ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, October 14, 2017

రవి అస్తమించని కవిత్వ సామ్రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.


తను శవమై...
ఒకరికి వశమై...

తనువు పుండై...
ఒకడికి పండై...

ఎప్పుడూ ఎడారై...
ఎందరికో ఒయాసిస్సై... 

(వేశ్య)
అలిశెట్టి ప్రభాకర్ అనగానే చటుక్కున స్ఫురించే కవిత ఇది. నాలుగు పదుల వయసు నిండకుండానే క్షయ వ్యాధిగ్రస్తుడై అస్తమించిన కవి సూర్యుడు ప్రభాకర్. ధ్వంసమై పోతున్న సమస్త మానవ విలువల్నీ, హింసా రాజకీయాల్ని నిరసించడంతోపాటు నిప్పు కణికల్లాంటి కన్నీటి గుళికలుగా సిటీ లైఫ్ పేర పొద్దున్నే దినపత్రికలో ఉదయించి భావకిరణాలు ప్రసరించేవాడు తాను. క్షయ అతని అక్షయ కవిత్వ సంపదకు అవరోధం కాలేదు. మందులు కొనుక్కోలేని నిర్భాగ్యపు నగరంలో జీవిక కోసం తండ్లాడుతూనే పరిపరి విధాల మానసిక వేదనల్నీ, పేదరికాన్నీ భరిస్తూనే అందరికీ అర్థమయ్యే కవిత్వాన్ని రాసి పాఠక లోక పరిధిని విస్తృతం చేసుకున్న దక్షత తనకే దక్కింది. ద్వంద్వ ప్రమాణాల లోకంలో నిర్ద్వంద్వ సాహిత్యోపజీవిగా నిలిచి కవిత్వంలో గెలిచి మరణంలోకి ఓడి మరలిపోయినవాడు ప్రభాకర్.

ఎంత సీరియస్ భావాన్నైనా సామాజిక కోణంలో పట్టుకుని పాఠకుడి గుండెకు, బుద్ధికి కూడా సూటిగా అందించగల నైపుణి అతని కవిత్వానిది. తానేమీ మినీ కవితా ఉద్యమంలో చొరబడలేదు గానీ శ్రీశ్రీ ‘ఆః’ కవితలా, తాను రాసిన అనేక కవితలు ఎందరినో అప్రతిభులను చేశాయి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో సిటీ లైఫ్ పేరుతో రాసిన కవితలే పధ్నాలుగు వందల ఇరవై అయిదు ఉన్నాయి. అందులో 418 కవితలు అదే పేర  1992లో పుస్తకంగా వెలువడ్డాయి.


ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, మరణం నా చివరి చరణం కాదు పేరిటి తన కవితా సంపుటులలోని సమగ్ర కవితలనూ ఒకచోట చేరుస్తూ అలిశెట్టి ప్రభాకర్ కవిత సమగ్ర కవితా సంపుటి 2013లో వెలువడి ఆ వెయ్యి ప్రతులూ ఎంతో తొందరగా చెల్లిపోయాయి. కవిని తమ గుండెల్లో నిలుపుకున్న మిత్రులు జనవరి 2015లో ప్రభాకర్ జయంతి - వర్థంతి (రెండూ జనవరి 12నే కావడం యాదృచ్ఛికమే!) నాడు జగిత్యాలలో అతని శిలాప్రతిమ నెలకొల్పడం జరిగింది. అలిశెట్టి ప్రభాకర్ కవిత మూడోసారి ముచ్చటగా నవ తెలంగాణ ముద్రణగా తాజాగా వెలువడిన సంపుటి ఇది.


ఎంత అర్థం కాకుండా రాస్తే అంత గొప్ప కవిత్వమనీ, నేరుగా అర్థమై పోతే అది కవిత్వమెలా అవుతుందనీ అనుకునే సమూహాలకు, కవిత్వ కూటములకు అలిశెట్టి ప్రభాకర్ అసలు కవియే కాడు. కవిత్వం అంటే అర్థంకాని భాష, అంతుచిక్కని విషయాలు అన్న ఊహను పటాపంచలు చేస్తూ పాఠక జనమమేకమై ఆదరణ పొందిన వాడంటే ప్రభాకరే! సామాజిక చైతన్యం, సమాజ పరివర్తన, కష్టజీవుల పక్షం అని కబుర్లు చెప్పే ఎందరో కవివతంసుల కన్నా ఒక నెరూడాలా, శ్రీశ్రీలా పాఠక జన ప్రభంజనమై వెలుగొందిన వాడు ప్రభాకర్.


కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఉదయించిన ప్రభాకర్ తొలుత చిత్రకారుడు. పత్రికల్లో ప్రకృతి దృశ్యాలు, పండుగ బొమ్మలు, సినీ తారల బొమ్మలు గీసేవాడు. ఆ తర్వాతే సాహితీమిత్ర దీప్తి సంస్థ పరిచయం తో కవిగా రూపొందాడు. తను మంచి ఫొటో గ్రాఫర్ కూడాను. బ్రతుకుతెరువు కోసం ఇరవై రెండేళ్ల ప్రాయంలో జగిత్యాలలో ‘స్టూడియో పూర్ణిమ’ నెలకొల్పుకున్నాడు. ఆ తర్వాత కరీంనగర్‌లో 1979లో ‘స్టూడియో శిల్పి’ ఏర్పరచాడు. అసలు జగిత్యాల నుండి కరీంనగర్‌కు మారడమే ఎందరికో అంతుబట్టని దశలో అక్కడి నుండి హైదరాబాద్‌కు జీవిక కోసం తరలి రావడం ఆర్థికంగా జీవితాన్ని మరింత అతలాకుతలం చేసింది. దానికి తోడు అనారోగ్యం. అయినా ఏనాడూ చింతపడలేదు. పోరాటాన్ని సాహసిగా ఔదలదాల్చాడు. హైదరాబాద్‌లో స్టూడియో చిత్రలేఖ వెలసింది. తన కవిత్వంతో వందల ఛార్టులు తయారుచేసి కవిత్వ ప్రదర్శనలకు శ్రీకారం చుట్టాడు. కవి సమ్మేళనాల్లో పాల్గొనడం ఒక ఎత్తయితే, ఈ కవిత్వ ప్రదర్శనలు యువత నెంతగానో ఆకట్టుకున్నాయి. 


అలిశెట్టి ప్రభాకర్ కవితలు వాటి ప్రభావోపేత నైజం వల్ల ఎక్కువగా మౌఖిక ప్రచారం పొందాయి. ఒక కవికి నిజానికి అంతకన్న గొప్ప గౌరవం ఏముంది. ‘కవియు జీవించె ప్రజల నాల్కల మీద, గుండెలలోన’ అనడానికి అలిశెట్టి ప్రభాకరే నిదర్శనం.

మిత్రుడు జయధీర్ తిరుమలరావ్ అన్నట్లు - ‘సామాజిక మార్పుని నినాదాల రూపంలో కాకుండా జీవిత కోణాలను, దానికి కారణమైన రాజకీయార్థిక రంగాలలోంచి దర్శించాడు. అతని ప్రతి కవిత్వ చరణం వాస్తవికతతో తొణికిసలాడుతుంది. విషాదాన్ని చెప్పినా దానికి కారణాల్ని కూడా ఎత్తి చెప్పేవాడు. విషాదాన్ని జయించే ఆలోచనా శక్తిని కూడా జత చేసేవాడు. అందుకే ప్రభాకర్ కవితకి అంత ప్రచారం. చాలామంది కవితలు చదివి పాటకులు మరిచిపోతారు. కాని ప్రభాకర్ కవిత పాఠకులను వెన్నాడుతుంది. తిరిగి తిరిగి మననం చేసుకునేలా వెంటాడుతుంది. ఈ లక్షణం ప్రభాకర్ మరణించి రెండు దశాబ్దాలు దాటినా కవులు సాధించలేకపోయారు.’


‘మరణం నా చివరి చరణం కాదు’ అని స్వయంగా ప్రకటించుకున్నట్లుగా నే ప్రభాకర్ కవిగా చిరంజీవిగా నిలుస్తున్నాడు నిజంగానే అతనిది ‘జ్వలించే అక్షరం’.

అక్షరం
కపాలం కంతల్లోంచి వెలికివచ్చే
క్షుద్ర సాహిత్యపు కీటకమూ కాదు
సౌందర్యం చర్మ రంధ్రాల్లో
తలదూర్చే ఉష్టప్రక్షీ కాదు

అధునాతనంగా
వధ్యశిలపై వాలిపోయే నిస్సహాయ శిరస్సూ కాదు

అక్షరం

జ్వలనా జ్వలనంగా ప్రకాశించే సత్యం
స్వచ్ఛంద స్వప్నాల అంకురం.


అక్షరం
 కాలం చేతుల్లో ఎదిగి
చరిత్ర భుజస్కందాల కందివచ్చే ఆయుధం
ఉద్యమ శిఖరాల మధ్య నుంచి
సంధించిన
ప్రతిఘటనా కిరణాల ప్రామాణికంగా
అక్షరం

ప్రచండ సూర్యగోళం

-అంటాడు. అందుకే ప్రభాకర్ ఓ సూర్యగోళంలానే జీవించాడు. విలువలను జార్చుకోలేదు. ప్రలోభాలకు ,సినిమా గ్లామర్‌కు తలఒగ్గలేదు. చాయ్‌లు, వాయు, ద్రవాలు మిత్రులతో బాటు పంచుకున్నా, మనుషుల పట్ల స్నేహాలను, ప్రేమలనూ పెంచుకున్నాడే గానీ స్వీయ జీవితాన్ని మండించుకుంటూనే సమాజానికి వెలుగులు అందించాడు గానీ కవిత్వపు దారి తప్పలేదు. తానెరిగిన వాడుక పదాలతోనే ,ఆ పదాలలోని అక్షరాలతోనే ,కవితా సృజన చేసే అద్భుత పరుసవేది విద్య అతనికి అలవడింది. దానితోనే జనంలో కవిగా అతని ముద్ర కూడా బలపడింది.

నను తొలిచే
 బాధల ఉలే
నను/ మలిచే

కవితా శిల్పం

అని తానన్నప్పుడు ‘చిత్తంలో ప్రతి దెబ్బా - సుత్తిదెబ్బగా మలచిన - మానవ మూర్తిని మించిన - మహిత శిల్పమేమున్నది’ అన్న పద్మభూషణ్ బోయి భీమన్న మాట యధార్థమనిపిస్తుంది.

అలిశెట్టి కవితలన్నీ ఎక్కువ భాగం ‘మినీ’లే! అల్పాక్షరముల అనల్పార్థ రచనలే! వాటిల్లో హాస్యం, వ్యంగ్యం, అధిక్షేపం కూడా తొంగిచూస్తాయి. పీడకుల పట్ల పిడికిలి బిగిస్తే, పీడితుల పట్ల తోడునిలిచే నైజం, రాజకీయాల రొచ్చును తూర్పారబట్టడంలో, వ్యవస్థలోని అవ్యవస్థ తీరుతెన్నులను నిలదీసి ప్రశ్నించి చూపడంలో కలేజా వున్న కవి ప్రభాకర్. అర్థరహిత సంక్షేమ పథకాలను అపహసించేవాడు.


రాత్రి
భలే కలొచ్చింది
భూమీద
నూకలు చెల్లినవారికి

 ప్రభుత్వం తరపున
స్వర్గంలో
సన్నబియ్యమిస్తారట


-అని అవహేళన చేయడం తనకే చెల్లింది.

ఆకాశానికే
 ఆకర్షణ శక్తుంటే
ఎవ్వడూ ఏదీ

 కూడబెట్టకపోను

-అనడంలో ఎంతటి సామ్యవాదం గర్భీకృతమై వుందో విశే్లషించుకోవచ్చు. నేర రాజకీయాలు, హింసా రాజకీయాలు ప్రబలిన వర్తమాన ‘దశ’ను ఇలా కళ్లకు కట్టించాడు.

ఇది వరకు
సమాజ శరీరమీద చీరుకుపోయే
చిన్న రౌడీ ‘బ్లేడు’

ఇవాళ
ఇంటింటికీ చేతుల జోడించి
ఎన్నికల్లో మెరిసిన ఎమ్మెల్ల్యే ‘చాకు’
రేపు

అరాచకీయాల్లో ఆరితేరి
కాగల మంత్రి ‘గండ్రగొడ్డలి’.


ఇలా ఏ కవితను స్పృశించినా ఏకకాలంలో బుద్ధికి ఆలోచననీ, హృదయానికి అనుభూతినీ ఏకకాలంలో అందించి సంప్రీతిని కలిగించే ప్రయోజనవంతమైన కవిత అలిశెట్టి ప్రభాకర్ కవిత. నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్‌కు, నర్సన్, నిజాం వెంకటేశం, నాగభూషణం, అశోక్‌కుమార్, గంగాధర్ వంటి అలిశెట్టి మిత్ర బృందానికి అభినందనలు అందించి తీరాలి. కవితాభిమానుల ప్రతి ఇంటా వుండి తీరాల్సిన పుస్తకం ఇది.

-సుధామ

అలిశెట్టి ప్రభాకర్ కవిత
సంపాదకులు: జయధీర్
తిరుమలరావు
నిజాం వెంకటేశం, బి.నర్సన్
వెల: రూ.200
ప్రతులకు: నవ తెలంగాణ
పబ్లిషింగ్ హౌస్
ఎంహెచ్ భవన్, ప్లాట్ నెం.21/1, అజామాబాద్, ఆర్‌టిసి కళ్యాణ మండపం దగ్గర, హైదరాబాద్-20.

                      ఆంధ్రభూమి :దినపత్రిక :శనివారం:అక్షర పేజీ :14 అక్టోబర్ ;2017 

2 comments:

nath said...

Tributes to the great poet ! Thank you sudhama garu for introducing him !

సుధామ said...

Thank you nath garu!