ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, April 17, 2011

మోర్సింగ్ మీద మాల్కౌస్ రాగం



నిజంగా... ప్రయోగాత్మకమే! -సుధామ


మోర్సింగ్ మీద మాల్కౌస్ రాగం (ప్రయోగాత్మక పద్యాలు) రచన: ఎలనాగ వెల: రూ. 30/- పాలపిట్ట బుక్స్, 403 విజయసాయి రెసిడెన్సీ సలీంనగర్, మలక్‌పేట హైదరాబాద్-౩౬


‘‘పద్యం రాస్తే దానికి ఒక తూగు, లయ, పద్యం అనేది ఛందోమయం కావడం వల్ల, అనివార్యంగా వచ్చి చేరతాయి’’ అని అధికసంఖ్యాకుల భావన. శ్రీశ్రీ మహాప్రస్థానంలోని కవితల్లో ఛందోలక్షణాలు పాటించడం వల్ల వాటికి ఒక ఊపు, తూగు, ధారణావకాశం వచ్చి చేరాయని పలువురు పేర్కొంటూ వుండడం కూడా కద్దు. ఛందోబందోబస్తులని ఫట్‌ఫట్ మని త్రెంచడంతో వచనకవిత స్థిరమైంది. కుందుర్తి వంటి కవులు వచనకవితా వికాసానికి దోహదం చేసినా, కుందుర్తి కవితల్లో కూడా అంత్యప్రాసల వంటి సంవిధానాన్ని చూడగలుగుతాం. యతి, ప్రాసల వంటి నియమాలు పాటించినప్పుడు, గణబద్ధంగా రచన సాగించినప్పుడు, పద్యం లలితపదాలతో నయినా, సమాస భూయిష్టంగానయినా, గంభీరంగా ద్యోతకమవుతుంది. కానీ పద్యం రాసి ‘వచన కవిత’ అనిపించేయడం నిజంగా ప్రయోగాత్మకమే!




‘పద్యం రాయడం చేతకానివారే వచన కవిత రాస్తారు’ అనే మాటను పరాస్తం చేస్తూ ‘ఎలనాగ’గా కవిలోకంలో గుర్తింపు పొందిన డాక్టర్ నాగరాజు సురేంద్ర వచనకవితలో వుండే సాదాసీదా పదాలను వినియోగిస్తూనే నాలుగు పాదాలుగా కాక, వచన కవిత్వపు తరహా పాదవిభజన పాటిస్తూ, గణాలు, యతిప్రాసలు కుదిరిస్తూనే వచన కవిత అనిపించే పద్యాలను ‘మోర్సింగ్ మీద మాల్కౌస్ రాగం’ పేరుతో వెలువరించారు. ముప్ఫై ఖండికలుగా వెలువరించిన ఈ వచన పద్యకవితా సంపుటిలో విషయాలు కూడా ఆధునిక అంశాలే. సమాజగత ఆలోచనాత్మక ఇతివృత్తాలే. ‘ప్రక్రియ పరమైన రచనా, వైవిధ్యాన్ని సాధించిన తృప్తికోసం ఇలాంటి రచన చేసా’నని ఎలనాగ అంటున్నా, కవిత్వం అనేది వుంటే - ప్రక్రియ ఏదీ అవరోధం కాదనీ, ప్రక్రియ కవితాభివ్యక్తికి ఒక వాహిక మాత్రమేననీ అర్థం చేసుకోగలుగుతాం!




వచనకవిత ‘స్వేచ్ఛను’ ప్రధానంగా సంకల్పించింది. భావవ్యక్తీకరణకు వ్యాకరణాల సంకెళ్లు, ఛందస్సుల సర్పపరిష్టంగాలూ పద్య నిర్మాణంలో ఉన్నాయనీ, వాటిని త్రెంచి పారేయడమే సంకల్పమనీ అభ్యుదయ కవులు చెబుతూ వచ్చారు. ఏ నియమాలకూ కట్టుబడని వ్యక్తీకరణ స్వేచ్ఛతో కేవలం బుద్ధి, హృదయమే ప్రధానంగా నిర్మితమయ్యే వచన కవితలోనూ ‘మినీ కవిత’ భావచిత్ర శబలతతో రూపుదిద్దుకుంది. కానీ మినీ కవిత అనుకుండా - నానీలనీ, రెక్కలనీ, చుక్కలనీ, హైకూలనీ, టాటూలనీ, దాదీలనీ, వ్యంజకాలనీ రకరకాల పేర్లతో ప్రయోగంగా పుట్టుకొచ్చిన కవితాప్రక్రియల్లో మళ్లీ పాదనియతి, అక్షర నియతి అనే సంకెళ్లు తీరికూర్చుని తగిలించుకోవడం ఎందుకో అర్థం కాదు. ఇవాళ ఒక వంక పద్యాన్ని నిరసిస్తూ ఈ పని చేయడం మరీ విడ్డూరమే! ప్రక్రియ ఏదయినా కవిత్వాంశ ప్రధానం. పద్యంలో వ్యర్థపదాలు గణయతుల నియమాలవల్ల వచ్చాయనే వారు నేడు అసలు ఈ చిరుకవితల పేరిట - భావసాంద్రతనే బలిపెట్టి, అతివేల హేలగా, వందలాదిగా కూర్చి, గ్రంథాలను వెలువరించడం, కవిత్వంలో నాయకత్వ మోజులు పెరిగిపోవడం, ఒక సమకాలీన వైచిత్య్రం.




సరళ పదాలతో, సమాసబంధురత తగ్గించి, భావచిత్రాలతో, చూడటానికి వచన కవిత్వంలానే స్పష్టంగా కనిపించే ‘ఎలనాగ’ పద్యాలు, దైనందిన జీవిత పార్శ్వాలనే స్పృశిస్తూ పకడ్బందీగా సాగడం కనిపిస్తుంది. ముఖ్యంగా పద్యకవులు ఈ గ్రంథాన్ని చూడడం అవసరం. ఎందుకంటే పద్యం అంటే ప్రాచీన వాసన గుబాలించేదేననే భావన, పద్యంలో పదాలు భాషా పటుత్వాన్నీ, పాండిత్య ప్రకర్షనూ వెల్లడించేదిగా ఉండాలన్న ఆలోచన, ఇంకా పలువురిలో కంఠదఘ్నంగా వుంది. ఉత్పల మాలలు, చంపక మాలలు, మత్త్భాలు, సీసాలు, శార్దూల విక్రీడితాలు అనగానే - ఒక గాఢమైన సమాసభూయిష్ట పదసరళి వుండి తీరాలనీ, ఆటవెలదులు, తేటగీతులు కొంచెం లలిత హేతువులనీ, అనుకోవడం మామూలే! కానీ ఎలనాగ పద్యాల్లో వృత్తాలు, సీసాలు కూడా మామూలు మాటతీరులో సాగడం నిజంగా ప్రతిభాయుత ‘కవన’ మహాత్యమే!




' కవితలు రాస్తివా అదొక కమ్మని హాయి మనోజ్ఞమైన ఊహ ఒకటి అంతరంగపు విహాయస వేదిక మీద తాండవించి విమలశోభతో ఎగసి చిత్తరువై ఒక అంతరింద్రియాన్ని విరయజేసెనా పుడమినే గెలిచిన సంబరం కదా కవితారాధకులందుకే అధమ ఆకాంక్షల్ని తనే్నసి ఈ కవనానే్న తమ జీవితాన ప్రియ లక్ష్యంగా ప్రతిష్ఠించడం నవలోకాలకు లేచిపోయి మహదానందాన్ని జుర్రేయడం కవులూ అన్య కలావికాసుకులకే కల్గే అదృష్టం కదా 'ఇది వచన కవిత కాదనీ, ఒక చంపకమాల, మత్త్భే పద్యం వరుసగా వచ్చినవనీ, చెబితే గానీ, నమ్మకం కురదు కదా! ఇలాంటి ప్రయోగవైచిత్రినే ఇందులోని ఖండికలన్నింటా కవి పాటిస్తూ వచ్చారు.




‘‘ ‘‘చూశావా? అసలెన్ని తీర్ల ఉలుకో - చూశావుటోయ్! బల్లిపడ్తే శోకం - ఇక పిల్లి అడ్డు పడితే డీలా - అరే తుమ్ము కూడా శాపంకు సమానమే - గృహము కడ్తావా? భలే - వాస్తు శాస్త్రం శోకాలకు నాశకం - కనుక విశ్వాసాన్ని ఉంచందులో - ఈ తీరే మన వాలకం ముదరితే ఏ తీరు శాస్ర్తియతా చైతన్యం - మన సొంతమై ప్రగతి ప్రస్థానం ఫలిస్తుంది? అంచేత ఈ మన గుడ్డి నమ్మకపు విచ్ఛేదాన్ని కోరాలి. ఔనంతే, కాదంటివా మరి, దురన్యాయాన్ని ఊహించుకో’’ అంటూ వ్ఢ్యౌ నిరసనం చేసే కవితను శార్దూల విక్రేడితాలుగా వినిర్మించారు.




‘‘సమాజపరంగా కళనే సరైన పనిగా స్వప్నించడం ఉత్తమం. అందులోనే జీవన సాఫల్యం వుందంటారు ఎలనాగ. పద్యాన్ని పాడినట్లుగా ఈ రచనలు పాడటానికి చూస్తే ఆ పద్య కవిత్వపు తూగు, లయ ఒక పట్టాన పట్టుబడక పోవడంలోనే ఈ ప్రయోగాత్మకత ప్రతిభ దాగి వుంది! వచన కవితల్లాగానే ఈ పద్యాలూ ధారణకు నిలుపుకోవడం సుసాధ్యమేమీ కాదు. అదీ విశేషమే! ఏమయినా కర్ణాటక వాద్యమైన మోర్సింగ్‌పై, హిందుస్తానీ మాల్కౌంస్ పరికించినట్లు, పద్యంపై వచన కవితను పలికించడం ఒక హృద్యప్రయోగం.




పాతకాలం పద్యమైతే వర్తమానం వచనగేయం అన్న మాటను - వర్తమానం పద్యమైతే పాతకాలమైనా ఛాయామాత్రంగా స్ఫురించక, నవీనతను అభివ్యక్తీకరించడం సాధ్యమేనని నిరూపించిన ‘ఎలనాగ’ ప్రయోగ కేతనం ఇలానే ఎగరాలని కవికి అభినందనలు

0 comments: