ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 20, 2011

చదువు‘కొంటారా!’
‘‘చదువుకొనాలనీ, ఉద్యోగం చేకొనాలనీ యువత ఆశపడడంలో తప్పేం వుంది చెప్పు!’’ అన్నాడు సన్యాసి.
‘‘నీ వాక్యంలోనే తప్పుందోయ్ సన్యాసీ! యువతకు చదువూ, ఆ తరువాత ఉద్యోగం తప్పనిసరే, కానీ వాటిని ‘కొనాలని’ ఆశించడమే తప్పు మరి!’’ అన్నాడు నవ్వుతూ రాంబాబు.

‘‘బాగా చదువుకుని, మంచి శాతం మార్కులతో ఉత్తీర్ణత లభిస్తేనే కదా, మంచి ఉద్యోగం లభించేది! అందుకోసం కష్టపడి చదవాలి. ఆ తరువాత ఉద్యోగానికి అప్లయ్ చేసినప్పుడు - ఆ ఇంటర్వ్యూలోనూ మెప్పించి, సాధించాలి. అదీ సరియైన పద్ధతి! కానీ విద్యార్థులూ, అభ్యర్థులూ ఈ పోటీ ప్రపంచంలో పరీక్షలు పాసవడానికీ, ఉద్యోగాలు సంపాదించడానికీ నిజంగా చాలా కష్టపడుతున్నారు అనడానికి ఒక్కొక్కసారి దాఖలాలు కనిపించడం లేదు’’ అన్నాడు ప్రసాదు.

‘‘అదేమిటి? పరీక్షలు పాసయిన వారూ, ఉద్యోగాలు సంపాదించిన వారూ, అవి తమ కష్టంతో సంపాదించుకున్నవి కావంటారా’’ అన్నాడు సన్యాసి ఊరికే డబాయింపుగా.

‘‘అందరి విషయంలోనూ ‘కష్టం’ అనేమాట వర్తిస్తుందిలే! కానీ చూసావ్! నువ్వన్నట్లు - చదువు ‘కొనే’ కష్టం కొందరిది. ఉద్యోగం చే‘కొనే’ కష్టం మరికొందరిది. ఒకప్పుడు పోస్టు గ్రాడ్యుయేషన్ చేయడమే చాలా గొప్ప! ఆ తరువాత ‘సిహెచ్‌డి’ చేసి ‘డాక్టరేట్’ సంపాదించడం అనేది మరీ ఘనతగా ఉండేది! కానీ ఈ రోజుల్లో ‘డాక్టరేట్లు’ చాలా చవక అయిపోయాయి. పరిశోధనల పేరుతో వస్తున్న సిద్ధాంత గ్రంథాలలో ‘సరుకు’ ఏమీ లేకపోయినా, డబ్బులు పెట్టి డాక్టరేట్లు కొనుక్కోవడం జరుగుతోంది! ఇంతమొత్తం డబ్బు చెల్లిస్తే ‘డాక్టరేట్’ ఇచ్చేస్తామని ఆ మధ్య విలువలను ‘కుప్ప’ కూల్చిన విశ్వవిద్యాలయం గురించీ బాహాటంగానే వార్తలొచ్చాయి! పదులూ, వందలూ కాదు, ఏకంగా ‘వేలాదిగా’ లక్షలు పుచ్చుకుని, లక్షణంగా ‘డాక్టరేట్లు’ పంపకం చేసిన ఘటనలు జరిగాయి. అంతెందుకు? విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా విస్తృతంగా పెరుగుతూ, అవి స్నాతకోత్సవాలలో ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్లూ ప్రహసనంగా మారిన సందర్భాలున్నాయి! అన్ని విశ్వవిద్యాలయాలకూ గవర్నరే ఛాన్సలర్‌గా ఉంటాడు. కానీ వైస్ ఛాన్సలర్లు యూనివర్శిటీ అధిపతులుగా ఆశ్రీతపక్షపాతాలకీ, బంధుప్రీతులకీ, అవినీతికీ లోబడి ‘డాక్టరేట్ల’ పంపకాలు చేసే పనులు జరగనే జరుగుతున్నాయి. గవర్నరే నివ్వెరపోయిన సందర్భాలూ ఉన్నాయిట’’ అన్నాడు ప్రసాదు.


‘‘సరే! కొన్ని ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాలూ, విదేశాలలోని విశ్వవిద్యాలయాలు కూడా వాటి గుర్తింపు సంగతేమిటో తెలీదు గానీ, అవి తమ ప్రతిభను గుర్తించి డాక్టరేట్లు ఇచ్చినట్లుగా పత్రాలు చూపుకంటున్నవారున్నారు! నకిలీ సర్ట్ఫికెట్లు, విశ్వవిద్యాలయం సీల్‌తో సహా ముద్రించి నేరుగా అమ్మకానికి పెట్టిన నేర కథనాలూ ఉన్నాయి. నకిలీ సర్టిపికెట్లతో ఉద్యోగాల్లో చేరి, ఆ తరువాత బండారం బయటపడిన బడాబాబులూ కొందరున్నారు’’ అన్నాడు రాంబాబు.

