ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, April 2, 2011

శుభ 'ఖర ' ఉగాది

సమస్యల భారం పెరిగినందుకేనేమో
సంవత్సరాది ఇలా వస్తోంది

కాలం చాకిరేవువద్ద
ఉతుక్కోవలసిన మాలిన్యాలెన్నో ఉన్నాయి
రాకపోకల ఆసరాకేనేమో
రాసభమై క్షాళిత సభకు రారమ్మంటోంది

వసుదేవుడంతటివాడు
ప్రణమిల్లిన సహనశీలికదా
చాకిరీకి ప్రత్యామ్నాయమై
పనిచేసే సంస్కృతిని ప్రబోధించేది కదా

ఓండ్రింపులు పెరిగిన
నేతల అడ్డ విశేషణాలకాలవాలమై
నిజమే!
పనికిరాని కాగితాల నివేదిక ముక్కలను
ఆత్రంగా దౌడపట్టి
ఎడంకాలి తాపుతో
తిరస్కారోద్యమాన్ని రూపెత్తించగలది కూడాను

ఓర్పుకీ హద్దుంటుంది
సహనానికీ సమయముంటుంది

ఇంటిని కాపలా కాయాల్సిన విశ్వాసాలు
వీగిపోతున్నప్పుడు
దెబ్బలుతినైనా రక్షణార్థమై
ఎలుగెత్తిన వంచన తెలియని కంచరకదా

కాని పనులని తెలిసినా
కాలం ఖర్మానికి వదిలేయలేని ఖర
ఆహ్వానించదగిన శ్రీకర శుభకర

ఉట్టి అడ్డగాడిదికి
సంక్షిప్తం కాదు ఉ.గా.ది
ఉత్సవాల గారవగౌరవ దిక్కుగా
ఉరకలెత్తించగల భారవహి

చెరవడిన నవావతార శిశువును
జలధి దాటించే వేళ
సహకరించేందుకే పాహి పాహి

శ్రీ ఖర ఉగాదీ!
విజయశీకరాలు వర్షించు
మనహ్ శుభ్ర వస్త్రాన్వితయి
జనావళి హర్షించు
అవనతమై నమస్కరించు.

3 comments:

సుధామ said...

ఈ కవిత ఉగాది రోజు (4.4.2011) రాత్రి 9.30కు TV.1 ఛానెల్ టెలీకాస్ట్ చేసింది.

Prasad Cheruvu said...

ఈ కవిత లోతు తెలుసుకు చదవాలి.
"శ్రీ ఖర" ను "శ్రీ కరం"
గా మార్చుకోవాలి

Prasad Cheruvu said...

ఈ కవిత లోతు తెలుసుకు చదవాలి.
"శ్రీ ఖర" ను "శ్రీ కరం"
గా మార్చుకోవాలి