ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, April 1, 2011

హ్యాపీ న్యూఇయర్

హ్యాపీ న్యూఇయర్ ఈ రోజుమీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అంటూ సన్యాసి అందరితో చేతులు కలపడం మొదలుపెట్టాడు రావడం రావడంతోనే.
‘ఏం తమాషాగా ఉందా? ఇలా ఫూల్స్ చేసేద్దామనే’’ అన్నాడు రాంబాబు.
‘‘తెలుగు సంవత్సరాది నాలుగవ తారీకున వస్తోంది. ఆంగ్ల సంవత్సరాది వచ్చి అప్పుడే మూడు నెలలైపోయింది. ఇవాళ ‘ఫూల్స్ డే’. ఇవాళ గ్రీటింగ్స్ చెబుతున్నావంటే, మేం అందరం ‘ఫూల్స్’మనా నీ ఉద్దేశ్యం!’ అన్నాడు ప్రసాద్ చెయ్యి కలపకుండా వెనక్కి తీసుకుంటూ.
‘ఓరి నా ఫ్రెండ్సూ! మీకు అసలు అంతరార్ధం అవగతం కావడంలేదు! ఏప్రిల్ 1నుండే నూతన‘ఆర్థిక సంవత్సరం’ ప్రారంభం అవుతుంది. ‘ధనమూలమిదం జగత్’ అన్నారు. ఎవరు ఎంత కాదన్నా, ఎన్ని నీతి వాక్యాలు పలికినా, డబ్బు చుట్టూనే సుఖాలు, సౌకర్యాలు ఆవరించుకుని ఉన్నాయి. ‘ఉన్నది పుష్టి మానవులకు’ అని, ఆర్థికంగా ఒడిదుడుకులు లేకపోతే జీవితం సాఫీగా వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువ. అంచేత నిజంగా ఈరోజు ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అంటే-ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు అన్ని విధాలా బాగుండాలనే నా శుభాకాంక్ష’’ అన్నాడు సన్యాసి నవ్వుతూ.
‘‘ఔనుస్మీ! అయితే సరే! నీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ ప్రసాద్ షేక్ హ్యాండిచ్చాడు.

‘సన్యాసిని మీరు పాపం అనవసరంగా అపార్ధం చేసుకున్నారర్రా! ‘ఆర్థిక నూతన సంవత్సరం’ అన్నమాట నిజమే గానీ, మీకొక విషయం తెలుసోలేదో? క్రీస్తుశకం ప్రకారం పదహారవ శతాబ్దానికి పూర్వం ఏప్రిల్ ఒకటిని సంవత్సరాదిగా పరిగణించేవారు. ఆ తర్వాత పోప్ గ్రెగరీ ఆదేశాన్ని అనుసరించి జనవరి ఒకటి సంవత్సరాది అయింది. 15వ శతాబ్దంలో మార్చి 21నుంచి ఏప్రిల్ 1 వరకు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేవారు. 1546లో ఫ్రాన్స్ చక్రవర్తి 9వ ఛార్లెస్-క్యాలెండర్‌లో మార్పులు చేయించాడు.్ఫలితంగా-ఏప్రిల్ ఒకటి కొత్త సంవత్సరం అని ఇంకా అనుకునేవారిని, సరదాగా ఆటపట్టించడం జరిగేదట. యూరోపియన్లు రోమన్లు అంతా కూడా ఏప్రిల్ 1ని సరదా దినంగా వేడుకలు పాటిస్తారు’’ అన్నాడు సుందరయి
‘‘కానీ ఏప్రిల్ ఒకటి అంటే ‘ఫూల్స్’ అని కదా! ఇవాళ అసత్యాలను, పరిహాసాలను చేస్తూ, ఆఖరికి పిల్లలు ‘అదిగో బల్లి’ ‘ఇదిగో పిల్లి’ అంటూ కూడా-అవతలి వారిని, లేనిది ఉన్నట్టుగా నమ్మితే ‘ఏప్రిల్ ఫూల్’ అని గేలిచేసి సరదా పడడం జరుగుతోంది కదా! ఇవాళ ఫూల్స్‌డేగానే గుర్తిస్తాం కదా!’’ అన్నాడు ప్రసాద్.
‘‘ ఏప్రిల్ ఫూల్స్ డే అనే ఆచారం-తొలుత ఫ్రాన్స్ దేశంలో మొదలైందర్రా! 1860 ఏప్రిల్ 1న లండన్ నగరంలో ఒక వ్యక్తి కొన్ని వందల మందికి తప్పుడు సమాచారాన్ని అందచేయడం ద్వారా ‘ఫూల్స్’ చేశాడు. క్రమంగా ప్రపంచమంతటా ఫూల్స్‌డే ప్రాచుర్యంలోకి వచ్చింది. 20వ శతాబ్దంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో ఏప్రిల్ క్లబ్‌లు పెట్టారు. ఆరోజు క్లబ్బు సభ్యులు అపరిచితులను సైతం నవ్వించి కవ్వించడం చేసేవారు. అయితే ఎదుటివారిని బాధపెట్టడం కాక నవ్వించడమే-ఇవాళ మనం ‘లైట్ గా తీస్కో’ అంటున్నామే అలా, సరదాగా, తేలికగా భావింపచేయడమే ఉద్దేశం’’ అన్నాడు సుందరయ్య.
‘‘హాస్యం అనేది నవరసాల్లో ఒకటి. ఆ రసం నచ్చని వ్యక్తులెవరూ ఉండరు. ఎటొచ్చి తనమీద తను కూడా జోక్‌లేసుకుని అవతలివారు వేసినా సరదాగా తీసుకోవడం కూడా గొప్ప వ్యక్తిత్వం! 1960లో అమెరికాలోని కాలిఫోర్నియాలో-‘‘ఫూల్స్ డే ఫ్రెండ్స్ సంస్థ’’ మొదలెట్టారని అక్కడి మా మిత్రుడు చెప్పాడు. ఆరోజు ఆ సంస్థ సభ్యులు బోలెడు మంచి మంచి జోకులు, సభ్యులకు ప్రపంచవ్యాప్తంగా అందేలా చూస్తారట! అందులో లక్షలాది సభ్యులున్నారట. ఒకప్పుడు ‘హిప్పీ కల్చర్’ బాగా ప్రాచుర్యంలో వుండేది గుర్తుందా! హిప్పీలంతా కలిసి ఏప్రిల్ 1నుండి 15రోజులపాటు ‘చంద్రుని పండుగ’ అని ఫూల్స్‌డేని చేసుకునేవారు.‘‘ అన్నాడు రాంబాబు తన వినికిడి విషయాలను కూడా వ్యక్తం చేస్తూ. పేపర్లలో-‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటన’’, ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా’’, ‘‘కాంగ్రెస్‌లో విలీనమైపోయిన జగన్‌వర్గం’, ‘‘తెలుగుదేశంలో తెరాస విలీనం’’ వంటి వార్తలనే ఇవాళ మనల్ని ‘ఫూల్స్’ చేయగల ప్రమాదాలున్నాయి! ఒకప్పుడు పత్రికలు ‘ఫూల్స్డేలో’ పాల్గొనేవి కావు కానీ ఇవాళ ఇలాంటి ‘సరదా’-అభూత కల్పనవార్తలను వేసే సంస్కృతిలోకి అవి చేరాయి. ఛానల్స్, మీడియా కూడా ఏప్రిల్‌ఫూల్స్‌డే పోకడలు ఎలా పోతాయో చెప్పలేం! అంచేత వివేకంతో అప్రమత్తంగా ఫూల్స్ కాకుండా ఉండడానికి ప్రయత్నించడం కూడా సరదాలో భాగమే’’ అన్నాడు ప్రసాద్
‘‘నిజానికి ఏప్రిల్ నెల అంటేనే-చెట్లు చిగిర్చి, మ్రోడులు సైతం మొలకెత్తే కాలం! ‘వసంతం’ మొదలు. అందుకే- చైత్రమాసం తొలినెలగా తెలుగుల నూతన సంవత్సరాది మార్చి చివరి నుంచి ఏప్రిల్ మొదట్లో వస్తుంది. క్రైస్తవులు పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే ఏప్రిల్‌లోనే వస్తాయి. యూదుల ‘పీసా’ పండుగ కూడా ఆనెలలోనే. మన ఉగాది, శ్రీరామనవమి ఏప్రిల్‌లో ఆవడం మామూలే! ’’ అన్నాడు సుందరయ్య.
‘‘సంవత్సరంలోని మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు మనమేమిటో మనకు గుర్తు చేసే ప్రతీక ఏప్రిల్ ఒకటి కాబట్టి అదంటే నాకిష్టం! అన్నాడట బెర్నార్డ్‌షా ఒకసారి సరదాగా! ‘ఫూల్’ అంటే ఒకరంగా మూర్ఖత్వం. అంతో ఇంతో మూర్ఖత అందరి సొత్తే! ‘ఆఫ్టర్ ఫార్టీస్ ఎవ్విరీబడీ ఈజ్ ఎ ఫూల్’ అని నలభైల వయసు దాటాక-అది-మరీ పెరుగుతుందని, ఒక ఆంగ్లోక్తి!మన నేతలందరూ ఆ వయసు దాటినవారే కనుక ఆ సారధ్యంలోనే పాలన సాగుతూ ఉంటుంది మరి. కానీ చూసావ్! డబ్బున్నవాడిని ఎంత మూర్ఖుడయినా ‘ఆహా ఓహో’ అని పొగిడేవాళ్లే ఎక్కువ. తెలివి ఎవరి సొత్తంటే సొత్తున్నవాడి సొత్తు అనుకుంటున్నందుకైనా, ఏప్రిల్ ఒకటి నూతన ఆర్థిక సంవత్సరం కాబట్టి-ఖచ్చితంగా ‘విష్ యూ హ్యాపీ న్యూఇయర్!’ అంటూ సన్యాసి మళ్లీ ప్రకటించాడు నవ్వుతూ.

1 comments:

kaartoon.wordpress.com said...

చాలా బాగా చెప్పారండి.!అద్భుతం!!