‘‘నిజమే! కష్టపడకుండా సునాసయంగా డిగ్రీలు సంపాదించేయాలనీ, అర్హతతో నిమిత్తం లేకుండా మంచి ఉద్యగాలు సంపాదించేయాలనీ, ఆత్రపడే వైఖరివల్ల యువతలో కొందరు వక్రమార్గాలు పట్టి అలాంటి నకిలీ సర్ట్ఫికెట్లు సంపాదించడం, ఉద్యోగాలు కొనుక్కోవడం చేస్తున్నారు. అంతెందుకు? పోలీస్, కస్టమ్స్, కమర్షియల్ టాక్స్ వంటి డిపార్టమెంట్స్‌లో ఉద్యోగం సంపాదించడానికి ఎంత డబ్బయినా ఖర్చు చేయడానికి సిద్ధమై అంతకు రెట్టింపు ఉద్యోగం చేస్తూ సంపాదించుకోవచ్చనే వైఖరి, కొందరిలో ఉంది! అందుకే ఎంతటి అక్రమాల కయినా వారు సిద్ధమవుతున్నారు. ఈ మధ్యే హైదరాబాద్ సైబరాబాద్ పోలీష్ కమిషనర్ - దొంగ ఉద్యోగాలు సృష్టించి, లేని కంపెనీలలో ఉద్యోగాల నియామకం చేస్తూ, లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారట! దొంగ సర్ట్ఫికెట్లకే కాదు, దొంగ ఉద్యోగాలకు కూడా పాపం డబ్బులు చెల్లించి, మోసపోతున్న యువత ఉంది మరి. ఏదో విధంగా పైకి రావాలనే దురాశే, వారిచేత అలా మోసగాళ్ళ వలల్లో చిక్కేలా చేస్తోందని వేరే చెప్పాలా?’’ అన్నాడు సన్యాసి.

‘‘అవును సన్యాసీ! ‘ఆశవేరు’, దురాశ వేరు. ‘ఆశతో కష్టపడడానికీ, దురాశతో కష్టపడడానికీ తేడా ఉంది! స్వయం ప్రతిభలేక, డబ్బుతో చదువునూ, ఉద్యోగాలనూ కొనుక్కోవాలనుకోవడం కచ్చితంగా దురాశే! ఇటీవల ‘క్వినర్ డాట్ కామ్’లో ‘జాబ్స్’ క్రింద వచ్చిన ప్రకటనలు కొన్ని చూస్తే - ఉద్యోగాల్లో చేరడానికి కొన్ని కంపెనీలు ‘అనుభవం’ అడుగుతున్నాయని, అలాంటి అనుభవం ఏమీ లేకున్నా, ఎక్స్‌పీరియన్స్ సర్ట్ఫికెట్లు జారీ చేసేవిగా ఉన్నాయని తేలిందిట! ఉద్యోగం చేయాలంటే అనుభవం కావాలి. అనుభవం కావాలంటే ఉద్యోగం చేయాలి. అంచేత ఒక ఉద్యోగం కోసం లేని ఉద్యోగం ఒకటి చేసి అనుభవం గడించినట్లు ప్రమాణ పత్రాలు పంచే నేరమయ వెసులుబాటూ కల్పిస్తున్నారన్నమాట’’ అన్నాడు ప్రసాదు.

‘‘నిజానికి కొనే్నళ్ళ క్రిందటిలో నిరుద్యోగ సమస్య యువతను మరీ భూతంలా భయపెడుతోంది అనలేం! గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించాలనే వెంపార్లాటా ఇవాళ కుర్రవాళ్ళల్లో తక్కువే! ప్రైవేటు కంపెనీలూ మంచి వేతనాలు చెల్లిస్తున్నాయి. అయితే - ఆ కంపెనీల్లో సిర్థరమైనవేవీ డబ్బులు తీసుకుని ఉద్యోగాలిచ్చి, మహాఅయితే నెలో రెండునెలలో జీతం అంటూ విదిల్చి ఆ తరువాత బోర్డు తిప్పేస్తున్నవీ, జెండా ఎత్తేస్తున్నవీ ఎన్ని అనే స్పృహ, నిఘా నేడు చాలా అవసరం! అవలీలగా డబ్బు సంపాదించడానికి అనేక అక్రమ మార్గాలు, తరుణోపాయాలు పొటమరిస్తున్నాయ. విదేశంలో విద్య, ఉద్యోగం అనే యువతరంలోని ‘మోజూ’ని తమకు అనుకూలంగా మలుచుకుని మోసం చేసి డబ్బు సంపాదించే వ్యక్తులూ, కంపెనీలూ వెలుస్తున్నాయి. చదువైనా, ఉద్యోగమైనా అవినీతితో అక్రమమార్గాం కాకుండా స్వశక్తితో, తెలివితేటలతో సంపాదించుకున్నప్పుడే అసలైన జీవన వికాసం పురోగతి’’ అన్నాడు రాంబాబు సన్యాసి భుజం తట్టివేస్తూ...

                                                                  


0 comments: