ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, October 21, 2011

సకల జన దీప్తి‘‘ఇంతకీ ‘ఉద్యమం నెలబాలుడు’ శుక్లపక్షమా? కృష్ణ పక్షమా? తెలీడంలేదు’’ అన్నాడు సన్యాని పేపర్ టేబుల్ మీద పెడుతూ.

‘‘శ్రీకృష్ణ కమిషన్ ‘మిషన్’ కదా కేంద్రానిది! చూస్తుంటే ‘కృష్ణపక్షం’లానే అనిపిస్తోంది. అయినా ఉద్యమం-నెలబాలుడెందుకయ్యిందీ! ముప్ఫై ఎనిమిది రోజులు దాటిపోతూంటేనూ! సకలం ‘కలకలం’రేపింది కదా! ‘సెగతగిలింది కదా!‘చల్లబడిన ఉద్యమ తీవ్రత అనడం దేనికి?’ అన్నాడు శంకరం.

‘బస్సు రోకో, రైలురోకో, చదువులు రోకో, ఆఫీసుల్లో కర్మాగారాల్లో పనులు రోకో-అంటుంటే, ఇంకా అక్కడ కేంద్రంలో ‘తెలంగాణ రోకో’ అన్నట్టు అధిష్ఠానం వ్యవహరిస్తోందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. మళ్లీ తెలంగాణపై ‘తాజా నివేదిక’ అంటూ, పన్నెండు మంది కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తూ, దీపావళి లోపు నివేదికను-ఎటువైపునుండి ప్రభావితం కాకుండా ఉండేలా, ప్రజల మనోభావాలను ఖచ్చితంగా ప్రతిబింబించేలా , అందించమని ఆదేశిస్తూ, నియమించినట్టు తెలుస్తోంది! భూమి గుండ్రంగా ఉందంటే ఇదేనేమో! బయలుదేరిన చోటికే మళ్లీ చేరడంలా ఉందిది’’ అన్నాడు ప్రసాదు.

‘‘ప్రత్యేక తెలంగాణ వాదం రాజకీయ వర్గాల్లో కాకుండా సామాన్య ప్రజానీకంలో ఏ స్థాయిలో ఉందన్న దానిపై సోనియాగారికి ఇంకా అనుమానాలున్నట్లున్నాయేమో! కాకపోతే ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంటిలిజెన్స్ అధికారులను మళ్లీ నివేదిక కోరడం ఏమిటి’’ అన్నాడు సన్యాసి.

‘‘ ‘జాయింట్ యాక్షన్స్’ కాక, ఎవరి యాక్షన్స్ వారివిగా కనిపిస్తున్నాయాయె! కొందరిది ‘ఓవర్ యాక్షన్’ అయితే, కొందరిది ‘నిల్’ యాక్షన్! ‘యాక్షన్’ చేస్తున్నారో, ‘నిజంగా కోరుకుంటున్నారో’ తెలియని వ్యవహార సరళి కొందరిది! ‘రాజీనామాలు’ అనేదాన్ని ఓ ప్రహసనం చేసారు. ఎలాగూ అంగీకరించరనే ధీమా కొందరిదయితే, అందువల్ల ఒనగూడదేమీ లేదని కొందరిది. నిజమే! మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఎల జీత భత్యాలకూ, వారి సౌకర్యాలకూ, వారిదైనందిన విలాసాలకూ-రాజీనామా చేసినా, చేయకపోయినా కలుగుతున్న ‘విఘాతమేమీ లేదు! వారి ‘జీవన సరళి’ ఏమీ ‘అతలా కుతలం’ కావడంలేదు. నష్టపోతున్నది ప్రజలే! స్వామిగౌడుగారు ఆర్తి చెందినట్టు-ఉద్యోగులు తమ జీతాలను పణంగా పెట్టి, ఇంట్లో వాళ్లను పస్తులు పెట్టయినా-ఉద్యమిస్తుంటే, కార్మికులు రోజు కూలీని కూడా త్యాగం చేస్తుంటే, విద్యార్థులు తమ చదువులను పోగొట్టుకుని-విలువైన భవిష్యత్తును బలిపెట్టుకుంటూంటే, ఎందరో జనంలోని ‘మామూలు ఆవేశ జీవులు’ తెలంగాణ రాదేమోనని-ఆత్మహత్యలు చేసుకుంటూంటే, రహదారి దిగ్బంధాలూ, రైలు రోకోలూ, విద్యాలయాల మూసివేతతో సామాన్యులే రెచ్చగొట్టబడి, అన్ని విధాలా నష్టపోతూంటే-ఏ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీకీ, పార్లమెంటుకూ ఎన్నికై వెళ్లారో, ఆ పెద్ద మనుషులు మాత్రం- తమ తమ పార్టీ, ఆ పార్టీలో తమ స్థానాలూ, తమ పదవులూ, అధికారాలు, తమ వ్యాపారాలూ, తమ ఆర్జనలూ....ఏవీ వీసమెత్తు కూడా నష్టపోకుండా, త్యాగం చేయకుండా, ‘ఉద్యమం’ పేరుతోనే హాయిగా జీవిస్తూంటే, కొందరు ఉద్యమం పేర ఆర్థికంగా ఎదుగుతూంటే, ప్రజలకు ఆగ్రహం కలగదా! ‘‘తమ త్యాగాలన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా?’’ అన్న ఆక్రోశం కలగదా! ఉద్యమ నాయకులు ఎవరూ హైదరాబాద్, ఢిల్లీల మధ్య బస్సులో కానీ, రైల్లో కానీ ప్రయాణం చెయ్యరుగా! వారివన్నీ ‘విమాన ప్రయాణాలే’నాయె! ఆ‘విమానాల రోకో’ ఏం చేయలేదుగా? తమ సొంత కార్లలోనో, లేదా పాపం కార్యకర్తలూ, అభిమానులూ కల్పించిన కార్లూ, జీపులూ...ఏసీ వాహనాల్లో ప్రయాణాలు చేస్తారు గానీ, మామూలు ‘తెలంగాణ జీవి’లాగా ఎర్రబస్సులోనో, పాసింజర్ రైల్లోనో ప్రయాణం చేయరు కదా! ఒక్క ‘సామాన్య తెలంగాణ జన జీవనానికి’ తప్ప, ఉద్యమ నేతలకు జరిగిన హాని ఏమయినా ఉందా? పైగా పోలీసుల జులుం, చట్టాల కొరడాలూ...డబ్బూ, అధికారం, నేతృత్వం ఉన్నవాళ్లనేమీ చేయవు. పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే-రేపు ఉద్యోగాలు రానిది విద్యార్థులకు. చట్ట వ్యతిరేక పనులు చేసారని సగటు ఉద్యోగులను ఇంక్రిమెంట్ అనో, సస్పెన్షన్ అనో, ఉద్యోగంనుంచి బర్తరఫ్ అనో వేధిస్తారు.

'ఏడు మారినా ఈడు ముదిరినా
ఏమి మారినది ఈ లోకంలో'

అని కవి కాళోజీగారన్నట్లు- నేతమారినా, ఉద్యమ స్వరూపం మారినా నష్టపోతుందీ, పోయేదీ ప్రజానీకమే! నేతలూ, సోకాల్డ్ మేధావులూ, రచయితలూ, ఇరవై నాలుగు గంటల నిరంతర ధారావాహిక ప్రసారాల మీడియాల అత్యుత్సాహాలు, వారి స్వార్ధాలూ, సకల ‘కలకలానికీ’ హేతువు అని స్పష్టంగా కనపడుతోంది! వివిధ రాజకీయ పార్టీలలోని నేతల మధ్యే తమ సాధన గురించి ఏకాభిప్రాయం లేనప్పుడు, ‘ఒక్క లక్ష్యం’కోసం వివిధ రూపాల్లో ‘వేర్పాట’వుతూ, ఏకీకృతం కాలేని ‘పిడికిలిశక్తి‘ కానరానప్పుడు, కృష్ణపక్షం తప్ప శుక్లపక్షం అని ఆశ కలిగేదెలా’’ అన్నాడు శంకరం ఆవేశంగా.

‘‘కూల్‌డౌన్ బ్రదర్! కూల్‌డౌన్! ‘సకల జనుల సమ్మె’- ఇలాంటిది దేశ చరిత్రలోనే అపురూపం అన్నారు అద్వానీ. ఒకప్పుడు అధికారంలో ఉండగా కుదరదన్న పార్టీవారే, 2014లో అధికారంలోకి వచ్చి ‘మేమే ప్రత్యేక రాష్ట్రం ఇస్తాం’ అంటున్నారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పెడితే మద్దతిస్తాం అంటున్నారు కానీ, నమ్మించి మోసం చేసిందంటున్న కాంగ్రెస్‌ను నిలదీస్తాం అని జన చైతన్య యాత్రతో 'కాక' పుట్టించగలుగుతున్నారా? ఎవరికి వారికి తెలంగాణ తమవల్లే రావాలనీ, వచ్చినపుడు తమకే ఆధిపత్యం కావాలనే రాజకీయ దురుద్దేశాలు ప్రజలకు కనిపిస్తున్నంత బాహాటంగా, జనచైతన్య ప్రబలత్వం గోచరం కావడంలేదు. సకలం సమాప్తం అయి, సామాన్య జనాకాంక్షతో ‘ప్రభాత’మవుతుందని ఆకాంక్షిద్దాం!’’ అంటూ లేచాడు సన్యాసి.


2 comments:

Anonymous said...

కార్గిల్ యుద్దానికి కాషాయం పూసి, సైనికుల శవాల మీద కావాతు చేసి అధికారంలోకి వచ్చారు వృద్ద జంబూకాలు, ఇప్పుడు తెలుగువా(లే)ళ్ళను విడగొట్టి అధికారానికి యత్నిస్తున్నారు. లీడర్ సినిమాలో అన్నట్టు ఎప్పుడు చస్తారో ఈ శనిగాల్లు అని ఎదురుచూడాలి.

Anonymous said...

మన దేశానికి వచ్చిన freedom కి జరిగిన పోరాటం వయస్సు 3 శతాబ్దాలు,
3 నెలలకు చంకలు గుద్దుకుంటే బ్రిటిష్ వలసపాలకుల్లాగా ఎగిరిపడితే ఎక్కడ పడతారో తెలుసుగా!

Sridhar