ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, January 2, 2016

కొంత హాస్యం.. కొంత సందేశం..సందుపట్ల భూపతిగారి జీవనవలయాలు రేడియో నాటికల 
సంపుటిలో పదమూడు నాటికలు వున్నాయి. ఇవన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రచాసరమయ్యాయని చెప్పడానికి సంతోషిస్తున్నానంటూ ‘నామాట’లో పేర్కొన్న రచయిత, 
ఎందరెందరికో కృతజ్ఞతలు ప్రకటిస్తూ, ఆకాశవాణిలో ప్రసారానికి ప్రోత్సహించిన రేడి యో ప్రముఖులను పేర్కొనకపోవడం సముచితంగా లేదు. ముందుమాటలు రాసిన అయిదుగురులోనూ ఆకాశవాణి 
వారెవ్వరూ లేరు.

ఇవన్నీ రేడియో కోసమే రాసినవనుకోలేం. రంగస్థలాన్ని కూడా 
దృష్టిలో పెట్టుకునే వుంటారు. కేవలం శ్రవ్య మాధ్యమమే లక్ష్యమయితే (‘సూర్యం ఫ్లాష్‌బ్యాక్ చెబుతున్నట్లు పెదాలు కదుపుతాడు’), (‘సూర్యం ఇద్దరి చేతులు కలిపాడు’) - (విజేత) (‘బిగదీసుకుపోతాడు’) - (లే అమ్మాయిలు) వంటి పాత్రగత సూచనలు అనవసరమే! అలాగని రచయితకు శ్రవ్య, దృశ్య మాధ్యమాల తేడా తెలియదనలేం 
‘సమాజంలో చేనేత కార్మికులు’ అనే ఈ సంకలనంలోని నాటిక రేడియోనాటిక కాదు. పూర్తిగా స్టేజి నాటకమే. ఆకాశవాణిలో ప్రసారితం కాలేదని అట్ట వెనుక పేర్కొన్న వివరాల్లో విశదమవుతున్నప్పుడు ఈ సంకలనంలో రేడియో నాటికగా ఎందుకు చేర్చారో తెలీదు. 
ఎందుకంటే అందులో రంగస్థల గత సూచనలు ‘ఎడమవైపు నుండి ప్రవేశిస్తాడు’, ‘ఉత్తరాన్ని తీసుకుంటూ’ ‘తలగోక్కుంటూ’, ‘చేతులు నలుపుకుంటూ’, ‘కళ్ళు ఎర్రజేసి ఎంకులు మీదకి పైపైకి పోతాడు’, ‘ఆవేశంగా చేతులు పైకెత్తి’, ర్మయ్య పేపరు చదువుతూ వుంటాడు’ 
వంటి శ్రవ్య నాటికలో చూపలేనివి ఇబ్బడిముబ్బడిగా వున్నాయి. 
అయితే చేనేత వృత్తితో జీవనం సాగిస్తూ పలు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ కూడా తన సృజనాత్మక రచనా వ్యాసంగాన్ని 
నిలుపుకోవడం ఎంతయినా అభినందించదగిన విషయం.

సామాన్య, మధ్య తరగతుల జీవితాలను, ము ఖ్యంగా తానెరిగిన వృత్తి జీవన పార్శ్వాలను ఈ నాటికలలో భూపతిగారు చిత్రించారు. ‘ఉచితం బాబోయ్ ఉచితం’, ‘ఆశ కాటేసింది’ నాటికల్లో సునిశిత హాస్యంతోనే 
బరువైన విషయాలను, దురాశ పనికి రాదనేటువంటి సందేశాలను సంతరించారు. ‘జన్మభూమి’ దేశభక్తి ప్రబోధితం. ‘మమతే మా ఇంటి వెలుగు’, ‘వబంధం’ వంటి నాటికల్లో మానవ సంబంధాల పటిష్టతపట్ల
శ్రద్ధ పెట్టారు. ఆకతాయిలపట్ల అమ్మాయిలే, బుద్ధి చెప్పే ధీరలుగా 
మారాలని చెప్పేనాటిక ‘లే అమ్మాయిలు’.

వదాన్యుల ఆర్థిక సహకారంతో ఈ పుస్తకాన్ని ముద్రించి 
సమస్త వృత్తుల శ్రమైక జీవుల ఘర్మ జలానికి అంకితం చేయడం అభ్యుదయ చింతకునిగా భూపతిగారి ఆశయ దీప్తిని వెలారుస్తోంది. 
ఈ గ్రంథ రచయితకు అభినందనలు తెలుపుతూ కళారత్న, 
ప్రజానటులు కర్నాటి లక్ష్మీనరసయ్యగారు చెప్పిన మాటలు 
రేడియో నాటికలు రాయదలచినవారు ప్రముఖంగా 
గుర్తుంచుకోదగినవి.

‘‘దృశ్యనాటకంలో ఇతివృత్తం, పాత్రల సృష్టి, నటన, ఆహార్యం, 
రంగాలంకరణ, సంగీతం, భావప్రకటనలు ఇలాంటి విభజనలన్నీ 
శ్రవ్య నాటకంలోకి వచ్చేసరికి కేవలం ఎంచుకున్న ఇతివృత్తం, సంభాషణలపైనే ఆధారపడి అవి సవ్యంగా ఉంటే రేడియో నాటకం 
కూడా సవ్యంగా కొనసాగుతుంది.
రంగస్థల నాటకంలో కొన్ని నియమ నిబంధనలకి కట్టుబడి 
రేడియోనాటక ప్రక్రియ వుండదు. దాని పరిధి విస్తృతం. సన్నివేశం ఎప్పుడైనా, ఎక్కడైనా సాగవచ్చు. అయితే సంభాషణలు మాత్రం 
సూటిగా, సుస్పష్టంగా శ్రోత మదిలో నిలిచేలా వుండాలి. సన్నివేశం
 క్లుప్తంగా సాగుతూ, చిరుచిరు సంభాషణలు ఆసక్తికరంగా సాగాలి. 
సుదీర్ఘ వాక్యాలు, సంభాషణలు శ్రోతలు త్వరగా జీర్ణించుకోలేక కష్టపడకూడదు. అందుకే రేడియో నాటిక రచన కత్తిమీద 
సాములాంటిది. రచన, సంభాషణలు రసానుభూతిని కలిగించాలి. అవసరమైన చోట సంభాషణలను అస్త్రాలుగా సంధించి వదలాలి. 
పాత్రల మధ్య సంభాషణలు అర్థవంతంగా, సుస్పష్టంగా వుండాలి. ప్రయోజనం లేని మాటలు సన్నివేశాన్ని దెబ్బతీస్తాయి. రచన, సంభాషణలు బావుంటే, పలికే నటీనటులు నవరసాల్ని అభినయిస్తే, నిర్వాహకులు శ్రవ్య బంధనంలో విన్పించే సంగీతం, స్పెషల్ ఎఫెక్ట్స్ ఆసక్తికరంగా వుంటే అప్పుడు రేడియో నాటకం విజయవంతం
అయినట్లే.

రేడియో మాధ్యమానికి చక్కని నాటికలు రాసి, ‘జీవన వలయాలు’ 
పేరిట ఇలా రేడియో నాటికల సంపుటి వెలువరించిన 
సందుపట్ల భూపతిగారికి అభినందనలు.

-సుధామ
02/01/2016

జీవన వలయాలు
(రేడియో నాటకాల సంపుటి) 
-సందుపట్ల భూపత్ మంగళగిరి
వెల: రూ.120/-
చైతన్య వీవర్స్ కల్చరల్
అసోసియేషన్ ప్రచురణ - 
3/103(74ఎ) గండలాయపేట, 
మంగళగిరి, గుంటూరు- 522 503

0 comments: