ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, June 10, 2011

అవినీతికి ‘పంతం’ లేదా?







‘‘అవినీతికి పంతం లేదా..నా మదిలో రేగే సాయం మాసిపోదా!..’’ అంటూ పాడుకుంటూ ప్రవేశించాడు సన్యాసి.

‘‘నీ తలకాయ్! ఏమిటా పాడడం? అసలు పాట ‘సాహిత్యం’ తెలీకుండా పాడతావేం? ‘‘ఎదురీతకు అంతం లేదా...నా మదిలో రేగే గాయం మాసిపోదా!’’ అనేది అసలు సినిమా పాట’’ అన్నాడు రాంబాబు.

‘‘ అది తర్వాత సంగతి! అవినీతికి ఎదురీత ఎక్కడిది? ఎంతమంది చేస్తున్నారు. పైగా అలా అవినీతి ఉండరాదనీ, అందుకు చర్యలు తీసుకోవాలనీ, దీక్షలు, ఉపవాసాలు చేస్తున్నవారిని అరెస్టులు చేసీ, బెదరగొట్టి, ప్రభుత్వం వ్యవహరిస్తుందో-అవినీతికి వత్తాసు పలుకుతున్నట్లా, అవినీతి వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నట్లా? సాయం చేద్దామని మదిలో ఓ భావన రేగుతున్నా, చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వోద్యోగికేమిటి...ఎవరికయినా, అవినీతిగా ఉండడమే బెటర్, దానికి ఎదురొడ్డిపోక, హాయిగా సంపాయించుకోక ఎందుకు వెర్రివెధవననిపించుకోవడం అనిపించదా!’’ అన్నాడు సన్యాసి.

‘‘అదేం మాట? 2జి స్పెక్ట్రమ్ వ్యవహారంలో ఎందరిని జైలుకు పంపలేదు. అంటే అవినీతిని ‘సహించమనే కదా! పాపం కరుణానిధిగారూ, వాళ్లావిడా తమ కూతురు ‘కనిమోళి’, తీహార్ జైలులో బెయిల్ కూడా దొరక్క కూచుందని కంట తడిపెడుతున్నారు. అసలు ఆమె తప్పేం లేదంటూ తన పితృహృదయం చాటుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిగారు ‘‘తప్పుతనవల్లే’’ అన్నట్లే కదా! ఇప్పుడు సరికొత్తగా బలవంతపు ‘డీల్స్’ కుదిర్చిన దయానిధి మారన్ చుట్టూ కూడా 2జి ఉచ్చు బిగిస్తోంది కదా! ఆయనకూ ‘రాజా’లానే, జైలు తప్పదనీ, ఎయిర్ సెల్ వ్యవస్థాపకుడు శివశంకరన్ తమని మాక్సిస్‌కు అమ్మమని మారన్ బలవంతపెట్టారని బహిరంగపరచడంతో, పదవినుంచి తప్పుకోమని కాంగ్రెస్ సంకేతాలు పంపిందట కదా’’ అన్నాడు ప్రసాద్.

‘‘ ఆమాట కొస్తే, అసలు ప్రధాని యే ‘అసలు నిందితుడ’నే భావనతో జనలోక్‌పాల్ బిల్లులో ప్రధానిని కూడా చేర్చాలని-అవినీతిపై పోరుబాట పట్టిన అన్నా హజారేను, బాబారామ్‌దేవ్‌ను సమర్ధిస్తున్న వారెందరో అభిప్రాయపడుతున్నా, అందులోంచి ప్రధానిని తప్పించాలని కాదు, అసలు ‘బిల్లు’ పాస్ కాకుండా ‘చిల్లులు’ పొడవాలన్న యత్నమే జరుగుతోందన్నది విస్పష్టం! ఇప్పడు కేంద్రం అవినీతిపై పోరు చేస్తున్న అన్నాహజారే, రామ్‌దేవ్ ఉద్యమాలు ‘అసలు అవి, నీతివంతమైనవేనా’ అని ప్రశ్నిస్తూ వారు సామ, దాన, భేదాలకు లొంగేలా లేరని వారిమీదే అవినీతి ఆరోపణలు చేస్తూ-దండోపాయంతో ‘వేధించడానికి’ సమకట్టింది! రామ్‌దేవ్ బాబాకు పదకొండువేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. యోగా, ఆయుర్వేద ఔషధ కంపెనీలు, యూనివర్సిటీ, స్కాట్లండ్‌లో ఓ దీవీ ఉన్నాయి. ఆయన అనుచరుల చేతుల్లో రెండువందలకుపైగా వ్యాపారాలున్నాయి. బాబా ఆస్తులపై విచారణ జరపాలని రంగం సిద్ధం చేస్తోంది కేంద్రం. బాబా రామ్‌దేవ్ దీక్ష సందర్భంగా గాయపడినవారికి మద్దతుగా అన్నా హజారే జంతర్‌మంతర్ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.! రామ్‌దేవ్ కంటే అన్నాహజారే గొప్పవాడేం కాదని విమర్శిస్తున్నారు. అన్నాహజారే లోక్‌పాల్ డ్రాఫ్టింగ్ కమిటీనుంచే తప్పుకున్నా, సమావేశాలకు వారు రాకున్నా మునిగి పోయిందేం లేదని కేంద్రమంత్రి కపిల్ సిబల్ వ్యాఖ్యానించడం చూస్తే, అసలు అవినీతి నిరోధక లోక్‌పాల్ బిల్లుకు ఆదిలోనే బోలెడు ‘హంసపాదులు’, ప్రభుత్వమే సృష్టిస్తోందనిపించడం లేదా’’ అన్నాడు రాంబాబు.

‘‘ఎయిర్ సెల్ వివాదం వల్ల మంత్రివర్గంనుంచి మారన్ ఔట్ అయ్యాడనే అనుకుందాం! ‘ అయినా నేను మాత్రం మారన్’ , అనే అవినీతిపరులకు లోటేముంది? తప్పించు తిరగడం ఎలాగో ‘కనిమొళి’, మన జగన్‌నుంచి నేర్చుకోవచ్చు . కానీ, జగన్ విషయం వేరు! అన్నాహజారేలు, రాందేవ్‌బాబాలు ఎందరు ఎన్ని దీక్షలు చేసినా ‘అవినీతి చేయడమే దీక్ష’గా గలవారిని కదిలించడం చాలా కష్టం! ‘ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెదింకొక దారి’ అన్న సామెతలా, హజారేలు, రాందేవ్‌లు ఉలిపికట్టె’లుగానే ఉంటారు. ‘కరప్షన్’ నిరోధానికి ‘కర్రే’ ఆప్షన్! కానీ కర్ర విరిచి పొయ్యిలో పెట్టడమే పార్టీల, నేతల లక్ష్యం. అందుకే బయటకు మాత్రం అవినీతికి తామూ వ్యతిరేకులమేనని, దొంగయే ‘దొంగ దొంగ’ అని అరిచినట్టు ప్రవర్తిస్తూ, ‘కర్రా విరగక, పామూ చావక’ అవినీతి సర్వం బుసలు కొడుతునే ఉంటుంది. రిటైరైన ఉద్యోగి పెన్షన్ శాంక్షన్ చేయడానికి కూడ లంచం పట్టే ‘అమానవీయం’ విస్తరిస్తున్నప్పుడు - ‘కర్రా విరగదు పామూ చావదు’ అన్నాడు సన్యాసి.

‘‘సామాన్యులను చీమల్లా దోమల్లా చూసే నేతలు, పార్టీలు అధికారాలు చెలాయిస్తున్నా ‘‘బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ’‘ అన్నట్లు ఎప్పటికయినా అవినీతికి అంతం రాదా! ఆశే జీవన శ్వాస. దానితోనే ఎదురీత తప్పదు, సువ్యవస్థకై ఎదురు చూడడమూ తప్పదు! అంటూ లేచాడు ప్రసాదు.

0 comments: