనులు సానుకూలం చేసేసే వారున్నారు. ఐ.ఏ.యస్ అధికారి అయిన శ్రీలక్ష్మి ‘స్ర్తి’ అయినా అరెస్టు చేయబడే స్థితికి వచ్చిందంటే- ఓబుళాపురం మైనింగ్ లీజుల్లో జరిగిన అవినీతి అక్రమాలతో సంబంధం వుందని ఋజువవడమే కదా! ‘స్ర్తి’అని ఆవిడ మీద జాలిపడాల్సిన స్థితి లేకుండా, అవినీతికి ‘కొమ్ము’ కాసిందనేకదా! అంచేత-కేవలం రాజకీయకులు, రాజకీయకుల ఒత్తిడులు మాత్రమే కాదు, సచివాలయ అధికారగణం పాత్రే అమితంగా వుందనాల్సి వస్తోంది! ఆమె ఇంటిమీద, ఆస్తులమీద కూడా సిబిఐ దాడులు నిర్వహించింది. అర్హతకు మించిన ఆస్తులున్నట్లు ఆమె విషయంలోనూ అవగతమయ్యాకనే కదా స్థితి అరెస్టు వరకూ వచ్చింది’’ అన్నాడు సుందరయ్య.


‘‘అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు.. అని శ్రీశ్రీ ఏనాడో పాట కట్టాడు. రాను రాను అవినీతి అనివార్యమైన వ్యవస్థగా రూపొంతూండడమే విషాదం! ఎవడికివాడు, ఎక్కడ వీలయితే అక్కడ, ఎంత వీలయితే అంత- దండుకు తినడం, దోచుకోవడం పెరిగిపోయింది. అది‘దోపిడీ’ అనికూడా అనుకోలేనంత ‘అలవాటుగా’ మారిన క్రియాకలాపమైపోయింది. చట్టాలను, న్యాయాన్ని కూడా కొనగలమన్న ‘భరోసా’వల్ల కాదూ- నేరాలు పెరిగిపోతున్నది! ఓ అక్రమ నిర్మాణం సంగతే తీసుకోండి. నియమ విరుద్ధంగా నిర్మించి ఆ తరువాత ఎలాగో ‘రెగ్యులరైజ్’ చేసుకోవచ్చనీ, అధికారుల చేతులు తడిపితే చూసీ చూడనట్లు ఎలాగూ వదిలేస్తారనీ నమ్మకం పెరిగిపోయింది. అక్రమార్జనాపరులకూ, అవినీతిపరులకు అసలు భయం ఏది? ‘శిక్షలు’ పడతాయన్న జంకు ఎక్కడుంది? ఏ నేరం చేసినా ఎలాగయినా తప్పించుకోవచ్చనీ, ఏ కారణంవల్లనో తమ వ్యవహారం బయటపడినా- తాము వెళ్ళే ‘జైల్లో’నూ విలాసవంతమైన సౌకర్యాలు సమకూర్చుకోగలమనీ, తమకు పడే జరిమానా సొమ్ము, తను అక్రమంగా ఆర్జించిన సొమ్ములో ఏపాటిదిలే అనీ, ఒక ‘దిలాసా’ లభిస్తున్నప్పుడు- దానికితోడు- ‘నెగిటివ్’ అనే అనుకుంటున్నా, మీడియాలో తమకు బోలెడు ప్రచారం లభిస్తుండగా, తమ మీద పడ్డ మచ్చ’ చందమామలోని అందం'గా మలిచేసుకోగలమన్న అలవోకతనం నైజగతమైపోయినప్పుడు, పాపులకే భగవంతుడి క్షమా, ఆదరణా లభిస్తాయన్న భావనా-నేటి ‘భక్తి’లోనూ బాగా చొరబడిపోయినప్పుడు, ఇక ‘బరితెగించడం’లో బరాబరులేవీ! నేరం చేసినా ‘లైట్ తీసుకో’ వ్యవహారం అంతా విస్తరిస్తూంటే- కఠిన శిక్షలూ- క్రూర దండనలూ దేనికీ లేక, ఆఖరికి ‘ఉరిశిక్ష’ కూడా సిరిరక్ష’గా మార్చేసుకోగల దారులు ఏర్పడినప్పుడు, వ్యవస్థలో మంచికి మార్పు ఎలా సాధ్యం? అసలు ‘మంచి’కే నిర్వచనం మారిపోయింది. సత్యం 'వధ’-ధర్మం ‘చెఱ’ జరుగుతూనే వుంటోంది. నువ్వూ నేను మాట్లాడితే సంభాషణ అయినట్లు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అక్రమాలు, విశృంఖలత్వం, నీతిమాలినతనం, తిలోదకాలిచ్చిన పాపభీతి- వీటి మొదటి అక్షరాలన్నీ కలిసే ‘అవినీతి’ అవుతోంది. అంచేత అది సమీకృతమై, ఒక్కటిగా, తిరుగులేని విశ్వరూపంగా, వ్యవస్థీకృతమవుతోంది! ఈ వ్యవస్థను సమూలంగా మారిస్తే తప్ప- ‘సువ్యవస్థ’ సాధ్యంకాదు. విధ్వంసం నుండీ, వినాశనం నుండీ కాకుండా - ‘చైతన్యంతో ‘వినిర్మాణం’ చేద్దామనుకునే అన్నా హజారేలూ, జయప్రకాశ్‌లూ కూడా ఈ చట్రంలోంచి ఒదిగి ఎదిగిన కొందరున్నారు. మరి ఎప్పటికో అసలు విప్లవం’’ అని లేచాడు రాంబాబు.

0 comments: